రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్నా ఇండియాలో మాత్రం పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తన తాజా నివేదికలో తెలిపింది. 2010–2021 మధ్య రోడ్డు ట్రాఫిక్ దుర్ఘటనలు ఏటా 5 శాతం (లక్షా 19 వేలు) తగ్గాయి. ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో సభ్యత్వం ఉన్న 108 దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గిపోతుండగా, భారత్‌లో మాత్రం 15 శాతం పెరిగాయని ఈ నివేదిక వివరించింది. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ఇండియాలో 2010లో 1.34 లక్షలు సంభవించగా, 2021లో వాటి సంఖ్య 1.54 లక్షలకు పెరిగింది. రోడ్డు భద్రతలో ప్రపంచ పరిస్థితి–2023 అనే పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
నార్వే, డెన్మార్క్, జపాన్, రష్యా సహా పది దేశాల్లో రోడ్డు దుర్ఘటనల మరణాలు 50 శాతం తగ్గించగలిగారు. మరో 35 దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాలు 30 నుంచి 50 శాతం వరకూ తగ్గిపోయాయి. 2019 నాటికి ప్రపంచంలో ఐదు నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న పిల్లలు, యువతీయువకుల మరణాలకు ప్రధాన కారణం రోడ్డు ప్రమాదాలని, అన్ని వయసులవారి హఠాన్మరణాలకు 12వ ప్రధాన కారణం రోడ్డు దుర్ఘటనలేనని ఈ నివేదిక వివరించింది. రోడ్డు ప్రమాదాల్లో మూడింట రెండు వంతుల మరణాలు పనిచేసే వయసులో ఉన్న వారికే సంభవించాయి. గడచిన దశాబ్దంలో ప్రపంచ జనాభా 140 కోట్లు (13%) పెరగింది. కాని, విశ్వవ్యాప్తంగా రోడ్డు దుర్ఘటనల్లో మొత్తం మరణాలు ఐదు శాతం తగ్గిపోయాయి.
పదేళ్ల కాలంలో మోటారు వాహనాల సంఖ్య 160 శాతం పెరిగింది.
2010–2021 సంవత్సరాల మధ్య ప్రపంచంలో మోటారు వాహనాల సంఖ్య 160 శాతం పెరిగింది. కాగా, ప్రతి లక్ష వాహనాలకు ఏటా ప్రమాదాల్లో సంభవించే మరణాల రేటు 79 నుంచి 47కు తగ్గింది. అంటే రోడ్డు ప్రమాదాల్లో చనిపోయేవారి సంఖ్య 41% తగ్గినట్టు లెక్క. ప్రపంచవ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాల మరణాలు 28 శాతం ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో సంభవించాయి. 25% రోడ్డు చావులు పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో, 19% ఆఫ్రికా ప్రాంతంలో, అమెరికా ఖండాల్లో 12%, తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంత దేశాల్లో 11%, ఐరోపా ప్రాంతంలో కేవలం ఐదు శాతం రోడ్డు ప్రమాద మరణాలు సంభవిస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది.
పేద, మధ్య స్థాయి ఆదాయ దేశాల్లోనే రోడ్డు ప్రమాద మరణాలు ఎక్కువ.
మోటారు వాహనాలకు రహదారులపై జరిగే ప్రమాదాల్లో ఎక్కువ మరణాలు సంభవించేది పేద, మధ్య స్థాయి ఆదాయాలు ఉన్న దేశాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది. ప్రతి పది మరణాల్లో తొమ్మిది ఈ పేద దేశాల్లోనే జరిగే రోడ్డు దుర్ఘటనల్లో సంభవిస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమంటే–పేద, మధ్య స్థాయి ఆదాయాలున్న దేశాల్లో జనం వాడే మోటారు వాహనాలు సంఖ్య తక్కువ. అలాగే, ఈ దేశాల్లో ఉన్న రహదారుల సంఖ్య కూడా బాగా తక్కువ.
రోడ్ల నాణ్యత కూడా అభిలషణీయ స్థాయిలో ఉండదు. సరైన మౌలిక సౌకర్యాలు, అవసరమైనన్ని మోటారు వాహనాలు లేని ఈ దేశాల్లో రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవించే అవకాశం ధనిక దేశాలతో పోల్చితే బాగా ఎక్కువ. ఈ బడుగు దేశాల్లో మోటారు వాహనాల సంఖ్య చాలా తక్కువ ఉన్నప్పటికీ పేదరికం, సరైన రోడ్లు లేకపోవడం, డ్రైవింగ్ నిర్లక్ష్యంగా చేయడం వంటి కారణాల వల్ల అక్కడ జరిగే ప్రమాదాల్లో ఎక్కువ మంది మరణిస్తున్నారు. వాస్తవానికి ప్రపంచంలోని అన్ని దేశాల్లో రోడ్లపై తిరిగే మొత్తం మోటారు వాహనాల్లో కేవలం ఒక్క శాతం మాత్రమే తక్కువ ఆదాయ దేశాల్లో ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక తెలపింది.
ఈ నివేదిక వివరాలను ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక శుక్రవారం ప్రచురించింది. రోడ్డు ప్రమాదాల్లో యువకులు, చిన్న పిల్లల మరణాల వల్ల ఏ దేశంలోనైనా ఆర్థిక ప్రగతిపై వ్యతిరేక ప్రభావం పడుతుంది. రోడ్లపై మోటారు వాహనాల ప్రమాదాలు అరిక్టడానికి ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో మద్యం తాగి వాహనాలు నడిపినా, మరణాలకు కారకులైనా పెద్ద శిక్షలు వేయడం ఎప్పటి నుంచో అమలులో ఉన్న విధానం. ఇండియాలో కూడా ఇలాంటి చర్యలు తీసుకుంటే రోడ్డు ప్రమాదాల్లో చావుల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి వీలవుతుంది.
వెస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment