Monkeypox: శారీరకంగా కలవడం వల్లే వైరస్‌ విజృంభణ | Monkeypox Outbreak UK US Caused By Possible Sexual Transmission | Sakshi
Sakshi News home page

మంకీపాక్స్‌ విజృంభణ.. శారీరకంగా కలవడం వల్లే కేసుల వ్యాప్తి! ఎందుకంటే..

Published Thu, May 19 2022 6:48 PM | Last Updated on Thu, May 19 2022 7:00 PM

Monkeypox Outbreak UK US Caused By Possible Sexual Transmission - Sakshi

ఇంతకాలం ఆఫ్రికాకే పరిమితమైన మంకీపాక్స్‌ వైరస్‌.. ఇప్పుడు యూరప్‌, యూకే, నార్త్‌ అమెరికాలోనూ విజృంభిస్తోంది. కేసులు తక్కువగానే నమోదు అవుతున్నప్పటికీ.. అది వ్యాపించడానికి గల కారణాలు తెలిస్తే విస్తుపోవడం ఖాయం. ఈ విజృంభణలో చాలావరకు కేసులు.. శారీరక కలయిక ద్వారానే వ్యాప్తి చెందినట్లు స్పష్టమవుతోంది. ఈ మేరకు వైద్య సంస్థలు ఒక స్పష్టమైన ప్రకటన చేశాయి. 

► 
ఫ్లూ(జ్వరం) తరహా లక్షణాలు ఉండే మంకీపాక్స్‌ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉత్తర అమెరికాతో పాటు యూరప్‌లోనూ డజన్ల కొద్దీ కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే వీటిలో చాలావరకు సెక్సువల్‌ ట్రాన్స్‌మిషన్‌ ద్వారా వ్యాప్తి చెందినవే కావడం గమనార్హం. 

► కెనడాలో డజను, స్పెయిన్‌.. పోర్చుగల్‌లో 40(అనుమానిత.. ధృవీకరణ కేసులు), బ్రిటన్‌లో తొమ్మిది(మే 6వ తేదీ నుంచి ఇప్పటిదాకా..), అమెరికాలో బుధవారం తొలి మంకీపాక్స్‌ కేసులు నమోదు అయ్యాయి. 

► శారీరక కలయిక ద్వారానే వ్యాప్తి చెందినట్లు వైరస్‌ బారిపడ్డ వాళ్లను పరీక్షిస్తే స్పష్టమయ్యింది. ఈ మేరకు అమెరికా సీడీసీ ప్రకటన చేసింది. మరోవైపు యూకే ఆరోగ్య భద్రత సంస్థ కూడా దాదాపు ఇలాంటి ప్రకటనే చేసింది. గే, బైసెక్సువల్‌, పరస్పర పురుష శృంగారంలో పాల్గొన్న వ్యక్తుల్లోనే మంకీపాక్స్‌ లక్షణాలు గుర్తించినట్లు వెల్లడించింది. యూకేలో వెలుగు చూసిన మొదటి కేసు నైజీరియాతోనే ముడిపడి ఉండడం విశేషం.

► ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గత వారం రోజులుగా యూకే, యూరోపియన్‌ ఆరోగ్య ప్రతినిధులతో సమన్వయం అవుతూ.. పరిస్థితిని సమీక్షిస్తోంది. ఇప్పటిదాకా నమోదు అయిన కేసుల్లో చాలావరకు గే, బైసెక్సువల్‌గా గుర్తించినట్లు తెలిపింది. ‘‘పురుషుల పరస్పర శృంగారంతోనే వ్యాప్తి చెందినట్లు నిర్ధారణ అయ్యింద’’ని డబ్ల్యూహెచ్‌వో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సోసే ఫాల్‌ వెల్లడించారు. 

► మంకీపాక్స్‌ బారినపడ్డ వాళ్లు కోలుకోవడానికి పదిహేను రోజుల దాకా పట్టొచ్చు. ప్రాణాల మీదకు వచ్చేది చాలా తక్కువ సందర్భాల్లోనే. పది మందిలో ఒకరికి మాత్రమే ప్రాణాల మీదకు వస్తుంది. ఇంతకు ముందు.. మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో వేలమంది మంకీపాక్స్‌ బారినపడ్డారు. కానీ, యూరప్‌, నార్త్‌ అమెరికాలో కేసులు వెలుగు చూడడం అరుదనే చెప్పాలి. 

మంకీపాక్స్‌.. జ్వరం తరహా లక్షణాలతో మొదలవుతుంది. జ్వరం, కండరాల నొప్పులు, ఒంటి మీద దద్దుర్లు వస్తాయి. మంకీపాక్స్‌ వైరస్‌ను మనీపాక్స్‌ వైరస్‌ అని కూడా పిలుస్తారు. ఈ ఫ్లూ ‘ఆర్థోపాక్స్ వైరస్’ కుటుంబానికి చెందిన మంకీపాక్స్ వైరస్ వల్ల వస్తుంది. మంకీపాక్స్ ప్రధానంగా ముఖం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. 

► ఉచ్ఛ్వాస పెద్ద బిందువుల(తుంపర్ల) ద్వారా,  శరీరంపై గాయాలు, కలుషితమైన పదార్థాలతో.. చాలాసందర్భాల్లో వ్యాపిస్తుంది. జంతువులు, మనుషులు, వైరస్‌ సోకిన వస్తువుల ద్వారానూ మంకీపాక్స్‌ వ్యాప్తి చెందుతుంది. జంతువుల ద్వారా కాటు, కొరికిన గాయాలు, కరవడం.. ఇలా వ్యాప్తి చెందుతుంది.

అయితే యూరప్‌, నార్త్‌ అమెరికాతో పాటు యూకేలో వెలుగు చూస్తున్న కేసుల్లో.. వైరస్‌ బారినపడ్డ వాళ్లు ఇతరులతో అత్యంత సన్నిహితంగా(శారీరక సంబంధం) మెలగడం వల్లే వైరస్‌ విజృంభించడం గమనించాల్సిన విషయం.  

► మంకీపాక్స్‌ తొలి కేసు 1950లో.. రెండు దఫాల అవుట్‌బ్రేక్‌లు(వేవ్‌)లుగా విజృంభించింది.

► పరిశోధనల నిమిత్తిం కోతులపై ప్రయోగాలు చేస్తున్న క్రమంలో గుర్తించారు. అయితే మనుషుల్లో గుర్తించింది మాత్రం 1970లో. అది కాంగోలో.

ఆఫ్రికా ఖండంలో బయటపడ్డ వేల కేసుల్లో.. చాలావరకు అపరిశుభ్రత, జంతువుల ద్వారానే వైరస్‌ వ్యాపించింది. శారీరక కలయిక ద్వారా వ్యాపించిన కేసులు చాలా తక్కువే. 

► స్మాల్‌పాక్స్‌ వ్యాక్సిన్‌నే చాలాకాలంగా మంకీపాక్స్‌ చికిత్స కోసం ఉపయోగిస్తున్నారు. కానీ, అది అథెంటిక్‌గా ప్రూవ్‌ కాలేదు.

► సాధారణ జ్వరానికి ఉపయోగించే చికిత్సతో పాటు యాంటీ వైరల్స్‌, వ్యాక్సినియా ఇమ్యూన్‌ గ్లూబ్లిన్‌ను కూడా మంకీపాక్స్‌ ట్రీట్‌మెంట్‌లో ఉపయోగిస్తున్నారు.

► ఈ వైరస్‌ బారిన పడ్డవాళ్లు.. ఇతరులకు దూరంటూ, సాధారణ ఫ్లూ కోసం తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్యనిపుణులు చెప్తున్నారు.

► ప్రస్తుతం బయటపడ్డ కేసుల వెనుక అరుదైన మంకీపాక్స్‌ వైరస్‌ ఉంది. అయినప్పటికీ.. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అదే సమయంలో వైరస్‌ కట్టడికి తగు జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

::: సాక్షి, వెబ్‌స్పెషల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement