Granite Mafia
-
గ్రానైట్ మాఫియా దోపిడీ రూ.1,000 కోట్ల పైమాటే!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గ్రానైట్ మాఫియా గుండెల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డ మాఫియా డొంక కదులుతోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లో గ్రానైట్ అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగింది. ఆయన తన అనుచరులు పావులూరి చిన కోటయ్య, చంద్రమౌళి ద్వారా ప్రకాశం జిల్లా నుంచి వేలాది లారీల గ్రానైట్‌ను బిల్లులు లేకుండా పొరుగు రాష్ట్రాలకు తరలించినట్లు పోలీసుల విచారణలో తేలింది. గ్రానైట్ అక్రమ రవాణా వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారికంగా నిర్ధారించారు. అనధికారిక సమాచారం ప్రకారం.. గ్రానైట్ మాఫియా రూ.1,000 కోట్లకుపైగానే దోచేసినట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటిదాకా 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో యరపతినేని అనుచరుడు చంద్రమౌళి అలియాస్ సీఎం కూడా ఉన్నాడు. అక్రమాలకు సహకరించిన అధికారుల్లో వణుకు ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, బల్లికురవ, మార్టూరు, సంతమాగులూరు వంటి ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు రాజకీయ నాయకుల అండదండలతో నకిలీ కంపెనీలు సృష్టించి, వాటి పేరిట ఆన్లైన్ ద్వారా ఈ–వే బిల్లులు పొంది గ్రానైట్ లారీలను అక్రమంగా రాష్ట్రం దాటించారు. కొన్నిసార్లు అసలు బిల్లులు కూడా లేకుండా గ్రానైట్ లారీలను ఇతర రాష్ట్రాలకు తరలించి, ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. గత టీడీపీ సర్కారు హయాంలో ఈ బాగోతం నిరాటంకంగా సాగిపోయింది. అద్దంకి సేల్స్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ వి.పి.శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ప్రత్యేక టాస్‌్కఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి, లోతుగా దర్యాప్తు జరిపారు. గ్రానైట్ మాఫియా డొంకను కదిలించారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో యరపతినేని శ్రీనివాసరావు అనుచరులు బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాలకు తరలించిన గ్రానైట్ విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక నకిలీ వే బిల్లులతో వెళ్లిన లారీల సంఖ్య వేలల్లోనే ఉంటుందని చెబుతున్నారు. ఈ గ్రానైట్ లారీలు సక్రమంగా పన్నులు చెల్లించి ఉంటే ప్రభుత్వ ఖజానాకు రూ.300 కోట్లకు పైగా ఆదాయం వచ్చేదని తేల్చారు. ప్రకాశం జిల్లా టాస్‌్కఫోర్స్ పోలీసులు యరపతినేని అనుచరుడు చంద్రమౌళిని అదుపులోకి తీసుకున్నారన్న విషయం తెలియగానే మరో అనుచరుడు చిన కోటయ్య అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ కేసులో మరో 123 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చెప్పారు. అలాగే టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో గ్రానైట్ మాఫియాకు సహకరించిన ప్రభుత్వ అధికారుల్లో కలవరపాటు మొదలైంది. కోట్లకు పడగలెత్తిన చిన కోటయ్య గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండకు చెందిన పావులూరి కోటేశ్వరరావు అలియాస్ చిన కోటయ్య 2014కు ముందు సొంత ఇల్లు కూడా లేక అద్దె ఇంటిలో నివాసం ఉండేవాడు. అతడిది సామాన్య మధ్య తరగతి కుటుంబం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు యరపతినేని నేతృత్వంలో నడిచిన గుట్కా, రేషన్, గ్రానైట్ మాఫియాకు కీలక సూత్రధారిగా వ్యవహరించాడు. ఐదేళ్లలోనే చిన కోటయ్య రూ.కోట్లకు పడగలెత్తాడు. -
గ్రానైట్ అక్రమ రవాణా సూత్రధారి యరపతినేని!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లో గ్రానైట్ మాఫియా గత ఐదేళ్లు యథేచ్ఛగా అక్రమ రవాణాకు పాల్పడినట్లు తేలింది. నకిలీ వే బిల్లులతో వేలాది లారీల గ్రానైట్‌ను రాష్ట్రం దాటించిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. నకిలీ కంపెనీలు సృష్టించి వే బిల్లులు అమ్ముకున్న ముఠా తెలిపిన వివరాలతో ప్రకాశం జిల్లా పోలీసులు నివ్వెరపోయారు. గుంటూరు జిల్లా పల్నాడులో మైనింగ్ మాఫియాను నడిపి రూ.వేల కోట్లు దోచుకున్న యరపతినేని తన అనుచరుడు సీఎం (నిక్‌నేమ్) అనే వ్యక్తి ద్వారా ప్రకాశం జిల్లాలో సైతం గ్రానైట్ మాఫియాను ఏర్పాటు చేశారు. ఈ అక్రమ వ్యవహారంలో ప్రకాశం జిల్లాకు చెందిన కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు, రెండు జిల్లాల్లోని కొందరు అధికారులు భాగస్వాములయ్యారు. మార్టూరు ఎస్ఐ విచారణలో భారీ కుంభకోణం బయటపడటంతో ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ దీనిపై సిట్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. గ్రానైట్ లారీలకు రక్షణ కవచంలా యరపతినేని అనుచరులు గ్రానైట్ ఫ్యాక్టరీల నుంచి బయలుదేరిన గ్రానైట్ లారీలకు కిలోమీటర్ దూరంలో ముందుగా ఒక కారు వెళ్తుంది. అందులోని యువకులు ఎప్పటికప్పుడు అధికారుల కదలికలను లారీల్లో ఉన్నవారికి చేరవేస్తుంటారు. అధికారులు తారసపడితే వారిని వెంబడిస్తూ నానా హంగామా సృష్టిస్తారు. అప్పటికీ వెళ్లకపోతే యరపతినేనితో ఉన్నతాధికారులకు ఫోన్ చేయించి వారిని అక్కడ నుంచి పంపించివేస్తారు. లారీలకు ముందు, వెనుక సుమారు పది మంది యువకులు బైక్‌లపై రక్షణ కవచంలా ఉంటారు. ప్రకాశం జిల్లా నుంచి గుంటూరు జిల్లాలోకి వెళ్లేందుకు సుమారుగా 20 మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు. రోజుకో మార్గంలో వెళ్తుంటారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల మధ్య ఈ అక్రమ రవాణా జరుగుతుంది. యరపతినేని ముఖ్య అనుచరుడు సీఎం (నిక్‌నేమ్) వీరందరినీ పర్యవేక్షిస్తూ లారీలను సరిహద్దు చెక్‌పోస్టులు దాటిస్తాడు. కాపలాగా వచ్చిన యువకులకు ఒక్కొక్కరికి రోజుకు రూ.వెయ్యి చొప్పున డబ్బు, మద్యం ఎరగా వేస్తాడు. ఇవన్నీ ప్రకాశం జిల్లా పోలీసుల విచారణలో బయటపడ్డాయి. ఇప్పుడు సిట్‌ను కూడా ఏర్పాటు చేయడంతో గ్రానైట్ మాఫియా అక్రమాలు మరిన్ని వెలుగుచూసే అవకాశం ఉంది. -
దేవునిగుట్టపై ‘గ్రానైట్’ కన్ను
సాక్షి, శంకరపట్నం(కరీంనగర్) : గ్రానైట్ వ్యాపారుల కన్ను దేవునిగుట్టపై పడింది. శంకరపట్నం మండలం అంబాల్‌పూర్ గ్రామంలో సర్వేనంబర్221లో 36 ఎకారాల్లో దేవుని గుట్ట, పేదలకు పట్టాలకు ఇచ్చిన స్థలం కూడా ఉంది. ఈ సర్వే నంబర్లో తవ్వకాలకు గ్రానైట్ వ్యాపారులు 2006లో 3హెక్టార్లలో అనుమతి పొందారు. కలర్ గ్రానైట్ రాయికోసం తవ్వకాలు చేపట్టారు. గుట్టచుట్టూ అసైన్డ్భూములు ఉన్నాయి. అంబాల్‌పూర్ గ్రామానికి చెందిన సముద్రాల కొంరయ్యకు 15 గుంటలు, సముద్రాల ఎల్లయ్యకు 15గుంటలు, దామెర చిలుకమ్మకు 25 గుంటలు, సముద్రాల కొంరయ్యకు 15 గుంటలు, దామెర రాజేశ్వరికి 15 గుంటలకు రెవెన్యూ అధికారులు పట్టాలు ఇచ్చారు. వీరి నుంచి లీజ్‌కు తీసుకున్న వ్యాపారులు షెడ్లు వేసి నిర్మించుకున్నారు. దేవునిగుట్టపై కలర్గ్రానైట్ రాయి వెలికితీయడంతో మార్కెట్లో డిమాండ్ ఉండగా అదనంగా అను మతి కోసం వ్యాపారులు దరఖాస్తులు చేసుకున్నారు. పంచాయతీ నుంచి నిరభ్యంతర పత్రం జారీ కాకపోవడంతో అనుమతి ఇంకా రాలేదు. ఈ క్రమంలో గుట్టపై పనులు చేస్తూ అసైన్డ్‌భూముల్లో వృథాగా క్వారీలో నుంచి వెలికితీసిన రాయిని కుప్పలుగా పోస్తున్నారు. పట్టాభూముల్లో మాత్రమే వృథా రాయిని పోయాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూమిలో రాయి పోస్తే అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. రూ.లక్షల విలువ చేసే బ్లాకులు గ్రానైట్ క్వారీలో రూ.లక్షలు విలువ చేసే బ్లాకు లు గుట్టపై నిల్వ చేశారు. అనుమతి కంటే ఎక్కు వ విస్తీర్ణంలో గుట్టపై పనులు చేసి బ్లాకులు తీశారని ఆరోపణలు ఉన్నాయి. కలర్ గ్రానైట్‌కు డిమాండ్ ఉండడంతో అదనంగా అనుమతికోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అనుమతి విషయంలో స్పష్టత లేకపోవడంతో ఈనెల20న మైనింగ్, రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. ఈ నివేదిక ఆధారంగా గ్రానైట్‌క్వారీ ఎంత విస్తీర్ణంలో చేశారో తేలనుంది. పదిరోజులు గడుస్తున్నా ఇవ్వని నివేదిక అనుమతి కంటే ఎక్కువ విస్తీర్ణంలో గ్రానైట్క్వారీలో పనులు చేశారని అంబాల్‌పూర్ మాజీ సర్పంచ్ గాజుల లచ్చమ్మ, మాజీ ఉపసర్పంచ్ గాజుల మల్లయ్య, మోరె గణేశ్ ఫిర్యాదు మేరకు మైనింగ్ అధికారి సైదులు, సర్వేయర్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ సర్వేయర్ సంపత్‌లు ఈనెల20న సర్వేచేశారు. అదేరోజు పంచనామా కాపీ అందించాలి. సర్వే చేసి పది రోజులు గడిచినా నివేదికను అందించకపోవడంపై సర్వత్రా విమర్శలకు దారి తీసింది. చర్యలు తీసుకోవాలి శ్మశాన వాటికకోసం ఎంపిక చేసిన భూమిలో క్వారీ యజమానులు బండరాళ్లు వేసిండ్రు. గుట్టపై అనుమతి కంటే ఎక్కువ విస్తీర్ణంలో పనులు చేసిండ్రని ఫిర్యాదు చేస్తే సర్వే చేసిన అధికారులు నివేదికను ఇవ్వమంటే కాలయాపన చేస్తున్నరు. ఎక్కువ స్థలంలో పనులు చేసిన దానిపై చర్యలు తీసుకోవాలి. – గాజుల మల్లయ్య, మాజీ ఉపసర్పంచ్ -
గ్రానైట్.. అక్రమాలకు రైట్‌రైట్!
సాక్షి, అనంతపురం: జిల్లాలో గ్రానైట్ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. అత్యంత విలువైన ఖనిజాన్ని రాత్రికి రాత్రే జిల్లా సరిహద్దును దాటించేస్తున్నారు. ఎలాంటి రాయల్టీలు చెల్లించకుండా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండికొడుతున్నారు. దొరికితే దొంగ లేదంటే దొరే అన్న చందంగా అక్రమ రవాణా సాగుతోంది. క్వారీలపై గనులశాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఖనిజాన్ని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రధానంగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ రవాణ జోరుగా సాగుతోంది. గ్రానైట్ అక్రమ రవాణాతో ప్రభుత్వం ఏటా రూ.150 కోట్లకు పైగా నష్టపోతోంది. పర్మిట్లు నిల్.. రవాణా ఫుల్.. జిల్లా వ్యాప్తంగా అధికారికంగా 340 క్వారీలకు గనులశాఖ అధికారులు అనుమతులను మంజూరు చేశారు. వీటిలో 150కిపైగా కిపైగా గ్రానైట్ క్వారీలు, 144 రోడ్డుమెటల్ క్వారీలున్నాయి. దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకొవాలనే అన్న సామెతను గ్రానైట్ అక్రమార్కులు తూ చ తప్పకుండా పాటిస్తున్నారు. ఎలాంటి పర్మిట్లు తీసుకోకుండానే అత్యంత విలువైన గ్రానైట్‌ను జల్లా సరిహద్దు దాటించేసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలోని కలర్ గ్రానైట్‌కు కర్ణాటక ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉండడంతో గ్రానైట్ బ్లాక్‌లకు రాయల్టీ చెల్లించకుండా గుట్టు చప్పుడు కాకుండా కర్ణాటకకు తరలిస్తున్నారు. క్వారీ నిర్వహకులు గ్రానైట్‌ను తరలించే సమయంలో భూగర్భ గనుల శాఖ అధికారులతో అనుమతులు పొందాలి. కలర్ గ్రానైట్‌కు ఒక క్యూబిక్ మీటర్‌కు రూ.2350, బ్లాక్ గ్రానైట్‌కు రూ.3000లతో రాయల్టీ చెల్లించాలి. అయితే క్వారీ నిర్వహకులు మాత్రం తక్కువ క్యూబిక్ మీటర్లకు రాయల్టీ చెల్లించి అధిక మొత్తంలో గ్రానైట్‌ను తరలిస్తున్నారు. రోడ్డు మెటల్ క్వారీల్లో సైతం ఇదే తంతు కొనసాగుతోంది. పెనుకొండ, రాయదుర్గం ప్రాంతాల్లోని రోడ్డు మెటల్ క్వారీల్లో తీసుకున్న పర్మిట్లకు క్వారీల్లో తవ్వుకున్న ఖనిజానికి ఎక్కడా పొంతన లేదు. తక్కువ క్యూబిక్ మీటర్లకు రాయల్టీ చెల్లించి లక్షల కూబ్యిక్ మీటర్ల రోడ్డు మెటల్‌ను తవ్వుకుంటున్నారు. మడకశిర కేంద్రంగా అక్రమ రవాణా గ్రానైట్ అక్రమ రవాణ మడకశిర కేంద్రంగా సాగుతోంది. మడకశిర నియోజకవర్గంలోని అత్యధిక గ్రానైట్ క్వారీలు ఓ టీడీపీ ప్రజాప్రతినిధి అధీనంలో ఉన్నాయి. ఇక్కడ గ్రానైట్ రవాణా మొత్తం ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే.. గత 5 ఏళ్లలో ఇష్టారాజ్యంగా గ్రానైట్ రవాణా సాగించారు. ఇప్పుడు సైతం అదే పంథానే కొనసాగిస్తున్నారు. మొత్తం క్వారీలన్నీ ఆయన అధీనంలో ఉండడం.. క్వారీలకు 4,5 కిలో మీటర్ల దూరంలోనే కర్ణాటక సరిహద్దు ఉండడం ఆ నేతకు బాగా కలిసొచ్చింది. అత్యంత విలువైన గ్రానైట్‌ను రాత్రికి రాత్రే జిల్లా సరిహద్దును దాటించేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఒక మడకశిర ప్రాంతం నుంచే దాదాపు రూ.50 కోట్లకు పైగా అక్రమ వ్యాపారం సాగుతోంది. మడకశిర జిల్లా కేంద్రానికి సుదూరంగా ఉండడంతో అధికారుల పర్యవేక్షణ సైతం కొరవడింది. దీంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా రవాణా సాగిస్తున్నారు. గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంతోపాటు గనులశాఖ విజిలెన్సు కార్యాలయం జిల్లాలోనే ఉన్నా అక్రమ రవాణకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం వెహికల్ ట్రాకింగ్ సిస్టాన్ని అమలులోకి తీసుకువచ్చి గ్రానైట్ అక్రమ రవాణాకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేస్తాం. గ్రానైట్ రవాణా సమయంలో క్వారీ నిర్వహకులు రిజిస్టర్ వెహికల్ నంబర్ ఇస్తేనే పర్మిట్లు జారీ చేసేలా చర్యలు చేపడతాం. రాయల్టీ చెల్లించకుండా గ్రానైట్ రవాణా సాగిస్తే వెహికల్‌ను సీజ్ చేయడంతోపాటు క్వారీల లీజును సైతం రద్దు చేస్తాం. – చంద్రమౌళి, గనులశాఖ డీడీ -
కరిగిపోతున్న కొండలు
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్ నిక్షేపాలకు కొదవలేదు. తన సామ్రాజ్యంలో ఉన్న గ్రానైట్ నిక్షేపాలపై కన్నేసిన మంత్రి కళా వెంకటరావు 2014లో అధికారంలోకి వచ్చాక పావులు కదిపారు. గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన ఉణుకూరు నియోజకవర్గంలోని గ్రానైట్ కొండలపై పడ్డారు. రాజాం నియోజకవర్గంలోని వంగర మండలం మడ్డువలస జలాశయాన్ని ఆనుకుని ఉన్న కొండపై 25 ఎకరాల్లో గ్రానైట్ తవ్వకాలకు బినామీల పేరుతో అనుమతులు తెచ్చుకున్నారు. అయితే ఆ కొండ జోలికి వెళ్లకుండా ఆ అనుమతులతో రిజర్వాయర్‌కు సమీపంలో సర్వే నంబరు 341లోని పాండవుల పంచకొండపై 2016 ఏప్రిల్ నుంచి అనధికారికంగా తవ్వకాలు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యంత్రాలతో మైనింగ్ చేశారు. ఆ నిక్షేపాలను తరలించడానికి వీలుగా పెద్ద రోడ్డు కూడా వేశారు. ఇలా కొల్లగొట్టిన గ్రానైట్ విలువ దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ అక్రమ తవ్వకాల వ్యవహారంపై అప్పట్లో ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు వెలువడడంతో మైనింగ్‌శాఖ అధికారులు వాటిని నిలుపుదల చేశారు. అక్కడ తవ్వకాలు జరిపిన పొక్లెయిన్లు, క్రేన్లు, జేసీబీలు, లారీలు, ఇతర వాహనాలతో పాటు అప్పటికే తవ్వి ఉన్న గ్రానైట్ (గ్యాంగ్ సైజ్ బ్లాక్‌లను)ను ఎక్కడివక్కడే సీజ్ చేశారు. వాటిని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. అయితే కొద్దిరోజులకే రూ.కోట్ల విలువ చేసే ఆ వాహనాలు, గ్యాంగ్‌సైజ్ బ్లాక్‌లు (రాళ్లు) మాయమైపోయాయి. అధికార పార్టీ నేతలే వాటిని మాయం చేయడంతో రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు చేష్టలుడిగి చూశారు. రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినా.. పాండవుల కొండ వద్ద సీజ్ చేసిన రూ.కోట్ల విలువైన వాహనాలు, గ్రానైట్ మాయమయ్యాయని గతంలో వంగర తహసీల్దారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులూ భయపడిపోయి కేసు నమోదు చేయడమే మానేశారు. పోలీసులు నాన్చినాన్చి చివరకు కేసును క్లోజ్ చేసేశారు. తాజాగా మరో కొండకు కన్నం..! పాండవుల కొండపై గ్రానైట్ తవ్వకాలకు బ్రేకులు పడడంతో తాజాగా ఆ కొండకు ఎదురుగా ఉన్న మరో కొండ (నీలయ్యవలస పంచాయతీ)పై తవ్వకాలు మొదలెట్టారు. ఆ కొండ తవ్వకాలకు అనుమతుల్లేవు. అయినప్పటికీ కొన్నాళ్ల క్రితమే ఎలాంటి బెరుకు లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టారు. ప్రస్తుతం ఎన్నికల హడావుడి ఉన్నందున తాత్కాలికంగా పనులు ఆపారు. కొత్త తవ్వకాలను పరిశీలిస్తాం.. నీలయ్యవలస పంచాయతీలోని కొండలపై గ్రానైట్ తవ్వకాలకు కొత్త అనుమతులు లేవు. అనధికార తవ్వకాలు జరపడానికి వీల్లేదు. దీనిపై రెవెన్యూ ఇన్స్పెక్టర్ను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపిస్తామని వంగర డిప్యూటీ తహసీల్దార్ గోవిందరావు తెలిపారు. -
దొడ్డిదారి దందా!
ఇక్కడ కనిపిస్తున్న ఈ క్వారీ శెట్టూరు మండలం తిప్పనపల్లి గ్రామంలోనిది. దీంతోపాటు ఇక్కడ మరో రెండు రోడ్డు మెటల్ క్వారీలున్నాయి. వీటికి అత్యంత దగ్గరలోనే కర్ణాటక ప్రాంతం ఉంది. ఈ క్వారీల నుంచి ప్రతిరోజూ రోడ్డు మెటల్‌తోపాటు గ్రానైట్ రవాణా చేస్తున్నారు. అయితే తీసుకున్న పర్మిట్ల కన్నా ఎక్కువ రవాణా చేస్తున్నారు. ఒక్క పర్మిట్‌పై పదుల సంఖ్యల్లో వాహనాలు అక్రమంగా గ్రానైట్ రవాణా సాగిస్తూ ప్రభుత్వ అదాయానికి గండికొట్టి జేబులు నింపుకొంటున్నారు. అనంతపురం టౌన్: జిల్లావ్యాప్తంగా అధికారికంగా 320 క్వారీలకు గనులశాఖ అధికారులు అనుమతులు మంజూరు చేశారు. వీటిలో 70కిపైగా గ్రానైట్ క్వారీలు, 250 రోడ్డుమెటల్ క్వారీలు ఉన్నాయి. వీటిని అనుక్షణం పర్యవేక్షించి అక్రమ క్వారీలపై కొరడా ఝుళిపించాల్సిన భూగర్భగనుల శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. యథేచ్ఛగా అక్రమ క్వారీలు, అనుమతులు లేని క్రషర్ యూనిట్లు నడుస్తున్నా చర్యలు తీసుకోలేదు. మామూళ్ల మత్తులో నిద్రపోతూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అక్రమార్కులు ఇష్టారాజ్యంగా పర్మిట్లు పొందుతూ ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపి అక్రమంగా గ్రానైట్ రవాణా సాగిస్తున్నారు. ఒక్క పర్మిట్‌తో పదుల సంఖ్యలో వాహనాల్లో అత్యంత విలువైన గ్రానైట్‌ను జిల్లా సరిహద్దు దాటిస్తున్నారు. ఇక్కడి గ్రానైట్‌కు కర్ణాటక ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉండటంతో రాత్రికి రాత్రే జిల్లా సరిహద్దు దాటించేస్తున్నారు. మడకశిర, శెట్టూరు, గోరంట్ల, పెనుకొండ, బొమ్మనహాల్ ప్రాంతాలు కర్ణాటక ప్రాంతానికి దగ్గర్లోనే ఉండటంతో వారి అక్రమ రవాణాకు అడ్డులేకుండా పోతోంది. కర్ణాటక సరిహద్దులో దాదాపు 18కిపైగా చెక్‌పోస్టులు ఉన్నప్పటికీ దొడ్డిదారిన గ్రానైట్ తరలిస్తున్నారు. తీసుకున్న పర్మిట్లకు తరలిస్తున్న గ్రానైట్‌కు ఎక్కడా పొంతన లేదు. బొమ్మనహాల్ మండలంలో ఎలాంటి లీజు అనుమతులు లేకుండా లక్షల క్యూబిక్ మీటర్ల రోడ్డు మెటల్‌ను తవ్వి అక్రమంగా కర్ణాటక ప్రాంతానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నేమకల్ ప్రాంతాల్లోని రోడ్డు మెటల్ క్వారీలకు పర్మిట్లను జారీ చేయరాదని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినా గనులశాఖ అధికారులు పర్మిట్లు ఇచ్చేస్తున్నారు. గనులశాఖ అధికారులకు మామూళ్ల మత్తు గనులశాఖ కార్యాలయంలో పనిచేసే కొందరు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ అక్రమ రవాణాకు అండగా నిలుస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. జిల్లాలో గ్రానైట్‌ను పెద్ద ఎత్తున అక్రమంగా రవాణా చేస్తూ రూ.కోట్లలో ప్రభుత్వ అదాయానికి గండికొడుతున్నా ఈ ఏడాది కాలంలో అలాంటి వాహనాన్ని ఒక్కదాన్ని కూడా వారు సీజ్ చేయకపోవడంతో వాటికి మరింత బలం సమకూరింది. విజిలెన్స్ తనిఖీల్లో బట్టబయలు బొమ్మనహాల్ మండలంలో అత్యధికంగా 22 రోడ్డు మెటల్ క్వారీలున్నాయి. వీటిలో చాలా వాటికి పర్యావరణ అనుమతులు లేవు. అనుమతులు లేని క్వారీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పర్మిట్లు జారీ చేయకూడదు. అయితే అధికారులు క్వారీలను పర్యవేక్షించకుండా పర్మిట్లు ఇచ్చేస్తున్నారు. ఓ క్వారీ నిర్వాహకుడు లీజుకు తీసుకున్న క్వారీ కాకుండా మరోచోట తవ్వకాలు చేపట్టాడు. లక్షల క్యూబిక్ మీటర్ల మేర రోడ్డు మెటల్ తవ్వేసుకున్నాడు. ఇటీవల విజిలెన్సు అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. అక్రమంగా రవాణా చేస్తే క్రిమినల్ కేసులు గ్రానైట్‌ను అక్రమంగా రవాణా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు రెవెన్యూ అధికారులకు సైతం హక్కులను కల్పిస్తూ ప్రభుత్వం జీఓ నెం.18ని సైతం విడుదల చేసింది. వారు కూడా అక్రమ రవాణాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలి. బొమ్మనహాల్ క్వారీలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అక్రమంగా నిర్వహిస్తున్న క్వారీలను సీజ్ చేస్తాం. – వెంకటేశ్వరరెడ్డి, ఇన్చార్జ్ గనులశాఖ ఏడీ -
గ్రానైట్ మాఫియా గుప్పిట్లో గుట్టలు!
సాక్షి, వెల్గటూరు(ధర్మపురి) : పశుపక్షాదుల కిలకిల రావాలతో దశాబ్దం క్రితం వరకు వెల్గటూరు పరిసరాలు సుందరంగా కళకళలాడే గుట్టలు విచ్చలవిడిగా వెలసిన క్వారీలు, క్రషర్ల మూలంగా ప్రస్తుతం ధ్వంసం అవుతున్నాయి. ఎక్కడ చూసినా దుమ్ము ధూళితో శ్మశాన వాతావరణాన్ని తలపిస్తోంది. పర్యావరణ పరిరక్షించే గుట్టలు గ్రానైట్ మాఫియా గుప్పిట్లోకి వెళ్లాయి. అధికారుల అండదండలతో కరిగిపోతున్నాయి. గుట్టల విధ్వంసంతో వన్యప్రాణులు ఆవాసం కోల్పోయి జనారణ్యంలోకి వస్తున్నాయి. పశువులకు మేత కరువై రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పాడుతున్నా యి. సాగుభూములు బీళ్లుగా మారుతున్నాయి. పది గ్రామాల్లో తగ్గిన పశుసంపద వెల్గటూర్ మండల పరిధిలో ఏర్పాటయిన క్వారీ లు క్రషర్ల వల్ల వెల్గటూరు, కుమ్మరిపల్లి, జగదేవుపేట, కొండాపూర్, అంబారిపేట, శాఖాపూర్, కప్పారావుపేట, రాజక్కపల్లి, కిషన్రావుపేట, సంకెనపెల్లి గ్రామాల్లో పాడిపశువుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతోంది. పశువుల మేతకు ఉపయోగపడే గుట్టలన్ని స్టోన్క్వారీలుగా మారాయి. దీం తో పచ్చదనాన్ని కోల్పోయినాయి. బాంబుల మో తకు చిన్న జీవరాశి కూడా కనిపించకుండా పోయి ంది. పర్యావరణ పరిరక్షణ çఅనేది మచ్చుకైనా లేకుండా పోతోంది. ఫలితంగా పెద్దవాగు చుక్క నీరు లేకుండా ఎండిపోయింది. పాడి పశువులకు మేత కరువై రైతులు చేసేదేమి లేక కబేలాకు తెగనమ్ముతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు పాడి పశువులను జూలో చూడాల్సి వస్తుందేమోనని మేధావులు అభిప్రాయపడుతున్నారు. బసంత్‌నగర్ టు వెల్గటూరు గ్రానైట్ మాఫియా బసంత్‌నగర్ నుంచి వెల్గటూరుకు చేరుకుంది. ఒకప్పుడు స్టోన్ క్వారీలకు క్రషర్లకు బసంత్‌నగర్ బోడగుట్టలు నిలయంగా ఉండేవి. పదేళ్లుగా ఆ స్థానాన్ని వెల్గటూరు ఆక్రమించుకుంది. అక్కడి అధికారులు ప్రజాప్రతినిధుల ఒత్తిడి మూలంగా గ్రానైట్ వ్యాపారులంతా ఇక్కడికి చేరుకున్నారు. వీరికి తోడుగా బడా రాజకీయ నాయకులు సైతం క్వారీలను తీసుకుని అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ పర్యావరణానికి గొడ్డలిపెట్టుగా మారారు. వంద హెక్టార్లలో గుట్టలు హాంఫట్ రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారుల నిర్లక్ష్య ధో ర ణి వల్ల వందల హెక్టార్లలో వెలసిన గుట్టలు.. గ్రానైట్ మాఫియా చేతుల్లో పడి కరిగి పోతున్నా యి. వ్యవహారమంతా అక్రమంగా నడుస్తున్నా అ డిగేవారే లేరు. మైనింగ్ పొల్యూషన్ అధికారులు ఇటువైపు రానే రారు. వచ్చిన మామూళ్లు తీసుకు ని చడీచప్పుడు కాకుండా వెళ్లిపోతారనే ఆరోపణలున్నాయి. సామాన్యప్రజలను ఎవ్వరూ పట్టించుకోరూ.. మండల పరిధిలోని చుట్టూ పది గ్రామాల విస్తీర్ణంలో క్వారీలు క్రషర్లు వెలిశాయి. ఇవన్నీ వ్యవసాయ ఆధారిత గ్రామాలు. రైతులు, రైతు కూలీలు వ్యవసాయంపైనే ఆధారపడి బతుకు సాగిస్తారు. అలాంటి జీవితాల్లో గ్రానైట్ వ్యాపారులు గుట్టల ను ఆక్రమించారు. బాంబుల శబ్దం, దుమ్ము కాలుష్యం వల్ల ఆరోగ్యం, పంట పొలాలు నష్ట పోతాన్నామని రెవెన్యూ, మైనింగ్ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పెద్దమొత్తంలో గ్రానైట్ దందా సాగుతున్నా గ్రామాలకు రూపాయికూడా ఆదాయం లేదని.. అలాంటప్పుడు మేము ఎందుకు ఇబ్బంది పడాలని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి పర్యావరణానికి గొడ్డలిపెట్టులా మారినా గ్రానైట్ దందాకు చెక్ పెట్టాలని బాధిత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే గుట్టలను గ్రానైట్ పేరుతో లీజుకు ఇవ్వకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. పశు సంపదకు నిలయం మా గ్రామం కుమ్మరిపల్లి పశుసంపదకు నిలయంగా ఉండేది. అలాంటిది గుట్టలన్నీ బడాబాబులు, అధికా రుల చలవతో గ్రానైట్ వ్యా పారులు వశం చేసుకున్నా రు. నానాటికి పశువుల సంఖ్య తగ్గుతోంది. దై వంగా భావించే ఆవు గ్రామంలో కనుమరుగవ డం దురదృష్టకరం. – సాగర్, కుమ్మరిపల్లి పాడిరైతులను ఆదుకోవాలి నాది యాదవ కులం. మా కు బాగా తెలిసిన పని గొ ర్రెలు, మేకలను కాసుకుం టూ బతకటం. ఇప్పుడు గు ట్టలపై క్వారీలు వెలిశా యి. మేకలను, గొర్రెలను మేపుకుందామంటే జాగలేకుండా పోయింది. ఉన్న జీవరాసులన్నింటినీ అమ్ముకుని కూలీకి పోతున్నాం. – మాచర్ల రాజేందర్, కిషన్రావుపేట గ్రానైట్ క్వారీలను మూసేయాలి గ్రానైట్ క్వారీలు క్రషర్ల వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు. రెండు దశాబ్దాలుగా ఇక్కడ గ్రానైట్ వ్యాపారం సాగుతోంది. దీ ంతో పర్యావరణం దె బ్బతినటంతో పాటు ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలో జమ కాలేదు. విలువైన ఖనిజ సంపదను అక్రమార్కులు కొల్లగొట్టేసున్నా మైనింగ్ అధికారులు పట్టించు కోవడం లే దు. నిబంధలనకు విరుద్ధంగా అక్రమంగా న డుస్తున్న వాటిని అధికారులు తక్షణమే మూసి వేయాలి. – పత్తిపాక వెంకటేశ్, వెల్గటూరు -
అన్నాడీఎంకే నేతలకు భారీ షాక్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని పెరుందురైలో గ్రానైట్ రాళ్ల దోపిడీకి పాల్పడిన కేసులో ఇద్దరు అన్నాడీఎంకే నేతలకు ఈరోడ్ కోర్టు రూ.8 కోట్ల జరిమానా విధించింది. ఈరోడ్ జిల్లా పెరుందురై తాలూకా పరిధిలో మట్టి, గ్రానైట్ రాళ్లను అక్రమంగా తరలించినట్లు పెరుంగుడి సహకార బ్యాంక్ అధ్యక్షుడు, అన్నాడీఎంకే నేత సేనాపతితోపాటు మరో నేత సుబ్రహ్యణ్యంలపై ఫిర్యాదులు వచ్చాయి. వీటిని విచారించిన కోర్టు రూ.కోటి 96 లక్షల 56 వేలు జరిమానా చెల్లించాలని గతంలో ఆదేశించింది. అయితే వీరిద్దరూ జరిమానా చెల్లించకుండా అప్పీల్ చేశారు. ఈ అప్పీల్‌ను అనుసరించి పెరుందురై భూముల్లో కోర్టు డిజిటల్ సర్వే చేయించింది. 78,405 యూనిట్ల మట్టిని నిబంధనలకు విరుద్ధంగా తరలించినట్లు తేలడంతో ఈరోడ్ కోర్టు న్యాయమూర్తి నర్మదాదేవి వారిద్దరికీ రూ.8 కోట్ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. -
తాడిపత్రిలో ‘లగాన్ గ్యాంగ్’
అనగనగా ఓ పెద్దమనిషి. ఆయన వద్ద ఓ పెద్ద కోటరీ. తన ప్రాంతంలో ఎవరు ఏ పెద్ద వ్యాపారం చేయాలన్నా.. ఆయనకు కప్పం కట్టాలి. కాదు.. కూడదు అంటే ఊరుదాటాలి. దారికి రాని వారిని దెబ్బతీయడంలో ఆయనది అందెవేసిన చెయ్యి. ఆ ప్రాంతంలో పోస్టింగ్ కావాలన్నా ఆశీస్సులు తప్పనిసరి. వచ్చిన తర్వాత ‘జీ..హుజూర్’ అనకపోతే హూస్టింగ్కు సిద్ధం కావాల్సిందే. ఇప్పుడంతా అక్కడ ఆయన కనుసన్నల్లోనే వ్యవహారం సాగుతోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. గ్రానైట్ అక్రమ రవాణా సదరు పెద్దాయనకు కాసులు కురిపిస్తోంది. ఆయన చాటున.. ‘లగాన్ గ్యాంగ్’ దందా అడ్డూఅదుపు లేకుండా సాగిపోతోంది. సాక్షి, అనంతపురం: తాడిపత్రి చుట్టుపక్కల ఎక్కడా క్వారీలు లేవు. చిత్తూరు, ఒంగోలు, పొదిలి, కనిగిరి, కృష్ణగిరి నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఒక లోడు గ్రానైట్ బండలు క్వారీ నుంచి తాడిపత్రి చేరాలంటే రూ.45వేల నుంచి రూ.50వేల వరకు రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. అయితే లగాన్ గ్యాంగ్ రాయల్టీ లేకుండా రవాణా చేస్తామని క్వారీ, పాలిష్ మిషన్ వ్యాపారులతో ఒప్పందం చేసుకుంటోంది. గ్రానైట్ లారీ క్వారీ నుంచి.. తాడిపత్రి నుంచి పాలిష్ గ్రానైట్ బండల లారీలు బయలుదేరగానే నాలుగు పైలెట్ వాహనాలు బరిలోకి దిగుతాయి. దారిలో చెక్ పోస్టులు, అధికారులు ఎవరు ఆపినా ఈ గ్యాంగ్ ‘కార్యం’ చక్కబెడుతుంది. లోడును గమ్యం చేర్చినందుకు రూ.20వేల నుంచి రూ.30వేలు వసూలు చేస్తారు. రాయల్టీతో పోలిస్తే తక్కువ మొత్తానికి పని జరుగుతుండటంతో వ్యాపారులు ‘జీరో’ వైపునకు మొగ్గు చూపుతున్నారు. విజిలెన్స్ కళ్లుగప్పి అక్రమ రవాణా విజిలెన్స్ అధికారులు వస్తే అప్రమత్తమై వారి నుంచి దారి తప్పించే చర్యలకు ‘పైలెట్లు’ ఉపక్రమిస్తారు. అలాగే లారీలో ఉన్న గ్రానైట్ పరిమాణానికి బిల్లులో తక్కువ చూపించి రవాణా చేస్తారు. ఒకే బిల్లుతో 5–6లోడ్లు తరలిస్తారు. ఈ మొత్తం తతంగంలో అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి బాగోగులు చూసుకుంటారు. జోరో బిజినెస్ చేసేందుకు క్వారీ, మిషన్ వ్యాపారులతో బేరం కుదుర్చుకుని ఆ డబ్బును ‘తాడిపత్రి పెద్దమనిషి’కి కప్పం రూపంలో ముట్టజెబుతారు. ఆయన తన పీఏ ద్వారా ‘గ్రానైట్ మాఫియా’కు కొద్దిమేర చిల్లర విదిల్చి తక్కిన డబ్బు వేనకేసుకుంటున్నారు. ఇలా రోజూ లక్షల రూపాయలను అప్పనంగా ఆర్జిస్తున్నారు. రెండేళ్లు బ్రేక్.. మళ్లీ యథేచ్ఛగా దందా భూగర్భ గనుల శాఖ విజిలెన్స్ ఏడీగా ప్రతాప్‌రెడ్డి 2015 ఆగస్టు 21న బాధ్యతలు స్వీకరించారు. తాడిపత్రిలో సాగుతున్న అక్రమాలను చూసి నివ్వెరపోయారు. లారీలను ఆపి బిల్లులు అడిగితే లేవని చెప్పేవారు. దీంతో పెనాల్టీ రాయడం మొదలుపెట్టారు. అయితే ఆ వెంటనే ‘పెద్దమనిషి పీఏ’ నుంచి ఏడీకి ఫోన్ వచ్చేది. ‘తాడిపత్రి వెహికల్స్‌పై స్టిక్కర్ చూడలేదా? అవి ఎవరివో తెలియదా? పెనాల్టీ వేశావు, నువ్వే చెల్లించి రశీదు తీసుకో!’ అని దబాయించేవారు. అయినప్పటికీ విజిలెన్స్ ఏడీ బెదరకుండా వాహనాలను సీజ్ చేశారు. ఇలా రెండేళ్లలో గ్రానైట్ అక్రమదందాపై ఉక్కుపాదం మోపారు. 2015కు ముందు ఏటా కోటి రూపాయలు పెనాల్టీ రూపంలో వసూలయ్యేది. 2015–16లో రూ.5.40కోట్లు, 2016–17లో రూ.5.55కోట్లు రాబట్టారు. దీంతో ప్రతాప్‌రెడ్డిని మొదట దారికి తెచ్చుకోవాలని చూశారు. ఆ తర్వాత బెదిరించారు. చివరకు అవినీతి మరకలంటించేందుకు డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు వచ్చి ఇతనికి క్లీన్చిట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనపై భౌతిక దాడులకు యత్నించారు. తెలిసినా.. కన్నెత్తి చూడని అధికారులు తాడిపత్రిలో గ్రానైట్ మాఫియా సాగిస్తోన్న అక్రమ దందా భూగర్భ గనుల శాఖ అధికారులకు తెలియనిది కాదు. అయితే ‘లగాన్ గ్యాంగ్’తో సత్సంబంధాలు ఉండటంతో వారంతా చూసీచూడనట్లు వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రతాప్‌రెడ్డి అడ్డుపడి కొరకరానికి కొయ్యగా తయారైతే అనంతపురంలోని గనులశాఖ అధికారులు ప్రతాప్‌రెడ్డికి కాకుండా ‘మాఫియా’కు మద్దతుగా నిలిచారు. ఇదంతా కోట్లాది రూపాయల అక్రమాదాయం వల్లేననే విషయం రాష్ట్రస్థాయి అధికారులకు కూడా స్పష్టంగా తెలుసు. గ్రానైట్ వ్యాపారులను గుప్పిట్లో పెట్టుకుని సదరు పెద్దమనిషి కోట్ల రూపాయలు గడిస్తూ రాజకీయాల్లో మునిగితేలుతున్నారు. కానీ ఏ ఒక్క అధికారి కూడా తాడిపత్రి వైపు, ఇక్కడి అక్రమ వ్యాపారం వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన ప్రతాప్‌రెడ్డి తాడిపత్రి గ్రానైట్ మాఫియాతో తనకు ప్రాణహాని ఉందని గుత్తి విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి ఆగస్టు 2న భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌కు లేఖ రాశారు. అందులో ఐదుగురి పేర్లు పొందుపరిచారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి పీఏ రవీంద్రారెడ్డిని నంబర్–1గా పేర్కొన్నారు. తాడిపత్రి గ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాగేశ్వరరెడ్డి, బిల్లుల బాబు, సూర్యముని, ఎం.సుబ్బారావు అనే వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉన్నట్లు వెల్లడించారు. వీరందరిపై కేసులు ఉన్నాయని కూడా ఫిర్యాదులో వివరించారు. గత రెండేళ్లుగా గ్రానైట్ అక్రమ రవాణాకు ప్రతాప్‌రెడ్డి కొద్దిమేర బ్రేక్ వేశారు. ఈ క్రమంలో ‘గ్రానైట్ మాఫియా’ పెద్దమనిషి వద్దకు వెళ్లి అతన్ని బదిలీ చేయించాలని పట్టుబట్టింది. గ్రానైట్ ద్వారా వచ్చే ఆదాయం భారీగా ఉండటంతో భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావుకు చెప్పి ప్రతాప్‌రెడ్డిని 2017 అక్టోబర్ మూడోవారంలో బదిలీ చేయించారు. ఆయన బదిలీ తర్వాత దందా యథేచ్ఛగా సాగుతోంది. -
తాడిపత్రిలో చెలరేగిపోతున్న గ్రానైట్ మాఫియా
తాడిపత్రి: నిజాయతీ అధికారికి బదిలీ సన్మానం చేసిన తాడిపత్రి మాఫియా.. అడ్డూఅదుపు లేకుండా గ్రానైట్ అక్రమ రవాణాకు పాల్పడుతోంది. ఈ ప్రాంతంలో ఎక్కడా క్వారీలు లేకపోయినా.. వ్యాపారం కోట్లలో సాగుతుండటం గమనార్హం. ప్రకాశం జిల్లా చీమకుర్తి, కర్నూలు జిల్లా ఆదోని, డోన్, కదిరి, కనికిగి, చిత్తూరు తదితర ప్రాంతాల్లోని క్వారీల నుంచి ఇక్కడికి గ్రానైట్ గుండ్లు సరఫరా అవుతున్నాయి. ఒక లోడు గ్రానైట్ బోల్టర్లు క్వారీ నుంచి ఫ్యాక్టరీకి చేరాలంటే రూ.60వేల నుంచి రూ.70వేల రాయల్టీ చెల్లించాల్సి ఉంది. ఇక్కడే దందా మొదలవుతోంది. లగాన్ బృందం రంగంలోకి దిగి అధికారుల చేతులు తడుపుతూ పని కానిచ్చేస్తోంది. మైనింగ్ లీజుదారులు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. సేల్‌ట్యాక్స్ 12శాతం చెల్లించి ఒక్కో గుండు కొలతను బట్టి రాయల్టీ మీటరుకు రూ.3వేలు చొప్పున చెల్లించాలి. కానీ కొన్ని క్వారీల్లో నాసిరకం గుండ్లు ఉండడం వల్ల మంచి గుండ్లకు, నాసిరకం గుండ్లకు ఒకటే రాయల్టీ ధర నిర్ణయించడంతో క్వారీ లీజుదారులు, ప్యాక్టరీ యజమానులతో కుమ్మక్కై క్యూబిక్ మీటరు రూ.60వేల నుంచి రూ.70వేల విలువ చేసే ఖనిజానికి.. మీటరు రూ.7వేల విలువ చేసే ఖనిజానికి ప్రభుత్వం తేడా లేకుండా ఒకే ధరను నిర్ణయించింది. దీంతో తాడిపత్రి లాంటి ప్రాంతాలకు నాసిరకం గుండ్లను తరలించడంతో ఈ సమస్య ఉత్పన్నమౌతోంది. జీఎస్టీలో కూడా ట్యాక్స్ బిల్లు వేసేటప్పుడు అధిక ధర కలిగిన ఖనిజానికి తక్కువ ధర కలిగిన ఖనిజానికి విలువలో తేడా లేకుండా బిల్లు వేస్తున్నారు. దీంతో ఒంగోలు లాంటి పారిశ్రామిక ప్రాంతంతో పోల్చుకుంటే ఇక్కడ తేడా భారీగా ఉంటోంది. మామూళ్ల కోసం మాయాజాలం గ్రానైట్ రాయి ఐదువేల అడుగులు ఉంటే ఫ్యాక్టరీ యజమానులు 2,500 అడుగులకు మాత్రమే బిల్లు తయారు చేస్తారు. చెక్‌పోస్టు వద్ద అక్కడున్న అధికారుకులకు మామూళ్లు ముట్టజెప్పి సీలు వేయించుకుంటారు. దీంతో ఇతర ప్రాంతాల్లో అధికారులు వాహనాన్ని ఆపినప్పుడు బిల్లు చెక్ చేసినట్లు ఉండటంతో అంతోఇంతో తీసుకుని వదిలేస్తున్నారు. ఇలా ప్రభుత్వ ఆదాయానికి యథేచ్ఛగా గండి పడుతోంది. నిజాయతీగా పనిచేసే అధికారులకు బెదిరింపులు తాడిపత్రిలో మైనింగ్ మాఫియాకు అడ్డూఅదుపులేకుండా పోతున్న తరుణంలో గతంలో గుత్తి మైనింగ్ విజిలెన్స్ విభాగంలో అసిస్టెంట్ జియాలజిస్ట్‌గా ఉన్న ప్రతాపరెడ్డి మైనింగ్ మాఫియాపై కొరడా ఝళిపించారు. కేవలం లక్షల్లో ఉన్న ఆదాయన్ని కోట్ల రూపాయలకు చేర్చారు. ఇక తమ ఆటలు సాగవన్న ఆ మాఫీయా తాడిపత్రికి చెందిన ఓ ముఖ్యనేత సహకారం కోరారు. వచ్చే ఆదాయంలో వాటా ఇచ్చేందుకు ఒప్పందం కుదరడంతో ఏజి ప్రతాప్‌రెడ్డిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి అవినీతి మకిలి అంటించారు. ఆ శాఖ ఉన్నతాధికారులు విచారణ చేపట్టి ఆయనకు క్లీన్చిట్ ఇచ్చారు. దీంతో సదరు ముఖ్య నేత మైనింగ్ శాఖ మంత్రి వద్ద పంచాయితీ పెట్టి మరీ ఆయనను బదిలీ చేయించారు. ఆ తర్వాత మాఫియా యథేచ్ఛగా తమ దందా సాగిస్తోంది. లగాన్ అంటే.. ఎలాంటి అనుమతులు లేకుండా క్వారీల నుంచి గుండ్లను తీసుకుని ఫ్యాక్టరీకి సరఫరా చేసి యజమానుల వద్ద రూ.10వేల నుంచి రూ.15వేలు చొప్పున వసూలు చేసే ఈ తతంగాన్ని లగాన్గా పిలుస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత అనుచరుల కనుసన్నల్లో ఈ వ్యవహారం సాగుతోంది. 20 మంది సభ్యులు ఈ లగాన్ గ్యాంగ్‌లో ఉంటారు. క్వారీ నుంచి ఫ్యాక్టరీకి గుండ్లు చేరే వరకు మార్గమధ్యంలో ఎవరూ అడ్డుకోకుండా చూసుకోవడం వీరి బాధ్యత. అక్రమ రవాణాను క్వారీల వద్దే అడ్డుకుంటాం తాడిపత్రి ప్రాంతంలో గ్రానైట్ క్వారీలు ఎక్కడా లేవు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడి గుండ్లు వస్తాయి. క్వారీల వద్ద గుండ్ల రవాణాను అడ్డుకుంటున్నాం. ఈ విషయమై క్వారీ యజమానులతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఇప్పటికే అక్రమంగా గుండ్లను తరలించే లారీలను సీజ్ చేసి లక్షల్లో జరిమానా విధించాం. ఇక ముందు కూడా దాడులను ముమ్మరం చేస్తాం. – వెంకటేశ్వరరెడ్డి, మైనింగ్ ఏడీ -
నిజాయితీపై వేటు!
గ్రానైట్ మాఫియా ఒత్తిళ్లకు తలొగ్గిన ప్రభుత్వం – విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డి వైజాగ్‌కు బదిలీ – ఇటీవల ప్రభుత్వానికి లేఖ ఇచ్చిన ఓ ఎమ్మెల్యే – తాడిపత్రిలో తిరిగి రెచ్చిపోనున్న గ్రానైట్ మాఫియా – ఇక జీరో బిజినెస్‌తో దందా కొనసాగింపు అధికార పార్టీ నేతల పంతం నెగ్గింది. విధుల్లో నిక్కచ్చిగా వ్యవహరించిన మైనింగ్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డిపై బదిలీ వేటు పడింది. అధికారులను నాయకులు తమ మునివేళ్లతో ఆడిస్తారనేందుకు తాజా ఉదాహరణ ఇది. చెప్పినట్లు వినకపోయినా.. తమ ఆగడాలకు అడ్డొచ్చినా జిల్లాను దాటించేందుకూ వెనుకాడబోమని ఈ బదిలీ ఉదంతంతో చెప్పకనే చెప్పినట్లయింది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు పాలనలో పారదర్శకత పాటిస్తారా? నాయకుల చెప్పుచేతల్లో కాకుండా పేదల పక్షాన నిలబడతారా? సాక్షి ప్రతినిధి, అనంతపురం: మైనింగ్ విజిలెన్స్ ఏడీ ప్రతాప్‌రెడ్డిని వైజాగ్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయమై కొన్ని నెలలుగా తాడిపత్రి గ్రానైట్ మాఫియా, అక్కడి ఓ పెద్ద మనిషి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఉన్నతాధికారులు, సంబంధిత మంత్రిపై ఒత్తిళ్లు తీసుకొచ్చినా ఫలితం లేకపోవడంతో.. ఏకంగా సీఎం వద్ద పంచాయితీ పెట్టి మరీ ఏడీని బదిలీ చేయించినట్లు తెలుస్తోంది. ప్రతాప్‌రెడ్డి బదిలీతో తాడిపత్రిలో గ్రానైట్ మాఫియా తిరిగి రెచ్చిపోనుంది. తాడిపత్రి చుట్టుపక్కల ఎక్కడా గ్రానైట్ క్వారీలు లేవు. మడకశిర, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల క్వారీల నుంచి రవాణా అవుతోంది. ఆయా జిల్లాల్లో గ్రానైట్ పరిశ్రమలు ఉన్నా.. తాడిపత్రికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇందుకు ఆయా ప్రాంతాలతో పోలిస్తే గ్రానైట్ ధర ఇక్కడ కాస్త తక్కువగా ఉండటమే. ఇదే జీరో బిజినెస్‌కు కూడా కారణమవుతోంది. ప్రతాప్‌రెడ్డి రాకతో మాఫియాకు చెక్ మైనింగ్ విజిలెన్స్ ఏడీగా 2015 ఆగస్టు 21న ప్రతాప్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కొత్తలోనే గ్రానైట్ మాఫియా ఆగడాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రాయల్టీ లేకుండా వచ్చిన లోడు, ఒకే బిల్లుపై 5 నుంచి 10 లోడ్లు తిరుగుతుంటే భారీగా జరిమానాలు విధించారు. ఈ నేపథ్యంలో ప్రతి నెలా రూ.40 లక్షల మామూళ్లు అడుగుతున్నారని ఆయనపై ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. దీనిపై డైరెక్టరేట్ అధికారులు విచారణ చేపట్టారు. ప్రతాప్‌రెడ్డి ఎప్పుడూ డబ్బు డిమాండ్ చేయలేదని వ్యాపారులు తెలిపారు. ఏడీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రికార్డులు పరిశీలించారు. 2015కు ముందు ఏటా రూ.కోటి మాత్రమే పెనాల్టీ రూపంలో ఆదాయం వచ్చేది. 2015–16లో రూ.5.40కోట్లు, 2016–17లో రూ.5.55కోట్లు రావడంతో ఆయనకు క్లీన్చిట్ ఇచ్చారు. వెళ్లిపోవాలని బెదిరింపులు ప్రతాప్‌రెడ్డి బదిలీకి అన్నివిధాల ప్రయత్నించారు. చివరకు బెదిరింపులకూ పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో గ్రానైట్ మాఫియాతో తనకు ప్రాణహాని ఉందని, ఆగస్టు 2న ఉన్నతాధికారులకు ఏడీ ఫిర్యాదు చేశారు. దీంతో మాఫియాకు అండగా నిలిచే పెద్దమనిషి ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఎలాగైనా ప్రతాప్‌రెడ్డిని బదిలీ చేయించాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో ప్రతాప్‌రెడ్డి సెలవుపై వైజాగ్ వెళ్లారు. నంద్యాల ఎన్నికల తర్వాత ఆ పెద్దమనిషి ఏకంగా భూగర్భ గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావుతో పాటు ముఖ్యమంత్రిని కలిసి బదిలీకి పట్టుబట్టారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడే రెండురోజుల ముందు కూడా ఓ ఎమ్మెల్యే ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇందులో ఏడీ ఓ రాజకీయ పార్టీకి అంగా ఉంటున్నారని, నెలకు రూ.40లక్షల మామూళ్లు అడుగుతున్నారని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ అవాస్తవాలని తెలినప్పటికీ.. రాజకీయ ప్రయోజనాల కోసం పెద్దమనిషి సిఫార్సుకే ప్రభుత్వం పెద్దపీట వేసింది. నిజాయితీ అధికారిపై బదిలీ వేటు వేసింది. మళ్లీ మొదలు కానున్న దందా తాజా బదిలీతో తాడిపత్రిలో మాఫియా దందా షురూ కానుంది. తాడిపత్రిలో 600 పైగా గ్రానైట్ మిషన్లు ఉన్నాయి. వీటికి 20–30మంది ట్రాన్స్పోర్టర్లు ఉన్నారు. వీరు తమ లారీలను ఏర్పాటు చేసి గ్రానైట్ రాళ్లను సరఫరా చేస్తున్నారు. ఒకలోడు గ్రానైట్ క్వారీ నుంచి తాడిపత్రికి చేరాలంటే రూ.45వేల నుంచి రూ.50వేల రాయల్టీ చెల్లించాలి. రాయల్టీ లేకుండా క్వారీ నుంచి తాడిపత్రికి గ్రానైట్ చేర్చేలా క్వారీ, తాడిపత్రి పాలిష్ మిషన్ వ్యాపారులతో ఒప్పందం చేసుకుంటారు. అలాగే లారీలో ఉన్న గ్రానైట్ పరిమాణానికి, బిల్లులో తక్కువ చూపించి రవాణా చేస్తారు. ఒకే బిల్లుతో పదుల సంఖ్యలో 5–6లోడ్లు తరలిస్తారు. ఈ మొత్తం తతంగంలో అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి బాగోగులు ‘మాఫియా’నే చూస్తుంది. తద్వారా రోజూ కనీసం రూ.30లక్షలు గ్రానైట్ ద్వారానే అందనుంది. మైనింగ్ అధికారులు కూడా మాఫియాకు మద్దతుగా ఉండటంతో ఇకపై గ్రానైట్ అక్రమ దందా యథేచ్ఛగా సాగనుంది. -
మంత్రిని శాసిస్తున్న గ్రానైట్ మాఫియా !
- ఓవర్‌లోడ్ జరిమానా 1+5 నుంచి 1+1కు తగ్గించిన కేటీఆర్ - ఆ మేరకు చెల్లించాల్సిందేనని స్పష్టీకరణ - కేటీఆర్ సూచనలు గ్రానైట్ మాఫియా బేఖాతర్ - కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్న వైనం - అధికారంలో ఏ పార్టీ ఉన్నా గ్రానైట్ మాఫియాదే రాజ్యం - గతంలోనే చెక్‌పోస్టులను ఎత్తేయించుకున్న వైనం - రాత్రి పగలు తేడా లేకుండా ఓవర్‌లోడ్ కు రైట్‌రైట్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: గ్రానైట్ మాఫియా జిల్లాను శాసిస్తోంది. అధికారంలో ఏ పార్టీ ఉన్నా గ్రానైట్ మాఫియాదే రాజ్యం అన్నట్లుగా తయారైంది. వందల సంఖ్యలో గుట్టలను ధ్వంసం చేస్తూ పర్యావరణానికి, ప్రజా జీవనానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న గ్రానై ట్ మాఫియా ఓవర్‌లోడ్ పేరుతో సర్కారు ఖజానాకు గండి కొట్టిన మొత్తాన్ని జరిమానాతోసహా రూ.792 కోట్లు చెల్లించాల్సిందేనంటూ మైనింగ్ విజిలెన్సు అధికారులు పలుమార్లు నోటీసులు పంపినా పట్టించుకోలేదు. జరిమానా చెల్లించే వరకు పర్మిట్లు ఇవ్వకూడదని అధికారులు నిర్ణయిస్తే ఉలిక్కిపడ్డ కొందరు గ్రానైట్ వ్యాపారులు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు. రాష్ట్ర మున్సిపల్, ఐటీ, గనుల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు గ్రానైట్ వ్యాపారులు ప్రయత్నించినట్లు సమాచారం. ఇసుక, గ్రానైట్ అక్రమాలపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు తీసుకుంటున్న కేటీఆర్ తొలుత గ్రానైట్ వ్యాపారులకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని తెలిసింది. కొంద రు మంత్రులు, అధికార పార్టీకి చెందిన మరికొందరు నేతల విజ్ఞప్తి మేరకు గ్రానైట్ వ్యాపారులకు అపాయిట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం గ్రానైట్ సంక్షోభం ఏర్పడిందని, విజిలెన్సు అధికారులు నిర్ధారించిన 1+5 జరిమానా చెల్లించలేమని ఆ మొత్తాన్ని తగ్గించాలని గ్రానైట్ వ్యాపారులు చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేటీఆర్ జరిమానా మొత్తాన్ని 1+1(సుమారు రూ.262 కోట్లు)కు కుదించారు. ఆ మొత్తాన్ని చెల్లించాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు. అసలు జరిమానా మొత్తాన్ని చెల్లించేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపని గ్రానైట్ వ్యాపారులు మంత్రి నిర్ణయాన్ని బేఖాతర్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతోపాటు ఏకంగా స్టే తెచ్చుకోవడం విశేషం. ఈ విషయంలో గ్రానైట్ వ్యాపారులకు మైనింగ్ శాఖలోని కొందరు ఉన్నతాధికారులే సహ కరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పట్టపగలే ఓవర్‌లోడ్‌కు రైట్‌రైట్ ! గ్రానైట్ ఓవర్‌లోడ్, ఇసు క అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని మంత్రి కేటీఆర్ చేసిన ఆదేశాలు జిల్లాలో అమలు కావడం లేదు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కరీంనగర్ పట్టణ నడిబొడ్డునుంచి నిత్యం వందలాది వాహనాలు ఓవర్‌లోడ్‌తో వెళుతున్నా.. అధికారులు పెద్దగా పట్టించుకోవం లేదు. జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు సైతం నామమాత్రంగా మారాయి. ఈ విషయంలో కొందరు అధికారులు గ్రానైట్ వ్యాపారులకు సహకరిస్తున్నట్లు తెలిసింది. అందుకు ప్రతిఫలంగా ఒక్కో లారీకి లక్షలాది రూపాయలు అమ్యామ్యాలు తీసుకున్నట్లు సమాచారం. -
గుట్టలు హాంఫట్
- కరీంనగర్ జిల్లాలో 800 గుట్టల్ని మింగేసిన గ్రానైట్ మాఫియా - ఏటా రూ. వెయ్యి కోట్ల దందా! - గుట్టలు, వాటి చుట్టూ ఉన్న అడవులు మాయం.. గ్రామాల్లోకి వస్తున్న జంతువులు - వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంట పొలాలు - వందల సంఖ్యలో చెరువుల పూడ్చివేత - నిత్యం బాంబుల మోత.. దుమ్మూధూళి - శ్వాసకోశ వ్యాధులతో జనం సతమతం - గ్రానైట్ లారీలతో దెబ్బతింటున్న రోడ్లు - దేవుడి గుట్టలనూ వదలని వైనం - అక్రమ తరలింపుతో ప్రభుత్వ ఖజానాకు రూ.వందల కోట్లలో నష్టం - మామూళ్ల మత్తులో అధికారులు సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో మైనింగ్ మాఫియా గుట్టలను మింగేస్తోంది.. విచ్చలవిడిగా వ్యవహరిస్తూ పర్యావరణాన్ని ధ్వంసం చేస్తోంది.. గ్రానైట్ కోసం అక్రమంగా గుట్టలను తవ్వేస్తూ వేల కోట్ల రూపాయలు కొల్లగొడుతోంది.. గ్రానైట్ తిమింగలాల దెబ్బకు ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 800కుపైగా గుట్టలు మాయమైపోయాయి. వేలాది ఎకరాల్లోని పంట పొలాలు నాశనమయ్యాయి. కాకతీయులు గుట్టల చుట్టూ తవ్వించిన ఎన్నో చెరువులు ఆనవాళ్లు కోల్పోయాయి. గుట్టలు, వాటి చుట్టూ ఉన్న అడవిలో ఉండే వన్యప్రాణులన్నీ గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ క్వారీలతో జరుగుతున్న విధ్వంసం మాటలకు అందనిది. వేల కోట్ల దందా కరీంనగర్ జిల్లాలో 618 గ్రానైట్ క్వారీలకు అనుమతులున్నాయి. అనధికారికంగా మరో 200కుపైగా గుట్టల్లో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ టాంబరిన్ రెడ్, కాఫీ బ్రౌన్, మాఫిల్ రెడ్ అనే మూడు రకాల గ్రానైట్ లభిస్తోంది. వాటిని చైనా, జపాన్, సింగపూర్, ఇండోనేసియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లా నుంచి ఏటా ఎగుమతయ్యే గ్రానైట్ విలువ రూ.1,000 కోట్లకుపైగా ఉంటుంది. అక్రమంగా మరో రూ.500 కోట్ల విలువైన గ్రానైట్ తరలిపోతోందని అంచనా. 2006-2014 మధ్య 8 ఏళ్లపాటు రాయల్టీ రూపంలో సర్కారుకు వచ్చిన ఆదాయం రూ.వెయ్యి కోట్ల పైమాటే. ఇది రాష్ట్రవ్యాప్తంగా గ్రానైట్ నుంచి వస్తున్న ఆదాయంలో 75 శాతం కావడం గమనార్హం. భారీగా పర్యావరణ విధ్వంసం గుట్టలు పచ్చని ప్రకృతికి, వన్యప్రాణులకు నిలయాలు. కాకతీయులు గుట్టల చుట్టూ నివాస ప్రాంతాలకు దగ్గరలో పెద్ద సంఖ్యలో చెరువులు తవ్వించారు. వర్షాలు పడినప్పుడు గుట్టలపై నుంచి చేరే నీటితో అవన్నీ కళకళలాడుతుండేవి. కానీ క్వారీల్లో చేస్తున్న బ్లాస్టింగ్లు, తవ్వకాలతో పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. గుట్టలు తరిగిపోయి, చెట్లన్నీ కొట్టివేయడంతో వన్యప్రాణులన్నీ చెల్లాచెదురయ్యాయి. బాంబుల రసాయనాలతో నీటి వనరులు కలుషితమవుతున్నాయి. పేలుళ్ల ధాటికి ఇళ్లు పగుళ్లు బారుతున్నాయి. తవ్వకాల వ్యర్థాలను కుంటలు, చెరువుల్లో పడేస్తుండడంతో.. సుమారు 40కిపైగా చెరువులు ఆనవాళ్లు కోల్పోయాయి. మరో వంద వరకు కుంటలు కాలుష్యంతో నిండిపోయాయి. దీంతో సమీపంలోని పంట పొలాలన్నీ దెబ్బతిన్నాయి. కరీంనగర్ జిల్లా పరిధిలో దాదాపు 10 వేల ఎకరాల మేర పొలాలు ధ్వంసమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక గుట్టలపై ఆధారపడి బతుకున్న వారి జీవనాధారం తీవ్రంగా దెబ్బతిన్నది. క్వారీలతోపాటు గ్రానైట్‌ను చెక్కే పరిశ్రమల కారణంగా విపరీతంగా దుమ్మూ ధూళి రేగి గ్రామాలపై కమ్ముకుంటోంది. దీంతో సమీప గ్రామాల ప్రజలంతా శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. దేవుడి గుట్టలనూ వదల్లేదు జిల్లాలోని గ్రానైట్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా గుట్టలను తవ్వేస్తున్నారు. ప్రభుత్వ భూములేకాదు ఇనాం, లావణి, అసైన్డ్, వక్ఫ్‌బోర్డ్, దేవుడి మాన్యం వంటి భూములనూ వదలడం లేదు. గంగాధర మండలంలోని ఒద్యారం, గట్టుభూత్కూర్, సర్వారెడ్డిపల్లి, కోట్ల నర్సింహులపల్లి, అచ్చంపల్లి, గర్శకుర్తి, కాచిరెడ్డిపల్లి గ్రామాలతోపాటు, సుల్తానాబాద్ మండలం, కేశవపట్నం, వెల్గటూర్, హుస్నాబాద్ మండలాల్లో విలువైన గ్రానైట్ గుట్టలు ఉన్నాయి. సర్వారెడ్డిపల్లి, కోట్ల నర్సింహులపల్లి గ్రామాల్లోని 230, 236, 236/1, 236/3, 199 సర్వే నంబర్ల పరిధిలో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో పెద్దమ్మగుట్ట, పెద్దగుట్ట, చెక్కగుట్ట, కాకుల గుట్టలున్నాయి. ఇవే సర్వే నంబర్లలో గుట్టల కింద ఉన్న మరో 40 ఎకరాల ప్రభుత్వ భూములను దళిత, బడుగు, బలహీన వర్గాలకు పంపిణీ చేశారు. క్వారీల నిర్వహకులు వారిని భయపెట్టి, కబ్జాచేసి ఆ భూముల్లో గ్రానైట్ తవ్వకాలు చేపట్టారు. గట్టుభూత్కుర్లోని 1152, 1154 సర్వే నంబర్లను అనుకుని 10 ఎకరాల లావణి, ఇనాం భూములను ఆక్రమించుకున్నారు. ఒక్క ఒద్యారంలోనే సుమారు 150 వరకు గ్రానైట్ క్వారీలున్నాయంటే అక్కడ విధ్వంసం ఏమేరకు జరిగిందో ఊహించుకోవచ్చు. ఇక్కడి గుట్టలు పూర్తిగా తరిగిపోవడంతో.. భూగర్భంలోనూ తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ గ్రామం పరిధిలో 98, 99,100 సర్వే నంబర్లలో ఉన్న వక్ఫ్‌బోర్డు భూములు, 94/ఎ, 94/బి, 95/ఏ, 95/బి సర్వే నంబర్లలోని 9 ఎకరాల సీలింగ్ భూముల్లోనూ తవ్వేస్తున్నారు. ముప్పిడిపల్లిలోని పందికుంటను ఆక్రమించుకుని గ్రానైట్ వ్యర్థాలతో నింపేశారు. కరీంనగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న గుట్టలపై దేవాలయాలు, దేవతా విగ్రహలు ఉండడంతో ప్రజలంతా వాటిని దేవుడి గుట్టలుగా పిలుచుకుంటారు. గ్రానైట్ మాఫియా వాటిల్లోని రామస్వామిగుట్ట, మల్లన్న గుట్ట, మైసమ్మ గుట్టలపై ఉన్న దేవతా విగ్రహాలను తొలగించి తవ్వకాలు చేపట్టింది. ఇలా గుట్టలపైనున్న ఆలయాలతోపాటు చారిత్రక ఆనవాళ్లు, సాంస్కతిక రూపాలు ధ్వంసమవుతున్నాయి. భారీగా అక్రమాలు.. 2008-2011 మధ్య గ్రానైట్ అక్రమ రవాణా వల్ల రూ.792 కోట్ల మేర ప్రభుత్వ ఆదాయానికి గండిపడిందని విజిలెన్స్ రికార్డులే చెబుతున్నాయి. పెద్ద పెద్ద బ్లాకులుగా ఉన్న గ్రానైట్ రాళ్ల కొలతను తక్కువగా చూపి వందల కోట్లు పన్ను ఎగవేస్తున్నారు. ఇందుకోసం మైనింగ్ అధికారులకు, తనిఖీ అధికారులకు మామూళ్లు ముట్టచెబుతున్నారు. కరీంనగర్ నుంచి కాకినాడ షిప్పింగ్ పోర్టు వరకూ ఉన్న ఆర్టీఏ, ఇతర మైనింగ్ అధికారులకు ప్రతినెలా ఒక్కో లారీ సుమారు రూ.లక్ష వరకూ చెల్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంటే ఈ 300 లారీలపై వసూలవుతున్నది రూ.3 కోట్ల పైమాటే. రైల్వేస్టేషన్లు, పోర్టుల్లో విజిలెన్స్ అధికారులు చేసిన తనిఖీల్లో ఎన్నో అక్రమాలు వెలుగు చూశాయి. ఆ మూడేళ్లలోనే సుమారు రూ.792 కోట్ల విలువైన గ్రానైట్ అక్రమంగా తరలిపోయిందని విజిలెన్స్ నిర్ధారించింది. ఆయా గ్రానైట్ సంస్థలకు నోటీసులు కూడా జారీ చేసింది. కానీ పన్ను చెల్లించకుండా తప్పించుకునేందుకు ఇప్పటికీ గ్రానైట్ యజమానులు పెద్దఎత్తున లాబీయింగ్ చేస్తూనే ఉన్నారు. రోడ్లన్నీ నాశనం గ్రానైట్ లారీల కారణంగా కరీంనగర్ నుంచి వరంగల్, హైదరాబాద్, మంచిర్యాల, గోదావరిఖని నుంచి వెళ్లే రహదారులు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దాంతోపాటు పెద్ద సంఖ్యలో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రోజూ సుమారు 300 వరకు లారీలు గ్రానైట్‌ను తరలిస్తుండగా... అందులో 90 శాతానికిపైగా ఓవర్‌లోడ్‌తోనే ప్రయాణిస్తుంటాయి. దీంతో రోడ్లు పాడైపోతున్నాయి. పలు చోట్ల వంతెనలు దెబ్బతింటున్నాయి. ఈ విధ్వంసం వల్ల ఏటా రూ.500 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతోందని అధికారులే పేర్కొంటున్నారు. అక్రమ తరలింపుతో ప్రభుత్వ ఆదాయానికీ గండి పడుతోంది. విధ్వంసానికి ప్రతీక ఇది ఇది హుస్నాబాద్ మండలంలోని మన్నెగుట్ట. వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ గుట్ట గిరిజనులకు ఉపాధితోపాటు, శివారు గ్రామాల రైతులకు ఊట నీరిచ్చే కల్పతరువు. 2011లో గ్రానైట్ వ్యాపారుల కళ్లు మన్నెగుట్టపై పడ్డాయి. అప్పటి వరకు ప్రకృతి సౌందర్యంతో పచ్చగా ఉన్న పల్లెలు, గిరిజన తండాలు గ్రానైట్ క్వారీల దెబ్బకు నాశనమవుతున్నాయి. క్వారీలో వినియోగించే బాంబుల రసాయనాలు, రాతి పొడితో సమీపంలోని బూరుగులొద్ది కుంట, తిమ్మాయి చెరువుల నీళ్లు కలుషితమయ్యాయి. వాటిలోని చేపలు చచ్చిపోతుండడంతో.. మత్స్యకారులు చేపలు పెంచడం మానేశారు. ఇక పేలుళ్ల శబ్దాలకు అడవీ జంతువులు భయపడి.. రైతుల పొలాలు, గ్రామాల్లోకి వస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి. అన్ని రకాలా నష్టమే.. ‘‘గ్రానైట్ మైనింగ్ వల్ల జల వనరులు దెబ్బతింటాయి. పరిసర ప్రాంతాల్లోని ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నారు. ఒకవైపు చెరువుల మరమ్మతులకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. మరోవైపు ఆ చెరువుల వద్ద గ్రానైట్ తవ్వకాలకు అనుమతివ్వడంతో ప్రజాధనం వృథా అవుతోంది. గుట్టలపై నివసించే వన్యప్రాణులు చెల్లాచెదురవుతున్నాయి. అవి ఇళ్లలోకి వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గుట్టలపై లభించే సీతాఫలాలు, పూలు అమ్ముకుని బతికే వారికి జీవానోపాధి కరువైంది. కరీంనగర్ జిల్లాలో అసాధారణ వాతావరణ మార్పులకు గ్రానైట్ పేరిట జరుగుతున్న విధ్వంసమే కారణం..’’ - ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, తెలంగాణ భూమి రక్షణ సమితి కన్వీనర్ అడవి జంతువుల బారిన పడుతున్నం ‘‘మా పొలాల శివారులో మన్నెగుట్టకు క్వారీ ఏర్పాటు చేయడంతో అడవిలో ఉండే ఎలుగుబంట్లు పశువుల వద్ద వస్తున్నాయి. అడవి పందులు పంటలను నాశనం చేస్తున్నాయి. క్వారీతో కుంటల్లోని నీళ్లు కలుషితమై పశువులు, నెమళ్లు చనిపోతున్నాయి. గట్టు నుంచి వచ్చే నీళ్లతో బావుల్లో ఊట పెరిగేది. ఇప్పుడు గుట్టలు పోతే మా బావుల్లోకి నీళ్లు రావు. క్వారీలను నిలిపేయాలి..’’ - పొన్నబోయిన శ్రీనివాస్, రైతు -
రంగంలోకి సహాయం
గ్రానైట్ మాఫియా భరతం పట్టేందుకు ఐఏఎస్ అధికారి సహాయం నేతృత్వంలోని బృందం సిద్ధం అయింది. సోమవారం నుంచి రంగంలోకి దిగనుంది. మదురైకు రానున్న ఈ ఐఏఎస్ అధికారికి ఆహ్వానం పలికేందుకు అభిమానులు సిద్ధం అయ్యారు. సహాయం ఫ్యాన్స్ పేరిట పోస్టర్లు మదురైలో ప్రత్యేక ఆకర్షణగా మారాయి. సాక్షి, చెన్నై: మదురై జిల్లా మేలూరు కేంద్రంగా సాగుతూ వచ్చిన గ్రానైట్ అక్రమ రవాణాను అప్పట్లో ఆ జిల్లా కలెక్టర్‌గా ఉన్న సహాయం వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. గ్రానైట్ మాఫియా రూపంలో ప్రభుత్వానికి రూ.16వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లిన ట్టు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇందుకు ఆయనకు లభించిన ప్రతిఫలం బదిలీ. తరచూ బదిలీలతో తన విధుల్ని నిర్వర్తిస్తున్న సహాయం నిజాయితీని మద్రాసు హైకోర్టు గుర్తించింది. రాష్ట్రంలో సాగుతున్న గ్రానైట్, ఖనిజ సంపదల అక్రమ రవాణాపై సమగ్ర విచారణకు ఆయన నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి తొలుత ప్రభుత్వం మొకాలొడ్డినా, చివరకు కోర్టు ఆగ్రహానికి గురై అంగీకరించక తప్పలేదు. కమిటీలో 18 మంది: సహాయం కమిటీకి ఆమోద ముద్ర వేసిన రాష్ర్ట ప్రభుత్వం మదురై వరకు విచారణను పరిమితం చేసినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారంపై కోర్టులో పిటిషన్ సైతం దాఖలైంది. ఈ పరిస్థితుల్లో తన విచారణను చేపట్టేందుకు సహాయం సిద్ధం అయ్యారు. సహాయం కమిటీకి ఇద్దరు సబ్ కలెక్టర్లు, ఒక తహసీల్దార్‌తో పాటుగా 15 మంది సిబ్బందిని కేటాయించారు. ఆయుధ బలగాలు, కాన్వాయ్ రూపంలో ఐదు వాహనాలు అప్పగించారు. మదురై కేంద్రంగా తిష్ట వేసి తమ పనుల్ని వేగవంతం చేయడం లక్ష్యంగా సహాయం కమిటీ రెడీ అయింది. ఇందు కోసం మదురై అన్నా బస్టాండ్ సమీపంలోని పాత కలెక్టరేట్ భవనాన్ని అప్పగించారు. గ్రానైట్ అక్రమ దందాకు సంబంధించి ఏదేని ఆధారాలు, వివరాలు ఉన్నా, ఇక్కడికి వెళ్లి స్వయంగా సహాయంను కలిసి అప్పగించేందుకు వీలు కల్పించారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. రంగంలోకి ఫ్యాన్స్ : సినీ నటులకు, రాజకీయ నాయకులకు అభిమానులు ఉండటం సహజం. అయితే, అధికారులకు అభిమానులు అరుదే. అయితే, వేల కోట్ల రూపాయల స్కాంను గతంలో వెలికి తెచ్చిన సహాయంకు మదురైలో పెద్ద ఎత్తున అభిమానులు పుట్టుకొచ్చారు. ఆయనకు అండగా తాము సైతం ఉన్నట్టు ప్రకటించుకుంటున్నారు. గ్రానైట్ మాఫియా నుంచి ఆయనకు ఎలాంటి ఇబ్బందులు కలగని రీతిలో కవచం వలే తాము ఉన్నామన్నట్టుగా ఈ ఫ్యాన్స్ నగరంలో పోస్టర్లను ఏర్పాటు చేశారు. పదో తేదీ నుంచి సహాయం కమిటీ తన విచారణను చేపట్టనుండడాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ ఐఏఎస్ అధికారికి ఆహ్వానం పలుకుతూ ఆటోలకు ప్రత్యేకంగా పోస్టర్లను అతికించుకుని నగరంలో చక్కర్లు కొడుతుండడం విశేషం. కరుణకు చురక : సహాయం కమిటీ తన విచారణకు సిద్ధం అవుతోంటే, మరో వైపు డీఎంకే అధినేత ఎం కరుణానిధికి ఈ కమిటీ వ్యవహారంలో సీఎం పన్నీరు సెల్వం చురకలు అంటించారు. ఆ కమిటీ ఏర్పాటులో జాప్యం జరిగిందంటూ కరుణానిధి విమర్శలు గుప్పించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన హయూంలోనే వేల కోట్ల గ్రానైట్ కుంభకోణం జరిగిందన్న విషయాన్ని ఓ మారు గుర్తు చేసుకోవాలని చురకలు అంటించారు. తమ అమ్మ(జయలలిత) నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే, ఆ స్కాం వెనుక ఉన్న బడాబాబుల్ని కటకటాల్లోకి నెట్టామని గుర్తు చేశారు. గ్రానైట్ మాఫియాపై కొరడా ఝుళిపించే విధంగా తాము చర్యలు తీసుకుంటే, దాన్ని విమర్శించడం శోచనీయమన్నారు. ఈ కమిటీ ఏర్పాటు చేయాలని మదురై జిల్లా కలెక్టర్‌ను తాను ఆదేశించానని, తక్షణం వాళ్లు చర్యలు చేపట్టి అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారన్న విషయాన్ని కరుణానిధి మరిచినట్టున్నారని మండిపడ్డారు.