వీడియో గేమ్స్ అడిక్షన్ ఇంటింటి వ్యసనాయణం! అది చైనా, హేనన్ ప్రావిన్స్‌లోని ఒక కుటుంబానికి ఎలాంటి షాక్‌ను ఇచ్చిందో చదవండి. ఆ కుటుంబంలోని పదమూడేళ్ల అమ్మాయికి వీడియో గేమ్స్ అంటే పిచ్చి. నిద్రాహారాలు మరచిపోయి మరీ ఫోన్‌లో గేమ్స్ ఆడుతూ ఉంటుంది.. ఇల్లు, బడి అనే తేడా లేకుండా! ఆ అమ్మాయికున్న ఈ అలవాటును ఇంట్లో పెద్దలు నిర్లక్ష్యం చేసినా బడిలో టీచర్ మాత్రం లక్ష్యపెట్టింది. ఆ పిల్ల తల్లిదండ్రుల దృష్టికీ తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి మీద ఓ కన్నేసి ఉంచింది ఆమ్మ. ఎన్నో రోజులు గడవకముందే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ వీడియో అమ్మ కంట్లో పడింది.
ఏంటా అని చూస్తే.. తన కూతురు ఖర్చు పెట్టిన డబ్బు తాలూకు బ్యాంక్ స్టేట్‌మెంట్స్ వీడియో అది. ఒకటి కాదు రెండు కాదు 51,72,646 రూపాయలు. అది ఆ పిల్ల అమ్మానాన్న కొన్నేళ్లుగా కూడబెట్టిన మొత్తం! ఒక్క పూటలో అలవోకగా ఖర్చుపెట్టేసింది. అంతా ఆన్‌లైన్ పేమెంటే. కూతురికి ఎప్పుడైనా అర్జంట్‌గా ఏదైనా అవసరం వస్తుందేమో ఎంతకైనా మంచిది అని అమ్మాయికి తన డెబిట్ కార్డ్ పిన్ నంబర్ చెప్పింది. ఇంకేముంది ఆ కూతురు కొత్త వీడియో గేమ్స్ కొనడానికి, ఆడుతున్న గేమ్స్‌కి కావల్సిన పాయింట్స్‌ని సంపాదించడానికీ తల్లిదండ్రుల సేవింగ్స్‌ని ఖర్చుపెట్టింది ఆ పిన్ నంబర్ ఉపయోగించి.
తన ఈ సీక్రెట్ ఫ్రెండ్స్‌కి తెలిసిపోయి.. బ్లాక్‌మెయిల్ చేసేసరికి వాళ్లకూ కావల్సిన వీడియో గేమ్స్‌ని కొనిపెట్టి మొత్తం డబ్బును హుష్ కాకి చేసేసింది. ఈ వ్యవహారం తల్లి కంట పడకుండా చక్కగా ఫోన్‌లోంచి ఆ ట్రాన్జాక్షన్ హిస్టరీని డిలీట్ చేసింది. పదమూడేళ్ల అమ్మాయి రికార్డ్ స్థాయిలో వీడియో గేమ్స్ కొనేసరికి అది సోషల్ మీడియాలో వైరలై.. ట్రాన్జాక్షన్ స్టేట్‌మెంట్ కూడా బయటకు వచ్చి.. అమ్మకు షాక్ ఇచ్చింది. ఇన్నాళ్ల తమ కష్టాన్ని కూతురు సింపుల్‌గా స్వైప్ చేయడంతో నెత్తీనోరు కొట్టుకుంటున్నారు తల్లిదండ్రులు. ఈ వ్యసనాయణం మనకూ షాక్ ఇవ్వకుండా జాగ్రత్తపడదాం!
(చదవండి: బంధం నిలబడాలంటే అదొక్కటే సరిపోదు!)
Comments
Please login to add a commentAdd a comment