kala Venkatrao
-
‘కళా’కు పరాభవం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకటరావుకు ఊహించని పరిణామం ఎదురైంది. తన సొంత మండలానికి చెందిన నాయకులు షాక్ ఇవ్వడంతో ఆయన కంగుతిన్నారు. తాజాగా జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల్లో ఇంకా పోలింగ్ జరక్కుండానే అవమానకరమైన ఫలితాలను చవిచూశారు. ఉపసంహరణలకొచ్చేసరికి ఇంకెంతటి చేదు అనుభవాలను ఎదుర్కొంటారో చూడాలి. సొంత మండలమైన రేగిడిలో మూడు ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది. మండల పరిషత్ అధ్యక్ష పదవిని సైతం దక్కించుకోబోతోంది. దీన్నిబట్టి టీడీపీ ఎంత గడ్డు పరిస్థితిలో ఉందో స్పష్టమవుతోంది. రాష్ట్ర అధ్యక్షుడి సొంత మండలంలోనే ఇలా ఉంటే జిల్లాలో మిగతా చోట్ల ఇంకెంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నానాటికీ తీసికట్టు కళా వెంకటరావు.. ఈ పేరుకు జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు ఎంతో ప్రాధాన్యత ఉండేది. గతంలో అనేక పర్యాయాలు మంత్రిగా చేసిన అనుభవం.. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా.. ఇంతటి పేరున్న కళా వెంకటరావు పరిస్థితి ప్రస్తుతం దయనీయమని చెప్పాలి. మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసినప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా తన పెత్తనం ఇంకా ఉన్నప్పటికీ సొంత మండలంలో కనీసం పట్టు సాధించలేకపోయారు. దాదాపు ఉనికిని కోల్పోయారు. తాజాగా జరుగుతున్న ఎంపీటీసీ ఎన్నికల్లో సొంత మండలమైన రేగిడిలో మూడు ఎంపీటీసీ స్థానాలకు తన పార్టీ అభ్యర్థుల చేత నామినేషన్ వేయించలేకపోయారంటే ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఖండ్యాం, కందిశ, కొమ్మెర ఎంపీటీసీ స్థానాలకు ఒక్క వైఎస్సార్సీపీ అభ్యర్థులే నామినేషన్లు వేయడంతో ఏకగ్రీవమైపోయాయి. కనీసం నామినేషనే వేయలేదంటే అక్కడ టీడీపీ కార్యకర్తలే లేరా అనే సందేహానికి ఊతమిచ్చింది. దీన్నిబట్టి టీడీ పీ ఎంత ప్రతికూల పరిస్థితిని ఎదుర్కుంటుందో స్పష్టమవుతుంది. అధినేత చంద్రబాబునాయు డు అజెండాను తలకెత్తుకోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని అక్కడివారు చెప్పుకుంటున్నారు. చంద్రబాబు ఎఫెక్ట్.. రాష్ట్రంలో వెనకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందేందుకు దోహదపడే పరిపాలన వికేంద్రీకరణకు అడ్డుతగలడం, మూడు రాజధానులు వ ద్దు–అమరావతే ముద్దు అని చంద్రబాబు అజెండాను భుజానికెత్తుకుని ముందుకెళ్లడం వలన ప్రజలు చీదరించుకుంటున్నారు. రాగా రాగా వచ్చే అవకాశాన్ని కాలదన్నుతున్నారని, అభివృద్ధికి అడ్డుపడే నాయకులకు అండగా ఉండటం అనవసరమని కళా వెంకటరావు సొంత మండలంలోనే కాదు జిల్లావ్యాప్తంగా తిరస్కరిస్తున్నా రు. అధికారంలో ఉన్నంతకాలం అవినీతి అక్రమాలకు తెరలేపి, జన్మభూమి కమిటీల పేరుతో పచ్చనేతలను ప్రజల్లోకి వదిలేసి జిల్లాను నాశ నం చేసిన నేతలకు పట్టం కట్టడం కన్నా పక్కన పెట్టడమే మంచిదన్న నిర్ణయానికొచ్చిన ప్రజలు ఛీత్కరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తగి న బుద్ధి చెబుతామని బాహాటంగానే ప్రజలు ప్రకటిస్తుండటంతో ఆ పార్టీ తరపున పోటీ చే యడానికి నాయకులు భయపడుతున్నారు. అందులో భాగంగా కళా వెంకటరావు సొంత మండలంలోని మూడు ఎంపీటీసీ స్థానాలకు ఏకంగా నామినేషన్ వేయలేదు. జిల్లాలో టీడీపీ దయనీయ పరిస్థితికి ఇది తార్కాణంగా నిలిచింది. -
కరిగిపోతున్న కొండలు
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్ నిక్షేపాలకు కొదవలేదు. తన సామ్రాజ్యంలో ఉన్న గ్రానైట్ నిక్షేపాలపై కన్నేసిన మంత్రి కళా వెంకటరావు 2014లో అధికారంలోకి వచ్చాక పావులు కదిపారు. గతంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన ఉణుకూరు నియోజకవర్గంలోని గ్రానైట్ కొండలపై పడ్డారు. రాజాం నియోజకవర్గంలోని వంగర మండలం మడ్డువలస జలాశయాన్ని ఆనుకుని ఉన్న కొండపై 25 ఎకరాల్లో గ్రానైట్ తవ్వకాలకు బినామీల పేరుతో అనుమతులు తెచ్చుకున్నారు. అయితే ఆ కొండ జోలికి వెళ్లకుండా ఆ అనుమతులతో రిజర్వాయర్‌కు సమీపంలో సర్వే నంబరు 341లోని పాండవుల పంచకొండపై 2016 ఏప్రిల్ నుంచి అనధికారికంగా తవ్వకాలు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యంత్రాలతో మైనింగ్ చేశారు. ఆ నిక్షేపాలను తరలించడానికి వీలుగా పెద్ద రోడ్డు కూడా వేశారు. ఇలా కొల్లగొట్టిన గ్రానైట్ విలువ దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ అక్రమ తవ్వకాల వ్యవహారంపై అప్పట్లో ‘సాక్షి’ దినపత్రికలో కథనాలు వెలువడడంతో మైనింగ్‌శాఖ అధికారులు వాటిని నిలుపుదల చేశారు. అక్కడ తవ్వకాలు జరిపిన పొక్లెయిన్లు, క్రేన్లు, జేసీబీలు, లారీలు, ఇతర వాహనాలతో పాటు అప్పటికే తవ్వి ఉన్న గ్రానైట్ (గ్యాంగ్ సైజ్ బ్లాక్‌లను)ను ఎక్కడివక్కడే సీజ్ చేశారు. వాటిని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. అయితే కొద్దిరోజులకే రూ.కోట్ల విలువ చేసే ఆ వాహనాలు, గ్యాంగ్‌సైజ్ బ్లాక్‌లు (రాళ్లు) మాయమైపోయాయి. అధికార పార్టీ నేతలే వాటిని మాయం చేయడంతో రెవెన్యూ, పోలీసు, మైనింగ్ అధికారులు చేష్టలుడిగి చూశారు. రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినా.. పాండవుల కొండ వద్ద సీజ్ చేసిన రూ.కోట్ల విలువైన వాహనాలు, గ్రానైట్ మాయమయ్యాయని గతంలో వంగర తహసీల్దారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులూ భయపడిపోయి కేసు నమోదు చేయడమే మానేశారు. పోలీసులు నాన్చినాన్చి చివరకు కేసును క్లోజ్ చేసేశారు. తాజాగా మరో కొండకు కన్నం..! పాండవుల కొండపై గ్రానైట్ తవ్వకాలకు బ్రేకులు పడడంతో తాజాగా ఆ కొండకు ఎదురుగా ఉన్న మరో కొండ (నీలయ్యవలస పంచాయతీ)పై తవ్వకాలు మొదలెట్టారు. ఆ కొండ తవ్వకాలకు అనుమతుల్లేవు. అయినప్పటికీ కొన్నాళ్ల క్రితమే ఎలాంటి బెరుకు లేకుండా యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టారు. ప్రస్తుతం ఎన్నికల హడావుడి ఉన్నందున తాత్కాలికంగా పనులు ఆపారు. కొత్త తవ్వకాలను పరిశీలిస్తాం.. నీలయ్యవలస పంచాయతీలోని కొండలపై గ్రానైట్ తవ్వకాలకు కొత్త అనుమతులు లేవు. అనధికార తవ్వకాలు జరపడానికి వీల్లేదు. దీనిపై రెవెన్యూ ఇన్స్పెక్టర్ను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపిస్తామని వంగర డిప్యూటీ తహసీల్దార్ గోవిందరావు తెలిపారు. -
‘కళా’పోషకులు
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్ (శ్రీకాకుళం): ఐదేళ్ల టీడీపీ పాలనలో పేదవాడికి ఇళ్ల పట్టా ఇవ్వాలంటే అనేక నిబంధనలు పెట్టిన ప్రభుత్వం పరిశ్రమలకు మాత్రం అడ్డగోలుగా భూములు కేటాయించింది. దీనిలో భాగంగానే రాష్ట్ర ఇంధన వనరుల శాఖ మంత్రి కిమిడి కళా వెంకటరావు కుమారుడు పరిశ్రమ ఏర్పాటు చేస్తానని చెప్పడంతో అతని కోసం మంత్రివర్గం అత్యవసరంగా సమావేశమై భూ కేటాయింపులు జరిపారు. అయితే భూ కేటాయింపులు జరిగి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పరిశ్రమ నెలకొల్పకపోవడం గమనార్హం. మంత్రి కుమాడు రామ్‌మల్లిక్ నాయుడుకి 2015 సెప్టెంబర్ 6న నారువలో 9.96 ఎకరాల ప్రభుత్వ స్థలం కేటాయించారు. సప్తగిరి పవర్ ప్రాజక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఈ కేటాయింపులు జరిపారు. ఎకరాకు రూ.4.30 లక్షలకు చొప్పున 10 ఎకరాలు రూ.43 లక్షలకు భూములను అందజేశారు. ప్రస్తుతం ఈ భూమి ధర సుమారు రూ.3 కోట్లు ఉంటుంది. అయితే పరిశ్రమ కోసం భూమి కేటాయించి మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఎటువంటి పరిశ్రమ నెలకొల్పలేదు. నిబంధనలు ప్రకారం పరిశ్రమ ఏర్పాటు చేయకపోతే భూమిని మరలా వెనుకకు తీసుకోవలసి ఉన్నా అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఫలితంగా ఈ భూమిని వాణిజ్య అవసరాలకు వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ విధానాలపై పలువురు మండిపడుతున్నారు. టీడీపీ నాయకులకు అడ్డగోలుగా భూములను కేటాయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. -
‘పవన్.. అది చాలా ప్రమాదకరం’
విజయనగరం : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై టీడీపీ ఏపీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కళా వెంకట్రావ్ మండిపడ్డారు. రాజకీయం తెలియనటువంటి వాళ్లు ప్రాంతాలు, మతాలను రెచ్చగొట్టడం చేస్తున్నారు. వాళ్లలో విష బీజాలు నాటేలా వ్యాఖ్యలు చేస్తున్నారని.. అది చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ రాజకీయంగా ఇంకా పరిపక్వత చెందలేదు. వీటి కారణంగా రాబోయే తరాలు ఎంత బాధపడతారో ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ పార్టీలంటే ప్రాంతాలు, మతాలు, వర్గాలను రెచ్చగొట్టేవి కాదు. ఉత్తరాంధ్రలో వెనుకబాటు తనం ఉందంటున్నారు. అయితే దానిపై నీ పార్టీ ఏం నిర్ణయాలు తీసుకుంది. జనసేన అంటే సింగిల్ మ్యాన్ ఆర్మీ. అది కూడా కాదు కేవలం వన్ మ్యాన్ షో అనొచ్చు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సహా మిగతా పెద్దలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం పార్టీలు పెట్టి సేవ చేస్తామని వచ్చారు. కానీ విద్వేష రాజకీయాలు చేయడం మంచిది కాదు. ప్రజలను రెచ్చగొట్టటంతో అందరికీ ప్రమాదమే. కాపుల రిజర్వేషన్లపై పవన్ మాట్లాడుతున్నారు. పవన్.. మీ స్నేహితులు బీజేపీ వాళ్ల దగ్గర ఉన్న రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో పాస్ చేయించాలి. అయితే ఇలా చేసి ఓ సామాజిక వర్గానికి సాయం చేయడం మానేసి ప్రాంతాలు, కులాలు అంటూ ప్రజలను రెచ్చగొట్టడం తగదు. జనసేనది అనేది స్వరూపం లేని పార్టీ. మీ పార్టీ పాలసీ ఏంటి, స్వరూపం ఏంటో చెప్పడం నాయకుల లక్షణం. తెల్లవారితే సీఎం చంద్రబాబు నాయుడిపై, మంత్రి నారా లోకేష్‌పై, అధికార పార్టీ నేతలపై విమర్శలు చేయడం తగదని’ పవన్ కల్యాణ్‌కు కళా వెంకట్రావ్ సూచించారు. -
పవన్‌ను హెచ్చరించిన కళా వెంకట్రావ్
-
మీకు సోము వీర్రాజే సరిపోతాడు...
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ లాబీలో సోమవారం మంత్రి కళా వెంకట్రావు, మాజీ మంత్రి మాణిక్యాలరావు, ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మధ్య సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పైడికొండల మాణిక్యాలరావు పేరు తెరమీదకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నన్నపనేని రాజకుమారి...అడ్వాన్స్ కంగ్రాట్స్ అంటూ మాణిక్యాలరావును అభినందించారు. అయితే తాను ఏపీ బీజేపీ అధ్యక్షుడు కావడం లేదని, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అవుతారని, ఆయన పేరు ప్రతిపాదించినట్లు చెప్పారు. అందుకు ప్రతిగా నన్నపనేని మాట్లాడుతూ.. మీరే అధ్యక్షుడని అందరు అనుకుంటున్నారని అనగా, మీకు సోము వీర్రాజే సరిపోతాడంటూ మాణిక్యాలరావు నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. మరోవైపు మంత్రి కళా వెంకట్రావు కూడా మాణిక్యాలరావును చూసి..కొత్త శత్రువులకు నమస్కారం అంటూ నవ్వుతూ పలకరించారు. మోదీ మహిళలను బాధ పెడుతున్నారు.. ఇక ఏపీకి ప్రత్యేక హోదాపై నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ..‘ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీలోని రెండున్నర కోట్ల మంది మహిళలను పెడుతున్నారు. ఎవరైనా ఫిర్యాదు ఇస్తే మోదీకి నోటీసులు పంపుతాను. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ బాగా బాధ పడుతున్నారు. మోదీ, బీజేపీ అధినాయకత్వం లోక్‌సభ స్పీకర్‌ను తెగ ఇబ్బంది పెడుతున్నారు. ఇన్ని అవమానాలు భరించడం దేనికంటూ సుమిత్రా మహాజన్‌కు లేఖ రాస్తాను.’ అని అన్నారు. -
కేంద్రం మాపై కక్షసాధిస్తోంది: టీడీపీ
సాక్షి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖలోని అంశాలు చాలా బాధాకరమని టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం తమపై కక్ష సాధిస్తోందని విమర్శించారు. బీజేపీతో కలిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పొత్తు పెట్టుకున్నామని, ఇంతలా కక్ష సాధిస్తారని అనుకోలేదని ఆయన వాపోయారు. బీజేపీతో పొత్తు పెట్టుకోవడంవల్ల చాలా సీట్లు నష్టపోయామన్నారు. ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మాటిచ్చి.. ఇప్పుడు మాట తప్పారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు అడ్డుకోవాలని చూస్తున్నారని, ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టిన ఆంధ్రరాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ కేంద్రంతో పోరాడుతుందని అన్నారు. -
