న్యూయార్క్: గాయాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా దాదాపు 44 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. వీరిలో ప్రతి ముగ్గురిలో ఒకరు రోడ్డు ప్రమాదాల్లో గాయపడి, ప్రాణాలు కోల్పోతున్నారని తెలియజేసింది. ఈ మేరకు ‘గాయాల నివారణ, సంరక్షణ’ 14వ ప్రపంచ సదస్సు సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఓ ఒక నివేదిక విడుదల చేసింది. గాయాలు, హింస వల్ల ప్రపంచవ్యాప్తంగా నిత్యం 12,000 మంది బలైపోతున్నారని నివేదికలో వివరించింది.
5 నుంచి 29 ఏళ్ల వయసున్నవారిలో సంభవిస్తున్న మరణాలకు తొలి 5 కారణాల్లో 3 కారణాలు గాయాలకు సంబంధించినవేనని స్పష్టం చేసింది. జనం మృత్యువాత పడడానికి రోడ్డు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యలు, నీటిలో మునిగిపోవడం, అగ్ని ప్రమాదాలు, విషం తీసుకోవడం వంటివి ప్రధానంగా కారణమవుతున్నాయని డబ్ల్యూహెచ్‌ఓ తేల్చిచెప్పింది. ప్రతి 6 మరణాల్లో ఒకటి ఆత్మహత్య, ప్రతి 9 మరణాల్లో ఒకటి హత్య, ప్రతి 61 మరణాల్లో ఒకటి యుద్ధం, ఘర్షణల వల్ల సంభవిస్తున్నాయని పేర్కొంది. సంపన్నులతో పోలిస్తే పేదలు గాయాల వల్ల చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధానోమ్ గెబ్రీయెసస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment