
ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) పనితీరులో సంస్కరణల రావాలి. ఆ ప్రయత్నాలలో కీలక పాత్ర పోషించడానికి భారత్ సిద్ధంగా ఉంది.
WHO must be reformed, India ready to play key role: గురువారం జరిగిన రెండవ గ్లోబల్ కోవిడ్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) పనితీరులో సంస్కరణల కోసం పిలుపు నిచ్చారు. ఈ సదస్సులో ప్రపంచ ఆరోగ్య భద్రతను మరింత స్థితిస్థాపకంగా నిర్మించుకోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు ఆ ప్రయత్నాలలో కీలక పాత్ర పోషించడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు.
సరఫరా గొలుసులు స్థిరంగా ఉంచడానికి వ్యాక్సిన్‌లు, చికిత్సవిధానాల కోసం డబ్ల్యూహెచ్‌ఓ ఆమోద ప్రక్రియను క్రమబద్ధీకరించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రపంచ వ్యాప్తంగా సమన్వయంతో కూడిన ప్రతిస్పందన అవసరమని స్పష్టంగా తెలుస్తోందన్నారు. అంతేకాదు ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలు, ముఖ్యంగా వాణిజ్య సంబంధిత అంశాలకు సంబంధించిన మేథో సంపత్తి హక్కు(ట్రిప్స్)ల ఒప్పందాలు మరింత సరళంగా ఉండాలని చెప్పారు.
ఈ మేరకు మోదీ సదస్సులో కరోనా విషయమై మాట్లాడుతూ..." కోవిడ్ మహమ్మారి విషయంలో భారత్ సమిష్టి కేంద్రీకృత వ్యూహాన్ని అనుసరించింది. మేము వార్షిక ఆరోగ్య సంరక్షణ బడ్జెట్‌కు అత్యధిక నిధులు కేటాయించాం. భారత్‌లోని వ్యాక్సినేషన్ ప్రక్రియ అతి పెద్దది. భారత్ డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదించిన నాలుగు వ్యాక్సిన్‌లను తయారు చేయడమే కాకుండా ఐదు బిలియన్ డోస్‌ల వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.
మేము 98 దేశాలకు 200 మిలియన్ డోస్‌ల వ్యాక్సిన్‌లను సరఫరా చేశాం. అతి తక్కువ ఖర్చుతో కరోనా చికిత్స పొందేలా సరికొత్త వైద్యా విధానాన్ని అభివృద్ధి చేశాం. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి మేము సంప్రదాయ ఔషధాలకు పెద్ధ పీఠవేశాం. గత నెలలో ఈ పురాతన జ్ఞానాన్ని ప్రపంచానికి అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో మేము భారత్‌లో 'డబ్ల్యూహెచ్‌ఓ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్'కి పునాది వేశాం" అని అన్నారు.
(చదవండి: ప్రధాని మోదీకి లేఖ రాసిన మమతా బెనర్జీ)