బీజింగ్: చైనాలో ఆన్‌లైన్ వీడియో గేమ్‌లకు బానిసగా మారిన ఓ ఐదో తరగతి బాలుడిని ఆ వ్యసనం నుంచి బయటపడేసేందుకు తల్లిదండ్రులు అతని ‘దారి’నే ఎంచుకున్నారు! రోజూ గంటల తరబడి వీడియో గేమ్‌లు ఆడుతున్న తమ కుమారుడు తిరిగి చదువుల బాట పట్టేందుకు వీలుగా ఓ ప్రొఫెషనల్ ఆన్‌లైన్ గేమర్‌ను ఆశ్రయించారు!! ఇందుకోసం అతనికి గంటకు సుమారు రూ. 600 చొప్పున ‘సుపారీ’సైతం చెల్లించారు!!
ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా తమ కుమారుడిని ఆన్‌లైన్ గేమర్‌తో చిత్తుగా ఓడించడం ద్వారా ఈ తరహా ఆటలు ఆడటంలో నిష్ణాతుడినన్న అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలనుకున్నారు. అనుకున్నట్లుగానే వారి వ్యూహం ఫలించింది. బాలుడితో ఐదు గంటలపాటు ఐదు గేమ్‌లు ఆడిన ఆన్‌లైన్ గేమర్... అతన్ని చిత్తుగా ఓడించాడు.
గేమ్‌లన్నీ పూర్తి ఏకపక్షంగా సాగడంతో కంగుతిన్న బాలుడు.. ఆ ఆటలపై ఇష్టాన్ని కోల్పోయాడు. దీంతో తమ కొడుకును ఓదార్చిన తల్లిదండ్రులు... ఇక నుంచి అతను తిరిగి చదువుపై దృష్టిపెట్టేలా ఒప్పించారు. ఈ విషయాలను ఆన్‌లైన్ గేమర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు. మరో బాలుడిని సైతం ఇలాగే ఆన్‌లైన్ ఆటల వ్యసనం నుంచి బయటపడేసినట్లు చెప్పాడు.
చదవండి: పాలపుంతలో నీటి గ్రహాలు! కనిపెట్టిన నాసా టెలిస్కోప్..
Comments
Please login to add a commentAdd a comment