రంగంలోకి సహాయం | Granite illegal ravanana in Chennai | Sakshi
Sakshi News home page

రంగంలోకి సహాయం

Published Sun, Nov 9 2014 4:32 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

రంగంలోకి సహాయం

రంగంలోకి సహాయం

 గ్రానైట్ మాఫియా భరతం పట్టేందుకు ఐఏఎస్ అధికారి సహాయం నేతృత్వంలోని బృందం సిద్ధం అయింది. సోమవారం నుంచి రంగంలోకి దిగనుంది. మదురైకు రానున్న ఈ ఐఏఎస్ అధికారికి ఆహ్వానం పలికేందుకు అభిమానులు సిద్ధం అయ్యారు. సహాయం ఫ్యాన్స్ పేరిట పోస్టర్లు మదురైలో ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
 
 సాక్షి, చెన్నై: మదురై జిల్లా మేలూరు కేంద్రంగా సాగుతూ వచ్చిన గ్రానైట్ అక్రమ రవాణాను అప్పట్లో ఆ జిల్లా కలెక్టర్‌గా ఉన్న సహాయం వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. గ్రానైట్ మాఫియా రూపంలో ప్రభుత్వానికి రూ.16వేల కోట్ల మేరకు నష్టం వాటిల్లిన ట్టు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇందుకు ఆయనకు లభించిన ప్రతిఫలం బదిలీ. తరచూ బదిలీలతో తన విధుల్ని నిర్వర్తిస్తున్న సహాయం నిజాయితీని మద్రాసు హైకోర్టు గుర్తించింది. రాష్ట్రంలో సాగుతున్న  గ్రానైట్, ఖనిజ సంపదల అక్రమ రవాణాపై సమగ్ర విచారణకు ఆయన నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి తొలుత ప్రభుత్వం మొకాలొడ్డినా, చివరకు కోర్టు ఆగ్రహానికి గురై అంగీకరించక తప్పలేదు.
 
 కమిటీలో 18 మంది: సహాయం కమిటీకి ఆమోద ముద్ర వేసిన రాష్ర్ట ప్రభుత్వం మదురై వరకు విచారణను పరిమితం చేసినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ వ్యవహారంపై కోర్టులో పిటిషన్ సైతం దాఖలైంది. ఈ పరిస్థితుల్లో తన విచారణను చేపట్టేందుకు సహాయం సిద్ధం అయ్యారు. సహాయం కమిటీకి  ఇద్దరు సబ్ కలెక్టర్లు, ఒక తహసీల్దార్‌తో పాటుగా 15 మంది సిబ్బందిని కేటాయించారు. ఆయుధ బలగాలు, కాన్వాయ్ రూపంలో ఐదు వాహనాలు అప్పగించారు. మదురై కేంద్రంగా తిష్ట వేసి తమ పనుల్ని వేగవంతం చేయడం లక్ష్యంగా సహాయం కమిటీ రెడీ అయింది. ఇందు కోసం మదురై అన్నా బస్టాండ్ సమీపంలోని పాత కలెక్టరేట్ భవనాన్ని అప్పగించారు. గ్రానైట్ అక్రమ దందాకు సంబంధించి ఏదేని ఆధారాలు, వివరాలు ఉన్నా, ఇక్కడికి వెళ్లి స్వయంగా సహాయంను కలిసి అప్పగించేందుకు వీలు కల్పించారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు.
 
 రంగంలోకి ఫ్యాన్స్ : సినీ నటులకు, రాజకీయ నాయకులకు అభిమానులు ఉండటం సహజం. అయితే, అధికారులకు అభిమానులు అరుదే. అయితే, వేల కోట్ల రూపాయల స్కాంను గతంలో వెలికి తెచ్చిన సహాయంకు మదురైలో పెద్ద ఎత్తున అభిమానులు పుట్టుకొచ్చారు. ఆయనకు అండగా తాము సైతం ఉన్నట్టు ప్రకటించుకుంటున్నారు. గ్రానైట్ మాఫియా నుంచి ఆయనకు ఎలాంటి ఇబ్బందులు కలగని రీతిలో కవచం వలే తాము ఉన్నామన్నట్టుగా ఈ ఫ్యాన్స్ నగరంలో పోస్టర్లను ఏర్పాటు చేశారు. పదో తేదీ నుంచి సహాయం కమిటీ తన విచారణను చేపట్టనుండడాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ ఐఏఎస్ అధికారికి ఆహ్వానం పలుకుతూ ఆటోలకు ప్రత్యేకంగా పోస్టర్లను అతికించుకుని నగరంలో చక్కర్లు కొడుతుండడం విశేషం.
 
 కరుణకు చురక : సహాయం కమిటీ తన విచారణకు సిద్ధం అవుతోంటే, మరో వైపు డీఎంకే అధినేత ఎం కరుణానిధికి ఈ కమిటీ వ్యవహారంలో సీఎం పన్నీరు సెల్వం చురకలు అంటించారు. ఆ కమిటీ ఏర్పాటులో జాప్యం జరిగిందంటూ కరుణానిధి విమర్శలు గుప్పించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన హయూంలోనే వేల కోట్ల గ్రానైట్ కుంభకోణం జరిగిందన్న విషయాన్ని ఓ మారు గుర్తు చేసుకోవాలని చురకలు అంటించారు. తమ అమ్మ(జయలలిత) నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే, ఆ స్కాం వెనుక ఉన్న బడాబాబుల్ని కటకటాల్లోకి నెట్టామని గుర్తు చేశారు. గ్రానైట్ మాఫియాపై కొరడా ఝుళిపించే విధంగా తాము చర్యలు తీసుకుంటే, దాన్ని విమర్శించడం శోచనీయమన్నారు. ఈ కమిటీ ఏర్పాటు చేయాలని మదురై జిల్లా కలెక్టర్‌ను తాను ఆదేశించానని, తక్షణం వాళ్లు చర్యలు చేపట్టి అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారన్న విషయాన్ని కరుణానిధి మరిచినట్టున్నారని మండిపడ్డారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement