
ఆ గేములు మూడ్‌ను మార్చేస్తాయి!
న్యూయార్క్: కేవలం 20 నిమిషాలు వీడియోగేములు ఆడితే మీ ఒత్తిడి మాయమై మంచి మూడ్‌లోకి వస్తారట. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. అదే సమయంలో హింసాత్మక వీడియోగేములు ఒత్తిడిని తగ్గించినా వాటివల్ల దుందుడుకు స్వభావం పెరుగుతుందని సర్వే హెచ్చరించింది. ఈ పరిశోధనకు కేరిన్ రిడిల్ నేతృత్వం వహించారు. ఇందుకోసం 82 మంది గ్రాడ్యుయేట్ విద్యార్థులను ఎంచుకున్నారు.
వారిలో సగం మందికి ‘ఫ్రస్టేటింగ్ వీడియో గేమ్’ ఇచ్చారు. మిగిలిన సగం మందికి ఆ గేమ్ కాకుండా ఇతర గేమ్‌లు ఇచ్చారు. అనంతరం వారి ఆటల్లోని మానసిక భావోద్వేగాలకు సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు. వాటిని విశ్లేషించి ‘ఫ్రస్టేటింగ్ వీడియో గేమ్’ ఆడినవారిలో నీరసం తగ్గి, పోటీతత్వం పెరిగిందని వెల్లడించారు. రెండు రకాల ఆటలు ఆడిన వారిలో ఒత్తిడి తగ్గి ఆనందంపాళ్లు పెరిగినట్లు గుర్తించారు. కానీ, హింసాత్మక ఆటలు ఆడేవారిలో దుందుడుకు నైజం కూడా అభివృద్ధి చెందుతుందని, ఇది మంచి పరిణామం కాదని హెచ్చరించింది. కాబట్టి ఒత్తిడి తగ్గించేందుకు హింసలేని వీడియోగేమ్‌లు నయమని ఈ పరిశోధన స్పష్టం చేసింది.