సాక్షి, రాజమహేంద్రవరం: బిడ్డకు జన్మనివ్వడం పునర్జన్మతో సమానం. అదీ సహజ పద్ధతిలో జరిగితే తల్లీ, బిడ్డ అత్యంత సురక్షితం. పుట్టే బిడ్డకూ ఎలాంటి ఆపద ఉండదు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రైవేటు ఆస్పత్రి యాజమాన్యాల ధనదాహం అమ్మ కడుపును కోసేస్తోంది.. సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా.. దోపిడీయే పరమావధిగా సిజేరియన్లు యథేచ్ఛగా చేసేస్తున్నారు. గర్భిణి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే శస్త్ర చికిత్స తప్పుకాదు. కానీ ఇది సాకుగా చూపి పైసలే పరమావధిగా శ్రస్త్ర చికిత్సలనే ప్రోత్సహిస్తున్నారు.
సిజేరియన్‌కు రూ.40 వేల నుంచి రూ.60 వరకు వసూలు చేస్తున్నారు. జిప్ పద్ధతి(కోత కనబడని శస్త్ర చికిత్స) పేరుతో అందిన కాడికి దోచుకుంటున్నారు. కాన్పుల కోసం ప్రైవేటు ఆస్పత్రుతలకు వెళ్లే వారిలో 80 శాతం మందికి శస్త్ర చికిత్సలే చేస్తుండటం ఆందోళన కలిగించే అంశం. ఇలాంటి దయనీయ దుస్థితిలో మార్పు తీసుకువచ్చేందుకు వైద్య శాఖ సన్నద్ధం అవుతోంది. అవసరం లేని సిజేరియన్ల వల్ల కలిగే అనర్ధాలు, సహ ప్రసవాలతో జరిగే మేలును గర్భిణులకు వివరించేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తోంది. సహజ ప్రసవాలు పోత్రహించేందుకు ‘సీ–సేఫ్’ విధానాన్ని రూపకల్పన చేసి అమలుకు శ్రీకారం సన్నద్ధమవుతోంది.
ఇదీ సంగతి
జిల్లా వ్యాప్తంగా ప్రసూతి సేవలు అందించే ప్రైవేటు ఆస్పత్రులు సుమారు 300కి పైగా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా రాజమహేంద్రవరం జీజీహెచ్, గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు, కడియం పీహెచ్‌సీల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. జిల్లా వైద్య శాఖ గణాంకాల ప్రకారం 50 శాతం వరకు సిజేరియన్లు జరుగుతున్నాయి. వీటిలో 80 శాతం శస్త్రచికిత్సలు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాల ప్రకారం శస్త్రచికిత్సలు 10–15 శాతం లోపే ఉండాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే 50 శాతానికి పైగా అపరేషన్లు జరుగుతున్నాయి. అవసరం లేకపోయినా డబ్బులు దండుకునేందుకు సిజేరియన్లు చేస్తుండటంతో బాలింతలకు ఆరోగ్య పరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటిని అరికట్టాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.
జిల్లాలో ఇలా..
జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 22 నుంచి మార్చి 22 వరకు అధికారిక గణాంకాలు పరిశీలిస్తే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 22,648 ప్రసవాలు జరిగాయి. అందులో ప్రైవేటులో అత్యధికంగా 15,804, అందులో 10,433 సిజేరియన్లు జరిగాయి. 5,370 సాధారణ ప్రసవాలు మాత్రమే జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 6,844 జరగ్గా.. కేవలం 3,552 శస్త్ర చికిత్సలు మాత్రమే చేశారు. అదీ హైరిస్క్ కేసులు మాత్రమే ఉంటున్నాయి. 3,763 సాధారణ ప్రసవాలు జరిగాయి.
నర్సులకు శిక్షణ
సహజ ప్రసవాలు పెంచే ప్రక్రియలో భాగంగా ప్రభుత్వాస్పత్రుల్లోని నర్సులకు నర్స్ ప్రాక్టీషనర్ ఇన్ మిడ్ వైఫరీ(ఎన్‌పీఎం) కోర్సులో శిక్షణ అందించారు. బ్యాచ్‌కు 30 మంది చొప్పున శిక్షణ ఇచ్చారు. గర్భధారణ జరిగినప్పటి నుంచి మహిళలకు అవసరమైన వైద్యం ఎలా అందజేయాలో వివరించారు. హైరిస్క్‌లో ఉన్న గర్భిణులను గుర్తించడం, వారికి అందించాల్సిన వైద్యం తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం వీరికి నర్సింగ్ బోర్డులో పరీక్ష నిర్వహించారు. ఉత్తీర్ణులైన వారికి రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ప్రసవాలు జరిగే 10 ఆస్పత్రుల్లో నియమించనున్నారు.
సీ–సేఫ్ అంటే..
అత్యవసరమైన సందర్భాల్లో మాత్రమే సిజేరియనుల చేయాలన్నదే ‘సీ–సేఫ్’ ఉద్దేశం. దీనిపై వైద్యులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తారు. సిజేరియన్ విధానాలతో మాతృశిశు మరణాలు రాకుండా చర్యలు తీసుకుంటారు. ఆపరేషన్ చేసే సమయంలో అత్యంత సురక్షిత పద్ధతులు పాటించాలని సూచిస్తారు. ఈ విధానానికి యునిసెఫ్ సైతం సహకారం అందిస్తుంది.
సాధారణ కాన్పులే మేలు
నవమాసాలు మోస్తున్న గర్భిణులు ప్రసవ సమయంలో శస్త్రచికిత్సలను ప్రోత్సహించడం తగదని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. నార్మల్ డెలివరీ జరిగిన మహిళలు ఆరోగ్యంగా ఉంటారు. కాన్పు జరిగిన రెండో రోజు నుంచే పనులు చేసుకుంటారు. పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. శస్త్ర చికిత్స ద్వారా బిడ్డకు జన్మనిస్తే మహిళ శారీరక పరిస్థితిని బట్టి రెండు వారాల వరకు విశ్రాంతి అవసరం. ప్రసవ సమయంలో 9 మాసాలు పూర్తయినా కొందరు మహిళలకు నొప్పులు రావు. ఇలాంటి సందర్భంలోనూ శస్త్ర చికిత్స చేసుకుంటున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న వైద్యులు సిజేరియన్‌ను ప్రోత్సహిస్తున్నారు. వైద్యుల్లో సైతం వేచి చూసే ధోరణి ఉండాలి. రోగుల ఒత్తిడి మేరకు శస్త్ర చికిత్సలను ప్రోత్సహించడం తగదు. గర్భం దాల్చినప్పటి నుంచి తేలికపాటి వ్యాయామాలు చేస్తే కాన్పు సమయంలో ఇబ్బందులు పడాల్సి అవసరం ఉండదని సూచిస్తున్నారు.
జిల్లాలో మూడు నెలలుగా శస్త్ర చికిత్సలు, నార్మల్ డెలివరీలు ఇలా..
ఆస్పత్రి నెల సిజేరియన్లు నార్మల్ డెలివరీ
ప్రభుత్వ జనవరి 236 251
ఫిబ్రవరి 253 250
మార్చి 215 244
ప్రైవేటు జనవరి 916 389
ఫిబ్రవరి 631 345
మార్చి 599 292
గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నాం
మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. మాతృ మరణాల కట్టడికి అనేక చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం అవసరం లేకుండా చేపట్టే జిసేరియన్లు నియంత్రించడంపై దృష్టి సారిస్తున్నాం. ఇందుకు గాను ప్రతి పీహెచ్‌సీ, గ్రామాల్లో గర్భిణులకు అవగాహన కల్పిస్తున్నా.ం ఈ క్రమంలో సీ–సేఫ్ ప్రణాళిక రచించాం. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే సిజేరియన్లను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం...
– డాక్టర్.కె. వెంకటేశ్వరరావు,జిల్లా వైద్య శాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment