ఖనన్‌  | funday new story special | Sakshi
Sakshi News home page

ఖనన్‌ 

Published Sun, May 13 2018 12:40 AM | Last Updated on Sun, May 13 2018 12:40 AM

funday new story special

పొద్దున్నించీ ఇంట్లోనే కూర్చుని ఎలాగో ఉంది అతనికి. బయటికెళ్లి కాసేపు ఎక్కడైనా చెట్టునీడన కూర్చోవాలనుకున్నాడు. ఎర్రటి ఎండ. ఈమధ్య కాలంలో ఇంత ఎండ ఏనాడైనా వచ్చింది లేదు అనుకున్నాడు. ఎలాగోలా సర్దుకొని ఇంట్లోనుంచి చేతికర్ర సాయంతో బయటకి వెళుతుంటే అరిచినట్టే అడిగింది అతని భార్య – ‘‘భోజనం చెయ్యకుండా ఎక్కడికి వెళుతున్నావు? పైగా ఇంత ఎండలోనా? కళ్లు తిరిగి పడిపోతే తీసుకొచ్చే వారున్నారా ఏమైనా?’’. ఆమె మాటలు విననట్టే, ‘‘ఇక్కడికే వెళ్లొస్తానులే!’’ అని బయలుదేరాడు. వయసు మీద పడిపోతోంది. చేతికర్ర సాయమున్నా ఎక్కడ పడిపోతానోనన్న భయం అతణ్ని ఈమధ్య రోజూ వెంటాడుతూనే ఉంది. ఒక్కో అడుగు వేస్తూ వీధి చివర్న ఉన్న ఒక చెట్టుకిందకు చేరాడు. అప్పుడే అటుగా వెళుతున్న పశువులను అవి వెళ్లిపోయేంతవరకూ చూసి, ఒక దగ్గర కూలబడి కూర్చున్నాడు. అతనికి అకస్మాత్తుగా తన ఖనన్‌ గుర్తుకొచ్చింది. ఖనన్‌ తనకెంతో ఇష్టమైన ఎద్దు. ఇప్పుడతను కూర్చున్న ఈ చెట్టుకిందే ఖనన్‌ను పద్నాలుగేళ్ల కిందట అమ్మేశాడు.ఈ చెట్టు నీడలో, చల్లటి గాలిలో ఖనన్‌తో గడిపిన కాలం అతనికి గుర్తుకువస్తోంది. జ్ఞాపకాలు ఎప్పుడూ వెన్నంటే ఉంటాయి. ఖనన్‌ జ్ఞాపకాలనైతే అతను ఎప్పటికీ వదులుకోలేడు. ఎన్నేళ్ల బంధం ఖనన్‌తో తనది?  ఎంత ఇష్టంగా చూసుకునేవాడు ఖనన్‌ని? ఒక్కొక్కటీ గుర్తుకొస్తూ ఉంటే అతని కళ్లలో నీటిచెమ్మ. ఈ వయసులో దాన్ని తలుచుకుంటూ ఒంటరి వాడైపోయినట్టు భావిస్తున్నాడతను. 

ఖనన్‌తో అతనిది విడదీయలేని బంధం. ఇలాంటిదే ఒకరోజు మధ్యాహ్నం. ఖనన్‌తో కలిసి చెలకను దున్నుతున్నాడతను. సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చాడు. అతనికి అప్పటికే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. నీరసంగా ఉన్నాడు. ఇంక ఏమాత్రం పనిచేసే ఓపిక లేక, వెళ్లి దూరంగా ఓ చెట్టునీడ పట్టున గడ్డిమీదే పడుకొని కునుకు తీస్తున్నాడు. ఖనన్‌ మాత్రం పనిచేసుకుంటూనే ఉంది. దాని గజ్జెల శబ్దం అతనికి వినిపిస్తూనే ఉంది. కాసేపటికి చెలకనంతా దున్నేసి నాగలితో ఎర్రటి ఎండలో నిల్చుండిపోయింది. చాలాసేపు అలాగే నిలబడి ఉంది. అతను నీళ్ల దగ్గరికి తీసుకెళతాడని ఆశగా చూస్తూంది. ‘‘అయ్యో! ఎంత చెడ్డ పనిచేశాను నేను. నన్ను క్షమించు ఖనన్‌..’’ అంటూ పరుగున వెళ్లి ఖనన్‌ను నీళ్ల దగ్గరికి తీసుకెళ్లాడతను. దాని దాహం తీరింది. ఖనన్‌ అతను తప్ప ఎవ్వరు నీళ్లు తాగించినా తాగదు. గడ్డి కూడా అతను వేస్తే తప్ప తినేది కాదు. ఎవరైనా వేసినా విరుచుకు పడేది. ఖనన్‌కు ఏదైనా గాయమైతే అతను తన చేతి స్పర్శతో నిమిరితే చాలు గాయాన్ని మరచిపోయేది. ఒక్కరోజు అతను కనిపించకపోయినా ఖనన్‌ దిగులుగా ఉండేది. ఖనన్‌ మెడలో ఉండే గజ్జెల మువ్వలు ఉదయాన్నే అతణ్ని నిద్రలేపేవి. అలాగే అతను ఎప్పుడు నిద్రలేచినా ముందుగా ఖనన్‌ను చూసుకునేవాడు.వాళ్లదొక విచిత్ర బంధం. ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ. ఖనన్‌ అతనికి ఒక కొడుకు లాగా. ఖనన్‌ తోడుంటే పొలం పనులన్నీ ఇట్టే అయిపోతున్నట్టు అనిపించేది అతనికి. అతను ఏదైనా పనిమీద బయటకెళ్లి వస్తూంటే, దూరం నుంచే అతని మాటలో, కేకలో విని, గొంతు గుర్తుపట్టి దగ్గరకు వచ్చి చూసేది. అతను వందమందిలో ఉన్నా ఖనన్‌ అతణ్ని గుర్తుపడుతుంది.  అతనికి దు:ఖం ఎక్కువైంది. ‘ఎలా ఉండేది ఖనన్‌తో! ఇప్పుడు ఎక్కడుందో?’ అనుకుంటూ ఆ చెట్టునీడనే కొద్దిసేపు కునుకు తీశాడు. 

ఓసారి అతని పరిస్థితి దారుణంగా తయారైంది. ఎటుచూసినా కరువే. పేదరికం అతని ఇంటిని బలంగా తాకింది. కుటుంబానికి ఏమీ చెయ్యలేడు. ఖనన్‌కు తినడానికి ఏదైనా పెట్టడానికి కూడా కష్టమైంది. రోజురోజుకీ పేదరికం మీద పడిపోతుంటే, పెళ్లైనా అత్తారింటికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న కూతుర్ని చూస్తుంటే అతనికి బాధ లోలోతుల్నుంచి తన్నుకొచ్చేది. ఎంత బాధ ఉన్నా ఏం చేస్తాడు? పెళ్లికైతే ఇల్లు అమ్మేశాడు కానీ, కూతుర్ని అత్తారింటికి పంపడానికి కట్నం బాకీ తీర్చాలి. ఎలా? ఖనన్‌ పరిస్థితీ అంతే ఉంది. ఎప్పుడైనా అది ఎక్కడో ఒక దగ్గర ఇంత గడ్డి తినగలిగి ఇంటికొస్తే అతను చాలా సంతోషించే వాడు. ఒకరోజు ఇలాగే చాలారోజులకు కొంత తిని అతని పక్కనొచ్చి నెమరేస్తూ కూర్చుంది ఖనన్‌. అతను ఖనన్‌ను దగ్గరకు తీస్కొని నిమురుతున్నాడు. అప్పుడే కూతురు అక్కడికొచ్చి అతణ్ని చూసింది. ‘‘ఇంకా ఎన్ని రోజులు ఉండాలి నేనిక్కడ? మా అత్తగారింటికి ఎప్పుడు పంపిస్తారు నన్ను?’’ అంటూ అరుస్తున్నట్టే మాట్లాడింది. అతనికేం సమాధానం చెప్పాలో తెలియలేదు. ‘‘నా దగ్గర డబ్బులు లేవమ్మా!’’ అని సమాధానమిచ్చాడు. ‘‘ఈ ఖనన్‌ని అమ్మేసి డబ్బులు తీసుకురా!’’ అంది.

అతని గుండె ముక్కలయినంత పనయ్యింది. అతని భార్య భుజమ్మీద చెయ్యేసి పేదరికపు చూపొకటి చూసింది. అతనింకేం మాట్లాడలేదు. ఖనన్‌ని తీసుకొని ఆదివారం పశువులు అమ్ముడుపోయే సంతకు వెళ్లాడు. అక్కడ అన్నీ బక్కచిక్కిన ఎద్దులు, వ్యాధిసోకిన గేదెలు ఉన్నాయి. వాటితో కలిపి ఖనన్‌ని అమ్మేయాలన్న ఆలోచనే అతనికి భయంకరంగా తోచింది. ‘లేదు. నా ఖనన్‌ని అమ్మే ప్రసక్తే లేదు.’ అని గట్టిగా అనుకున్నాడు. వెంటనే కూతురి మాటలు గుర్తుకొచ్చాయి. ఖనన్‌ని చూసి చాలామంది ఎగబడి కొనడానికి వస్తున్నారు. అతను చివరకు ఎలాగోలా గుండె నిబ్బరం చేసుకొని ఖనన్‌ని అమ్మేశాడు. యజమాని దగ్గర్నుంచి డబ్బులు తీసుకుంటున్నప్పుడు అతణ్ని బాధగా చూస్తూ ఉంది ఖనన్‌. అతను మాత్రం దానికి ఏమని చెబుతాడు? ఆ రోజు ఈరోజుకీ అతనికి అలాగే గుర్తుంది. ఖనన్‌ను చివరగా చూసిన ఆ చూపును ఎప్పటికీ మరచిపోలేడు. ఖనన్‌ని అమ్మేయగా వచ్చిన డబ్బులతో అతను అప్పులన్నీ తీర్చేశాడు. కూతురు అత్తారింటికి కూడా వెళ్లిపోయింది. కానీ ఖనన్‌? ఖనన్‌ మాత్రం లేదిప్పుడు. 

చెట్టుకింద కునుకు తీస్తున్నాడన్న మాటే కానీ అతణ్ని ఖనన్‌ ఆలోచనలు వెంబడిస్తున్నాయి. ఆకలిని కూడా మరచిపోయాడు. కళ్లు తెరిచి చూస్తే వాతావరణం కాస్తంత చల్లబడింది. అప్పుడే సాయంత్రమైందా అన్నట్టు చుట్టూ చూశాడు. దూరంగా ఒక ఎద్దుల మంద కనిపించింది. ఆ మంద అతణ్ని చేరుతున్న కొద్దీ అతనికి ఒక శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. ‘అదే! కచ్చితంగా అదే చప్పుడు. అది కచ్చితంగా నా ఖనన్‌ గజ్జల చప్పుడే..’ అని లేచి నిలబడ్డాడు. అతని మనసు పట్టరాని ఆనందంతో ముసలి చిందులు వేస్తోంది. వెంటనే పరుగులాంటి నడకతో ఖనన్‌వస్తున్న వైపుకు వెళ్లాడు. ఖనన్‌ బక్కచిక్కిన ఎముకలు బయటకొచ్చి దీనంగా నిలబడింది. అతనితో పాటు అతని ఖనన్‌ కూడా ముసలిదైపోయింది. ‘ఎలా ఉండే ఖనన్‌ ఎలా అయిపోయింది!’ అనుకుంటూ ఖనన్‌ను చాలాకాలం తర్వాత చూసి తెలీకుండా ఏడ్చేశాడతను. అతనైతే ఖనన్‌ని గుర్తుపట్టాడు కానీ, ఖనన్‌ అతణ్ని గుర్తుపట్టలేకపోయింది.  దగ్గరికెళ్లి ఖనన్‌తో ఏదో మాట్లాడే ప్రయత్నం చేశాడు. దాని కాలు మీద ఏదో ఎర్రటి ముద్ర ఉండటం చూశాడు. 
‘‘ఇదేమిటయ్యా!’’ అని యజమానిని అడిగాడు. 

‘‘ఈ పశువులన్నింటినీ వేరే దేశానికి పంపిస్తున్నాం పెద్దయ్యా!’’ అన్నాడతను. అతనికి దు:ఖం తన్నుకొచ్చింది. ‘ఖనన్‌ను వేరే దేశానికి పంపిస్తున్నారా?’ ఖనన్‌కు దగ్గరగా వెళ్లి నిలబడి, ‘‘ఖనన్‌!’’ అని పిలిచాడు. దగ్గరగా జరిగి దాని ఒంటిమీద చెయ్యేసి మెల్లిగా నిమురుతూ ఉన్నాడు. ఆ చేతి స్పర్శతో, మాటతో ఖనన్‌ అతణ్ని గుర్తుపట్టింది. అతనికి ఎక్కడలేని సంతోషాన్నంతా ఎవరో పిలిచి ఇచ్చినట్టనిపించింది. ఖనన్‌ గంటలు మోగించింది. చెంగున ఎగిరింది. ‘నా ఖనన్‌ను ఎక్కడికీ పంపించకూడదు. నాతో పాటే తీసుకెళ్లాలి.’ అనుకున్నాడు. పశువులు అమ్మే అతని దగ్గరికి ఆ సాయంత్రమే వెళ్లి కలిశాడు. తన దగ్గరున్న డబ్బునంతా తెచ్చుకున్నాడు. తాను గుడిసె వేసుకొని ఉన్న పొలాన్ని తాకట్టు పెట్టి కొంత అప్పు కూడా తెచ్చుకున్నాడు. ‘‘ఖనన్‌! నేను నిన్ను ఎక్కడికీ పోనివ్వను. ఇంకెప్పటికీ..’’ అన్నాడతను ఖనన్‌ను గట్టిగా కౌగిలించుకుంటూ.          
              

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement