
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ధాటి నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో కొత్త వేరియంట్లు కలవరపెడుతున్నాయి. కాలానికి తగ్గట్టుగా రూపాంతరం చెందుతున్న మహమ్మారి… డెల్టా, లాంబ్డా వేరియంట్ల రూపంలో విరుచుకుపడుతోంది. ఇండియాలో సెకండ్ వేవ్‌కి కారణమైన డెల్టా వేరియంట్ ప్రస్తుతం 100కిపైగా దేశాల్లో విజృంభిస్తోంది. మరోవైపు దక్షిణ అమెరికా, లాటిన్ ఆమెరికా, ఐరోపా దేశాల్లో కరోనా మరో రూపం లాంబ్డా వేరియంట్ భయాందోళనలు సృష్టిస్తుంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ దేశాలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తుంది.
ఈ నేపథ్యంలో లాంబ్డా వేరియంట్‌పై పరిశోధనలు జరిపిన మలేషియా ఆరోగ్యమంత్రిత్వశాఖ సంచలన విషయాలను వెల్లడించింది. కరోనా డెల్టా రకం కంటే లాంబ్డా వేరియంట్ అత్యంత ప్రమాదకరమని ప్రకటించింది. ప్రపంచంలోని 30 దేశాల్లో విస్తరించిన లాంబ్డా వేరియంట్ కారణంగా అత్యధిక మరణాలు సంభవించవచ్చని షాకింగ్ న్యూస్ తెలిపింది. ప్రపంచంలోనే అత్యధిక కరోనా మరణాల రేటు ఉన్న పెరూ దేశం నుంచి లాంబ్డా జాతి వైరస్ ఉద్భవించిందని మలేషియా ఆరోగ్యమంత్రిత్వశాఖ ట్వీట్ చేసింది.
మరోవైపు యూకేలో గుర్తించిన లాంబ్డా కరోనా వేరియంట్ డెల్టా కంటే మూడు రెట్లు ప్రమాదకరమైన అంటువ్యాధి అని పరిశోధకులు తేల్చారు. పెరూలో మే, జూన్ నెలల్లో వెలుగుచూసిన కరోనా వైరస్ నమూనాలలో లాంబ్డా దాదాపు 82 శాతం ఉందని పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (పాహో) వెల్లడించింది. మరో దక్షిణ అమెరికా దేశమైన చిలీలో మే, జూన్ నుంచి 31 శాతానికి పైగా నమూనాల్లో లాంబ్డా వేరియంట్ వైరస్ ఉందని గుర్తించారు. లాంబ్డా వైరస్ త్వరగా ప్రబలుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment