court fine
-
సీఎం మమతా బెనర్జీకి రూ.5,000 జరిమానా
కోల్‌కతా: నారద కుంభకోణం కేసులో ఇద్దరు మంత్రులు సహా తృణమూల్ కాంగ్రెస్ నాయకుల అరెస్ట్‌ను నిరసిస్తూ సీబీఐ కార్యాలయం ఎదుట నిరసనలకు సంబంధించి వాదనలు వినిపించడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి కోల్‌కతా హైకోర్టు అనుమతి ఇచ్చింది. సరైన సమయంలో అఫిడవిట్ దాఖలు చేయడంలో విఫలమైనందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రూ.5,000 జరిమానా విధించింది. నారద కేసులో తృణమూల్ కాంగ్రెస్ అఫిడవిట్లను రికార్డు చేయడానికి నిరాకరిస్తూ కోల్‌కతా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. హైకోర్టులో అఫిడవిట్ల దాఖలుకు అనుమతి కోరుతూ తాజాగా మరో పిటిషన్ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, సరైన సమయంలో అఫిడవిట్ దాఖలు చేయకపోవడంతో కోర్టు జరిమానా విధించింది. -
అన్నాడీఎంకే నేతలకు భారీ షాక్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని పెరుందురైలో గ్రానైట్ రాళ్ల దోపిడీకి పాల్పడిన కేసులో ఇద్దరు అన్నాడీఎంకే నేతలకు ఈరోడ్ కోర్టు రూ.8 కోట్ల జరిమానా విధించింది. ఈరోడ్ జిల్లా పెరుందురై తాలూకా పరిధిలో మట్టి, గ్రానైట్ రాళ్లను అక్రమంగా తరలించినట్లు పెరుంగుడి సహకార బ్యాంక్ అధ్యక్షుడు, అన్నాడీఎంకే నేత సేనాపతితోపాటు మరో నేత సుబ్రహ్యణ్యంలపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిని విచారించిన కోర్టు రూ.కోటి 96 లక్షల 56 వేలు జరిమానా చెల్లించాలని గతంలో ఆదేశించింది. అయితే వీరిద్దరూ జరిమానా చెల్లించకుండా అప్పీల్ చేశారు. ఈ అప్పీల్‌ను అనుసరించి పెరుందురై భూముల్లో కోర్టు డిజిటల్ సర్వే చేయించింది. 78,405 యూనిట్ల మట్టిని నిబంధనలకు విరుద్ధంగా తరలించినట్లు తేలడంతో ఈరోడ్ కోర్టు న్యాయమూర్తి నర్మదాదేవి వారిద్దరికీ రూ.8 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. -
గర్ల్‌ఫ్రెండ్‌కు మత్తుమందిచ్చి వీడియోగేమ్స్
బెర్లిన్: ఇంటికొచ్చిన గర్ల్ ఫ్రెండ్‌కు మత్తుమందిచ్చి నిద్రలో ముంచినందుకు జర్మనీ కోర్టు ఓ 23 ఏళ్ల యువకుడికి ఫైన్ వేసింది. అదేంటని అనుకుంటున్నారా.. మరేం లేదు. ఆ యువకుడు తన స్నేహితుడితో కలిసి నాన్ స్టాప్‌గా వీడియో గేమ్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఈ సమయంలో ఎవరూ చిరాకుపెట్టించకూడదని, తన దృష్టిని మరల్చకూడదని నిర్ణయించుకున్నాడు. అదే సమయంలో అతడి 24 ఏళ్ల గర్ల్ ప్రెండ్ రాగా.. ప్రేమగా దగ్గరకు తీసుకొని టీలో నాలుగు చుక్కలు మత్తుమందు కలిపాడు. దాంతో ఆమె సోయిలేకుండా ఓ పన్నెండు గంటలపాటు నిద్రపోయింది. ఆ తర్వాత మనోడు తాఫీగా స్నేహితుడితో వీడియో గేమ్ ఆడుకున్నాడు. అయితే, ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన గర్ల్ ఫ్రెండ్ కోర్టుకు ఎక్కింది. దీంతో, ఆ సమయంలో మత్తుమందిచ్చి ఎలాంటి దుశ్చర్యకు పాల్పడకపోయినా, హానీ చేయకపోయినా.. ఓ వ్యక్తికి మత్తుమందివ్వడమనేది భౌతికంగా వారికి హానీ కలిగించే చర్యేనని తేల్చి చెప్పాడు. వెంటనే 500 యూరోల ఫైన్ చెల్లించాలంటూ ఆదేశించాడు.