జగన్ సమైక్య దీక్షకు వెల్లువెత్తుతున్న మద్దతు
హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, లోక్సభ సభ్యుడు జగన్మోహన రెడ్డి చేపట్టిన సమైక్య దీక్షకు హైదరాబాద్తోపాటు సీమాంధ్ర అంతటా మద్దతు వెల్లువెత్తుతోంది. నాలుగవ రోజు దీక్ష కొనసాగిస్తున్న జగన్ను చూసేందుకు, సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీపడుతున్నారు. అనేక మంది జగన్ను కలిసి తమ మద్దతు తెలిపారు. సమైక్యాంధ్ర జేఏసీ నేతలు కూడా ఈరోరజు జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. బుక్కరాయసముద్రం మాజీ జెడ్పీటీసీ గువ్వల శ్రీకాంత్‌రెడ్డి వైఎస్ జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. కూకట్‌పల్లి క్రిస్టియన్ మైనారిటీ నాయకుడు రెవరెన్ జార్జ్‌హెర్బత్ ఆధ్వర్యంలో 500 మంది చర్చి ఫాదర్లతో జగన్ దీక్షకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు.
సీమాంధ్ర అంతటా జగన్ దీక్షకు మద్దతుగా పలువురు నేతలు, అభిమానులు, కార్యకర్తలు ఆమరదీక్షలు, రిలేదీక్షలు కొనసాగిస్తున్నారు. చిత్తూరు జిల్లా అగరంపల్లిలో జగన్ దీక్షకు మద్దతుగా దేవాలయశాఖ మాజీ ఉద్యోగి కేశవులు చేస్తున్న దీక్ష నాలుగవ రోజుకు చేరింది. జగన్ దీక్షకు మద్దతుగా పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి దీక్ష చేయనున్నారు. బీఎం కండ్రికలో పార్టీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. తిరుపతి తుడా సర్కిల్‌లో పార్టీ నేతలు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.
వైఎస్‌ఆర్ జిల్లా పులివెందులలో వైఎస్ అవినాశ్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, అభిమానులు ర్యాలీలు నిర్వహించి రిలే దీక్షలు కొనసాగిస్తున్నారు. వైఎస్‌ఆర్ జిల్లాలో జగన్ దీక్షకు మద్దతుగా ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 5వ రోజు మహిళలలు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.
రాజంపేట కన్వీనర్ కోనా శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు దీక్ష చేస్తున్నారు. రాయచోటిలో ఈ రోజు దీక్షలో 30 మంది వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా విజయవాడ, నందిగామ, మైలవరం, తిరువూరులలో పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు.పామర్రులో పార్టీ సీఈసీ సభ్యురాలు ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పార్టీ సమన్వయకర్త చీర్ల రాధయ్య ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈరోజు దీక్షలో ముస్లిం సొదరులు పాల్గొన్నారు. నిడదవోలులో పార్టీ సమన్వయకర్త రాజీవ్ కృష్ణా రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేస్తున్నారు. పెనుగొండ గాంధీబొమ్మ సెంటర్‌లో వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త మల్లుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో పార్టీ సమన్వయకర్త ఎల్‌ఎమ్ మోహన్‌రెడ్డి ఆమరణ దీక్ష 4వ రోజుకు చేరింది. కదిరిలో వైఎస్ఆర్ సీపీ నేత వజ్ర భాస్కర్‌రెడ్డి చేస్తున్న ఆమరణ దీక్ష 4వ రోజుకు చేరింది. రాయదుర్గంలో పార్టీ కార్యకర్తలు నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. గుంతకల్‌లో పార్టీ సమన్వయ కర్త వై.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో, కదిరి, ఒడీసీలో వైఎస్ జగన్ అభిమానులు దీక్షలు చేస్తున్నారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో భూమా నాగిరెడ్డి ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. పత్తికొండ నియోజకవర్గంలో పార్టీ నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర పోరు పాదయాత్ర నిర్వహించారు.
ప్రకాశం జిల్లా మార్కాపురంలో పార్టీ కార్యకర్తల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
విశాఖ జిల్లా అనకాపల్లిలో వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కొణతాల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. మునగపాకలో యలమంచిలి వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త బుడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో 4వ రోజు రిలే దీక్ష చేస్తున్నారు.
గుంటూరు జిల్లా బాపట్ల వైఎస్ఆర్ సీపీ సమన్వయకర్త కోన రఘుపతి ఆధ్వర్యంలో 3వ రోజు రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.