
వరద తగ్గినా..
తిరువనంతపురం : వారం రోజులుపైగా కేరళను ముంచెత్తిన వరద తగ్గుముఖం పట్టిన క్రమంలో పునరావాస శిబిరాల్లో లక్షలాది మంది తలదాచుకుంటున్న క్రమంలో కలుషిత నీరు, వాయుకాలుష్యంతో వ్యాపించే వ్యాధులపై అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పునరావాస శిబిరాల్లో రెండు లక్షలకు పైగా కుటుంబాలు తలదాచుకుంటున్నాయని కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారి అనిల్ వాసుదేవన్ వెల్లడించారు.
రాష్ట్ర రాజధాని తిరువనంతపురానికి 200 కిమీ దూరంలోని అలువ పట్టణంలోని పునరావాస శిబిరంలో ముగ్గురికి చికెన్‌పాక్స్‌తో బాధపడుతున్నట్టు గుర్తించారు. శిబిరాల్లో అంటువ్యాధులు ప్రబలితే ఎదుర్కొనేందుకు అవసరమైన ప్రణాళిక రూపొందిస్తున్నట్టు కేరళ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
మరోవైపు కేరళలో 14 జిల్లాల్లో రెడ్ అలర్ట్‌ను ఉపసంహరించిన వాతావరణ శాఖ ఎర్నాకుళం, పధానమతిట్ట, అలప్పుజ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మరోవైపు కేరళలో వరద మృతుల సంఖ్య 194కు పెరిగింది. రాష్ట్రంలో వరద సహాయక, పునరావాస కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు సోమవారం కొచ్చి నావల్ బేస్ నుంచి విమానాల రాకపోకలను పునరుద్ధరించనున్నారు.