న్యూఢిల్లీ: హిందూ పురాణ పాత్రలతో కూడిన వీడియో గేమింగ్‌లకు ఆదరణ పెరుగుతోంది. దీంతో కంపెనీలు కొత్త కొత్త పాత్రలతో కూడిన గేమ్‌లను రూపొందిస్తున్నాయి. దీంతో భీముడు, సూర్పణక, అర్జునుడు, సుగ్రీవుడు తదితర పాత్రలతో కూడిన గేమ్‌లు దర్శనమివ్వనున్నాయి. దేశీ గేమింగ్ బూమ్ నేపథ్యంలో ఈ తరహా క్యారక్టర్ల పట్ల యూజర్లు ఆసక్తి ప్రదర్శిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. డిమాండ్ వాతావరణం బాగుండడంతో కంపెనీలు చేపట్టే కొత్త ప్రాజెక్టులకు ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడిదారులు మద్దతుగా నిలుస్తున్నారు. ‘కురుక్షేత్ర: ఆసెన్సన్’ అనే స్ట్రాటజీ విడియోగేమ్‌ను అభివృద్ధి చేసిన స్డూడియోసిరాహ్ 8,30,000 డాలర్ల నిధులను ప్రముఖ ఇన్వెస్టర్ల నుంచి సమీకరించడం గమనార్హం. లిమికాయ్ ఫండ్, ఇన్‌మొబి సహ వ్యవస్థాపకుడు పీయూష్ షా, స్వీడిష్ గేమింగ్ కంపెనీ స్టిల్‌ఫ్రంట్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆలెక్సిస్ బాంటే, నాడ్విన్ గేమింగ్ వ్యవస్థాపకుడు అక్షత్‌రాథీ పెట్టుబడులు పెట్టిన వారిలో ఉన్నారు.
మార్కెట్ పెద్దదే..
మరోవైపు ఇండస్ గేమ్ రూపకర్త ‘సూపర్ గేమింగ్’ సైతం సిరీస్–ఏ రౌండ్‌లో భాగంగా 5.5 మిలియన్ డాలర్లను సమీకరించింది. స్కైక్యాచర్, ఏఈటీ ఫండ్, బీఏస్ క్యాపిటల్, డ్రీమ్ ఇంక్యుబేటర్, 1అప్ వెంచర్స్, ఐసెర్టిస్ సహ వ్యవస్థాపకుడు మోనిష్ దర్దా ఈ పెట్టుబడులు సమకూర్చారు. భారత గేమింగ్ పరిశ్రమ భిన్నమైన గేమ్‌లతో పరిపక్వ దశలో ఉన్నట్టు కన్సల్టింగ్ సంస్థ రెడ్‌సీర్ ఇటీవలో ఓ నివేదికలో పేర్కొనడం గమనార్హం. ‘‘గేమింగ్ కంపెనీలకు యూజర్ల అభిరుచులే ఎన్నో అవకాశాలను కల్పిస్తున్నాయి. గేమింగ్ ప్రియులు భారతీయ కంటెంట్‌తో కూడిన వాటిని ఆదరిస్తున్నారు. భారత పురాణ పాత్రలతో కూడిన వాటి పట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారు’’ అని రెడ్‌సీర్ తెలిపింది. ‘‘ప్రజలకు తెలిసిన పాత్రలతో గేమ్‌లను రూపొందించి వారికి చేరువయ్యే ప్రయత్నాన్ని కంపెనీలు చేస్తున్నాయి. మహాభారత, రామాయణంలోని పాత్రలను చిన్న నాటి నుంచి పెరుగుతూనే తెలుసుకుంటాం. వీటిని అర్థం చేసుకునేందుకు ప్రత్యేక శ్రమ పెట్టక్కర్లేదు’’ అని స్టూడియో సిరాహ్ సహ వ్యవస్థాపకుడు అబ్బాస్‌షా తెలిపారు. కురుక్షేత్ర గేమ్‌ను బీటా వెర్షన్‌లో 100 మంది యూజర్లకు ఆహ్వాన విధానంలో అందించామని, వాణిజ్య పరంగా వచ్చే ఏడాది విడుదల చేస్తామని చెప్పారు. భారత మార్కెట్టే కాకుండా.. దక్షిణాసియా దేశాల్లోనూ భారత పురాణ పాత్రల పట్ల ఆసక్తి ఉందన్నారు.
చదవండి: వీడియో గేమ్‌లో అన్నదమ్ములు.. పేరెంట్స్ ఖాతా నుంచి లక్ష ఖర్చు
Comments
Please login to add a commentAdd a comment