దుమ్మురేపుతున్న ఆన్‌లైన్ వీడియో గేమ్స్
గేమ్ స్ట్రీమింగ్‌కు ఫుల్ డిమాండ్
2033 నాటికి మార్కెట్ లీడర్‌గా భారత్...
సరికొత్త వీడియో గేమ్‌లు మార్కెట్లోకి రిలీజ్ అయిన వెంటనే ఆడేయాలని ఎవరికుండదు చెప్పండి! నేటి జెన్ జడ్, యువతరానికి గేమ్స్ అంటే మరీ క్రేజ్. వీటిని ఆడాలంటే హై ఎండ్ పీసీతో పాటు ఖరీదైన గేమింగ్ కన్సోల్స్ తప్పనిసరి కావడంతో చాలా మందికి అందని ద్రాక్షగానే ఊరిస్తున్నాయి. అయితే, క్లౌడ్ గేమింగ్ ఎంట్రీతో వీడియో గేమ్స్ ముఖ చిత్రమే మారిపోతోంది. అతి తక్కువ ఖర్చుతో, ఇంట్లో ఉన్న సాధారణ పీసీతోనే అదిరిపోయే లేటెస్ట్ వీడియో గేమ్స్ ఆడే అవకాశం లభిస్తుండటంతో గేమర్స్ క్లిక్.. క్లిక్.. హుర్రే అంటున్నారు!
గేమింగ్ ఆన్ డిమాండ్... గేమ్ స్ట్రీమింగ్.. క్లౌడ్ గేమింగ్... పేరేదైనా కానీ గేమర్ల పాలిట వరంలా మారింది. కేవలం హైస్పీడ్ ఇంటర్నెట్, గేమ్ ప్యాడ్/కంట్రోలర్ ఉంటే చాలు.. ఇప్పుడు ఎవరైనా తమ ఫేవరెట్ గేమ్స్‌ను డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, మొబైల్ లేదా టీవీలోనే ఎంచక్కా స్ట్రీమ్ చేసేయొచ్చన్నమాట! హై క్వాలిటీ గేమ్‌ను మన సొంత సిస్టమ్‌లో రన్ చేయాలంటే, ఆడటానికి ముందే ఆ గేమ్‌ను ఫిజికల్‌గా ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. దీనికి పూర్తి భిన్నంగా ఎక్కడో క్లౌడ్ సర్వర్లలో ఉన్న నచ్చిన గేమ్‌ను ఏ డివైజ్ లేదా ప్లాట్‌ఫామ్‌లోనైనా ఆడేందుకు (స్ట్రీమ్ చేసేందుకు) వీలవుతోంది. ఒకేసారి పలు డివైజ్‌లలోనూ గేమ్ ఆడొచ్చు. అంతేకాదు, గేమ్‌ను ఆపిన చోట నుంచే మళ్లీ ఆడుకోవచ్చు కూడా. అందుకే గేమర్స్ దీన్ని ‘నెట్‌ఫ్లిక్స్ ఫర్ గేమ్స్’ అని కూడా పిలుచుకుంటారు!
రెండేళ్లలో మూడింతలు...
మార్కెట్ రీసెర్చ్ ప్లాట్‌ఫామ్ మార్కెట్.యూఎస్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ గేమింగ్ యూజర్ల సంఖ్య 2021లో దాదాపు 10.27 కోట్ల మంది కాగా, 2023లో ఈ సంఖ్య ఏకంగా 29.1 కోట్లకు ఎగబాకింది. అంటే రెండేళ్లలోనే మూడింతలైంది. ఈ డిమాండ్‌కు అనుగుణంగా క్లౌడ్ గేమింగ్ మార్కెట్ కూడా ఫుల్ స్వింగ్‌లో పరుగులు తీస్తోంది. 2030 నాటికి ప్రపంచ క్లౌడ్ గేమింగ్ మార్కెట్ 46.9 శాతం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)తో 85 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుందని ఫార్చూన్ బిజినెస్ లెక్కగట్టింది. 2022లో ఈ మార్కెట్ విలువ కేవలం 3.37 బిలియన్ డాలర్లు మాత్రమే.
మరోపక్క, క్లౌడ్ గేమింగ్‌కు అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉన్న భారత్.. 2033 నాటికి పరిశ్రమ లీడర్‌గా ఎదుగుతుందని బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ తాజా నివేదిక పేర్కొనడం గమనార్హం. ‘అమెరికా, చైనా వంటి అభివృద్ధి చెందిన సీఎస్‌జీ (క్లౌడ్–స్ట్రీమ్డ్ గేమింగ్) మార్కెట్లు, ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల్లో మూడో వంతుకు పైగా ఆక్రమిస్తున్నాయి. వచ్చే పదేళ్లలో దక్షిణ, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా మార్కెట్లు భారీగా వృద్ధి చెందనున్నాయి. ముఖ్యంగా యువతరంతో ఉప్పొంగుతున్న భారత్‌లో, 5జీ విప్లవం ఆన్‌లైన్ గేమింగ్ స్వరూపాన్ని సమూలంగా మార్చేయనుంది’ అని బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ ఎనలిస్ట్ నాథన్ నాయుడు పేర్కొన్నారు.
భారత్.. అవకాశాల ‘క్లౌడ్’
భారీ అవకాశాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్, ఎన్‌వీడియో, సోనీ మొబైల్ విభాగాలు వర్ధమాన దేశాల మార్కెట్లలో విస్తరణపై దృష్టి సారిస్తున్నాయి. యాపిల్ కూడా తన గేమ్–స్ట్రీమింగ్ యాప్‌లను ఈ మార్కెట్లలో అందుబాటులోకి తెస్తోంది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ప్రపంచ మార్కెట్లో ఒక్కో గేమింగ్ యూజర్ నుంచి సగటు ఆదాయం (ఏఆర్‌పీయూ) 10% వార్షిక వృద్ధి సాధిస్తుండగా.. భారత్‌లో 15% చొప్పున పెరుగుతుండటం విశేషం.
‘మారుమూల ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ లభ్యత, చౌక డేటా ప్లాన్లు, 4జీ/5జీ భారీ విస్తరణ, స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం, అవి మరింత చౌక రేట్లతో మరింత పవర్‌ఫుల్ ఫీచర్లతో లభిస్తుండటం వంటి అనేక అంశాలు భారత్‌లో క్లౌడ్ గేమింగ్ జోరుకు దన్నుగా నిలుస్తున్నాయి’ అని యాంట్‌క్లౌడ్ సీఈఓ హిమాన్షు జైన్ పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లో సేవలు ప్రారంభించిన ఈ క్లౌడ్ గేమింగ్, పీసీ సర్వీస్ ప్రొవైడర్ ఇప్పటికే 10,000 మంది యూజర్లను సంపాదించింది. ఈ ఏడాది చివరికల్లా 50,000 సబ్‌్రస్కిప్షన్లను లక్ష్యంగా పెట్టుకుంది.
టెల్కోలకు భలే చాన్స్..
దూసుకెళ్తున్న క్లౌడ్ గేమింగ్ మార్కెట్లో టెల్కోలు తమ సహజ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో రిలయన్స్ జియో ‘జియో గేమ్స్ క్లౌడ్’ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. నెలకు రూ.199 ప్లాన్‌తో గేమ ర్లు చెలరేగిపోవచ్చన్న మాట! 30 రోజుల ఉచిత ట్రయల్ కూడా అందుబాటులో ఉంది. వొడాఫోన్ ఐడియా కూడా క్లౌడ్ ప్లే పేరుతో గేమింగ్ సరీ్వస్ మొదలుపెట్టింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ హ్యాండ్‌సెట్లలో ఎలాంటి డౌన్‌లోడ్లు లేకుండానే అదిరిపోయే గేమింగ్ అనుభూతిని యూజర్లకు అందిస్తోంది.
– సాక్షి, బిజినెస్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment