
సాక్షి, అమరావతి: టెలిమెడిసిన్ సేవల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ విశాల్ చౌహాన్ ప్రశంసించారు. ఇతర రాష్ట్రాలు ఏపీని ఆదర్శంగా తీసుకుని టెలిమెడిసిన్ సేవలను మరింత మెరుగైన రీతిలో అందించాలని సూచించారు. దేశంలో టెలిమెడిసిన్ విధానాన్ని బలోపేతం చేసే అంశంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆగ్నేయ ఆసియా రీజియన్ ఆధ్వర్యాన ఢిల్లీలో నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విశాల్ చౌహాన్ మాట్లాడుతూ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్‌ల ద్వారా టెలిమెడిసిన్ సేవలను అమలు చేస్తున్నామని తెలిపారు.
టెలిమెడిసిన్ సేవలకు కరోనా కష్టకాలంలో అత్యంత ఆదరణ లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న ఏపీ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లకు టెలిమెడిసిన్ సేవలను విస్తరించిందని తెలిపారు. రాష్ట్రంలో 27 టెలిమెడిసిన్ హబ్‌లను ఏర్పాటు చేశామని, రోజుకు 60వేల టెలి కన్సల్టేషన్లు నమోదవుతున్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 9.7 కోట్ల టెలి కన్సల్టేషన్లు నమోదు కాగా, ఇందులో 3.1కోట్లు (32 శాతం) ఏపీలోనే నమోదయ్యాయని తెలిపారు.
ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసి రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య వ్యవస్థను మరింత సమర్థంగా నడపాలని సీఎం వైఎస్ జగన్ సూచించారన్నారు. కరోనా వ్యాప్తి సమయంలో టెలిమెడిసిన్ కోసం ప్రత్యేక యాప్‌ను ప్రవేశపెట్టి అందులో 6,145 మంది డాక్టర్లను రిజిస్టర్ చేయడం ద్వారా అప్పట్లో ప్రజలకు విశేష సేవలు అందించామన్నారు. ఈ డాక్టర్‌లు 13,74,698 కాల్స్ స్వీకరించి సేవలు అందజేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment