అనుమతుల్లేకుండా గ్రానైట్ తవ్వకాలు జరిపిన పాండవుల కొండ, కొండపైకి అనధికారికంగా వేసిన రోడ్డు
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్ నిక్షేపాలకు కొదవలేదు. తన సామ్రాజ్యంలో ఉన్న గ్రానైట్ నిక్షేపాలపై కన్నేసిన మంత్రి కళా వెంకటరావు 2014లో అధికారంలోకి వచ్చాక పావులు కదిపారు. గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన ఉణుకూరు నియోజకవర్గంలోని గ్రానైట్ కొండలపై పడ్డారు. రాజాం నియోజకవర్గంలోని వంగర మండలం మడ్డువలస జలాశయాన్ని ఆనుకుని ఉన్న కొండపై 25 ఎకరాల్లో గ్రానైట్ తవ్వకాలకు బినామీల పేరుతో అనుమతులు తెచ్చుకున్నారు. అయితే ఆ కొండ జోలికి వెళ్లకుండా ఆ అనుమతులతో రిజర్వాయర్‌కు సమీపంలో సర్వే నంబరు 341లోని పాండవుల పంచకొండపై 2016 ఏప్రిల్ నుంచి అనధికారికంగా తవ్వకాలు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యంత్రాలతో మైనింగ్ చేశారు.
ఆ నిక్షేపాలను తరలించడానికి వీలుగా పెద్ద రోడ్డు కూడా వేశారు. ఇలా కొల్లగొట్టిన గ్రానైట్ విలువ దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ అక్రమ తవ్వకాల వ్యవహారంపై అప్పట్లో ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు వెలువడడంతో మైనింగ్‌శాఖ అధికారులు వాటిని నిలుపుదల చేశారు. అక్కడ తవ్వకాలు జరిపిన పొక్లెయిన్లు, క్రేన్లు, జేసీబీలు, లారీలు, ఇతర వాహనాలతో పాటు అప్పటికే తవ్వి ఉన్న గ్రానైట్ (గ్యాంగ్ సైజ్ బ్లాక్‌లను)ను ఎక్కడివక్కడే సీజ్ చేశారు. వాటిని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. అయితే కొద్దిరోజులకే రూ.కోట్ల విలువ చేసే ఆ వాహనాలు, గ్యాంగ్‌సైజ్ బ్లాక్‌లు (రాళ్లు) మాయమైపోయాయి. అధికార పార్టీ నేతలే వాటిని మాయం చేయడంతో రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు చేష్టలుడిగి చూశారు.
రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినా..
పాండవుల కొండ వద్ద సీజ్ చేసిన రూ.కోట్ల విలువైన వాహనాలు, గ్రానైట్ మాయమయ్యాయని గతంలో వంగర తహసీల్దారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులూ భయపడిపోయి కేసు నమోదు చేయడమే మానేశారు. పోలీసులు నాన్చినాన్చి చివరకు కేసును క్లోజ్ చేసేశారు.
తాజాగా మరో కొండకు కన్నం..!
పాండవుల కొండపై గ్రానైట్ తవ్వకాలకు బ్రేకులు పడడంతో తాజాగా ఆ కొండకు ఎదురుగా ఉన్న మరో కొండ (నీలయ్యవలస పంచాయతీ)పై తవ్వకాలు మొదలెట్టారు. ఆ కొండ తవ్వకాలకు అనుమతుల్లేవు. అయినప్పటికీ కొన్నాళ్ల క్రితమే ఎలాంటి బెరుకు లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టారు. ప్రస్తుతం ఎన్నికల హడావుడి ఉన్నందున తాత్కాలికంగా పనులు ఆపారు.
కొత్త తవ్వకాలను పరిశీలిస్తాం..
నీలయ్యవలస పంచాయతీలోని కొండలపై గ్రానైట్ తవ్వకాలకు కొత్త అనుమతులు లేవు. అనధికార తవ్వకాలు జరపడానికి వీల్లేదు. దీనిపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపిస్తామని వంగర డిప్యూటీ తహసీల్దార్ గోవిందరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment