మంత్రి కుమారునికి కేటాయించిన ప్రభుత్వ భూమి
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్ (శ్రీకాకుళం): ఐదేళ్ల టీడీపీ పాలనలో పేదవాడికి ఇళ్ల పట్టా ఇవ్వాలంటే అనేక నిబంధనలు పెట్టిన ప్రభుత్వం పరిశ్రమలకు మాత్రం అడ్డగోలుగా భూములు కేటాయించింది. దీనిలో భాగంగానే రాష్ట్ర ఇంధన వనరుల శాఖ మంత్రి కిమిడి కళా వెంకటరావు కుమారుడు పరిశ్రమ ఏర్పాటు చేస్తానని చెప్పడంతో అతని కోసం మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమై భూ కేటాయింపులు జరిపారు. అయితే భూ కేటాయింపులు జరిగి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పరిశ్రమ నెలకొల్పకపోవడం గమనార్హం.
మంత్రి కుమాడు రామ్‌మల్లిక్ నాయుడుకి 2015 సెప్టెంబర్ 6న నారువలో 9.96 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించారు. సప్తగిరి పవర్ ప్రాజక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఈ కేటాయింపులు జరిపారు. ఎకరాకు రూ.4.30 లక్షలకు చొప్పున 10 ఎకరాలు రూ.43 లక్షలకు భూములను అందజేశారు. ప్రస్తుతం ఈ భూమి ధర సుమారు రూ.3 కోట్లు ఉంటుంది. అయితే పరిశ్రమ కోసం భూమి కేటాయించి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి పరిశ్రమ నెలకొల్పలేదు. నిబంధనలు ప్రకారం పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే భూమిని మరలా వెనుకకు తీసుకోవలసి ఉన్నా అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఫలితంగా ఈ భూమిని వాణిజ్య అవసరాలకు వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ విధానాలపై పలువురు మండిపడుతున్నారు. టీడీపీ నాయకులకు అడ్డగోలుగా భూములను కేటాయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment