పెళ్లయ్యాక కోడలిని చదవనిస్తారా?.. సరికొత్త కథనంతో 'మామగారు'! | Star Maa Serial 'Mamagaru' Streaming On September 11th | Sakshi
Sakshi News home page

Mamagaru Serial: అహంకారానికి - ఆత్మవిశ్వాసానికి జరిగే పోరాటమే 'మామగారు'!

Published Tue, Sep 12 2023 3:20 PM | Last Updated on Tue, Sep 12 2023 3:41 PM

Star Maa Serial Mamagaru Streaming On September 11th - Sakshi

తెలుగు రాష్ట్రాలలో  బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోన్న స్టార్ మాలో మరో కొత్త సీరియల్ వచ్చేసింది. సరికొత్త కథనంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు "మామగారు" అనే సరికొత్త సీరియల్‌తో పలకరించింది. ఈ నెల 11 నుంచి ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలకు ఈ సీరియల్ ప్రసారమవుతోంది. 

స్టార్ మాలో ప్రసారమయ్యే వినూత్నమైన కథనం కలిగిన ఈ సీరియల్.. అహంకారానికి - ఆత్మవిశ్వాసానికి నడుమ జరిగిన పోరులా ఉండనుంది. డిగ్రీని పూర్తి చేసి పీజీ చేయాలని.. ఉన్నత వుద్యోగం చేసి  వికలాంగురాలైన చెల్లెలు, అమ్మ నాన్నలను కంటికి రెప్పలా చూసుకోవాలని కోరుకునే  యువతి గంగ.  బాగా చదువుకుని ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రమే ఒక పెద్ద కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టాలని కోరుకుంటుంది ఆమె.  


చెంగయ్య , ఓ పెద్ద మనిషి. పేరున్న కుటుంబానికి చెందిన వ్యక్తి. తన మాటే చెల్లుబాటు కావాలనుకునే పంతం కలిగిన వ్యక్తి.  ఆయన మూడో కుమారుడైన గంగాధరన్‌కు చదువుపై ఆసక్తి లేకపోవడంతో చిన్నతనంలోనే ఎలక్ట్రీషియన్‌గా పనికి వెళ్లాడు. తండ్రి చేత తిట్లు తినే అతను, ఈ బాధ ల నుంచి విముక్తి కావాలనుకుంటూ తప్పుడు సర్టిఫికెట్లు తో దుబాయ్‌కి వెళ్లాలని ప్రణాళిక చేస్తాడు. అయితే, అతను ఫోర్జరీ చేయాలనుకున్నది గంగకు చెందిన  సర్టిఫికేట్‌లు కావటం... ఈ విషయం తెలిసి గంగ  ఫిర్యాదు చేయటం తో , ప్రభుత్వం గంగాధరన్ పాస్‌పోర్ట్‌ను నిషేదిస్తుంది. పెళ్లి చేస్తే అయినా తమ కుమారుడు గంగాధరన్ మారతాడని భావించి..  చెంగయ్య తన సోదరి కుమార్తె సుభద్రతో గంగాధరన్‌కు వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ సుభద్ర గంగాధరన్‌ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుంది. 


అయినప్పటికీ చెంగయ్య పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు.  తన స్నేహితుడి కుమార్తె గంగతో గంగాధరన్ పెళ్లి చేయాలని చెంగయ్య ప్లాన్ చేస్తాడు. అదే సమయంలో  గంగ తండ్రికి ప్రాణాపాయస్థితి ఏర్పడటం... డబ్బుకు ఇబ్బంది పడుతున్న గంగకు ధన సహాయం చేసి ఆమె తండ్రిని కాపాడి బదులుగా తన కుమారుడిని పెళ్లి చేసుకోవాలని కోరతాడు. తమ కూతురును చెంగయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని హామీ ఇచ్చిన గంగ తండ్రి, పెళ్లయ్యాక కూడా  గంగను చదివించాలని కోరతాడు. ఇంట్లో ఆడపిల్లలెవరూ పెద్దగా చదువుకోకూడదని నిషేధం విధించిన చెంగయ్య .. సరేనంటూ తల ఊపుతాడు. నిజానికి పితృ స్వామ్య స్వభావం నరనరాన జీర్ణించుకున్న చెంగయ్య.. తన భార్య డాక్టర్ అనే సంగతి కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియనియ్యడు. అలాంటి వాడు తన కోడలిని చదువుకోనిస్తాడా ? అనేది సీరియల్‌ చూస్తేనే తెలుస్తుంది.

తానెవరిని పెళ్లి చేసుకుంటున్నాడో కూడా తెలియని గంగాధరన్‌, మంగళసూత్రం కట్టేటప్పుడు  గంగ ముఖం చూస్తాడు. తన దుబాయ్ కలలు కల్లలు కావటానికి కారణమైన గంగను భార్యగా గంగాధరన్‌ అంగీకరించాడా ? ఒక పెద్ద ఇంటికి కోడలు కావాలనే కల సాకారమైనందుకు  సంతోషంగా కొత్త ఇంటికి అడుగు పెట్టిన గంగ.. ఒక వైపు తనను అసహ్యించుకునే భర్త, మరోవైపు స్త్రీలను బానిసలుగా భావించే మామగారు... నడుమ తన కలను సాకారం చేసుకోవటానికి  ఎలా పోరాడుతుంది ? ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో మామగారు సీరియల్ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement