సినిమా చూపిస్త మావా.. వడివడిగా ఓవర్‌ ది టాప్‌ అడుగులు | Streaming Services OTT Platforms Turn Indian People Entertainment | Sakshi
Sakshi News home page

సినిమా చూపిస్త మావా.. టెలివిజన్‌ రంగాన్ని మించి పోయే దిశగా ఓటీటీ అడుగులు

Published Thu, Aug 11 2022 1:17 AM | Last Updated on Thu, Aug 11 2022 3:22 PM

Streaming Services OTT Platforms Turn Indian People Entertainment - Sakshi

కంటికి కనిపించని కరోనాను తీసుకువచ్చి ప్రపంచాన్ని గడగడలాడించిన 2020.. మానవాళి జీవన శైలిని సమూలంగా మార్చివేసింది. అనేక అలవాట్లను, పోకడలను పరిచయం చేసింది. వర్క్‌ ఫ్రం హోంలు, ఆన్‌లైన్‌ చెల్లింపులు, ఆన్‌లైన్‌ షాపింగ్‌లు లాంటి వాటన్నింటినీ అలవాటు చేసింది. అదే సంవత్సరం మరో పరిణామానికి నాంది పలికింది. అది స్ట్రీమింగ్‌ సర్వీసుల వెల్లువ. మనం ఓటీటీ సర్వీసుగా పిలుచుకునే ఈ సేవల విజృంభణకు కరోనా కూడా ఓ ప్రధాన కారణమయ్యింది.

థియేటర్ల మూత, బయట తిరగలేని పరిస్థితి, వర్క్‌ ఫ్రం హోంలతో ఇంటికి పరిమితమైన జనాభాకు వినోదం అందించేందుకు ఓ కొత్త మార్గాన్ని ఆవిష్కరించిందీ ఓటీటీ సర్వీసు. కేబుల్‌ కనెక్షన్, బ్రాడ్‌కాస్ట్‌ పరికరాలు, శాటిలైట్‌ కనెక్షన్లతో సంబంధం లేకుండా ఇంటర్నెట్‌ ద్వారా మన దగ్గర ఉన్న మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌ లాంటి ఎలాంటి పరికరం ద్వారా అయినా వినోదాన్ని అందించేదే ఈ స్ట్రీమింగ్‌ సర్వీసు. సినిమాతో మొదలై టెలివిజన్‌ సీరియల్స్, వెబ్‌ సిరీస్‌లు, లైవ్‌ స్ట్రీమింగ్‌ల వరకు విస్తరించిన ఈ ఓటీటీ రంగం త్వరలో టెలివిజన్‌ రంగాన్ని మించి పోయే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. పేరుకు తగ్గట్టుగా ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) అన్ని వినోద రంగాల్ని అధిగమించబోతోంది. 

వీడియో వచ్చి రేడియోను మరిపించినట్లుగా ఓటీటీ ఇప్పుడు డిష్‌ చానళ్లను కనుమరుగు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది కేబుల్‌ కనెక్షన్లకు స్వస్తి చెప్పి ఓటీటీ సర్వీసుల్లో సభ్యులుగా చేరిపోయారు. ఓటీటీ సేవల విస్తృతి గమనిస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. 2019 నాటికి 190 కోట్ల మంది సభ్యులు కలిగిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ 2020కి 210 కోట్లు, 2021 నాటికి 220 కోట్లు లెక్కన 2025 నాటికి 270 కోట్ల సభ్యులను  సమకూర్చుకోబోతోంది.

ఇది ఆఫ్రికా ఖండం జనాభాకు దాదాపుగా రెట్టింపు కాబోతోంది. సభ్యత్వ రుసుము ద్వారా ఈ సంస్థలు ఆర్జిస్తున్న ఆదాయం కూడా అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. 2019లో 8,300 కోట్ల డాలర్లు ఉండగా 2020 నాటికి అది 9,900 కోట్ల డాలర్లకు పెరిగి 2025 నాటికి 16700 కోట్ల డాలర్లకు పెరగనున్నట్లు అంచనా.  అంటే శ్రీలంక, నేపాల్‌ జీడీపీలను కలిపినా ఈ మొత్తం ఎక్కువే.

దీనంతటకూ కారణం బ్రాడ్‌బ్యాండ్‌ కవరేజీ పెరగడం, హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడం, చెల్లించే రుసుము తక్కువ కావడం కొన్ని కారణాలైతే విపరీతంగా పెరిగిపోతున్న స్మార్ట్‌ ఫోన్లు మరో పెద్ద కారణం. బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్‌ లేదా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉంటే ఎక్కడున్నా నచ్చిన సినిమా లేదా సీరియల్‌ను వీక్షించే వీలుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 664 కోట్లు స్మార్ట్‌ ఫోన్లు అంటే.. 83.89 శాతం మంది వద్ద ఫోన్లు ఉన్నట్లు  జోరాం అనే సంస్థ నివేదిక. 2026 నాటికి 130 కోట్ల స్మార్ట్‌ ఫోన్లు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పొందనున్నట్లు మొబైల్‌ ట్రేడింగ్‌ సంస్థ జీఎస్‌ఎమ్‌ఏ అంచనా. 

లెక్కలేనన్ని చానల్స్‌
సినిమా, మ్యూజిక్, వెబ్‌సిరీస్, స్పోర్ట్స్‌ లాంటి అన్ని రకాల వినూత్న వినోద క్రీడా రంగాలకు సంబంధించి ఓటీటీ చానెల్స్‌ అందుబాటులో ఉన్నాయి. కొన్ని చానెల్స్‌లో చిన్న పిల్లలకు కూడా వినోదం అందించే కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 300కుపైగా ఓటీటీ చానెల్స్‌ ఉన్నాయి. అమెరికా జనాభా 75శాతం మంది రెండు లేదా ఆపైన ఓటీటీ చానల్స్‌ సబ్‌స్క్రైబర్లుగా ఉన్నారు. ఒక్క నెట్‌ఫ్లిక్స్‌కే అమెరికా జనాభాలో 30శాతం మంది సభ్యులు.

