చిన్నా.. మాట వినాల్సిందే కన్నా..
అసలే సెలవులు.. దీంతో పొద్దున్న లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకూ నాన్న సెల్లో.. అమ్మ మొబైలో పట్టుకుని.. ఆపమని పోరు పెడుతున్నా.. వినకుండా వీడియో గేమ్స్ ఆడుకునే పిల్లల జనరేషన్ ఇదీ.. తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లో టెంపుల్ రన్ అంటూ.. సబ్‌వే సర్ఫర్స్ అంటూ గంటలతరబడి వీడియో గేమ్స్ ఆడటం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. అడ్డదిడ్డంగా కూర్చుని.. సోఫాపై ఇష్టానుసారం పడుకుని వీటిని ఆడుతుంటారు. తిన్నంగా కూర్చోమని చెప్పినా వినరు. దీని వల్ల వాళ్ల వెన్నుపూస, మెడ భాగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కళ్లద్దాలు ఇలాంటి సమస్యలన్నిటికీ చెక్ చె ప్పనున్నాయి.
ఇంతకీ ఇదేం చేస్తుంది?
ఠి ఈ అద్దాలు, ఒక యాప్‌తో లింక్ అయి ఉంటాయి. దీన్ని ఫోన్లో లోడ్ చేసుకుంటే చాలు.. పిల్లలు గేమ్స్ ఆడుతున్నప్పుడు సరైన భంగిమలో కూర్చుంటున్నారో లేదో ఇందులోని సెన్సర్లు గమనిస్తూ ఉంటాయి. సరిగా కూర్చోకుంటే.. హెచ్చరిక సందేశాలను పిల్లలకు, మనకూ పంపిస్తాయి. ఇలా ఐదు సార్లు చెబుతుంది. అయినా వినకుంటే.. వీడియో గేమ్ ఆటోమెటిక్‌గా ఆగిపోతుంది.
కళ్లద్దాలు తీసేస్తేనో..
పిల్లలు ఈ కళ్లద్దాలను తీసేసినప్పటికీ.. హెచ్చరికలు వస్తునే ఉంటాయి. కౌంట్ దాటగానే.. కళ్లద్దాలు తీసేసినప్పటికీ.. గేమ్ ఆగిపోతుంది. అంతేకాదు.. ఇందులో వచ్చే వార్నింగ్‌ల సంఖ్యను మనం సెట్ చేసుకోవచ్చు. అంటే.. 3 సార్లు వార్నింగ్ వచ్చి.. తర్వాత షట్‌డౌన్ అయిపోయేలా మనం మార్చుకోవచ్చు. గేమ్స్ నిర్ణీత సమయానికి షట్‌డౌన్ అయిపోయేలా కూడా మార్పులు చేయవచ్చు.
ఎవరు తయారుచేశారు? రేటెంత?
ఐఫోర్సర్ అనే సంస్థ తయారుచేసింది. దీన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు కిక్‌స్టార్టర్ ద్వారా నిధుల సేకరణ చేస్తోంది. ధర రూ.8 వేలు.