
ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మరణించిన ఘటనపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) విచారణ చేపట్టింది. కుటుంబ సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రోగ్రాం అధికారి డాక్టర్ సూర్యశ్రీరావు ఆధ్వర్యంలో వైద్య బృందం గురువారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించింది.
గత నెల 25న జరిగిన ఆపరేషన్లపై వైద్యుల నుంచి బృందం సభ్యులు వివరాలు తెలుసుకున్నారు. శస్త్రచికిత్సల సమయంలో ఉపయోగించిన ఆపరేషన్ పరికరాలను పరిశీలించారు. వాటిని ఎలా స్టెరిలైజ్ చేశారో ఆపరేషన్ థియేటర్‌లో పని చేసే సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆపరేషన్లు జరిగిన అనంతరం మహిళలను ఇంటికి పంపే ముందు వాడిన మందుల గురించి రికార్డు చేసుకున్నారు.