సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి ఏడాది కావస్తున్న సందర్భంగా తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాహుల్ గాంధీ కీర్తిని మరింత ఇనుమడింప చేశాయి. ఏడాది క్రితం విపక్షాల నుంచి ‘పప్పూ’ అనిపించుకున్న రాహుల్ గాంధీ ఏడాది కాలంలోనే రాజకీయంగా ఎంతో పరిణతి సాధించారు. రాజకీయాలంటే అంతగా పట్టవని, ప్రసంగాల్లో పస ఉండదని, ప్రజలతో సంబంధాలు పెంచుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారంటూ విమర్శలను ఎదుర్కొన్న రాహుల్ గాంధీ ఇప్పుడు తన సత్తా ఏమిటో చాటి చెప్పారు.
ఏడాది క్రితం వరకు తనపై తనకే నమ్మకం లేదన్నట్లు ప్రవర్తించిన రాహుల్ గాంధీ తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడంతోపాటు అంతే విశ్వాసంతో ఘాటుగా ప్రసంగించే స్థాయికి ఏడాదిలోనే ఎదిగారు. కాంగ్రెస్ పార్టీలో ‘బచ్చ’గాడంటూ సీనియర్లు, మనతోటి వాడేలే అంటూ జూనియర్లు అంతగా పట్టించుకోని స్థాయి నుంచి అందరు పట్టించుకునే స్థాయికి, మెచ్చుకునే స్థాయికి రాహుల్ పరిణామక్రమం పట్టించుకోవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 2017, డిసెంబర్ 16వ తేదీన అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ గాంధీ అంతకుముందు జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో అనధికార హోదాలో విస్త్రృత ప్రచారం చేశారు. అక్కడి ప్రసంగాల ద్వారానే నాయకుడిగా ఆయన ఎదుగుదల ప్రారంభమైంది. గుజరాత్‌లో గతంలో కన్నా కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని మెరుగుపర్చడంలో విజయం సాధించిన రాహుల్ ఆ తర్వాత కర్ణాటక ఎన్నికల్లో జనతాదళ్ (సెక్యులర్) పార్టీతో పొత్తు పెట్టుకొని బీజేపీ ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటులో రాణించారు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, చత్తీస్‌గఢ్, మిజోరం ఎన్నికల్లో అవసరమైన చోట మిత్ర పక్షాలతో, అవసరం లేని చోట ఒంటిరిగా పార్టీని రంగంలోకి దింపి రణతంత్రంతో తెలంగాణలో మినహా మిగతా రాష్ట్రాల్లో ఆశించిన విజయాలను సాధించారు. తాజా విజయాలతో రాహుల్ గాంధీ తన పరిణితిని ప్రదర్శించారు. పార్లమెంట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కౌగిలించకోవడం, తోటివారి వైపు చూస్తూ కొంటెగా కన్ను గీటడం దగ్గరి నుంచే రాహుల్ గాంధీ పరిణితి పెరుగుతూ వచ్చిందని ఇంటా బయట అంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్థాయికి రాహుల్ ఇంకా ఎదగలేదని, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఫలితాల విజయంతో పార్టీలో తన నాయకత్వాన్ని మరింత బలపర్చుకున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీతో దీటుగా ఎన్నికల్లో పోటీపడే ఆత్మవిశ్వాసాన్ని తమ నాయకుడు రాహుల్ గాంధీ సాధించారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
‘రాజకీయ నాయకుడిగా రాహుల్ గాంధీ ఎంతో పరిణితి సాధించారు. అందులో ఎలాంటి సందేహం లేదు’ అని మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. ‘రాహుల్ గాంధీలో ఎంతో పురోభివృద్ధి ఉంది. కచ్చితంగా ఇది అనుభవం ద్వారానే వచ్చి ఉంటుంది’ అని మాజీ కేంద్ర మంత్రి కిషోర్ చంద్ర దాస్ వ్యాఖ్యానించారు. బీజేపీని, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీని ఒంటరిగానే ఎదుర్కొంటూ రాహుల్ గాంధీ పార్టీ కార్యకర్తల్లోనే ఉత్సాహం తీసుకొచ్చారని పార్టీ నేతలంటున్నారు. ముఖ్యంగా 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్‌లో పార్టీ సీట్లు 44 సీట్లకు కూలిపోయినప్పుడు కుంగిపోతున్న పార్టీని మళ్లీ కూకటి వేళ్లకాడి నుంచి నిలబెట్టుకొచ్చిన ఘనత రాహుల్ గాంధీకే దక్కుతుందని పార్టీ నేతలు అంటున్నారు.
పార్టీ పైస్థాయి నుంచి కిందిస్థాయి కార్యకర్తల వరకు ఎప్పటికప్పుడు దిశ నిర్దేశించడం ద్వారా రాహుల్ గాంధీ పార్టీకి పునర్జీవం పోశారనిపార్టీ నేతలు అంటున్నారు. ఒకప్పుడు రాజకీయేతర కార్యదర్శుల సలహాలను మాత్రమే స్వీకరించిన ఆయన ఈ నాడు వివిధ వర్గాల సలహాలను వింటున్నారని అన్నారు. ‘పార్టీలో మార్పులు జరుగుతున్నాయి. ఆ మార్పులు మంచి కొరకే’ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి కుమారి సెల్జా వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ తాను బ్రాహ్మణుడినని చెప్పుకోవడం, గుళ్లూ గోపురాలను తిరగడం పట్ల భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నెహ్రూ కాలం నాటి లౌకికవాద విలువలను తాకట్టు పెడుతున్నారని కొందరు విమర్శిస్తే, ప్రత్యర్థి పార్టీ అగ్రవర్ణాల వారిని ఆకర్షించడం కోసం ఏమైనా చేస్తున్నప్పుడు, బలహీన వర్గాల పార్టీగా ముద్రపడిన కాంగ్రెస్‌ను అన్ని వర్గాల పార్టీగా చెప్పుకోవడానికి కొన్ని చర్యలు అనివార్యమవుతాయని ఇతరులు సమర్థిస్తున్నారు.
సంస్థాగతంగాను రాహుల్ గాంధీ చేసిన మార్పులు మంచి ఫలితాలు ఇస్తున్నాయని యువ కాంగ్రెస్ నాయకులు ఆర్‌పీఎన్ సింగ్, జితిన్ ప్రసాద లాంటి వారు అంటున్నారు. ఇది వరకు ఒక్కో ప్రధాన కార్యదర్శి నాలుగైదు రాష్ట్రాల పార్టీ వ్యవహారాలకు బాధ్యుడిగా ఉండేవారని, ఇప్పుడు ఒక్కో ప్రధాన కార్యదర్శి ఒక్కో రాష్ట్రానికి బాధ్యత వహించడం ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని వారు అంటున్నారు. మొత్తానికి తమ నాయకుడు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారని వారు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment