Streaming support
-
జీబీలకు జీబీలు వాడేస్తున్నారు!
స్వాతి వైజాగ్‌లో ఓ ఫ్యాషన్ డిజైనర్. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లో తాజా ట్రెండ్స్ చూసేందుకు గంటల కొద్దీ సమయం గడుపుతుంది. ఇక రాయ్‌పూర్‌లో ఉబెర్ ఆటో డ్రైవర్ కిశోర్ సాహు అయితే సిటీలో తిరిగే 12 గంటల్లో యూట్యూబ్, ఓటీటీ కంటెంట్‌లోనే మునిగితేలుతాడు. రోజువారీ మొబైల్ డేటా లిమిట్ 1.5–2 జీబీ డేటా అయిపోతే, మళ్లీ డేటా టాపప్ కూడా చేస్తాడు. చిన్న నగరాల్లో సైతం డేటా వినియోగం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే!4జీ.. 5జీ పుణ్యమా అని దేశంలో మొబైల్ డేటా వాడకం ఓ రేంజ్లో దూసుకుపోతోంది. ఇదేదో మెట్రోలు, బడా నగరాలకే పరిమితం అనుకుంటే పొరబాటే! ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు డేటా వాడకంలో మెట్రోలను మించిపోతుండటం విశేషం. ముఖ్యంగా తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని చిన్న చిన్న నగరాలు ‘టాప్’లేపుతున్నాయి. ఇక్కడ యూజర్ల నెలవారీ సగటు డేటా వినియోగం 38–42 జీబీగా ఉన్నట్లు పరిశ్రమ గణాంకాలు చెబుతున్నాయి. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఇది 30–42 జీబీ మాత్రమే కావడం గమనార్హం. అప్పుడైతే పీక్స్... ఐపీఎల్ మ్యాచ్‌లు, క్రికెట్ వరల్డ్ కప్ ఇతరత్రా ముఖ్యమైన క్రీడా ఈవెంట్ల సమయంలో అయితే డేటా వాడకం పీక్స్‌కు వెళ్తోంది. గ్రామాలు, పట్టణాలనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ సగటు నెలవారీ వినియోగం 50–58 జీబీలను తాకుతున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అధిక రోజువారీ డేటా ఉండే ప్యాక్‌లను రీచార్జ్ చేసుకోవడమే కాకుండా.. డేటా టాపప్‌లు కూడా హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయట! సోషల్ మీడియా, ఓటీటీ వీడియోలు, షోలు, గేమ్ స్ట్రీమింగ్‌తో పాటు క్రీడా ఈవెంట్లు దేశంలో డేటా వినియోగానికి బూస్ట్ ఇస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. చౌక స్మార్ట్ ఫోన్లు, డేటా రేట్లు దీనికి దన్నుగా నిలుస్తున్నాయి. 2029 నాటికి మనమే టాప్... అంతర్జాతీయ టెలికం పరికరాల తయారీ దిగ్గజం ఎరిక్సన్ అంచనా ప్రకారం 2023లో భారత్‌లో ఒక్కో యూజర్ సగటు నెలవారీ డేటా విని యోగం 29 జీబీలుగా ఉంది. నోకియా మాత్రం దీన్ని 24.1 జీబీగా అంచనా వేసింది. గడిచిన ఐదేళ్లలో 21.1% వార్షిక వృద్ధి నమోదైందని పేర్కొంది. కాగా, 2029 నాటికి నెలవారీ సగటు వాడకం 68 జీబీకి చేరుతుందని, చైనాను సైతం అధిగమించి డేటా వాడకంలో భారత్ నంబర్ వన్‌గా నిలుస్తుందని ఎరిక్సన్ చెబుతోంది.జీడీపీకి దన్నుపెద్ద నగరాల్లో ఇంట్లో, ఆఫీసుల్లో వైఫై బాగా అందుబాటులో ఉంటుంది. ఫోన్లు, పీసీల్లో వైఫై డేటాతోనే పనైపోతుంది. అయితే ద్వితీయ శ్రేణి మార్కెట్ల విషయానికొస్తే యూజర్లు ఎక్కువగా డేటా ప్యాక్‌లపైనే ఆధారపడుతున్నారని, అక్కడ మొబైల్ డేటా వాడకం భారీగా పెరిగేందుకు ఇది కూడా కారణమని టెలికం కన్సల్టెంట్, నెట్వర్క్ స్పెషలిస్ట్ పరాగ్ కర్ చెప్పారు. కాగా, టెలికం కంపెనీలకు మాత్రం ఆ స్థాయిలో ఆదాయాలు పెరగడం లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. 2020–21లో ఒక్కో జీబీ డేటాపై రూ.10.82 చొప్పున ఆదాయం లభించగా, 2023–24లో ఇది రూ.9.12గా తగ్గిందని ట్రాయ్ గణాంకాల్లో వెల్లడైంది. మరోపక్క, మొబైల్ కనెక్టివిటీ పెరగడం, బ్రాండ్‌బ్యాండ్ విస్తరణ వల్ల ఉద్యోగాల కల్పనతో పాటు ఎకానమీ వృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని అధ్యయనాల్లో వెల్లడైనట్లు గ్లోబల్ టీఎంటీ కన్సలి్టంగ్ సంస్థ ఎనాలిసిస్ మేసన్‌కు చెందిన అశ్విందర్ సేథి చెప్పారు.అత్యధిక మొబైల్ డేటా వినియోగ మార్కెట్లు: తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, చత్తీస్‌గఢ్‌లోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు50-58జీబీ : గ్రామీణ, పట్టణ మార్కెట్ రెండింటిలో గరిష్ట స్థాయి (పీక్) నెలవారీ వినియోగంప్రతి 10%: బ్రాడ్‌బ్యాండ్ విస్తరణతో జీడీపీ 1% వృద్ధి చెందుతుందని అంచనా సోషల్ మీడియా, ఓటీటీ వీడియోలు, గేమ్ స్ట్రీమింగ్: డేటా వాడకం జోరుకు ప్రధాన కారణం– సాక్షి, బిజినెస్ డెస్క్ -
క్లౌడ్ గేమింగ్ సూపర్ ‘క్లిక్’!
సరికొత్త వీడియో గేమ్‌లు మార్కెట్లోకి రిలీజ్ అయిన వెంటనే ఆడేయాలని ఎవరికుండదు చెప్పండి! నేటి జెన్ జడ్, యువతరానికి గేమ్స్ అంటే మరీ క్రేజ్. వీటిని ఆడాలంటే హై ఎండ్ పీసీతో పాటు ఖరీదైన గేమింగ్ కన్సోల్స్ తప్పనిసరి కావడంతో చాలా మందికి అందని ద్రాక్షగానే ఊరిస్తున్నాయి. అయితే, క్లౌడ్ గేమింగ్ ఎంట్రీతో వీడియో గేమ్స్ ముఖ చిత్రమే మారిపోతోంది. అతి తక్కువ ఖర్చుతో, ఇంట్లో ఉన్న సాధారణ పీసీతోనే అదిరిపోయే లేటెస్ట్ వీడియో గేమ్స్ ఆడే అవకాశం లభిస్తుండటంతో గేమర్స్ క్లిక్.. క్లిక్.. హుర్రే అంటున్నారు!గేమింగ్ ఆన్ డిమాండ్... గేమ్ స్ట్రీమింగ్.. క్లౌడ్ గేమింగ్... పేరేదైనా కానీ గేమర్ల పాలిట వరంలా మారింది. కేవలం హైస్పీడ్ ఇంటర్నెట్, గేమ్ ప్యాడ్/కంట్రోలర్ ఉంటే చాలు.. ఇప్పుడు ఎవరైనా తమ ఫేవరెట్ గేమ్స్‌ను డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్, మొబైల్ లేదా టీవీలోనే ఎంచక్కా స్ట్రీమ్ చేసేయొచ్చన్నమాట! హై క్వాలిటీ గేమ్‌ను మన సొంత సిస్టమ్‌లో రన్ చేయాలంటే, ఆడటానికి ముందే ఆ గేమ్‌ను ఫిజికల్‌గా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. దీనికి పూర్తి భిన్నంగా ఎక్కడో క్లౌడ్ సర్వర్లలో ఉన్న నచ్చిన గేమ్‌ను ఏ డివైజ్ లేదా ప్లాట్‌ఫామ్‌లోనైనా ఆడేందుకు (స్ట్రీమ్ చేసేందుకు) వీలవుతోంది. ఒకేసారి పలు డివైజ్‌లలోనూ గేమ్ ఆడొచ్చు. అంతేకాదు, గేమ్‌ను ఆపిన చోట నుంచే మళ్లీ ఆడుకోవచ్చు కూడా. అందుకే గేమర్స్ దీన్ని ‘నెట్‌ఫ్లిక్స్ ఫర్ గేమ్స్’ అని కూడా పిలుచుకుంటారు! రెండేళ్లలో మూడింతలు... మార్కెట్ రీసెర్చ్ ప్లాట్‌ఫామ్ మార్కెట్.యూఎస్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ గేమింగ్ యూజర్ల సంఖ్య 2021లో దాదాపు 10.27 కోట్ల మంది కాగా, 2023లో ఈ సంఖ్య ఏకంగా 29.1 కోట్లకు ఎగబాకింది. అంటే రెండేళ్లలోనే మూడింతలైంది. ఈ డిమాండ్‌కు అనుగుణంగా క్లౌడ్ గేమింగ్ మార్కెట్ కూడా ఫుల్ స్వింగ్‌లో పరుగులు తీస్తోంది. 2030 నాటికి ప్రపంచ క్లౌడ్ గేమింగ్ మార్కెట్ 46.9 శాతం వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్)తో 85 బిలియన్ డాలర్లకు ఎగబాకుతుందని ఫార్చూన్ బిజినెస్ లెక్కగట్టింది. 2022లో ఈ మార్కెట్ విలువ కేవలం 3.37 బిలియన్ డాలర్లు మాత్రమే. మరోపక్క, క్లౌడ్ గేమింగ్‌కు అతిపెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉన్న భారత్.. 2033 నాటికి పరిశ్రమ లీడర్‌గా ఎదుగుతుందని బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ తాజా నివేదిక పేర్కొనడం గమనార్హం. ‘అమెరికా, చైనా వంటి అభివృద్ధి చెందిన సీఎస్జీ (క్లౌడ్–స్ట్రీమ్డ్ గేమింగ్) మార్కెట్లు, ప్రపంచవ్యాప్తంగా అమ్మకాల్లో మూడో వంతుకు పైగా ఆక్రమిస్తున్నాయి. వచ్చే పదేళ్లలో దక్షిణ, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికా మార్కెట్లు భారీగా వృద్ధి చెందనున్నాయి. ముఖ్యంగా యువతరంతో ఉప్పొంగుతున్న భారత్‌లో, 5జీ విప్లవం ఆన్లైన్ గేమింగ్ స్వరూపాన్ని సమూలంగా మార్చేయనుంది’ అని బ్లూంబర్గ్ ఇంటెలిజెన్స్ ఎనలిస్ట్ నాథన్ నాయుడు పేర్కొన్నారు. భారత్.. అవకాశాల ‘క్లౌడ్’ భారీ అవకాశాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్, ఎన్‌వీడియో, సోనీ మొబైల్ విభాగాలు వర్ధమాన దేశాల మార్కెట్లలో విస్తరణపై దృష్టి సారిస్తున్నాయి. యాపిల్ కూడా తన గేమ్–స్ట్రీమింగ్ యాప్‌లను ఈ మార్కెట్లలో అందుబాటులోకి తెస్తోంది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ప్రపంచ మార్కెట్లో ఒక్కో గేమింగ్ యూజర్ నుంచి సగటు ఆదాయం (ఏఆర్పీయూ) 10% వార్షిక వృద్ధి సాధిస్తుండగా.. భారత్‌లో 15% చొప్పున పెరుగుతుండటం విశేషం. ‘మారుమూల ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్ లభ్యత, చౌక డేటా ప్లాన్లు, 4జీ/5జీ భారీ విస్తరణ, స్మార్ట్ ఫోన్ల వాడకం పెరగడం, అవి మరింత చౌక రేట్లతో మరింత పవర్ఫుల్ ఫీచర్లతో లభిస్తుండటం వంటి అనేక అంశాలు భారత్‌లో క్లౌడ్ గేమింగ్ జోరుకు దన్నుగా నిలుస్తున్నాయి’ అని యాంట్క్లౌడ్ సీఈఓ హిమాన్షు జైన్ పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్‌లో సేవలు ప్రారంభించిన ఈ క్లౌడ్ గేమింగ్, పీసీ సర్వీస్ ప్రొవైడర్ ఇప్పటికే 10,000 మంది యూజర్లను సంపాదించింది. ఈ ఏడాది చివరికల్లా 50,000 సబ్‌్రస్కిప్షన్లను లక్ష్యంగా పెట్టుకుంది.టెల్కోలకు భలే చాన్స్..దూసుకెళ్తున్న క్లౌడ్ గేమింగ్ మార్కెట్లో టెల్కోలు తమ సహజ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరిలో రిలయన్స్ జియో ‘జియో గేమ్స్ క్లౌడ్’ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. నెలకు రూ.199 ప్లాన్‌తో గేమ ర్లు చెలరేగిపోవచ్చన్న మాట! 30 రోజుల ఉచిత ట్రయల్ కూడా అందుబాటులో ఉంది. వొడాఫోన్ ఐడియా కూడా క్లౌడ్ ప్లే పేరుతో గేమింగ్ సరీ్వస్ మొదలుపెట్టింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ హ్యాండ్సెట్లలో ఎలాంటి డౌన్లోడ్లు లేకుండానే అదిరిపోయే గేమింగ్ అనుభూతిని యూజర్లకు అందిస్తోంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ICC World Cup 2023: 3.5 కోట్ల వీక్షకులు! డిస్నీ హాట్‌స్టార్ రికార్డు
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్ మొబైల్ స్ట్రీమింగ్‌లో కొత్త రికార్డు సృష్టించింది. ఒకదశలో మ్యాచ్‌ను ఒకేసారి గరిష్టంగా 3.5 కోట్ల మంది వీక్షకులు చూసినట్లు డిస్నీ హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ ఏడాది చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్‌ను 3.2 కోట్ల మంది ఏకసమయంలో చూడగా... ఇప్పుడు ఆ రికార్డును తాజా ప్రపంచకప్ మ్యాచ్ బద్దలు కొట్టింది. -
పెళ్లయ్యాక కోడలిని చదవనిస్తారా?.. సరికొత్త కథనంతో 'మామగారు'!
తెలుగు రాష్ట్రాలలో బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోన్న స్టార్ మాలో మరో కొత్త సీరియల్ వచ్చేసింది. సరికొత్త కథనంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు "మామగారు" అనే సరికొత్త సీరియల్‌తో పలకరించింది. ఈ నెల 11 నుంచి ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలకు ఈ సీరియల్ ప్రసారమవుతోంది. స్టార్ మాలో ప్రసారమయ్యే వినూత్నమైన కథనం కలిగిన ఈ సీరియల్.. అహంకారానికి - ఆత్మవిశ్వాసానికి నడుమ జరిగిన పోరులా ఉండనుంది. డిగ్రీని పూర్తి చేసి పీజీ చేయాలని.. ఉన్నత వుద్యోగం చేసి వికలాంగురాలైన చెల్లెలు, అమ్మ నాన్నలను కంటికి రెప్పలా చూసుకోవాలని కోరుకునే యువతి గంగ. బాగా చదువుకుని ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రమే ఒక పెద్ద కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టాలని కోరుకుంటుంది ఆమె. చెంగయ్య , ఓ పెద్ద మనిషి. పేరున్న కుటుంబానికి చెందిన వ్యక్తి. తన మాటే చెల్లుబాటు కావాలనుకునే పంతం కలిగిన వ్యక్తి. ఆయన మూడో కుమారుడైన గంగాధరన్‌కు చదువుపై ఆసక్తి లేకపోవడంతో చిన్నతనంలోనే ఎలక్ట్రీషియన్‌గా పనికి వెళ్లాడు. తండ్రి చేత తిట్లు తినే అతను, ఈ బాధ ల నుంచి విముక్తి కావాలనుకుంటూ తప్పుడు సర్టిఫికెట్లు తో దుబాయ్‌కి వెళ్లాలని ప్రణాళిక చేస్తాడు. అయితే, అతను ఫోర్జరీ చేయాలనుకున్నది గంగకు చెందిన సర్టిఫికేట్లు కావటం... ఈ విషయం తెలిసి గంగ ఫిర్యాదు చేయటం తో , ప్రభుత్వం గంగాధరన్ పాస్‌పోర్ట్‌ను నిషేదిస్తుంది. పెళ్లి చేస్తే అయినా తమ కుమారుడు గంగాధరన్ మారతాడని భావించి.. చెంగయ్య తన సోదరి కుమార్తె సుభద్రతో గంగాధరన్‌కు వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ సుభద్ర గంగాధరన్‌ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుంది. అయినప్పటికీ చెంగయ్య పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు. తన స్నేహితుడి కుమార్తె గంగతో గంగాధరన్ పెళ్లి చేయాలని చెంగయ్య ప్లాన్ చేస్తాడు. అదే సమయంలో గంగ తండ్రికి ప్రాణాపాయస్థితి ఏర్పడటం... డబ్బుకు ఇబ్బంది పడుతున్న గంగకు ధన సహాయం చేసి ఆమె తండ్రిని కాపాడి బదులుగా తన కుమారుడిని పెళ్లి చేసుకోవాలని కోరతాడు. తమ కూతురును చెంగయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని హామీ ఇచ్చిన గంగ తండ్రి, పెళ్లయ్యాక కూడా గంగను చదివించాలని కోరతాడు. ఇంట్లో ఆడపిల్లలెవరూ పెద్దగా చదువుకోకూడదని నిషేధం విధించిన చెంగయ్య .. సరేనంటూ తల ఊపుతాడు. నిజానికి పితృ స్వామ్య స్వభావం నరనరాన జీర్ణించుకున్న చెంగయ్య.. తన భార్య డాక్టర్ అనే సంగతి కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియనియ్యడు. అలాంటి వాడు తన కోడలిని చదువుకోనిస్తాడా ? అనేది సీరియల్ చూస్తేనే తెలుస్తుంది. తానెవరిని పెళ్లి చేసుకుంటున్నాడో కూడా తెలియని గంగాధరన్, మంగళసూత్రం కట్టేటప్పుడు గంగ ముఖం చూస్తాడు. తన దుబాయ్ కలలు కల్లలు కావటానికి కారణమైన గంగను భార్యగా గంగాధరన్ అంగీకరించాడా ? ఒక పెద్ద ఇంటికి కోడలు కావాలనే కల సాకారమైనందుకు సంతోషంగా కొత్త ఇంటికి అడుగు పెట్టిన గంగ.. ఒక వైపు తనను అసహ్యించుకునే భర్త, మరోవైపు స్త్రీలను బానిసలుగా భావించే మామగారు... నడుమ తన కలను సాకారం చేసుకోవటానికి ఎలా పోరాడుతుంది ? ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో మామగారు సీరియల్ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేసింది. -
12 కోట్ల వీక్షకులతో జియోసినిమా కొత్త రికార్డు
న్యూఢిల్లీ: టాటా ఐపీఎల్ మ్యాచ్‌ల స్ట్రీమింగ్ హక్కులు దక్కించుకున్న జియోసినిమా కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను 12 కోట్ల మంది విశిష్ట వీక్షకులు వీక్షించినట్లు సంస్థ తెలిపింది. దీంతో పాటు ’పీక్ కాన్కరెన్సీ’కి సంబంధించి ఓటీటీ ప్లాట్‌ఫాం 3.2 కోట్ల వీక్షకులతో మరో రికార్డు సృష్టించినట్లు వివరించింది. తద్వారా స్పోర్ట్స్ వీక్షణలో గ్లోబల్ రికార్డులను బద్దలు కొట్టినట్లు జియోసినిమా తెలిపింది. అత్యాధునిక సాంకేతికతతో మ్యాచ్‌లను ప్రసారం చేసిన నేపథ్యంలో సగటున ప్రతి మ్యాచ్ వీక్షణ సమయం 60 నిమిషాల పైగా నమోదైనట్లు వివరించింది. వీడియోల రూపంలో చూసే మొత్తం వీక్షకులను విశిష్ట వీక్షకులుగా వ్యవహరిస్తారు. ఏ క్షణంలోనైనా ఏకకాలంలో అత్యధిక లాగిన్లు నమోదైన సమయాన్ని పీక్ కాన్‌కరెన్సీగా పరిగణిస్తారు. -
యాత్ర 2 ఉంటుంది.. జగన్ అన్న పాదయాత్ర నుంచి మొదలై...
‘‘యాత్ర’ సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించారు. ప్రస్తుతం ‘యాత్ర 2’ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే ఆ చిత్రంలోని పాత్రలకు తగ్గ నటీనటులు కుదరడం లేదు. పూర్తి కథ, నటీనటులు ఫైనల్ అయ్యాక ‘యాత్ర 2’ ని సెట్స్‌పైకి తీసుకెళతాం’’ అని డైరెక్టర్ మహీ వి.రాఘవ్ అన్నారు. ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, ‘జోర్దార్’ సుజాత, దేవయాని, పావని గంగిరెడ్డి, హర్షవర్ధన్ లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’. మహీ వి.రాఘవ్, ప్రదీప్ అద్వైతం షో రన్నర్స్‌గా తేజ కాకుమాను దర్శకత్వం వహించారు. మహీ వి.రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ ఏప్రిల్ 27నుంచి డిస్నీ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా మహీ వి.రాఘవ్ పంచుకున్న విశేషాలు... ► మంచి కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ‘సేవ్ ది టైగర్స్’ నిరూపించింది. కుటుంబం అంతా కలిసి మా వెబ్ సిరీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.. దీంతో ఒక మంచి సిరీస్ తీశామనే తృప్తి ఉంది. ఇలాంటి చక్కని సిరీస్‌ని నిర్మించే అవకాశం మాకు కల్పించిన డిస్నీ హాట్‌స్టార్‌కి థ్యాంక్స్. త్వరలో ‘సేవ్ ది టైగర్స్’ రెండో సిరీస్ షూటింగ్ ప్రారంభిస్తాం. ► ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఎన్నికల సమయంలో ‘యాత్ర 2’ ని విడుదల చేయనున్నారని, ఆ సినిమా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నకి సపోర్ట్‌గా ఉంటుందని వినిపిస్తున్న మాటల్లో వాస్తవం లేదు. ఎందుకంటే సినిమా వల్ల ఓట్లు వస్తాయనుకోవడం అపోహ మాత్రమే. అలా అనుకుంటే ఇతర పార్టీల వారు కూడా నాలుగైదు సినిమాలు తీసుకోవచ్చు కదా? ఓటర్లందరూ నా ‘యాత్ర’ సినిమాని చూసుంటే ‘బాహుబలి’లా పెద్ద సినిమా అయ్యేది. ఓటర్లందరూ సినిమాలు చూస్తారని అనుకోవడం లేదు. జగన్ అన్న పాదయాత్రతో... ‘యాత్ర 2’ సినిమా జగన్ అన్న పాదయాత్ర నుంచి మొదలై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకూ ఉంటుంది. కథ మొత్తం పూర్తయ్యాక ఆ వివరాలు చెబుతాను. ప్రస్తుతం నేను దర్శకత్వం వహించిన ‘సిద్దా లోకం ఎలా ఉంది నాయనా?’ అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ‘సైతాన్’ అనే కొత్త వెబ్ సిరీస్‌తో జూన్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. -
230 మిలియన్లకు చేరిన యూజర్లు, నెట్‌ఫ్లిక్స్ సీఈవో పదవికి రీడ్ హేస్టింగ్స్ గుడ్‌బై
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ గత ఏడాది ముగిసే సమయానికి నిపుణుల అంచనాలకు మించి ప్రపంచ వ్యాప్తంగా 230 మిలియన్ సబ్‌స్కైబర్లు చేరినట్లు ప్రకటించింది. పాస్వర్డ్ షేరింగ్, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా సేవల్ని నిలిపి వేయడం, ఆర్ధిక అనిశ్చితితో ఆ సంస్థ గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంది. అయితే ‘వెడ్నస్డే’, ‘హ్యారీ అండ్ మేఘన్’ షోల కారణంగా చేజారిపోయిన సబ్‌స్కైబర్లు తిరిగి చేరినట్లు తెలిపింది. ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ డీవీడీ సర్వీసుల్ని రెంట్ ఇచ్చే స్థాయి నుంచి ఎంటర్టైన్మెంట్ దిగ్గజంగా అవతరించేందుకు సుదీర్ఘకాలం పాటు విశేష్ సేవలందించిన రీడ్ హేస్టింగ్స్ నెట్‌ఫ్లిక్స్ సీఈవో బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించింది. ఇదే విషయాన్ని రీడ్ హేస్టింగ్ తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ఇక, ఆయన బాధ్యతల్ని సీఎఫ్ఓ గ్రెగ్ పీటర్స్, టెడ్ శారండోస్‌కు అప్పగించారు. తాను ఇకపై ఇతర టెక్ దిగ్గజ వ్యవస్థాపకుల తరహాలోనే కార్యనిర్వాహక ఛైర్మన్‌గా కొనసాగుతానని హేస్టింగ్స్ చెప్పారు. మూడు నెలల్లో 7.3 మిలియన్ల సబ్‌స్కైబర్లు అంతేకాదు మూడు నెలల్లో 7.3 మిలియన్ల మంది చందాదారులు చేరగా..ఆ మొత్తం సంఖ్య 230 మిలియన్ల మందికి చేరింది. ఇక హర్రర్ కామెడీ జానర్లో వచ్చిన వెడ్నస్డే,ఆడమ్స్ ఫ్యామిలీలు అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్‌లో చోటు దక్కించుకున్నట్లు పేర్కొంది. -
సినిమా చూపిస్త మావా.. వడివడిగా ఓవర్ ది టాప్ అడుగులు
కంటికి కనిపించని కరోనాను తీసుకువచ్చి ప్రపంచాన్ని గడగడలాడించిన 2020.. మానవాళి జీవన శైలిని సమూలంగా మార్చివేసింది. అనేక అలవాట్లను, పోకడలను పరిచయం చేసింది. వర్క్ ఫ్రం హోంలు, ఆన్లైన్ చెల్లింపులు, ఆన్లైన్ షాపింగ్‌లు లాంటి వాటన్నింటినీ అలవాటు చేసింది. అదే సంవత్సరం మరో పరిణామానికి నాంది పలికింది. అది స్ట్రీమింగ్ సర్వీసుల వెల్లువ. మనం ఓటీటీ సర్వీసుగా పిలుచుకునే ఈ సేవల విజృంభణకు కరోనా కూడా ఓ ప్రధాన కారణమయ్యింది. థియేటర్ల మూత, బయట తిరగలేని పరిస్థితి, వర్క్ ఫ్రం హోంలతో ఇంటికి పరిమితమైన జనాభాకు వినోదం అందించేందుకు ఓ కొత్త మార్గాన్ని ఆవిష్కరించిందీ ఓటీటీ సర్వీసు. కేబుల్ కనెక్షన్, బ్రాడ్కాస్ట్ పరికరాలు, శాటిలైట్ కనెక్షన్లతో సంబంధం లేకుండా ఇంటర్నెట్ ద్వారా మన దగ్గర ఉన్న మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ లాంటి ఎలాంటి పరికరం ద్వారా అయినా వినోదాన్ని అందించేదే ఈ స్ట్రీమింగ్ సర్వీసు. సినిమాతో మొదలై టెలివిజన్ సీరియల్స్, వెబ్ సిరీస్‌లు, లైవ్ స్ట్రీమింగ్ల వరకు విస్తరించిన ఈ ఓటీటీ రంగం త్వరలో టెలివిజన్ రంగాన్ని మించి పోయే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. పేరుకు తగ్గట్టుగా ఓటీటీ (ఓవర్ ది టాప్) అన్ని వినోద రంగాల్ని అధిగమించబోతోంది. వీడియో వచ్చి రేడియోను మరిపించినట్లుగా ఓటీటీ ఇప్పుడు డిష్ చానళ్లను కనుమరుగు చేస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది కేబుల్ కనెక్షన్లకు స్వస్తి చెప్పి ఓటీటీ సర్వీసుల్లో సభ్యులుగా చేరిపోయారు. ఓటీటీ సేవల విస్తృతి గమనిస్తే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. 2019 నాటికి 190 కోట్ల మంది సభ్యులు కలిగిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ 2020కి 210 కోట్లు, 2021 నాటికి 220 కోట్లు లెక్కన 2025 నాటికి 270 కోట్ల సభ్యులను సమకూర్చుకోబోతోంది. ఇది ఆఫ్రికా ఖండం జనాభాకు దాదాపుగా రెట్టింపు కాబోతోంది. సభ్యత్వ రుసుము ద్వారా ఈ సంస్థలు ఆర్జిస్తున్న ఆదాయం కూడా అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. 2019లో 8,300 కోట్ల డాలర్లు ఉండగా 2020 నాటికి అది 9,900 కోట్ల డాలర్లకు పెరిగి 2025 నాటికి 16700 కోట్ల డాలర్లకు పెరగనున్నట్లు అంచనా. అంటే శ్రీలంక, నేపాల్ జీడీపీలను కలిపినా ఈ మొత్తం ఎక్కువే. దీనంతటకూ కారణం బ్రాడ్‌బ్యాండ్ కవరేజీ పెరగడం, హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం, చెల్లించే రుసుము తక్కువ కావడం కొన్ని కారణాలైతే విపరీతంగా పెరిగిపోతున్న స్మార్ట్ ఫోన్లు మరో పెద్ద కారణం. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే ఎక్కడున్నా నచ్చిన సినిమా లేదా సీరియల్‌ను వీక్షించే వీలుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 664 కోట్లు స్మార్ట్ ఫోన్లు అంటే.. 83.89 శాతం మంది వద్ద ఫోన్లు ఉన్నట్లు జోరాం అనే సంస్థ నివేదిక. 2026 నాటికి 130 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఇంటర్నెట్ కనెక్షన్ పొందనున్నట్లు మొబైల్ ట్రేడింగ్ సంస్థ జీఎస్ఎమ్ఏ అంచనా. లెక్కలేనన్ని చానల్స్ సినిమా, మ్యూజిక్, వెబ్‌సిరీస్, స్పోర్ట్స్ లాంటి అన్ని రకాల వినూత్న వినోద క్రీడా రంగాలకు సంబంధించి ఓటీటీ చానెల్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని చానెల్స్‌లో చిన్న పిల్లలకు కూడా వినోదం అందించే కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 300కుపైగా ఓటీటీ చానెల్స్ ఉన్నాయి. అమెరికా జనాభా 75శాతం మంది రెండు లేదా ఆపైన ఓటీటీ చానల్స్ సబ్స్క్రైబర్లుగా ఉన్నారు. ఒక్క నెట్‌ఫ్లిక్స్‌కే అమెరికా జనాభాలో 30శాతం మంది సభ్యులు. కోవిడ్ పుణ్యమా అని కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. జర్మనీలోని బూట్సాస్ అనే మ్యూజిక్ నైట్ క్లబ్ ఏకంగా బాట్సాస్ లైవ్ అనే ఓటీటీ చానెల్ ప్రారంభించి సభ్యుల కోసం లైవ్ మ్యూజిక్ కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. పికాక్ అనే సంస్థ టోక్యో ఒలింపిక్స్ లైవ్ స్ట్రీమింగ్ కోసం ఓటీటీ చానెల్ ప్రారంభించి అన్ని రకాల క్రీడా పోటీలను లైవ్‌గా ప్రసారం చేసింది. ఎన్ని చానెల్స్ ఉన్నా ఓటీటీ రంగంలోకి తొలి అడుగు వేసిన నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికీ టాప్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్‌కి నెలవారీ ఫీజు చెల్లించే 22.5 కోట్ల మంది సభ్యులు ఉన్నారు అమెజాన్‌కు చెందిన ప్రైమ్ వీడియోకు 20.5 కోట్లు, స్పాటిఫైకి 18 కోట్లు , డిస్నీ ప్లస్‌కి 13 కోట్లు, హెచ్‌బీవో మ్యాక్స్‌కి 8.5 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. అక్కడ ఫ్లాప్.. ఇక్కడ హిట్... పాత సినిమాలు, టీవీ సీరియల్స్ కొనుగోలు చేసి ప్రసారం చేయడం ద్వారా వ్యాపారం ప్రారంభించిన ఈ స్ట్రీమింగ్ చానల్స్ ఇప్పుడు సొంత సినిమాలు, సీరియల్స్ నిర్మిస్తు న్నాయి. టీవీలో ఫ్లాప్ అయిన సీరియల్స్ ఓటీటీలో బంపర్‌హిట్ అవుతున్నాయి. స్పానిష్ థ్రిల్లర్‘మనీహైస్ట్’ టీవీలో ఫ్లాప్ షోగా ముద్ర వేయించుకుని నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ చానల్లో ప్రత్యక్షమై బ్రహ్మాండంగా హిట్టయ్యింది. నెట్‌ఫ్లిక్స్ 2020లో సొంత సినిమాలు, సీరియల్స్ కోసం 1,700 కోట్ల డాలర్లు వెచ్చించింది. ఈ సంస్థ దగ్గర ఇప్పుడు సినిమాలు, సీరియల్స్ కలిపి 6,000 టైటిల్స్ ఉన్నాయి. అందులో 40 శాతం సొంత ప్రొడక్షనే. డిస్నీ దగ్గర అయితే 2500 టీవీ సీరియల్స్‌కు సంబంధించిన 55,000 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఆస్కార్ అవార్డు గ్రహీత టామ్ హంక్స్, ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ కలసి రెండో ప్రపంచయుద్ధంపై హెచ్‌బీవో కోసం సిరీస్ నిర్మిస్తున్నారు. దీనికోసం బ్రిటన్‌లో ఇప్పటికే ఒక కృత్రిమ వైమానిక స్థావరాన్ని నిర్మించారు. విలీనపర్వం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ మధ్య పోటీ రసవత్తరంగా మారింది. నెట్‌ఫ్లిక్స్‌లో పోటీ పడేందుకు వివిధ టీవీ, ఓటీటీ సంస్థలు విలీనబాట పడుతున్నాయి. మీడియా రంగంలో మెగా సంఘటనగా పేర్కొంటున్న అతి పెద్ద విలీనం ఈ ఏడాది చివరికి జరగబోతోంది. ఏటీ అండ్ టీ, హెచ్‌బీవో, సీఎన్ఎన్, వార్నర్ మీడియా, డిస్కవరీ, యానిమల్ప్లానెట్, టీఎల్సీ కలసి ఒకే గొడుగు కిందకి రాబోతున్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పటికే హాలీవుడ్ మెగా సంస్థ ఎంజీఎంను కొనుగోలు చేసింది. బ్రిటన్‌లో బీబీసీ, ఐటీవీ, చానెల్ఫోర్ కలసి ‘బ్రిట్బాక్స్’ అనే స్ట్రీమింగ్ సంస్థను ఏర్పాటు చేసుకున్నాయి. జర్మనీలో డిస్కవరీ, మరో మాస్ మీడియా సంస్థతో కలసి జోయిన్గా అవతరించాయి. స్పెయిన్‌లో అట్రెస్ మీడియా, మీడియా సెల్, ఆర్టీవీ కలసి లవ్స్ టీవీనీ ఏర్పాటు చేశాయి. నెట్‌ఫ్లిక్స్ వీడియో, గేమింగ్ మార్కెట్లో అడుగుపెట్టేందుకు నైట్స్కూల్ స్టూడియోను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది. - దొడ్డ శ్రీనివాసరెడ్డి -
అమెజాన్ చేతికి ఎంజీఎం
న్యూయార్క్: జేమ్స్‌బాండ్ సినిమాల నిర్మాణ దిగ్గజం ఎంజీఎంను ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 8.45 బిలియన్ డాలర్లు వెచ్చిస్తోంది. తద్వారా తమ వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను మరింత పటిష్టం చేసుకోవాలని యోచిస్తోంది. నిత్యావసరాల చెయిన్ హోల్ ఫుడ్స్‌ను 2017లో 14 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన తర్వాత అమెజాన్‌కి ఇదే అతి పెద్ద డీల్. మీడియా రంగంలో నెట్‌ఫ్లిక్స్, డిస్నీప్లస్ వంటి స్ట్రీమింగ్ సేవల సంస్థలతో పోటీపడేందుకు అమెజాన్‌కి ఈ ఒప్పందం ఉపయోగపడనుంది. అమెజాన్ ఇప్పటికే ప్రైమ్ వీడియో పేరిట స్ట్రీమింగ్ సర్వీసులు అందిస్తోంది. దీనికి నికరంగా ఎంత మంది యూజర్లు ఉన్నారన్నది వెల్లడించనప్పటికీ .. అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం ఉన్న దాదాపు 20 కోట్ల మందికి ఇది అందుబాటులో ఉంటోంది. ప్రైమ్ వీడియోతో పాటు ఐఎండీబీ టీవీ పేరుతో ఉచిత స్ట్రీమింగ్ సర్వీస్ కూడా అమెజాన్ నిర్వహిస్తోంది. ఎంజీఎం కొనుగోలుతో రాకీ, రోబోకాప్, పింక్ పాంథర్ వంటి పలు హిట్ సినిమాలు, షోలు కంపెనీ చేతికి దక్కుతాయి. అలాగే ఎపిక్స్ అనే కేబుల్ చానల్ కూడా లభిస్తుంది. త్వరలో విడుదలయ్యే జేమ్స్ బాండ్ మూవీ.. ‘నో టైమ్ టు డై’ కూడా ఎంజీఎం నిర్మించింది. మూకీ యుగం నుంచి ఎంజీఎం.. గర్జించే సింహం లోగోతో మూకీ సినిమాల సమయం నుంచి సినీ ప్రేక్షకులకు ఎంజీఎం స్టూడియో చిరపరిచితం. 1924లో దీన్ని ఏర్పాటు చేశారు. సింగింగ్ ఇన్ ది రెయిన్ వంటి అనేక క్లాసిక్ సినిమాలతో పాటు ఇటీవలి షార్క్ ట్యాంక్, ది రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ బెవర్లీ హిల్స్ వంటి రియాలిటీ టీవీ షోలను ఎంజీఎం నిర్మించింది. మరోవైపు అమెజాన్‌కి కూడా సొంత స్టూడియో ఉన్నప్పటికీ ఫలితాలు మిశ్రమంగా ఉంటున్నాయి. మార్వెలస్ మిసెస్ మెయిజెల్, ఫ్లీబ్యాగ్ వంటి షోలు అవార్డులు గెల్చుకున్నప్పటికీ చాలా మటుకు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. 1995లో ఏర్పాటైన అమెజాన్ ప్రస్తుతం 1.6 లక్షల కోట్ల డాలర్ల దిగ్గజంగా ఎదిగింది. ఆన్లైన్ అమ్మకాల నుంచి అంతరిక్షంలో ఉపగ్రహాల దాకా పంపిస్తోంది. దీంతో కంపెనీ గుత్తాధిపత్యాన్ని తగ్గించడంపై అమెరికా దృష్టి పెడుతోంది. -
డిస్నీప్లస్‌లో హాట్‌స్టార్.. హాట్‌హాట్
ముంబై, సాక్షి: ప్రపంచవ్యాప్తంగా డిస్నీప్లస్కున్న 8.68 కోట్ల సబ్స్క్రైబర్లలో హాట్‌స్టార్ యూజర్ల సంఖ్య 30 శాతానికి చేరింది. ఈ నెల 2కల్లా హాట్‌స్టార్ యూజర్లు 2.6 కోట్లకు చేరినట్లు డిస్నీస్ ప్రపంచ కార్యకలాపాలు, డైరెక్ట్ టు కన్జూమర్ విభాగం చైర్మన్ రెబెక్కా క్యాంప్‌బెల్ వెల్లడించారు. గత రెండు నెలల్లోనే 75 లక్షల మంది కొత్తగా జత కలసినట్లు ఇన్వెస్టర్ల డే సందర్శంగా తెలియజేశారు. సెప్టెంబర్ చివరికల్లా హాట్‌స్టార్ యూజర్ల సంఖ్య 1.85 కోట్లుగా నమోదు కాగా.. హాట్‌స్టార్ సబ్స్క్రైబర్ల సంఖ్యలో భారత్‌కు మెజారిటీ వాటా ఉన్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబర్‌లో ఇండొనేసియా, సింగపూర్‌లో గత నెలలో సర్వీసులను ప్రారంభించింది. కాగా. ప్రపంచవ్యాప్తంగా వివిధ స్ట్రీమింగ్ సర్వీసులకు ప్రస్తుతం 13.7 కోట్లమంది పెయిడ్ సబ్స్క్రైబర్లున్నట్లు డిస్నీ సీఎఫ్‌వో క్రిస్టీన్ మెకార్థీ తెలియజేశారు. 2024కల్లా ఈ సంఖ్య 30-35 కోట్లకు చేరవచ్చని భావిస్తున్నట్లు చెప్పారు. (ఫేస్బుక్ నుంచి విడిగా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్?) ఐపీఎల్ ఎఫెక్ట్ గత నెలలో ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ 13వ ఎడిషన్ కారణంగా హాట్‌స్టార్ యూజర్ల సంఖ్యలో వృద్ధి నమోదైనట్లు పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. దీంతో దేశీయంగా ఈ సర్వీసులపై సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఒక్కో వినియోగదారుడిపై సగటున 2.19 డాలర్ల ఆదాయం నమోదైంది. భారత్‌లో వేగంగా పెరుగుతున్న మధ్యతరగతి ప్రజల కారణంగా డిస్నీప్లస్కు ప్రధాన మార్కెట్‌గా మారినట్లు క్యాంప్‌బెల్ పేర్కొన్నారు. ఇందుకు ప్రధానంగా స్టార్ టీవీ, హాట్‌స్టార్ కారణమవుతున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఏడు ప్రాంతీయ భాషలలో సర్వీసులు అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతీ ఏటా 17,000 గంటల స్థానిక ఒరిజినల్ కార్యక్రమాలను జత చేస్తున్నట్లు వివరించారు. కాగా.. దేశీయంగా డిస్నీప్లస్ హాట్‌స్టార్.. ఇతర గ్లోబల్ దిగ్గజాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జీ5 (ఎస్సెల్ గ్రూప్), సోనీ లైవ్ తదితరాలతో పోటీని ఎదుర్కొంటున్నట్లు ఈ సందర్భంగా పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. (టెస్లా కార్లూ, షేర్లూ- మనకు భలే ఆసక్తి) -
శామ్సంగ్ టైజెన్- టీవీ ఓఎస్‌లలో టాప్
సియోల్: గ్లోబల్ టీవీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మార్కెట్లో టైజెన్ అతిపెద్ద ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)గా ఆవిర్భవించినట్లు స్ట్రాటజీ అనలిటిక్స్ పేర్కొంది. టైజెన్ ఓఎస్‌ను లైనక్స్ ఆధారంగా శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్, ఇంటెల్ కార్ప్ అభివృద్ధి చేశాయి. ఈ ఏడాది(2020) మూడో క్వార్టర్లో శామ్సంగ్ టీవీ విక్రయాలు జోరు చూపడం టైజెన్ ఓఎస్‌కు బూస్ట్ నిచ్చినట్లు టీవీ పరిశ్రమను సమీక్షించే స్ట్రాటజీ అనలిటిక్స్ తెలియజేసింది. తాజా వివరాల ప్రకారం టైజెన్ 12.5 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకోవం ద్వారా ఇతర ఓఎస్‌లను వెనక్కి నెట్టినట్లు వెల్లడించింది. ఈ బాటలో ఎల్జీకి చెందిన వెబ్ ఓఎస్, సోనీ ప్లేస్టేషన్, రోకు టీవీ ఓఎస్, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ అండ్రాయిడ్ ప్రధాన ఓఎస్లుగా నిలిచినట్లు పేర్కొంది. చదవండి: (3 నిముషాలకు టిక్‌టాక్ వీడియోలు!) 1.18 కోట్లు ఈ ఏడాది క్యూ3(జులై- సెప్టెంబర్)లో ప్రపంచవ్యాప్తంగా శామ్సంగ్ 1.18 కోట్ల స్మార్ట్ టీవీలను విక్రయించినట్లు స్థానిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఏ ఇతర కంపెనీ అమ్మకాలకంటే ఇవి ఎక్కువకాగా.. దీంతో 15.5 కోట్ల టైజెన్ ఓఎస్ స్మార్ట్ టీవీలు ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్నట్లు వివరించింది. గతేడాదితో పోలిస్తే ఇది 23 శాతం వృద్ధిగా తెలియజేసింది. ప్రపంచంలోనే టీవీ విక్రయాలలో తొలి ర్యాంకులో ఉన్న శామ్సంగ్కు టైజెన్ కొత్త ఆదాయ వనరుగా నిలుస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల పలువురు వినియోగదారులు సంప్రదాయ పే చానళ్లు, ప్రసార ప్లాట్‌ఫామ్స్ నుంచి స్ట్రీమింగ్ సర్వీసులకు మళ్లుతున్నట్లు తెలియజేసింది. ఫలితంగా ఇటీవల శామ్సంగ్ ప్రకటనదారులు, కంటెంట్ ప్రొవైడర్లను ఆకట్టుకునే ప్రణాళికలు అమలు చేస్తోంది. తద్వారా వేగంగా ఎదుగుతున్న టైజెన్ను టీవీ ప్రకటనల విభాగంలో నాయకత్వ స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. 8.13 కోట్లు ప్రపంచవ్యాప్తంగా క్యూ3లో స్మార్ట్ టీవీలు, మీడియా స్ట్రీమర్లు, గేమింగ్ కన్సోల్స్ తదితర కనెక్టెడ్ టీవీ డివైస్‌లు 8.13 కోట్లకు చేరినట్లు స్ట్రాటజీ అనలిటిక్స్ వెల్లడించింది. ఇది వార్షిక ప్రాతిపదికన 19 శాతం వృద్ధికాగా.. కోవిడ్-19 కారణంగా హోమ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో భారీ డిమాండ్ నెలకొనడం ఇందుకు సహకరించినట్లు తెలియజేసింది. దీంతో 2020 డిసెంబర్‌కల్లా 7 శాతం వృద్ధితో ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల కనెక్టెడ్ టీవీ డివైసెస్‌లు వినియోగంలోకి రానున్నట్లు అభిప్రాయపడింది. -
యూట్యూబ్ మ్యూజిక్ సేవలు కాస్ట్లీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే పాపులర్ మ్యూజిక్ సర్వీసులను అందిస్తున్న యూ ట్యూబ్ కొత్త మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలను ప్రకటించింది. ఆన్లైన్ మ్యూజిక్ సెక్టార్లో పెరుగుతున్న పోటీని క్యాష్ చేసుకునే వ్యూహంలో ఈ నెల 22న దీన్ని అధికారికంగా లాంచ్ చేయనుంది. ముఖ్యంగా మ్యూజిక్ స్ట్రీమింగ్ రంగంలో మార్కెట్లను ఏలుతున్న ఆపిల్ మ్యూజిక్, స్పాటీఫై, సావన్ లాంటి సంస్థలకు పోటీగా తాజా యూ ట్యూబ్ మ్యూజిక్, యూ ట్యూబ్ ప్రీమియం అనే రెండు సర్వీసులను లాంచ్ చేయనుంది. తద్వారా ఇప్పటివరకూ ఉచితంగా అందిస్తున్నసేవలను సభ్యత్వ ఆధారిత సేవలుగా మారుస్తోంది. మ్యూజిక్ సేవలను రీబ్రాండింగ్ చేయడ ద్వారా ప్రత్యర్థి సంస్థలకు సవాల్ విసురుతోంది. యూట్యూబ్ సంస్థ తీసుకు వస్తున్న యూ ట్యూబ్ మ్యూజిక్‌లో కేవలం ఆడియో మాత్రమే ప్లే అయ్యే విధంగా ప్లాన్ చేసింది. దీంతో బ్యాండ్‌విడ్త్ ఆదా అవుతుందని సంస్థ భావిస్తోంది. అలాగే కేవలం యూట్యూబ్ లో ఉన్న వీడియోలు మాత్రమే కాదు, ఇతర పెద్ద మ్యూజిక్ కంపెనీల నుండి మ్యూజిక్ స్ట్రీమింగ్ చేయడం కోసం యూట్యూబ్ సంస్థ హక్కులను కొనుగోలు చేసింది. అంటే ఆ పాటలన్నింటిని ఈ సర్వీస్ ద్వారా ప్లే చేసుకుని వినవచ్చన్నమాట. అయితే ఇందుకు సబ్‌స్క్రైబ్ చేసువాల్సి ఉంటుంది. నెలకు సుమారు 680 రూపాయలు(10-12 డాలర్లు) ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఇక యూ ట్యూబ్ వీడియోను యాడ్ ఫ్రీగా వీక్షించాలనుకునే వారినుద్దేశించి తీసుకొస్తున్న మరో ఆప్షన్ ప్రీమియం సర్వీసు. ఈ సర్వీసు కూడా సబ్స్క్రిప్షన్ ఆధారంగానే పనిచేస్తుంది. అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, మెక్సికో, దక్షిణ కొరియాలో ఈ సేవలను మొదటగా ప్రారంభిస్తుంది. త్వరలోనే ఇతర దేశాల్లో కూడా ఆవిష్కరించనుంది. -
జగన్ సమైక్య దీక్షకు వెల్లువెత్తుతున్న మద్దతు
హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి చేపట్టిన సమైక్య దీక్షకు హైదరాబాద్‌తోపాటు సీమాంధ్ర అంతటా మద్దతు వెల్లువెత్తుతోంది. నాలుగవ రోజు దీక్ష కొనసాగిస్తున్న జగన్‌ను చూసేందుకు, సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీపడుతున్నారు. అనేక మంది జగన్‌ను కలిసి తమ మద్దతు తెలిపారు. సమైక్యాంధ్ర జేఏసీ నేతలు కూడా ఈరోరజు జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. బుక్కరాయసముద్రం మాజీ జెడ్పీటీసీ గువ్వల శ్రీకాంత్‌రెడ్డి వైఎస్ జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. కూకట్పల్లి క్రిస్టియన్ మైనారిటీ నాయకుడు రెవరెన్ జార్జ్హెర్బత్ ఆధ్వర్యంలో 500 మంది చర్చి ఫాదర్లతో జగన్ దీక్షకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. సీమాంధ్ర అంతటా జగన్ దీక్షకు మద్దతుగా పలువురు నేతలు, అభిమానులు, కార్యకర్తలు ఆమరదీక్షలు, రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా అగరంపల్లిలో జగన్ దీక్షకు మద్దతుగా దేవాలయశాఖ మాజీ ఉద్యోగి కేశవులు చేస్తున్న దీక్ష నాలుగవ రోజుకు చేరింది. జగన్ దీక్షకు మద్దతుగా పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి దీక్ష చేయనున్నారు. బీఎం కండ్రికలో పార్టీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. తిరుపతి తుడా సర్కిల్లో పార్టీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ అవినాశ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, అభిమానులు ర్యాలీలు నిర్వహించి రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లాలో జగన్ దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 5వ రోజు మహిళలలు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. రాజంపేట కన్వీనర్ కోనా శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు దీక్ష చేస్తున్నారు. రాయచోటిలో ఈ రోజు దీక్షలో 30 మంది వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా విజయవాడ, నందిగామ, మైలవరం, తిరువూరులలో పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.పామర్రులో పార్టీ సీఈసీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పార్టీ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈరోజు దీక్షలో ముస్లిం సొదరులు పాల్గొన్నారు. నిడదవోలులో పార్టీ సమన్వయకర్త రాజీవ్ కృష్ణా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. పెనుగొండ గాంధీబొమ్మ సెంటర్లో వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త మల్లుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పార్టీ సమన్వయకర్త ఎల్ఎమ్ మోహన్‌రెడ్డి ఆమరణ దీక్ష 4వ రోజుకు చేరింది. కదిరిలో వైఎస్ఆర్ సీపీ నేత వజ్ర భాస్కర్‌రెడ్డి చేస్తున్న ఆమరణ దీక్ష 4వ రోజుకు చేరింది. రాయదుర్గంలో పార్టీ కార్యకర్తలు నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. గుంతకల్‌లో పార్టీ సమన్వయ కర్త వై.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో, కదిరి, ఒడీసీలో వైఎస్ జగన్ అభిమానులు దీక్షలు చేస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పత్తికొండ నియోజకవర్గంలో పార్టీ నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర పోరు పాదయాత్ర నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో పార్టీ కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖ జిల్లా అనకాపల్లిలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కొణతాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మునగపాకలో యలమంచిలి వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త బుడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో 4వ రోజు రిలే దీక్ష చేస్తున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలో 3వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.