అలసత్వాన్ని సహించం | Laziness sahincam | Sakshi
Sakshi News home page

అలసత్వాన్ని సహించం

Published Sun, Jan 4 2015 3:29 AM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM

అలసత్వాన్ని సహించం - Sakshi

అలసత్వాన్ని సహించం

కర్నూలు అగ్రికల్చర్: విధి నిర్వహణలో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని కలెక్టర్ విజయమోహన్ హెచ్చరించారు. శనివారం తన కాన్ఫరెన్స్ హాల్‌లో టీబీ నియంత్రణ, సర్వేపై సమీక్ష నిర్వహించారు. గోనెగండ్ల, కోవెలకుంట్ల సీనియర్ టీబీ ట్రీట్‌మెంట్ సూపర్‌వైజర్ల పనితీరు సరిగా లేనందున ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.  

టీబీ వ్యాధిని సమూలంగా నిర్మూలించాల్సి ఉందని, ఇందుకు అనుగుణంగా ప్రతీ ఒక్కరు జవాబుదారీతనంతో పని చేయాలని సూచించారు. గ్రామం వారీగా టీబీ రోగులను గుర్తించేందుకు ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు సర్వే చేయాలని పేర్కొన్నారు. అనుమానిత కేసులను గుర్తించి గళ్ల పరీక్షలు, అవసరమైతే ఎక్స్‌రేలు తీయించి వ్యాధిని గుర్తించాలన్నారు. వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయితే వెంటనే చికిత్స ప్రారంభించాలన్నారు.

ఇక నుంచి టీబీ నియంత్రణపై ప్రతినెలా సమీక్ష నిర్వహిస్తానని, పూర్తి వివరాలతో రావాలని తెలిపారు. జిల్లాలో 540 సబ్ సెంటర్లు ఉండగా, నవంబర్, డిసెంబర్ నెలలో 74 సబ్ సెంటర్లలోనే సర్వే జరిగిందని, అన్ని సబ్ సెంటర్ల పరిధిలో గ్రామాల వారీగా సర్వే చేయాలన్నారు.

కర్నూలు పెద్దాసుపత్రికి వచ్చిన టీబీ కేసులను సంబంధిత క్లస్టర్లకు రెఫర్ చేస్తుంటారని, వారికి కూడా ఎటువంటి జాప్యం లేకుండా వైద్య సేవలు అందించాలన్నారు. జిల్లా క్షయ నివారణ అధికారి  డాక్టర్ మోక్షేశ్వరుడు మాట్లాడుతూ.. నవంబర్ నెలలో 700, డిసెంబర్ నెలలో 949 టీబీ కేసులను గుర్తించి చికిత్స చేపట్టినట్లు వివరించారు. సమీక్షలో అన్ని క్లస్టర్ల ఎస్‌పీహెచ్‌ఓలు, ఎస్‌టీసీలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement