నేడు వరల్డ్ బ్లడ్ డోనర్ డే
ఏదైనా ప్రమాదం జరిగింది, లేకుంటే ఏదో అత్యవసర సర్జరీ జరిగింది.. ట్రీట్‌మెంట్ కోసం రక్తం కావాలి. అప్పటికప్పుడు ఎవరైనా దాత దొరికితేనో, బ్లడ్ బ్యాంకుల్లో స్టాక్ ఉంటేనో సరి. లేకుంటే ఎంతో విలువైన ప్రాణాలు గాలిలో కలసిపోవడం ఖాయం. ఈ నేపథ్యంలోనే రక్తదానంపై అవగాహన కల్పించడం, రక్తదానంపై ఉన్న అపోహలు, వదంతులకు చెక్ పెట్టడం లక్ష్యంగాఏటా జూన్ 14న ‘వరల్డ్ బ్లడ్ డోనర్ డే’ను నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..
జూన్ 14నే ఎందుకు?
ఒకప్పుడు ఒకరి రక్తాన్ని మరొకరికి ఎక్కించడమనే చికిత్సే లేదు. ఒకవేళ అలా చేసినా.. బాధితులు బతికేవారు కాదు. దానికి కారణం మన రక్తం వేర్వేరుగా ఉండటమేనని ప్రముఖ శాస్త్రవేత్త కార్ల్ లాండ్‌స్టీనర్ 1990వ దశకంలో గుర్తించారు. రక్తాన్ని ఏ, బీ, ఓ గ్రూపులుగా వర్గీకరించారు. ఆయన పుట్టినరోజు అయిన జూన్ 14వ తేదీని ‘వరల్డ్ బ్లడ్ డోనర్ డే’కోసం ఎంపిక చేశారు.
రక్తదానంపై అవగాహన పెంచేందుకు..
ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది ప్రమాదాల బాధితులు, వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు సరైన సమయానికి రక్తం అందక ప్రాణాలు వదులుతున్నారు. ఈ క్రమంలో రక్తదానంపై అవగాహన పెంచేందుకు ప్రఖ్యాత సంస్థలు నడుం బిగించాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ), అంతర్జాతీయ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్, రెడ్ క్రిసెంట్ సొసైటీస్ (ఐఎఫ్‌ఆర్‌సీఎస్), అంతర్జాతీయ ఫెడరేషన్ ఆఫ్ బ్లడ్ డోనర్ ఆర్గనైజేషన్స్ (ఐఎఫ్‌బీడీఓ), అంతర్జాతీయ సొసైటీ ఫర్ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూషన్ (ఐఎస్‌బీటీ) సంస్థలు కలసి తొలిసారిగా 2004 జూన్ 14వ తేదీ నుంచి ‘వరల్డ్ బ్లడ్ డోనర్ డే’ను నిర్వహించడం మొదలుపెట్టాయి. దీనికి ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తవుతుండటంతో.. ‘20 ఏళ్ల రక్తదానం. దాతలకు కృతజ్ఞతలు’అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు.
పేదరికానికి ‘రక్తం’ లింకు..
ప్రమాదాల్లో గాయపడ్డవారు, సర్జరీలు చేయించుకునేవారికే కాదు తలసేమియా, హీమోఫీలియా, ఎనీమియా వంటి వాటితో బాధపడుతున్నవారికి కూడా తరచూ రక్తం ఎక్కించడం అవసరం. ముఖ్యంగా నిరుపేద దేశాల్లో చిన్నపిల్లలు వివిధ వ్యాధులకు లోనవడం, పోషకాహార లోపం వంటివాటితో.. రక్తం ఎక్కించాల్సిన అవసరం ఎక్కువగా ఉంటోంది.
– ప్రపంచవ్యాప్తంగా చూస్తే ధనిక దేశాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రమాదాలు, సర్జరీలు, వయసు మీదపడటం వల్ల వచ్చిన సమస్యల బాధితులకు రక్తం ఎక్కువగా ఎక్కిస్తున్నారు.
– పేద దేశాల్లో రక్త హీనత, వివిధ వ్యాధులు, పోషకాహార లోపం వంటి వాటితో బాధపడుతున్న చిన్నారులు, మహిళలకు రక్తం ఎక్కువగా అవసరం పడుతోంది.
దానం చేస్తే.. మనకూ ఆరోగ్యం!
రక్తదానం చేయడం వల్ల అవతలివారి ప్రాణాలను కాపాడటమేకాదు.. మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నవాళ్లమూ అవుతామని వైద్య నిపుణులు చెప్తున్నారు. రక్తదానం వల్ల మన శరీరంలో ఐరన్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయని.. కొత్త రక్తం ఉత్పత్తి, రక్త ప్రసరణ తీరు మెరుగుపడతాయని అంటున్నారు. ఇది గుండె సంబంధిత వ్యాధుల ముప్పును అరికడుతుందని, బరువు తగ్గేందుకూ తోడ్పడుతుందని వివరిస్తున్నారు. మొత్తంగా రక్తదాత శారీరక, మానసిక ఆరోగ్యానికి దారితీస్తుందని స్పష్టం చేస్తున్నారు.
రక్తంలో ఏభాగాన్ని ఎన్నిసార్లు దానం చేయొచ్చు?
పూర్తిస్థాయి రక్తమైతే.. 90 రోజులకోసారి
ప్లాస్మా ఒకటే అయితే.. 28 రోజులకోసారి
ప్లేట్ లెట్లు మాత్రమే అయితే.. 14 రోజులకోసారి
ఎర్ర రక్తకణాలు మాత్రమే అయితే 112 రోజులకోసారి
భారతదేశంలో రక్తదానం పరిస్థితి ఇదీ.. ఏటా అవసరమైన రక్తం 5 కోట్ల యూనిట్లు
ఎవరెవరు రక్తదానం చేయొచ్చు?
– పురుషులు 3 నెలలకు ఒకసారి.. మహిళలు 4 నెలలకు ఒకసారి
– వయస్సు పరిమితి18 – 65 ఏళ్ల మధ్య
– కనీసం ఉండాల్సిన బరువు 45 కిలోలు
– దగ్గు, జలుబు, జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్లు ఏవీ ఉండకూడదు.
– ఏవైనా వ్యాక్సిన్లు వేసుకున్నవారు కనీసం 15 రోజులనుంచి నెలరోజుల్లోపు రక్తదానం చేయవద్దు.
– రక్తదానం చేసినవారు రెండు రోజుల పాటు నీళ్లు, పళ్లరసాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. తీవ్ర శారీరక శ్రమకు దూరంగా ఉండాలి.
డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం..
– రక్తదాతల నుంచి అందుతున్నది 2.5 కోట్ల యూనిట్లు
– దాత నుంచి సేకరించే రక్తం350 మిల్లీలీటర్లు
– ఇందుకుపట్టే సమయం15 నిమిషాలు
– ప్రపంచవ్యాప్తంగా చూస్తే ప్రతి 2 సెకన్లలో ఒకరికి రక్తం అవసరం పడుతోంది.
– ఏటా ప్రపంచవ్యాప్తంగా రక్తదానాలు 11.85 కోట్లు
– అందులో ధనిక దేశాల నుంచి వస్తున్నవే 40%
– పేద దేశాల్లో రక్తం ఎక్కిస్తున్న వారిలో ఐదేళ్లలోపు పిల్లలే 54%
– ధనిక దేశాల్లో రక్తం ఎక్కిస్తున్నవారిలో 60 ఏళ్లు పైబడిన వారు76%
Comments
Please login to add a commentAdd a comment