గర్ల్ఫ్రెండ్కు మత్తుమందిచ్చి వీడియోగేమ్స్
బెర్లిన్: ఇంటికొచ్చిన గర్ల్ ఫ్రెండ్కు మత్తుమందిచ్చి నిద్రలో ముంచినందుకు జర్మనీ కోర్టు ఓ 23 ఏళ్ల యువకుడికి ఫైన్ వేసింది. అదేంటని అనుకుంటున్నారా.. మరేం లేదు. ఆ యువకుడు తన స్నేహితుడితో కలిసి నాన్ స్టాప్గా వీడియో గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమయంలో ఎవరూ చిరాకుపెట్టించకూడదని, తన దృష్టిని మరల్చకూడదని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో అతడి 24 ఏళ్ల గర్ల్ ప్రెండ్ రాగా.. ప్రేమగా దగ్గరకు తీసుకొని టీలో నాలుగు చుక్కలు మత్తుమందు కలిపాడు.
దాంతో ఆమె సోయిలేకుండా ఓ పన్నెండు గంటలపాటు నిద్రపోయింది. ఆ తర్వాత మనోడు తాఫీగా స్నేహితుడితో వీడియో గేమ్ ఆడుకున్నాడు. అయితే, ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన గర్ల్ ఫ్రెండ్ కోర్టుకు ఎక్కింది. దీంతో, ఆ సమయంలో మత్తుమందిచ్చి ఎలాంటి దుశ్చర్యకు పాల్పడకపోయినా, హానీ చేయకపోయినా.. ఓ వ్యక్తికి మత్తుమందివ్వడమనేది భౌతికంగా వారికి హానీ కలిగించే చర్యేనని తేల్చి చెప్పాడు. వెంటనే 500 యూరోల ఫైన్ చెల్లించాలంటూ ఆదేశించాడు.