
వదంతులు, చట్టవ్యతిరేక కార్యకలాపాల వ్యాప్తిని నిరోధించడానికి పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని సైంథియా పట్టణంలోని ఐదు గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో ఇంటర్నెట్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ టెలిఫోనిక్ సేవలను నిలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మార్చి 14 (శుక్రవారం) నుంచి మార్చి 17 (సోమవారం) వరకు ఈ ప్రాంతాల్లో నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ హోం, హిల్ అఫైర్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ మార్చి 14న ఈమేరకు ప్రకటన జారీ చేశారు. అసలు ప్రభుత్వాలు ఎలాంటి పరిస్థితుల్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధాజ్ఞలు విధించే వీలుందో తెలుసుకుందాం.
దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దిష్ట పరిస్థితుల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపేసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ప్రజా భద్రత, జాతీయ భద్రతకు విఘాతం కలుగుతుందని భావిస్తే ఈ చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 కిందకు వచ్చే టెంపరరీ సస్పెన్షన్ ఆఫ్ టెలికాం సర్వీసెస్ (పబ్లిక్ ఎమర్జెన్సీ లేదా పబ్లిక్ సేఫ్టీ) రూల్స్, 2017 ప్రకారం టెలికాం సేవలు, ఇంటర్నెట్ సేవలను నిలిపేసే అధికారం ప్రభుత్వాలకు ఉంది.
ఏయే సందర్భాల్లో నిలిపేస్తారంటే..
పబ్లిక్ ఎమర్జెన్సీలో భాగంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి, శాంతిభద్రతలను కాపాడటానికి, అల్లర్లు, నిరసనలు లేదా మత హింస వంటి పరిస్థితుల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయవచ్చు.
ఉగ్రవాద కార్యకలాపాలు లేదా సైబర్ దాడులు వంటి జాతీయ భద్రతకు ముప్పు ఉందనే సందర్భాల్లో, సున్నితమైన సమాచారాన్ని రక్షించడానికి, శత్రు సంస్థల మధ్య సమన్వయాన్ని నివారించడానికి ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను కట్టడి చేయవచ్చు.
హింస లేదా అశాంతిని ప్రేరేపించే నకిలీ వార్తలు, పుకార్లు లేదా రెచ్చగొట్టే కంటెంట్ వ్యాప్తిని అరికట్టడానికి కొన్నిసార్లు ఇంటర్నెట్‌ను నిలిపేసే అవకాశం ఉంటుంది.
న్యాయ సమీక్షకు లోబడి ఉండాల్సిందే..
అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వాలు తమ ఇష్టారీతిన ఇంటర్నెట్‌ను నిలిపేయలేవు. దీనికి సంబంధించి ప్రభుత్వ చర్యలు న్యాయ సమీక్షకు లోబడి ఉండాలి. ఇదిలాఉండగా, ఇలాంటి చర్యలు టెలికాం కంపెనీల రెవెన్యూను ప్రభావితం చేస్తాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందుకు అనుగుణంగా ఇతర ప్రాంతాల వినియోగదారుల నుంచి ఆదాయ మార్గాలను ఎలా పెంపొందించుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరాన్ని ఈ చర్యలు హైలైట్ చేస్తున్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి: గృహాల ధరలకు బ్రేక్..!
అసలు గొడవేంటి..
పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలోని సైంథియా పట్టణంలో హోలీ వేడుకల సందర్భంగా హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రెండు స్థానిక వర్గాల మధ్య జరిగిన వాగ్వాదం రాళ్లు రువ్వడం, భౌతిక దాడులకు దారితీయడంతో పలువురికి గాయాలయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment