ఆడుతూ, పాడుతూ ‘అమ్మ’ | Check for unnecessary caesareans | Sakshi
Sakshi News home page

ఆడుతూ, పాడుతూ ‘అమ్మ’

Published Mon, Aug 21 2023 3:18 AM | Last Updated on Mon, Aug 21 2023 3:19 AM

Check for unnecessary caesareans - Sakshi

వీఏవీ రంగాచార్యులు, సాక్షి సెంట్రల్‌ డెస్క్‌  : మాతృత్వంలోని కమ్మదనం గురించి ‘అమ్మ’కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. అయితే బిడ్డకు జన్మనిచ్చి తల్లి అవ్వడం అనేది ఆ  ‘అమ్మ’కు పునర్జన్మేనని చెప్పవచ్చు. అంటే ఓ మహిళ గర్భం దాల్చి.. తొమ్మిది నెలలపాటు శిశువును మోయడం ఒక ఎత్తు అయితే, ఆ బిడ్డను బాహ్య ప్రపంచంలోకి తీసుకురావడం మరోఎత్తు. ఈ క్రమంలో ఆ చివరి రోజు ఆ మహిళ పడే కష్టం, బాధ వర్ణణాతీతం.

ఈ బాధ భరించలేక చాలా మంది సిజేరియన్‌ (ఆపరేషన్‌ చేసి బిడ్డను బయటకు తీయడం) చేయించుకోవడానికే మొగ్గు చూపుతుంటారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు కూడా ఎక్కువ ఫీజు వస్తుందని మారు మాట్లాడకుండా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఇది సరికాదని, ఇతరత్రా ఎలాంటి సమస్యలు లేకపోతే నార్మల్‌ డెలివరీ చేయడానికే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గట్టిగా చెబుతోంది.

దీంతో చాలా వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో, పీహెచ్‌సీల్లో నార్మల్‌ డెలివరీకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రిస్క్‌ తీసుకోవడానికి ప్రైవేట్‌ ఆస్పత్రులు సిద్ధంగా లేనందున అనవసర సిజేరియన్లు కొనసాగుతూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తూనే ఉంది.
  
ఎపిడ్యూరల్‌ విధానం ఒక వరం 
అభివృద్ధి చెందిన దేశాల్లో, మన దేశంలో ఎగువ మధ్య తరగతి, ధనికులు ఇప్పుడిప్పుడే ఈ విధానం ద్వారా సుఖ ప్రసవం అయ్యేలా దృష్టి సారిస్తున్నా­రు. ఎపిడ్యూరల్‌ అంటే ఇదొక రకమైన అన­స్థీషి­యా. మామూలుగా శరీరంలో ఒక భాగానికి నొప్పి తెలియకుండా ఉండేందుకు స్పైన్‌ (వెన్ను)కు మత్తు మందు ఇచ్చినప్పుడు ఆ భాగం నుంచి మెదడుకు నొప్పి సంకేతాలు వెళ్లవు.

అదే సమయంలో మెదడు నుంచి మోటార్‌ సిగ్నల్స్‌ రావు. అప్పుడు ఆ భాగా­నికి సంబంధించి  కండరాలు వదులవుతాయి. సిజేరియన్‌ కోసమైతే ఇలా చేయాలి. నొప్పి తెలియకుండా నార్మల్‌ డెలివరీ చేయాలంటే ఇందులో ఒకదాన్ని ఆపి, మరొకదాన్ని పని చేయించాలి.  

వైద్యులతో ముందే చర్చించాలి 
కార్పొరేట్, ప్రైవేట్‌ ఆస్పత్రులకు ప్రసవం కోసం వచ్చే వారిలో చాలా మంది నొప్పి తట్టుకోలేక సిజేరియన్‌ చేసేయండని అడుగుతున్నారని, ఇలాంటి సమయంలో ఎపిడ్యూరల్‌ విధానం పాటించాలని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది. ఈ విధానానికి నిపుణుడైన అనెస్థీషియాలజిస్ట్‌ మాత్రమే అదనంగా అవసరం. అందువల్ల దాదాపు సిజేరియన్‌కు అయ్చే ఖర్చే అవుతుంది.

ఇప్పటికే ఈ విధానం గురించి తెలిసిన వారు చాలా కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యులతో ముందుగానే చర్చించి తగిన శ్రద్ధ తీసుకుంటున్నారు. వారి సూచనల మేరకు నిత్యం వ్యాయామం చేస్తూ ఆడుతూ, పాడుతూ గడుపుతున్నారు. పురుటి నొప్పులు మొదలవుతాయనడానికి ముందుగానే ఆస్పత్రిలో చేరుతున్నారు. వీరికి యాక్టివ్‌ లేబర్‌ కంటే (తీవ్రమైన నొప్పులు) ముందు నుంచే పెలి్వక్‌ (కండరాలు వదులయ్యేలా) ఎక్సర్‌సైజ్‌లు చేయిస్తారు.

ఆ సమయంలో వేడి నీళ్లలో తడిపిన టవల్‌ ద్వారా ఒత్తిడి తేవడం, కొన్ని ఎక్సర్‌సైజ్‌ల ద్వారా సుఖ ప్రసవం అయ్యేలా చూస్తారు. ఇటీవల సినీ నటుడు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన ఈ విధానంలోనే బిడ్డకు జన్మనివ్వడం గమనార్హం.

కొన్ని ఆస్పత్రుల్లో ఐవీ అనాల్జీషియా, ఎంటొనాక్స్‌ (మాస్క్‌ ద్వారా గ్యాస్‌ ఇవ్వడం) తదితర పద్దతుల్లో కూడా నొప్పి లేకుండా ప్రసవాలు చేస్తున్నప్పటికీ ఎపిడ్యూరల్‌ మాత్రమే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. సిజేరియన్‌ కంటే ఇదే మేలు కాబట్టి, దీని గురించి అందరికీ తెలియాలని డబ్ల్యూహెచ్‌వో కోరుకుంటోంది.  

స్పైన్‌ పై భాగంలోనే మత్తు 
స్పైన్‌లోపలికి కాకుండా పై భాగంలో ఉన్న పొరలోకి మత్తు మందును తక్కువ మోతాదులో ఇంజెక్ట్‌ చేస్తారు. ఇలా చేస్తే అనాల్జీషియా (నొప్పి లేకపోవడం) మాత్రమే పని చేస్తుంది. అంటే మెదడుకు ఆ భాగం నుంచి నొప్పి సంకేతాలు వెళ్లనందున నొప్పి తెలియదు. మెదడు నుంచి యథావిధిగా మోటార్‌ సిగ్నల్స్‌ వస్తూనే ఉంటాయి.

అందువల్ల ఆ భాగంలో కండరాలు యథావిధిగా పని చేస్తాయి. దీంతో గర్భసంచి చుట్టూ ఒత్తిడి పెరిగి, కొద్ది కొద్దిగా బేబీ బయటకు వస్తుంది. ఇందుకోసం సర్జరీలకు వాడేంత డోస్‌ కాకుండా తక్కువ డోసులో మత్తు మందు వాడతారు. అన్ని అనెస్థీషియాల్లాగే దీనికీ కొంత సైడ్‌ ఎఫెక్ట్‌ ఉన్నప్పటికీ సిజేరియన్‌ చేయాల్సిన పరిస్థితి రాదు. మామూలుగా కంటే ఓ గంట సమయం ఎక్కువ పడుతుంది. 

మంచి బెనిఫిట్‌ ఉంటుంది 
ఎపిడ్యూరల్‌ వల్ల మంచి ఫలితం ఉంటుంది. పెయిన్‌ను బాగా తగ్గించవచ్చు. బెనిఫిట్‌ చాలా బావుంటుంది. చాలా దేశాల్లో ఇప్పుడు ఇదే విధా­నం కొనసాగుతోంది. పూర్వపు రోజుల్లో ఈ విధా­నం పట్ల మన దేశంలో కొంత అపోహ ఉండేది. ఇప్పుడు విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం పెరగ­డం వల్ల ఆ అపోహలు తొలగిపోయాయి. లేబర్‌లో మూడు దశలు ఉంటాయి. రెండవ దశ నుంచి ఇది స్టార్ట్‌ చేయాలి. కొంచెం బీపీ తగ్గిపో­యే అవకాశం ఉంటుంది. అంతకు మించి పెద్ద సమస్యలు ఉత్పన్నం కావు.

కాకపోతే తొమ్మిదవ నెల నుంచే గర్భిణి­ని ఇందు­కు సమాయత్తం చేయాల్సి ఉంటుంది. ఈ విధానంపై కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో పరిశోధన కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి పీజీ అనెస్థీసియా విద్యార్థులు పలు పేపర్లు కూడా ప్రెజెంట్‌ చేశా­రు. యువతులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఖర్చు కూడా తక్కువే. ప్రస్తుతం కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంది. గర్భిణికి అవగాహన ఉండి కోరితేనే చేస్తున్నారు.     – ఎస్‌.మాణిక్యరావు, గైనకాలజీ హెచ్‌ఓడి, కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement