ప్రజలు జ్వరాలతో అల్లాడుతున్నారు. పల్లె, పట్టణం తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ వైరల్ ఫీవర్లు విజృంభిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు పారిశుద్ధ్యం అధ్వానంగా తయారైంది. తాగునీరు కూడా కలుషితమవుతోంది. వీటి విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. దీంతో సీజనల్ వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా తీవ్ర ఒళ్లునొప్పులు, కీళ్లు పట్టేయడం వంటి లక్షణాలతో కూడిన జ్వరంతో ప్రజలు అల్లాడుతున్నారు. పట్టణాల్లో ప్రతి వీధిలోనూ, గ్రామాల్లో ప్రతి ఇంట్లోనూ కనీసం ఒకరు చొప్పున బాధపడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఓపీ విభాగాలు రోగులతో కిటకిటలాడుతున్నాయి.
కర్నూలు(హాస్పిటల్): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతిరోజూ 60 నుంచి 100 వరకు ఉండే ఓపీ ఇటీవల వైరల్ ఫీవర్ల కారణంగా 150 నుంచి 180కి చేరుతోంది. అలాగే కర్నూలు సర్వజన వైద్యశాల, నంద్యాల జిల్లా ఆసుపత్రి, ఆదోని ఏరియా ఆసుపత్రులతో పాటు ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు జ్వరపీడితులు అధిక సంఖ్యలో వస్తున్నారు. సర్వజన వైద్యశాలలోని మెడికల్ ఓపీ విభాగాల్లో జ్వరపీడితుల సంఖ్య ప్రతిరోజూ 400 నుంచి 450 వరకు ఉంటోంది. ఇటీవల వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. నదుల్లో, కాలువల్లో కొత్త నీరు వచ్చి చేరుతోంది. ఇదే క్రమంలో తాగునీరు కలుషితమవుతోంది. నీటిని శుద్ధిచేసి అందించాల్సిన ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖలు తమ బాధ్యతలను నిర్వర్తించడం లేదు. దీంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. టైఫాయిడ్, పసరికల(కామెర్లు)తో బాధపడేవారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది.
పెరుగుతున్న డెంగీ, స్వైన్‌ఫ్లూ కేసులు
ఒకవైపు వైరల్ ఫీవర్లు విజృంభిస్తుండగా.. మరోవైపు చాపకింద నీరులా డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 57 మందికి డెంగీ వచ్చినట్లు అధికారికంగా నిర్ధారణ అయ్యింది. ఇంకా 188 మందికి అనుమానిత డెంగీగా చికిత్స అందించారు. కర్నూలు నగరంలోని పలు కాలనీలు, నంద్యాల, ఆదోనితో పాటు గూడూరు, బేతంచర్ల, క్రిష్ణగిరి, ఎమ్మిగనూరు, ఆత్మకూరు, మిడుతూరు, శ్రీశైలం తదితర ప్రాంతాల్లో డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఇక గిరిజన ప్రాంతాల్లో 30, ఇతర ప్రాంతాల్లో 29 మందికి మలేరియా వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవానికి మూడింతలు అధికంగా బాధితుల సంఖ్య ఉంటుంది. కర్నూలు, నంద్యాల పట్టణాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు కూడా బయటపడుతున్నాయి. నంద్యాలకు చెందిన ఓ వ్యక్తి కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. అలాగే నగరానికి చెందిన ఓ మహిళ సైతం స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. డెంగీ, మలేరియా నిర్ధారణ అయిన ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపడుతున్నాం. ఈ మేరకు మలేరియా సబ్‌యూనిట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చాం. పాజిటివ్ వచ్చిన రోగి ఇంటి పక్కల 50 ఇళ్లల్లో పైరిత్రమ్ స్ప్రే చేస్తున్నాం. నీళ్లు నిలిచిన చోట యాంటీలార్వా చర్యలు తీసుకుంటున్నాం. దోమలు ఎక్కువగా ఉంటే పంచాయతీల సహకారంతో ఫాగింగ్ చేయిస్తున్నాం.
–జె.డేవిడ్‌రాజు, జిల్లా మలేరియా అధికారి