
ఆన్‌లైన్ గేమ్స్ అంత ప్రమాదమేమీ కాదట!
పరిపరి శోధన
పిల్లలు వీడియో గేమ్స్ ఆడటం వల్ల వారి చదువు చంకనాకిపోతుందని, తెలివితేటలు తెల్లారిపోతాయని, మెదడు మందకొడిగా తయారవుతుందని పరిశోధకులు ఎప్పటినుంచో మొత్తుకుంటున్నారు. అయితే రోజూ ఆన్‌లైన్ గేమ్స్ ఆడే పిల్లల బుర్ర చురుగ్గా తయారవుతుందని, చదువుల్లో ముందుంటారని తాజాపరిశోధనలు చెబుతున్నాయి. నిత్యం ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ఆడే పిల్లలు, మ్యాథ్స్‌లో, సైన్స్‌లో మిగిలిన వారి కన్నా ఎక్కువ మార్కులు సాధించినట్లు వెల్లడైంది. ఈ పరిశోధనలు నిర్వహించిన మెల్‌బోర్న్‌లోని ఆర్‌ఎంఐటీ విశ్వవిద్యాలయానికి చెందిన ఆల్బెర్టో పోసో అనే విద్యావేత్త మాటల్లో చెప్పాలంటే... ఆన్‌లైన్ గేమ్స్ ఆడే పిడుగులలో ఏకాగ్రత పెరుగుతుంది.
గేమ్‌లో తర్వాతి స్టెప్‌ను ఎలా అందుకోవాలా అన్న ఆలోచనతో బుర్రకు పదును పెట్టుకోవడం వల్ల వారిలో జీకే పెరుగుతుంది, లెక్కల్లో, సైన్స్‌లో పరిణతి పెరుగుతుంది. ఫలితంగా చదువులో చురుగ్గా ఉంటారని దాదాపు 700కు పైగా హైస్కూల్ స్టూడెంట్స్‌ను అధ్యయనం చేసిన ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్‌మెంట్ (పిసా) చెబుతోంది. ఆన్‌లైన్ గేమ్స్ ఆడేవారు ఆ గేమ్‌కు సంబంధించిన నియమనిబంధనలను ఆకళింపు చేసుకోవడం కోసం పేజీలకొద్దీ సమాచారాన్ని చదవడం వల్ల లెక్కలు, సైన్స్‌లో ముందుండగలుగుతారు. అయితే వీడియోగేమ్స్ వేరు, ఇంటర్నెట్ వేరు. పొద్దస్తమానం ఇంటర్నెట్లో గంటలకొద్దీ గడపకూడదు. అలాగే సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విటర్ వంటివాటితో తలమునకలుగా ఉండేవారు మాత్రం చదువులో వెనకపట్టులో ఉంటారట.