కోవిడ్‌ పుణ్యమా అని కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. జర్మనీలోని బూట్‌సాస్‌ అనే మ్యూజిక్‌ నైట్‌ క్లబ్‌ ఏకంగా బాట్‌సాస్‌ లైవ్‌ అనే ఓటీటీ చానెల్‌ ప్రారంభించి సభ్యుల కోసం లైవ్‌ మ్యూజిక్‌ కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. పికాక్‌ అనే సంస్థ టోక్యో ఒలింపిక్స్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ కోసం ఓటీటీ చానెల్‌ ప్రారంభించి అన్ని రకాల క్రీడా పోటీలను లైవ్‌గా ప్రసారం చేసింది.

ఎన్ని చానెల్స్‌ ఉన్నా ఓటీటీ రంగంలోకి తొలి అడుగు వేసిన నెట్‌ఫ్లిక్స్‌ ఇప్పటికీ టాప్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌కి నెలవారీ ఫీజు చెల్లించే 22.5 కోట్ల మంది సభ్యులు ఉన్నారు అమెజాన్‌కు చెందిన ప్రైమ్‌ వీడియోకు 20.5 కోట్లు, స్పాటిఫైకి 18 కోట్లు , డిస్నీ ప్లస్‌కి 13 కోట్లు, హెచ్‌బీవో మ్యాక్స్‌కి 8.5 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. 

అక్కడ ఫ్లాప్‌.. ఇక్కడ హిట్‌...
పాత సినిమాలు, టీవీ సీరియల్స్‌ కొనుగోలు చేసి ప్రసారం చేయడం ద్వారా వ్యాపారం ప్రారంభించిన ఈ స్ట్రీమింగ్‌ చానల్స్‌ ఇప్పుడు సొంత సినిమాలు, సీరియల్స్‌ నిర్మిస్తు న్నాయి. టీవీలో ఫ్లాప్‌ అయిన సీరియల్స్‌ ఓటీటీలో బంపర్‌హిట్‌ అవుతున్నాయి. స్పానిష్‌ థ్రిల్లర్‌‘మనీహైస్ట్‌’ టీవీలో ఫ్లాప్‌ షోగా ముద్ర వేయించుకుని నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ చానల్‌లో ప్రత్యక్షమై బ్రహ్మాండంగా హిట్టయ్యింది. నెట్‌ఫ్లిక్స్‌ 2020లో సొంత సినిమాలు, సీరియల్స్‌ కోసం 1,700 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఈ సంస్థ దగ్గర ఇప్పుడు సినిమాలు, సీరియల్స్‌ కలిపి 6,000 టైటిల్స్‌ ఉన్నాయి.

అందులో 40 శాతం సొంత ప్రొడక్షనే. డిస్నీ దగ్గర అయితే 2500 టీవీ సీరియల్స్‌కు సంబంధించిన 55,000 ఎపిసోడ్స్‌ ఉన్నాయి. ఆస్కార్‌ అవార్డు గ్రహీత టామ్‌ హంక్స్, ప్రముఖ దర్శకుడు స్టీవెన్‌ స్పిల్‌బర్గ్‌ కలసి రెండో ప్రపంచయుద్ధంపై హెచ్‌బీవో కోసం  సిరీస్‌ నిర్మిస్తున్నారు. దీనికోసం బ్రిటన్‌లో ఇప్పటికే ఒక కృత్రిమ వైమానిక స్థావరాన్ని నిర్మించారు. 

విలీనపర్వం 
పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ మధ్య పోటీ రసవత్తరంగా మారింది. నెట్‌ఫ్లిక్స్‌లో పోటీ పడేందుకు వివిధ టీవీ, ఓటీటీ సంస్థలు విలీనబాట పడుతున్నాయి. మీడియా రంగంలో మెగా సంఘటనగా పేర్కొంటున్న అతి పెద్ద విలీనం ఈ ఏడాది చివరికి జరగబోతోంది. ఏటీ అండ్‌ టీ, హెచ్‌బీవో, సీఎన్‌ఎన్, వార్నర్‌ మీడియా, డిస్కవరీ, యానిమల్‌ప్లానెట్, టీఎల్‌సీ కలసి ఒకే గొడుగు కిందకి రాబోతున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఇప్పటికే హాలీవుడ్‌ మెగా సంస్థ ఎంజీఎంను కొనుగోలు చేసింది.

బ్రిటన్‌లో బీబీసీ, ఐటీవీ, చానెల్‌ఫోర్‌ కలసి ‘బ్రిట్‌బాక్స్‌’ అనే స్ట్రీమింగ్‌ సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. జర్మనీలో డిస్కవరీ, మరో మాస్‌ మీడియా సంస్థతో కలసి జోయిన్‌గా అవతరించాయి. స్పెయిన్‌లో అట్రెస్‌ మీడియా, మీడియా సెల్, ఆర్‌టీవీ కలసి లవ్స్‌ టీవీనీ ఏర్పాటు చేశాయి. నెట్‌ఫ్లిక్స్‌ వీడియో, గేమింగ్‌ మార్కెట్లో అడుగుపెట్టేందుకు నైట్‌స్కూల్‌ స్టూడియోను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది. 

- దొడ్డ శ్రీనివాసరెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement