ఆటాడుకుందాం..రా! | Mobile gaming market to cross $40B by 2016; freemium games the way forward: Nazara’s CEO Nitish Mittersain | Sakshi
Sakshi News home page

ఆటాడుకుందాం..రా!

Published Sat, Dec 7 2013 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM

ఆటాడుకుందాం..రా!

ఆటాడుకుందాం..రా!

టెంపుల్ రన్... క్యాండీ క్రష్... యాంగ్రీ బర్డ్స్... చోటా భీమ్... క్రిష్-3 ఇలా పేరేదైనా మొబైల్ ఫోన్ యూజర్లను కట్టిపడేస్తున్న గేమ్స్ ఇవి. చిన్నాపెద్దా తేడాలేకుండా అందరూ ఈ మొబైల్ గేమ్స్‌కు అతుక్కుపోతున్నవారే! ఈ ధోరణే అంతర్జాతీయంగా, ఇటు దేశీయంగా కూడా మొబైల్ గేమ్స్ మార్కెట్ శరవేగంగా దూసుకెళ్లేలా చేస్తోంది. దీనంతటికీ పెద్ద టచ్‌స్క్రీన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్స్ హవా, 3జీ సేవల విస్తరణ ప్రధాన కారణం. గేమింగ్ నిపుణుల అంచనా ప్రకారం 2016 నాటికల్లా గ్లోబల్ మొబైల్ గేమింగ్(ఎం-గేమింగ్) మార్కెట్ 40 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.2.5 లక్షల కోట్లు)ను అధిగమించే అవకాశాలున్నాయి. ఇటీవలే ముగిసిన టెక్‌సర్కిల్ డిజిటల్ గేమింగ్ ఫోరం-2013లో మొబైల్ గేమింగ్ భవిష్యత్ రూపురేఖలు, ఎలా పురోగమించనుందనేది ప్రధానంగా చర్చించారు.
 
 జనాభాలో ఏడోవంతు ఎం-గేమింగ్ ప్రియులే...
 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడుతున్నట్లు అంచనా. అంటే జనాభాలో ఏడోవంతు ప్రజలు ఎం-గేమింగ్ ప్రియులని లెక్క తేలుతోంది. అంతేకాదు సంచలనం సృష్టిస్తున్న ట్యాబ్లెట్ పీసీలు సైతం గేమింగ్ మార్కెట్ టాప్‌గేర్‌లో దూసుకెళ్లేందుకు దోహదం చేస్తున్నాయి. వచ్చే మూడేళ్లలో ట్యాబ్లెట్ గేమింగ్ అనేది 400 శాతం వృద్ధి చెందొచ్చని ఫోరంలో కీలక ప్రజెంటేషన్ ఇచ్చిన నజారా గ్రూప్ వ్యవస్థాపకుడు, సీఈఓ నితీశ్ మిత్తర్‌సేన్ అంచనా వేశారు. మొబైల్ గేమింగ్ కంపెనీలకు ఆదాయాలపరంగా ఆసియా పసిఫిక్ ప్రాంతం అగ్రస్థానంలో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆదాయంలో ఈ ప్రాంతం వాటాయే 48 శాతం కావడం గమనార్హం. ఉత్తర అమెరికా, పశ్చిమ యూరప్ ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
 
 ‘ఫ్రీమియం’ గేమ్స్‌తో కొత్తజోష్...: గేమింగ్ మార్కెట్‌కు ‘ఫ్రీమియం’ కంటెంట్ అనేది ఇప్పుడు కొత్తజోష్ నింపుతోంది. ఫ్రీ(ఉచితం), ప్రీమియం(డబ్బుచెల్లించాల్సింది)ల కలయికే ఈ ఫ్రీమియం. చాలా కంపెనీలు తమ గేమ్ యాప్స్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకుని ఆడుకునే వీలుకల్పిస్తున్నాయి. అయితే, ఇందులో అధునాతన ఫీచర్లు, ఇతరత్రా సదుపాయాలను వాడుకోవాలంటే ప్రీమియంగా కొత్త సొమ్మును వసూలు చేస్తున్నాయి. గేమ్స్ ప్రియులు ఈ ఆటలకు అలవాటుపడ్డాక కొత్త ఫీచర్ల కోసం డబ్బు చెల్లించేందుకు సైతం వెనుకాడకపోవడం కంపెనీలకు వరంగా మారుతోంది. ఎం-గేమింగ్ ప్లేయర్ల సంఖ్య పెంచేందుకు.. అదేవిధంగా కంపెనీకి క్రమంగా ఆదాయం పెంచుకునేందుకు ఈ ప్రైసింగ్ వ్యూహం బాగానే పనిచేస్తోందని నిపుణులు చెబుతున్నారు. మరోపక్క, యాప్‌ల అమ్మకాలతో పాటు యాడ్‌ల రూపంలో కూడా గేమింగ్ రూపకర్తలకు కాసులు కురుస్తున్నాయి. మొత్తం స్మార్ట్‌ఫోన్ గేమింగ్ కంపెనీల ఆదాయాల్లో 70-80% యాప్‌ల అమ్మకాలద్వారా మిగతాది యాడ్‌లు ఇతర మార్గాల్లో లభిస్తోంది.  
 
 భారత్‌లోనూ అదే జోరు...: మొబైల్ గేమ్‌లకు దేశీ టచ్ ఇస్తుండటంతో ఇటు భారత్‌లోనూ ఈ మార్కెట్ జోరందుకుంటోంది. తీన్ పత్తి, క్రిష్-3, చోటా భీమ్, థార్న్ ఆఫ్ బాలి వంటి దేశీ గేమ్స్ భారీ విజయాన్నే అందుకోవడం దీనికి నిదర్శనం. ఈ గేమ్స్ అన్నీ పది లక్షలకుపైగా డౌన్‌లోడ్స్‌ను అధిగమించడం వీటికున్న స్పందన ఏంటో చెప్పకనేచెబుతోంది. ప్రస్తుతం భారతీయ మొబైల్ యూజర్లు గూగుల్‌ప్లే, ఐట్యూన్స్ యాప్ స్టోర్ ఇతరత్రా ఆన్‌లైన్ స్టోర్స్ నుంచి గేమింగ్ యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసేకోవడానికి నెలకు రూ.5 కోట్లమేర వెచ్చిస్తున్నట్లు అంచనా.
 
 ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ల దన్ను...
 స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం ఆకాశమేహద్దుగా ఎగబాకుతుండటం ఎం-గేమింగ్ జెట్‌స్పీడ్‌కు కీలకంగా నిలుస్తోంది. అందులోనూ.. గూగుల్ ఆండ్రాయిడ్; యాపిల్ ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లలో ఉపయోగిస్తున్న ఐఓఎస్ వంటి పటిష్టమైన ఆపరేటింగ్ సిస్టమ్‌లు కూడా ఎం-గేమింగ్ సూపర్ సక్సెస్‌కు ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. అత్యున్నత కంటెంట్ లభ్యత మొబైల్ యూజర్లను గేమింగ్ ప్రియులుగా మార్చేస్తోందంటున్నారు. ఒక్క మొబైల్ గేమ్స్ మాత్రమే కాకుండా.. ఫేస్‌బుక్ ఇతర  సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లు, ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్స్(యాప్స్) కూడా గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లుగా మారుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌లలో  సోషల్ గేమింగ్‌కు జపాన్‌లో పునాదిపడగా.. పాశ్చాత్య మార్కెట్లలో కూడా ఇది బంపర్‌హిట్ కొడుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement