సియోల్: గ్లోబల్ టీవీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మార్కెట్లో టైజెన్ అతిపెద్ద ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)గా ఆవిర్భవించినట్లు స్ట్రాటజీ అనలిటిక్స్ పేర్కొంది. టైజెన్ ఓఎస్‌ను లైనక్స్ ఆధారంగా శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, ఇంటెల్ కార్ప్ అభివృద్ధి చేశాయి. ఈ ఏడాది(2020) మూడో క్వార్టర్‌లో శామ్‌సంగ్ టీవీ విక్రయాలు జోరు చూపడం టైజెన్ ఓఎస్‌కు బూస్ట్ నిచ్చినట్లు టీవీ పరిశ్రమను సమీక్షించే స్ట్రాటజీ అనలిటిక్స్ తెలియజేసింది. తాజా వివరాల ప్రకారం టైజెన్ 12.5 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకోవం ద్వారా ఇతర ఓఎస్‌లను వెనక్కి నెట్టినట్లు వెల్లడించింది. ఈ బాటలో ఎల్‌జీకి చెందిన వెబ్ ఓఎస్, సోనీ ప్లేస్టేషన్, రోకు టీవీ ఓఎస్, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ అండ్రాయిడ్ ప్రధాన ఓఎస్‌లుగా నిలిచినట్లు పేర్కొంది. చదవండి: (3 నిముషాలకు టిక్‌టాక్ వీడియోలు!)
1.18 కోట్లు
ఈ ఏడాది క్యూ3(జులై- సెప్టెంబర్)లో ప్రపంచవ్యాప్తంగా శామ్‌సంగ్ 1.18 కోట్ల స్మార్ట్ టీవీలను విక్రయించినట్లు స్థానిక న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఏ ఇతర కంపెనీ అమ్మకాలకంటే ఇవి ఎక్కువకాగా.. దీంతో 15.5 కోట్ల టైజెన్ ఓఎస్ స్మార్ట్ టీవీలు ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్నట్లు వివరించింది. గతేడాదితో పోలిస్తే ఇది 23 శాతం వృద్ధిగా తెలియజేసింది. ప్రపంచంలోనే టీవీ విక్రయాలలో తొలి ర్యాంకులో ఉన్న శామ్‌సంగ్‌కు టైజెన్ కొత్త ఆదాయ వనరుగా నిలుస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల పలువురు వినియోగదారులు సంప్రదాయ పే చానళ్లు, ప్రసార ప్లాట్‌ఫామ్స్ నుంచి స్ట్రీమింగ్ సర్వీసులకు మళ్లుతున్నట్లు తెలియజేసింది. ఫలితంగా ఇటీవల శామ్‌సంగ్ ప్రకటనదారులు, కంటెంట్ ప్రొవైడర్లను ఆకట్టుకునే ప్రణాళికలు అమలు చేస్తోంది. తద్వారా వేగంగా ఎదుగుతున్న టైజెన్‌ను టీవీ ప్రకటనల విభాగంలో నాయకత్వ స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
8.13 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా క్యూ3లో స్మార్ట్ టీవీలు, మీడియా స్ట్రీమర్లు, గేమింగ్ కన్సోల్స్ తదితర కనెక్టెడ్ టీవీ డివైస్‌లు 8.13 కోట్లకు చేరినట్లు స్ట్రాటజీ అనలిటిక్స్ వెల్లడించింది. ఇది వార్షిక ప్రాతిపదికన 19 శాతం వృద్ధికాగా.. కోవిడ్-19 కారణంగా హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో భారీ డిమాండ్ నెలకొనడం ఇందుకు సహకరించినట్లు తెలియజేసింది. దీంతో 2020 డిసెంబర్‌కల్లా 7 శాతం వృద్ధితో ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల కనెక్టెడ్ టీవీ డివైసెస్‌లు వినియోగంలోకి రానున్నట్లు అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment