Temple Run
-
‘పప్పూ’ నుంచి రాహుల్ పరిణితి
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి ఏడాది కావస్తున్న సందర్భంగా తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాహుల్ గాంధీ కీర్తిని మరింత ఇనుమడింప చేశాయి. ఏడాది క్రితం విపక్షాల నుంచి ‘పప్పూ’ అనిపించుకున్న రాహుల్ గాంధీ ఏడాది కాలంలోనే రాజకీయంగా ఎంతో పరిణతి సాధించారు. రాజకీయాలంటే అంతగా పట్టవని, ప్రసంగాల్లో పస ఉండదని, ప్రజలతో సంబంధాలు పెంచుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారంటూ విమర్శలను ఎదుర్కొన్న రాహుల్ గాంధీ ఇప్పుడు తన సత్తా ఏమిటో చాటి చెప్పారు. ఏడాది క్రితం వరకు తనపై తనకే నమ్మకం లేదన్నట్లు ప్రవర్తించిన రాహుల్ గాంధీ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడంతోపాటు అంతే విశ్వాసంతో ఘాటుగా ప్రసంగించే స్థాయికి ఏడాదిలోనే ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో ‘బచ్చ’గాడంటూ సీనియర్లు, మనతోటి వాడేలే అంటూ జూనియర్లు అంతగా పట్టించుకోని స్థాయి నుంచి అందరు పట్టించుకునే స్థాయికి, మెచ్చుకునే స్థాయికి రాహుల్ పరిణామక్రమం పట్టించుకోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 2017, డిసెంబర్ 16వ తేదీన అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీ అంతకుముందు జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అనధికార హోదాలో విస్త్రృత ప్రచారం చేశారు. అక్కడి ప్రసంగాల ద్వారానే నాయకుడిగా ఆయన ఎదుగుదల ప్రారంభమైంది. గుజరాత్లో గతంలో కన్నా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని మెరుగుపర్చడంలో విజయం సాధించిన రాహుల్ ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల్లో జనతాదళ్ (సెక్యులర్) పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీ ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటులో రాణించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, చత్తీస్‌గఢ్, మిజోరం ఎన్నికల్లో అవసరమైన చోట మిత్ర పక్షాలతో, అవసరం లేని చోట ఒంటిరిగా పార్టీని రంగంలోకి దింపి రణతంత్రంతో తెలంగాణలో మినహా మిగతా రాష్ట్రాల్లో ఆశించిన విజయాలను సాధించారు. తాజా విజయాలతో రాహుల్ గాంధీ తన పరిణితిని ప్రదర్శించారు. పార్లమెంట్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కౌగిలించకోవడం, తోటివారి వైపు చూస్తూ కొంటెగా కన్ను గీటడం దగ్గరి నుంచే రాహుల్ గాంధీ పరిణితి పెరుగుతూ వచ్చిందని ఇంటా బయట అంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్థాయికి రాహుల్ ఇంకా ఎదగలేదని, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల విజయంతో పార్టీలో తన నాయకత్వాన్ని మరింత బలపర్చుకున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీతో దీటుగా ఎన్నికల్లో పోటీపడే ఆత్మవిశ్వాసాన్ని తమ నాయకుడు రాహుల్ గాంధీ సాధించారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ‘రాజకీయ నాయకుడిగా రాహుల్ గాంధీ ఎంతో పరిణితి సాధించారు. అందులో ఎలాంటి సందేహం లేదు’ అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. ‘రాహుల్ గాంధీలో ఎంతో పురోభివృద్ధి ఉంది. కచ్చితంగా ఇది అనుభవం ద్వారానే వచ్చి ఉంటుంది’ అని మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్ర దాస్ వ్యాఖ్యానించారు. బీజేపీని, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీని ఒంటరిగానే ఎదుర్కొంటూ రాహుల్ గాంధీ పార్టీ కార్యకర్తల్లోనే ఉత్సాహం తీసుకొచ్చారని పార్టీ నేతలంటున్నారు. ముఖ్యంగా 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్లో పార్టీ సీట్లు 44 సీట్లకు కూలిపోయినప్పుడు కుంగిపోతున్న పార్టీని మళ్లీ కూకటి వేళ్లకాడి నుంచి నిలబెట్టుకొచ్చిన ఘనత రాహుల్ గాంధీకే దక్కుతుందని పార్టీ నేతలు అంటున్నారు. పార్టీ పైస్థాయి నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు ఎప్పటికప్పుడు దిశ నిర్దేశించడం ద్వారా రాహుల్ గాంధీ పార్టీకి పునర్జీవం పోశారనిపార్టీ నేతలు అంటున్నారు. ఒకప్పుడు రాజకీయేతర కార్యదర్శుల సలహాలను మాత్రమే స్వీకరించిన ఆయన ఈ నాడు వివిధ వర్గాల సలహాలను వింటున్నారని అన్నారు. ‘పార్టీలో మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులు మంచి కొరకే’ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి కుమారి సెల్జా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ తాను బ్రాహ్మణుడినని చెప్పుకోవడం, గుళ్లూ గోపురాలను తిరగడం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నెహ్రూ కాలం నాటి లౌకికవాద విలువలను తాకట్టు పెడుతున్నారని కొందరు విమర్శిస్తే, ప్రత్యర్థి పార్టీ అగ్రవర్ణాల వారిని ఆకర్షించడం కోసం ఏమైనా చేస్తున్నప్పుడు, బలహీన వర్గాల పార్టీగా ముద్రపడిన కాంగ్రెస్‌ను అన్ని వర్గాల పార్టీగా చెప్పుకోవడానికి కొన్ని చర్యలు అనివార్యమవుతాయని ఇతరులు సమర్థిస్తున్నారు. సంస్థాగతంగాను రాహుల్ గాంధీ చేసిన మార్పులు మంచి ఫలితాలు ఇస్తున్నాయని యువ కాంగ్రెస్ నాయకులు ఆర్పీఎన్ సింగ్, జితిన్ ప్రసాద లాంటి వారు అంటున్నారు. ఇది వరకు ఒక్కో ప్రధాన కార్యదర్శి నాలుగైదు రాష్ట్రాల పార్టీ వ్యవహారాలకు బాధ్యుడిగా ఉండేవారని, ఇప్పుడు ఒక్కో ప్రధాన కార్యదర్శి ఒక్కో రాష్ట్రానికి బాధ్యత వహించడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని వారు అంటున్నారు. మొత్తానికి తమ నాయకుడు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారని వారు అభిప్రాయపడ్డారు. -
చిన్నా.. మాట వినాల్సిందే కన్నా..
అసలే సెలవులు.. దీంతో పొద్దున్న లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకూ నాన్న సెల్లో.. అమ్మ మొబైలో పట్టుకుని.. ఆపమని పోరు పెడుతున్నా.. వినకుండా వీడియో గేమ్స్ ఆడుకునే పిల్లల జనరేషన్ ఇదీ.. తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లో టెంపుల్ రన్ అంటూ.. సబ్వే సర్ఫర్స్ అంటూ గంటలతరబడి వీడియో గేమ్స్ ఆడటం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. అడ్డదిడ్డంగా కూర్చుని.. సోఫాపై ఇష్టానుసారం పడుకుని వీటిని ఆడుతుంటారు. తిన్నంగా కూర్చోమని చెప్పినా వినరు. దీని వల్ల వాళ్ల వెన్నుపూస, మెడ భాగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కళ్లద్దాలు ఇలాంటి సమస్యలన్నిటికీ చెక్ చె ప్పనున్నాయి. ఇంతకీ ఇదేం చేస్తుంది? ఠి ఈ అద్దాలు, ఒక యాప్‌తో లింక్ అయి ఉంటాయి. దీన్ని ఫోన్లో లోడ్ చేసుకుంటే చాలు.. పిల్లలు గేమ్స్ ఆడుతున్నప్పుడు సరైన భంగిమలో కూర్చుంటున్నారో లేదో ఇందులోని సెన్సర్లు గమనిస్తూ ఉంటాయి. సరిగా కూర్చోకుంటే.. హెచ్చరిక సందేశాలను పిల్లలకు, మనకూ పంపిస్తాయి. ఇలా ఐదు సార్లు చెబుతుంది. అయినా వినకుంటే.. వీడియో గేమ్ ఆటోమెటిక్‌గా ఆగిపోతుంది. కళ్లద్దాలు తీసేస్తేనో.. పిల్లలు ఈ కళ్లద్దాలను తీసేసినప్పటికీ.. హెచ్చరికలు వస్తునే ఉంటాయి. కౌంట్ దాటగానే.. కళ్లద్దాలు తీసేసినప్పటికీ.. గేమ్ ఆగిపోతుంది. అంతేకాదు.. ఇందులో వచ్చే వార్నింగ్‌ల సంఖ్యను మనం సెట్ చేసుకోవచ్చు. అంటే.. 3 సార్లు వార్నింగ్ వచ్చి.. తర్వాత షట్‌డౌన్ అయిపోయేలా మనం మార్చుకోవచ్చు. గేమ్స్ నిర్ణీత సమయానికి షట్‌డౌన్ అయిపోయేలా కూడా మార్పులు చేయవచ్చు. ఎవరు తయారుచేశారు? రేటెంత? ఐఫోర్సర్ అనే సంస్థ తయారుచేసింది. దీన్ని మార్కెట్లోకి తెచ్చేందుకు కిక్‌స్టార్టర్ ద్వారా నిధుల సేకరణ చేస్తోంది. ధర రూ.8 వేలు. -
ఆ యాప్‌కు వంద కోట్ల డౌన్లోడ్లు!!
స్మార్ట్‌ఫోన్ గానీ, టాబ్లెట్ పీసీ గానీ ఉన్నాయంటే చాలు.. అందులో తప్పనిసరిగా ఉండి తీరాల్సిన యాప్.. టెంపుల్ రన్. పిల్లలు, పెద్దవాళ్లు, ఆడ, మగ.. ఎలాంటి తేడా లేకుండా విపరీతంగా ఆడుతున్న ఆట ఈ టెంపుల్ రన్. అందుకే, దీని డౌన్లోడ్లు ఏకంగా వందకోట్లు దాటేశాయి. ఇప్పటివరకు ప్రపంచం మొత్తమ్మీద అత్యధికంగా డౌన్లోడ్ అయిన ఏకైక యాప్..టెంపుల్ రన్ మాత్రమే. టెంపుల్ రన్, టెంపుల్ రన్ 2.. ఈ రెండూ కలిసి మొత్తం వంద కోట్ల డౌన్లోడ్లు దాటాయి. ఇందులో ఉన్న మిగిలిన వెర్షన్లను కూడా కలుపుకొంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. 2008 సంవత్సరంలో కీత్ షెఫర్డ్, నటాలియా లకియనోవా అనే భార్యాభర్తలు కలిసి స్థాపించిన ఇమాంజి స్టూడియోస్ అనే సంస్థ 2011 సంవత్సరంలో టెంపుల్ రన్ యాప్‌ను విడుదల చేసింది. తాము ముందు దీన్ని ప్రారంభించినప్పుడు వంద కోట్ల డౌన్లోడ్లు అవుతాయని పొరపాటున కూడా ఊహించలేదని కీత్ షెఫర్డ్ చెప్పారు. టెంపుల్ రన్ ఆడుతున్న ప్రతి ఒక్కళ్లకు, తమ టీమ్ సభ్యులకు అందరికీ చాలా కృతజ్ఞులై ఉంటామని, దీన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు, మరిన్ని సృజనాత్మక గేమ్స్ రూపొందిస్తామని తెలిపారు. ఈ యాప్‌ను అత్యధికంగా చైనాలో 36 శాతం మంది డౌన్లోడ్ చేసుకుంటే, అమెరికాలో 21 శాతం మందే చేసుకున్నారు. ఈ ఆట ఆడేవాళ్లలో 60 శాతం మంది ఆడాళ్లేనని కూడా కంపెనీ తెలిపింది. ఆట ఆడేవాళ్లంతా కలిసి సంయుక్తంగా 2,16,018 సంవత్సరాల సమయం గడిపారని, 3200 కోట్ల ఆటలు ఆడారని, టెంపుల్ రన్ ప్లేయర్లంతా కలిసి ఇప్పటికి 50 ట్రిలియన్ల మీటర్లు పరిగెత్తారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. -
ఆటాడుకుందాం..రా!
టెంపుల్ రన్... క్యాండీ క్రష్... యాంగ్రీ బర్డ్స్... చోటా భీమ్... క్రిష్-3 ఇలా పేరేదైనా మొబైల్ ఫోన్ యూజర్లను కట్టిపడేస్తున్న గేమ్స్ ఇవి. చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ ఈ మొబైల్ గేమ్స్‌కు అతుక్కుపోతున్నవారే! ఈ ధోరణే అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా కూడా మొబైల్ గేమ్స్ మార్కెట్ శరవేగంగా దూసుకెళ్లేలా చేస్తోంది. దీనంతటికీ పెద్ద టచ్స్క్రీన్లతో కూడిన స్మార్ట్‌ఫోన్స్ హవా, 3జీ సేవల విస్తరణ ప్రధాన కారణం. గేమింగ్ నిపుణుల అంచనా ప్రకారం 2016 నాటికల్లా గ్లోబల్ మొబైల్ గేమింగ్(ఎం-గేమింగ్) మార్కెట్ 40 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.2.5 లక్షల కోట్లు)ను అధిగమించే అవకాశాలున్నాయి. ఇటీవలే ముగిసిన టెక్సర్కిల్ డిజిటల్ గేమింగ్ ఫోరం-2013లో మొబైల్ గేమింగ్ భవిష్యత్ రూపురేఖలు, ఎలా పురోగమించనుందనేది ప్రధానంగా చర్చించారు. జనాభాలో ఏడోవంతు ఎం-గేమింగ్ ప్రియులే... ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడుతున్నట్లు అంచనా. అంటే జనాభాలో ఏడోవంతు ప్రజలు ఎం-గేమింగ్ ప్రియులని లెక్క తేలుతోంది. అంతేకాదు సంచలనం సృష్టిస్తున్న ట్యాబ్లెట్ పీసీలు సైతం గేమింగ్ మార్కెట్ టాప్‌గేర్‌లో దూసుకెళ్లేందుకు దోహదం చేస్తున్నాయి. వచ్చే మూడేళ్లలో ట్యాబ్లెట్ గేమింగ్ అనేది 400 శాతం వృద్ధి చెందొచ్చని ఫోరంలో కీలక ప్రజెంటేషన్ ఇచ్చిన నజారా గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈఓ నితీశ్ మిత్తర్సేన్ అంచనా వేశారు. మొబైల్ గేమింగ్ కంపెనీలకు ఆదాయాలపరంగా ఆసియా పసిఫిక్ ప్రాంతం అగ్రస్థానంలో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆదాయంలో ఈ ప్రాంతం వాటాయే 48 శాతం కావడం గమనార్హం. ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ‘ఫ్రీమియం’ గేమ్స్‌తో కొత్తజోష్...: గేమింగ్ మార్కెట్‌కు ‘ఫ్రీమియం’ కంటెంట్ అనేది ఇప్పుడు కొత్తజోష్ నింపుతోంది. ఫ్రీ(ఉచితం), ప్రీమియం(డబ్బుచెల్లించాల్సింది)ల కలయికే ఈ ఫ్రీమియం. చాలా కంపెనీలు తమ గేమ్ యాప్స్‌ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని ఆడుకునే వీలుకల్పిస్తున్నాయి. అయితే, ఇందులో అధునాతన ఫీచర్లు, ఇతరత్రా సదుపాయాలను వాడుకోవాలంటే ప్రీమియంగా కొత్త సొమ్మును వసూలు చేస్తున్నాయి. గేమ్స్ ప్రియులు ఈ ఆటలకు అలవాటుపడ్డాక కొత్త ఫీచర్ల కోసం డబ్బు చెల్లించేందుకు సైతం వెనుకాడకపోవడం కంపెనీలకు వరంగా మారుతోంది. ఎం-గేమింగ్ ప్లేయర్ల సంఖ్య పెంచేందుకు.. అదేవిధంగా కంపెనీకి క్రమంగా ఆదాయం పెంచుకునేందుకు ఈ ప్రైసింగ్ వ్యూహం బాగానే పనిచేస్తోందని నిపుణులు చెబుతున్నారు. మరోపక్క, యాప్‌ల అమ్మకాలతో పాటు యాడ్ల రూపంలో కూడా గేమింగ్ రూపకర్తలకు కాసులు కురుస్తున్నాయి. మొత్తం స్మార్ట్‌ఫోన్ గేమింగ్ కంపెనీల ఆదాయాల్లో 70-80% యాప్‌ల అమ్మకాలద్వారా మిగతాది యాడ్లు ఇతర మార్గాల్లో లభిస్తోంది. భారత్‌లోనూ అదే జోరు...: మొబైల్ గేమ్‌లకు దేశీ టచ్ ఇస్తుండటంతో ఇటు భారత్‌లోనూ ఈ మార్కెట్ జోరందుకుంటోంది. తీన్ పత్తి, క్రిష్-3, చోటా భీమ్, థార్న్ ఆఫ్ బాలి వంటి దేశీ గేమ్స్ భారీ విజయాన్నే అందుకోవడం దీనికి నిదర్శనం. ఈ గేమ్స్ అన్నీ పది లక్షలకుపైగా డౌన్లోడ్స్ను అధిగమించడం వీటికున్న స్పందన ఏంటో చెప్పకనేచెబుతోంది. ప్రస్తుతం భారతీయ మొబైల్ యూజర్లు గూగుల్‌ప్లే, ఐట్యూన్స్ యాప్ స్టోర్ ఇతరత్రా ఆన్లైన్ స్టోర్స్ నుంచి గేమింగ్ యాప్స్‌ను డౌన్లోడ్ చేసేకోవడానికి నెలకు రూ.5 కోట్లమేర వెచ్చిస్తున్నట్లు అంచనా. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ల దన్ను... స్మార్ట్ఫోన్ల వినియోగం ఆకాశమేహద్దుగా ఎగబాకుతుండటం ఎం-గేమింగ్ జెట్స్పీడ్కు కీలకంగా నిలుస్తోంది. అందులోనూ.. గూగుల్ ఆండ్రాయిడ్; యాపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్లలో ఉపయోగిస్తున్న ఐఓఎస్ వంటి పటిష్టమైన ఆపరేటింగ్ సిస్టమ్‌లు కూడా ఎం-గేమింగ్ సూపర్ సక్సెస్‌కు ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. అత్యున్నత కంటెంట్ లభ్యత మొబైల్ యూజర్లను గేమింగ్ ప్రియులుగా మార్చేస్తోందంటున్నారు. ఒక్క మొబైల్ గేమ్స్ మాత్రమే కాకుండా.. ఫేస్బుక్ ఇతర సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లు, ఇన్స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్స్(యాప్స్) కూడా గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లుగా మారుతున్నాయి. స్మార్ట్ఫోన్లలో సోషల్ గేమింగ్‌కు జపాన్‌లో పునాదిపడగా.. పాశ్చాత్య మార్కెట్లలో కూడా ఇది బంపర్‌హిట్ కొడుతోంది.