Internet service
-
రూ.11తో 10 జీబీ డేటా!
రిలయన్స్ జియో వినియోగదారులకు కొత్తగా బూస్టర్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎక్కువగా డేటా వాడుకునే కస్టమర్లకు ఈ ప్లాన్ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది. ఈమేరకు ప్లాన్ వివరాలు వెల్లడించింది.కేవలం రూ.11తో 10 జీబీ 4జీ డేటా వాడుకోవచ్చు.ఈ ఆఫర్ వ్యాలిడిటీ కేవలం ఒక గంట మాత్రమే ఉంటుంది.రీఛార్జ్ చేసుకున్న గంట తర్వాత డేటా స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది.ఈ ఆఫర్ కేవలం ఇంటర్నెట్ సర్వీసుకే పరిమతం. వాయిస్ కాల్స్, ఎస్ఎంఎస్ సర్వీసులను ఇది అందించదు.నిర్ణీత సమయంపాటు హైస్పీడ్ డేటా అవసరమయ్యేవారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగమని కంపెనీ తెలిపింది.లార్జ్ ఫైల్స్ లేదా సాఫ్ట్వేర్ అప్డేట్లు, డౌన్లోడ్ చేయాలనుకొనేవారికి ఈ ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పింది.ఇదీ చదవండి: సీపీఐ నుంచి ఆహార ద్రవ్యోల్బణం మినహాయింపు? -
సినిమా చూపిస్త మావా.. వడివడిగా ఓవర్ ది టాప్ అడుగులు
కంటికి కనిపించని కరోనాను తీసుకువచ్చి ప్రపంచాన్ని గడగడలాడించిన 2020.. మానవాళి జీవన శైలిని సమూలంగా మార్చివేసింది. అనేక అలవాట్లను, పోకడలను పరిచయం చేసింది. వర్క్ ఫ్రం హోంలు, ఆన్లైన్ చెల్లింపులు, ఆన్లైన్ షాపింగ్‌లు లాంటి వాటన్నింటినీ అలవాటు చేసింది. అదే సంవత్సరం మరో పరిణామానికి నాంది పలికింది. అది స్ట్రీమింగ్ సర్వీసుల వెల్లువ. మనం ఓటీటీ సర్వీసుగా పిలుచుకునే ఈ సేవల విజృంభణకు కరోనా కూడా ఓ ప్రధాన కారణమయ్యింది. థియేటర్ల మూత, బయట తిరగలేని పరిస్థితి, వర్క్ ఫ్రం హోంలతో ఇంటికి పరిమితమైన జనాభాకు వినోదం అందించేందుకు ఓ కొత్త మార్గాన్ని ఆవిష్కరించిందీ ఓటీటీ సర్వీసు. కేబుల్ కనెక్షన్, బ్రాడ్కాస్ట్ పరికరాలు, శాటిలైట్ కనెక్షన్లతో సంబంధం లేకుండా ఇంటర్నెట్ ద్వారా మన దగ్గర ఉన్న మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ లాంటి ఎలాంటి పరికరం ద్వారా అయినా వినోదాన్ని అందించేదే ఈ స్ట్రీమింగ్ సర్వీసు. సినిమాతో మొదలై టెలివిజన్ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్ట్రీమింగ్ల వరకు విస్తరించిన ఈ ఓటీటీ రంగం త్వరలో టెలివిజన్ రంగాన్ని మించి పోయే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. పేరుకు తగ్గట్టుగా ఓటీటీ (ఓవర్ ది టాప్) అన్ని వినోద రంగాల్ని అధిగమించబోతోంది. వీడియో వచ్చి రేడియోను మరిపించినట్లుగా ఓటీటీ ఇప్పుడు డిష్ చానళ్లను కనుమరుగు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది కేబుల్ కనెక్షన్లకు స్వస్తి చెప్పి ఓటీటీ సర్వీసుల్లో సభ్యులుగా చేరిపోయారు. ఓటీటీ సేవల విస్తృతి గమనిస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. 2019 నాటికి 190 కోట్ల మంది సభ్యులు కలిగిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ 2020కి 210 కోట్లు, 2021 నాటికి 220 కోట్లు లెక్కన 2025 నాటికి 270 కోట్ల సభ్యులను సమకూర్చుకోబోతోంది. ఇది ఆఫ్రికా ఖండం జనాభాకు దాదాపుగా రెట్టింపు కాబోతోంది. సభ్యత్వ రుసుము ద్వారా ఈ సంస్థలు ఆర్జిస్తున్న ఆదాయం కూడా అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. 2019లో 8,300 కోట్ల డాలర్లు ఉండగా 2020 నాటికి అది 9,900 కోట్ల డాలర్లకు పెరిగి 2025 నాటికి 16700 కోట్ల డాలర్లకు పెరగనున్నట్లు అంచనా. అంటే శ్రీలంక, నేపాల్ జీడీపీలను కలిపినా ఈ మొత్తం ఎక్కువే. దీనంతటకూ కారణం బ్రాడ్‌బ్యాండ్ కవరేజీ పెరగడం, హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం, చెల్లించే రుసుము తక్కువ కావడం కొన్ని కారణాలైతే విపరీతంగా పెరిగిపోతున్న స్మార్ట్ ఫోన్లు మరో పెద్ద కారణం. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఎక్కడున్నా నచ్చిన సినిమా లేదా సీరియల్‌ను వీక్షించే వీలుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 664 కోట్లు స్మార్ట్ ఫోన్లు అంటే.. 83.89 శాతం మంది వద్ద ఫోన్లు ఉన్నట్లు జోరాం అనే సంస్థ నివేదిక. 2026 నాటికి 130 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ కనెక్షన్ పొందనున్నట్లు మొబైల్ ట్రేడింగ్ సంస్థ జీఎస్ఎమ్ఏ అంచనా. లెక్కలేనన్ని చానల్స్ సినిమా, మ్యూజిక్, వెబ్‌సిరీస్, స్పోర్ట్స్ లాంటి అన్ని రకాల వినూత్న వినోద క్రీడా రంగాలకు సంబంధించి ఓటీటీ చానెల్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని చానెల్స్‌లో చిన్న పిల్లలకు కూడా వినోదం అందించే కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 300కుపైగా ఓటీటీ చానెల్స్ ఉన్నాయి. అమెరికా జనాభా 75శాతం మంది రెండు లేదా ఆపైన ఓటీటీ చానల్స్ సబ్స్క్రైబర్లుగా ఉన్నారు. ఒక్క నెట్‌ఫ్లిక్స్‌కే అమెరికా జనాభాలో 30శాతం మంది సభ్యులు. కోవిడ్ పుణ్యమా అని కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. జర్మనీలోని బూట్సాస్ అనే మ్యూజిక్ నైట్ క్లబ్ ఏకంగా బాట్సాస్ లైవ్ అనే ఓటీటీ చానెల్ ప్రారంభించి సభ్యుల కోసం లైవ్ మ్యూజిక్ కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. పికాక్ అనే సంస్థ టోక్యో ఒలింపిక్స్ లైవ్ స్ట్రీమింగ్ కోసం ఓటీటీ చానెల్ ప్రారంభించి అన్ని రకాల క్రీడా పోటీలను లైవ్‌గా ప్రసారం చేసింది. ఎన్ని చానెల్స్ ఉన్నా ఓటీటీ రంగంలోకి తొలి అడుగు వేసిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికీ టాప్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌కి నెలవారీ ఫీజు చెల్లించే 22.5 కోట్ల మంది సభ్యులు ఉన్నారు అమెజాన్‌కు చెందిన ప్రైమ్ వీడియోకు 20.5 కోట్లు, స్పాటిఫైకి 18 కోట్లు , డిస్నీ ప్లస్‌కి 13 కోట్లు, హెచ్‌బీవో మ్యాక్స్‌కి 8.5 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. అక్కడ ఫ్లాప్.. ఇక్కడ హిట్... పాత సినిమాలు, టీవీ సీరియల్స్ కొనుగోలు చేసి ప్రసారం చేయడం ద్వారా వ్యాపారం ప్రారంభించిన ఈ స్ట్రీమింగ్ చానల్స్ ఇప్పుడు సొంత సినిమాలు, సీరియల్స్ నిర్మిస్తు న్నాయి. టీవీలో ఫ్లాప్ అయిన సీరియల్స్ ఓటీటీలో బంపర్‌హిట్ అవుతున్నాయి. స్పానిష్ థ్రిల్లర్‘మనీహైస్ట్’ టీవీలో ఫ్లాప్ షోగా ముద్ర వేయించుకుని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ చానల్లో ప్రత్యక్షమై బ్రహ్మాండంగా హిట్టయ్యింది. నెట్‌ఫ్లిక్స్ 2020లో సొంత సినిమాలు, సీరియల్స్ కోసం 1,700 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఈ సంస్థ దగ్గర ఇప్పుడు సినిమాలు, సీరియల్స్ కలిపి 6,000 టైటిల్స్ ఉన్నాయి. అందులో 40 శాతం సొంత ప్రొడక్షనే. డిస్నీ దగ్గర అయితే 2500 టీవీ సీరియల్స్‌కు సంబంధించిన 55,000 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత టామ్ హంక్స్, ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ కలసి రెండో ప్రపంచయుద్ధంపై హెచ్‌బీవో కోసం సిరీస్ నిర్మిస్తున్నారు. దీనికోసం బ్రిటన్‌లో ఇప్పటికే ఒక కృత్రిమ వైమానిక స్థావరాన్ని నిర్మించారు. విలీనపర్వం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మధ్య పోటీ రసవత్తరంగా మారింది. నెట్‌ఫ్లిక్స్‌లో పోటీ పడేందుకు వివిధ టీవీ, ఓటీటీ సంస్థలు విలీనబాట పడుతున్నాయి. మీడియా రంగంలో మెగా సంఘటనగా పేర్కొంటున్న అతి పెద్ద విలీనం ఈ ఏడాది చివరికి జరగబోతోంది. ఏటీ అండ్ టీ, హెచ్‌బీవో, సీఎన్ఎన్, వార్నర్ మీడియా, డిస్కవరీ, యానిమల్ప్లానెట్, టీఎల్సీ కలసి ఒకే గొడుగు కిందకి రాబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పటికే హాలీవుడ్ మెగా సంస్థ ఎంజీఎంను కొనుగోలు చేసింది. బ్రిటన్‌లో బీబీసీ, ఐటీవీ, చానెల్ఫోర్ కలసి ‘బ్రిట్బాక్స్’ అనే స్ట్రీమింగ్ సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. జర్మనీలో డిస్కవరీ, మరో మాస్ మీడియా సంస్థతో కలసి జోయిన్గా అవతరించాయి. స్పెయిన్‌లో అట్రెస్ మీడియా, మీడియా సెల్, ఆర్టీవీ కలసి లవ్స్ టీవీనీ ఏర్పాటు చేశాయి. నెట్‌ఫ్లిక్స్ వీడియో, గేమింగ్ మార్కెట్లో అడుగుపెట్టేందుకు నైట్స్కూల్ స్టూడియోను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది. - దొడ్డ శ్రీనివాసరెడ్డి -
గూగుల్‌తో జతకట్టిన ఎలోన్ మస్క్
గూగుల్‌తో స్పేస్ఎక్స్ సంస్థ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ జతకట్టారు. వీరిద్దరి కలయికతో ఇప్పుడు ఉపగ్రహానికి హై స్పీడ్ ఇంటర్నెట్, సురక్షిత కనెక్షన్ లభించే అవకాశాలు ఉన్నాయి. ఎలోన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. అతని శాటిలైట్-టు-ఇంటర్నెట్ సేవా సంస్థ స్పేస్ఎక్స్. దీనిని ‘స్టార్‌లింక్’ అని పిలుస్తారు. స్టార్‌లింక్ ప్రపంచంలోని ఏ మూలనైనా ఇంటర్నెట్ సేవలను అందించడం సులభతరం చేస్తుంది. ప్రస్తుతం గూగుల్ కలయికతో ఇకపై వినియోగదారులు ఎలాంటి అంతరాయం లేకుండా అధిక వేగంతో ఇంటర్నెట్ అందించనుంది. వీరి ఒప్పందం ప్రకారం ఎలోన్ మస్క్ అంతరిక్ష అభివృద్ధి సంస్థ గూగుల్ క్లౌడ్ ద్వారా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను ప్రారంభించనుంది. అందుకోసం స్టార్‌లింక్ ఉపగ్రహాలకు అనుసంధానించడం కోసం గూగుల్ డేటా సెంటర్లలో స్టార్‌లింక్ గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. 2021 రెండవ భాగంలో కస్టమర్లకు ఈ సేవ అందుబాటులో ఉంటుందని టెక్ దిగ్గజం తెలిపింది. ఇటీవల ఆదాయ నివేదిక ప్రకారం, గూగుల్ క్లౌడ్ వ్యాపారం మొత్తం ఆదాయంలో 7% వాటాను కలిగి ఉంది. ( చదవండి: మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్! ) -
రూ. 1.72 లక్షల కోట్ల బకాయిలు కట్టండి
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సర్వీస్ లైసెన్సు (ఐఎస్పీ) ఫీజులు తదితర బాకీలకు సంబంధించి ఏకంగా రూ. 1.72 లక్షల కోట్లు కట్టాలంటూ ప్రభుత్వ రంగ గెయిల్ ఇండియాకు టెలికం విభాగం లేఖ పంపింది. ఐపీ–1, ఐపీ–2, ఐఎస్పీ లైసెన్సు ఫీజుల బకాయిల కింద రూ. 1,72,655 కోట్లు చెల్లించాలని ఇందులో సూచించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఇప్పటికే కట్టాల్సినదంతా కట్టేశామని.. ఇక చెల్లించాల్సిన బాకీలం టూ ఏమీ లేవని గెయిల్ ప్రత్యుత్తరంలో పేర్కొన్నట్లు వివరించాయి. 2002లో తీసుకున్న ఐఎస్పీ లైసెన్సు గడువు 2017తో తీరిపోయిందని గెయిల్ తెలిపింది. అసలు దీనితో వ్యాపారమేమీ చేయనందున ఆదాయార్జన ప్రసక్తే లేదని పేర్కొంది. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ కేటగిరీ 1, 2 కింద తీసుకున్న లైసెన్సులపై 2001–02 నుంచి రూ. 35 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చిందని.. టెలికం విభాగం చెబుతున్నట్లుగా రూ. 2,49,788 కోట్లు కాదని స్పష్టం చేసింది. మరోవైపు, టెలికం విభాగం అడుగుతున్న మొత్తం .. గెయిల్ కంపెనీ విలువకు ఏకంగా మూడు రెట్లు ఉంటుందని సంస్థ వర్గాలు వ్యాఖ్యానించాయి. టెలికంయేతర వ్యాపా రాల ద్వారా వచ్చిన రెవెన్యూను కూడా ఆదాయం కిందే లెక్కించి, దాన్ని బట్టి లైసెన్సు ఫీజు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల బాకీలను కట్టాలంటూ టెల్కోలను ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించింది. తాజాగా ఇదే ప్రాతిపదికన బాకీలు కట్టాలంటూ గెయిల్‌ను టెలికం విభాగం ఆదేశించింది. -
వై-ఫైకి బాలారిష్టాలు
సాక్షి, సిటీబ్యూరో:రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో ప్రారంభించిన వై-ఫై సర్వీసులకు బాలారిష్టాలు తప్పడం లేదు. నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా, ఈట్‌స్ట్రీట్ ఫుడ్ కోర్ట్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన వై-ఫై హాట్‌స్పాట్ పరికరాల వద్ద ఇంటర్నెట్ సర్వీసులను వినియోగించుకోవాలనుకున్న వారికి నిరాశ తప్పడం లేదు. గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతాల్లో ఉచిత వై-ఫై సేవలను వినియోగించుకునేందుకు కొన్ని గంటల పాటు ప్రయత్నించి విఫలమైనట్టు పలువురు వినియోగదారులు వాపోయారు. ఉదయం వ్యాహ్యాళికి వెళ్లేవారు... ట్యాంక్‌బండ్ పరిసరాల్లో సేదదీరదామనుకున్న వారికి ఈ పరిణామం నిరాశపరుస్తోంది. ఈ ప్రాజెక్టును ప్రారంభించి ఐదు రోజులు పూర్తయినప్పటికీ బాలారిష్టాలు అధిగమించకపోవడం గమనార్హం. ఇదే విషయమై వై-ఫై సౌకర్యం ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ సంస్థ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా.. ఈట్‌స్ట్రీట్, పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన హాట్‌స్పాట్ పరికరాల్లో స్వల్ప సాంకేతిక సమస్యలు తలెత్తాయని తెలిపారు. దీనికి తోడు తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుండడంతో వీటి పరిధిలో నెట్ వినియోగించుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ అంశాన్ని హెచ్ఎండీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. వారి సహకారంతో పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉంటే హాట్‌స్పాట్ పరికరాల్లో సమస్యలు తలెత్తవని వెల్లడించారు. ప్రస్తుతం హుస్సేన్‌సాగర్ చుట్టూ 40 వై-ఫై హాట్ స్పాట్ పరికరాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందులో పది మినహా మిగతా చోట్ల ఇంటర్నెట్ సేవలకు ఎలాంటి అంతరాయం లేదని చెప్పారు. ఒక్కో హాట్‌స్పాట్ పరికరం వద్ద ఒకేసారి 500 మంది లాగిన్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇలా వినియోగించుకోవాలి.. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లోని సెట్టింగ్స్‌లో వై-ఫై ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే నెట్‌వర్క్‌లో క్యూ5 నెట్‌వర్క్‌పై క్లిక్ చేయాలి. బ్రౌజర్లో మీ వివరాలను, మొబైల్ నెంబర్, ఈ మెయిల్ అడ్రస్ తదితర వివరాలు నమోదు చేసి... సబ్మిట్ చేయాలి. మీ సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా అందే సందేశంలోని నాలుగు అంకెల పాస్‌వర్డ్‌ను టైప్ చేయాలి. ఆ తరవాత లాగిన్ కావాల్సి ఉంటుంది. తొలి అరగంట ఉచితంగా వై-ఫై సేవలు అందుతాయి. ఆ తరువాత వినియోగానికి చార్జీలు తప్పవు. అక్కడ నో ఫికర్.. సైబర్టవర్స్-మాదాపూర్ పోలీస్ స్టేషన్, సైబర్ టవర్స్ - కొత్తగూడ జంక్షన్, సైబర్ టవర్స్-రహేజా మైండ్‌స్పేస్ సర్కిల్ పరిధిలో గత ఏడాది అక్టోబర్‌లో వైఫైని అందుబాటులోకి తెచ్చారు. 8 కి.మీ మార్గంలో 17 కేంద్రాల వద్ద వై-ఫై సిగ్నల్స్‌ను అందించే హాట్‌స్పాట్స్ ఏర్పాటు చేశారు. వీటి పరిధిలో సుమారు 20 వేల మంది నిత్యం 750 మెగాబైట్స్ నిడివిగల వై-ఫై సాంకేతిక సేవలను నిరంతరాయంగా వినియోగించుకుంటున్నారు. అప్పుడప్పుడూ స్వల్ప అంతరాయం ఎదురవుతున్నప్పటికీ సాంకేతిక సమస్యలను ఎయిర్టెల్ సంస్థ వెంటనే సరిదిద్దుతోంది. దీంతో వై-ఫై సేవలకు అంతరాయం కలగడంలేదని వినియోగదారులు చెబుతున్నారు. ఒకేసారి ఎక్కువమంది లాగిన్ అయినపుడు మాత్రం అంతరాయం కలుగుతోందని తెలిపారు.