2022లో గాంబియా, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల్లో భారత్‌లో తయారైన కలుషిత దగ్గు మందు తీసుకోవడం వల్ల దాదాపు 300 మంది చిన్నారులు మరణించారు. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌ఓ అప్రమత్తమైంది. తాజాగా, మార్షల్ దీవులు, మైక్రోనేషియాలలో భారత్‌కు చెందిన ఓ ఫార్మా కంపెనీ తయారు చేసిన దగ్గు మందు కలుషితమైనట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. అయితే దగ్గు మందు సేవించడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురయ్యారా? లేదా? అనే విషయాల్ని డబ్ల్యూహెచ్‌ఓ తెలపలేదు.
ఈ దగ్గు మందులో గుయిఫెనెసిన్ సిరప్ టీజీ సిరఫ్‌లో డైథిలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్‌తో మోతాదుకు మించి ఉన్నట్లు చెప్పింది. ఈ దగ్గు మందు వినియోగంతో ప్రాణాలు పోయే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా రెగ్యులరేటరీ థెరప్యూటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ సైతం తెలిపింది.
పంజాబ్‌కు చెందిన క్యూపీ ఫార్మాకెమ్ లిమిటెడ్ తయారు చేసిన ఈ దగ్గుమందును ట్రిలియం ఫార్మా మార్కెటింగ్ చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ చెప్పింది. ఇక క్యూపీ ఫార్మాకెమ్ తయారు చేసిన దగ్గు మందును ఏప్రిల్ 6న పరిశీలించగా.. అవి కలుషితమైనట్లు గుర్తించినట్లు తెలిపింది.
డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికలపై క్యూపీ ఫార్మాకెమ్ మేనేజింగ్ డైరెక్టర్ సుధీర్ పాఠక్ స్పందించారు. భారత ప్రభుత్వం అనుమతితో 18వేల సిరప్ బాటిళ్లను కాంబోడియాకు ఎగుమతి చేయగా.. దేశంలో సైతం పంపిణీ చేశామని అన్నారు. అయితే ఇప్పటి వరకు సిరప్‌లోని లోపాలపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని స్పష్టం చేశారు. ఇక ఇదే అంశంపై అటు తయారీ సంస్థ క్యూపీ ఫార్మా కెమ్ లిమిటెడ్, ఇటు మార్కెటింగ్ సంస్థ ట్రిలియం ఫార్మాలు స్పందించలేదు.
Comments
Please login to add a commentAdd a comment