వీడియో గేమ్స్‌తో దృశ్యభ్రమ!
లండన్: తరచూ వీడియోగేమ్స్ ఆడేవారు తీవ్రమైన దృశ్య భ్రమకు గురయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దాని వల్ల నిద్ర కరువవడం, పనులు సరిగా చేసుకోలేకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయని చెబుతున్నారు. బ్రిటన్‌కు చెందిన నాటింగ్‌హమ్ ట్రెంట్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు దీనిపై విస్తృతంగా పరిశోధన చేశారు. తరచూ వీడియోగేమ్‌లు ఆడే 483 మంది మానసిక పరిస్థితిని విశ్లేషించి.. ‘గేమ్ ట్రాన్స్‌ఫర్ ఫెనోమినా (జీటీపీ)’యే దానికి కారణమని గుర్తించారు.
వీరందరికీ సాధారణ సమయాల్లో కూడా వీడియోగేమ్స్‌లోని చిత్రాలు, దృశ్యాలు కళ్ల ముందు మసగ్గా కనిపించడం.. చుట్టూ ఉన్న పరిసరాలు, వస్తువులన్నీ ఆకారాలు, స్థానం మారుతున్నట్లుగా భ్రమ కలగడం.. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కళ్ల ముందు వీడియోగేమ్‌ల్లోని మెనూలు, ఆప్షన్స్ మసగ్గా కనిపించడం వంటి భ్రమలు కలుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. అయితే, అందరిలోనూ ఈ ప్రభావం ఒకేతీరులో కనిపించడం లేదని.. కొందరిలో అతికొద్ది సమయం పాటు కనిపించి మాయమవుతున్నాయని వారు చెబుతున్నారు. కొందరిలో మాత్రం పనులు సరిగా చేసుకోలేనంతగా, నిద్ర సరిగా పట్టనంతగా ఇబ్బంది కలుగుతోందని పేర్కొంటున్నారు.