
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని పెరుందురైలో గ్రానైట్ రాళ్ల దోపిడీకి పాల్పడిన కేసులో ఇద్దరు అన్నాడీఎంకే నేతలకు ఈరోడ్ కోర్టు రూ.8 కోట్ల జరిమానా విధించింది. ఈరోడ్ జిల్లా పెరుందురై తాలూకా పరిధిలో మట్టి, గ్రానైట్ రాళ్లను అక్రమంగా తరలించినట్లు పెరుంగుడి సహకార బ్యాంక్ అధ్యక్షుడు, అన్నాడీఎంకే నేత సేనాపతితోపాటు మరో నేత సుబ్రహ్యణ్యంలపై ఫిర్యాదులు వచ్చాయి.
వీటిని విచారించిన కోర్టు రూ.కోటి 96 లక్షల 56 వేలు జరిమానా చెల్లించాలని గతంలో ఆదేశించింది. అయితే వీరిద్దరూ జరిమానా చెల్లించకుండా అప్పీల్ చేశారు. ఈ అప్పీల్‌ను అనుసరించి పెరుందురై భూముల్లో కోర్టు డిజిటల్ సర్వే చేయించింది. 78,405 యూనిట్ల మట్టిని నిబంధనలకు విరుద్ధంగా తరలించినట్లు తేలడంతో ఈరోడ్ కోర్టు న్యాయమూర్తి నర్మదాదేవి వారిద్దరికీ రూ.8 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.