‘చంద్రబాబు రాత్రికి రాత్రే చెడ్డోడు అయ్యారా’
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ టీడీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తెర వెనుక కుట్రలో భాగంగా పవన్ ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అంబ్లీ ప్రాంగణంలో గురువారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్‌పై విమర్శలు చేశారు. మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. నిన్నటి వరకు మంచిగా కనిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రికి రాత్రే చెడ్డోడు అయ్యారా అని ప్రశ్నించారు. టీడీపీకి ప్రజల అండ ఉందని పేర్కొన్నారు. ప్రజలు నమ్మితే పవన్ కల్యాణ్ కాదు.. ఎలాంటి వాళ్ళు వచ్చిన టీడీపీకి ఇబ్బంది లేదని తెలిపారు. అజ్ఞాతవాసి ఫ్లాప్‌తో.. అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ కావడంతో పవన్ కల్యాణ్‌కు మతిభ్రమించిందని పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథి ఎద్దేవా చేశారు. పవన్ ఏమీ మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. పవన్ వ్యాఖ్యలు దేనికి సంకేతం.. రాష్ట్రాభివృద్ధిలో కలిసికట్టుగా వెళ్లే సమయంలో పవన్ వ్యాఖ్యలు దేనికి సంకేతమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నదేంటీ.. పవన్ మాట్లాడిందేమిటన్నారు. నాటి ముఖ్యమంత్రి జయలలిత సిఫారస్సుతో శేఖర్‌రెడ్డిని టీడీపీలోకి తీసుకున్నారని.. శేఖర్ రెడ్డికి లోకేశ్‌కు ఏమి సంబంధమన్నారు. లోకేష్ తన పని తాను చేసుకుంటుంటే ఆయనపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. ఎన్నికలు వచ్చే సమయంలో పార్టీలను తయారు చేయడం కొందరికి అలవాటన్నారు. రాష్ట్రాభివృదికి ఏం చేస్తాడో పవన్ చెప్పలేదని.. ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివి వినిపించారని ఆరోపించారు. తెరవెనుక కుట్రలో భాగంగా పవన్ మాట్లాడాడని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేసి పోరాడటం పవన్‌కి కనపడలేదా అని ప్రశ్నించారు. కష్టానికి మారు పేరు చంద్రబాబు అని ఆయన పేర్కొన్నారు. -
'కళా 'పవర్‌కు ఎస్ఈ చిత్తు!
అరసవల్లి: జిల్లాలోని ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు ఓ అధికారి బదిలీకి కారణమయ్యాయి. వీరి ఆధిపత్య పోరులో అధికారులు నలిగిపోతున్నారు. గడిచిన మూడేళ్లలో పలువురు అధికారులు రాజకీయ జోక్యంతోనే బదిలీలకు, క్రమశిక్షణ చర్యలకు గురయ్యారు. తాజాగా రెండో మంత్రిగా కళా వెంకట్రావు జిల్లాలో అడుగుపెట్టడం..అందులోనూ విద్యుత్ శాఖ మంత్రి కావడంతో తొలి వేటు విద్యుత్ శాఖ ఉన్నతాధికారిపైనే పడింది. వాస్తవానికి ముక్కుసూటి ధోరణి, సున్నిత మనస్తత్వం ఉన్న తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్ఈ దత్తి సత్యనారాయణ కేవలం ఏడాదిన్నర కాలమే విధుల్లో చేరారు. అయితే ఈయన్ను ఆకస్మికంగా బదిలీ చేస్తున్నట్లు సీఎండీ కార్యాలయం నుంచి వచ్చిన ఉత్తర్వులు వెనుక పెద్ద కథే నడిచిందనే ప్రచారం జరుగుతుంది. విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకటరావుకు, మరో మంత్రి అచ్చెన్నాయుడుకు మధ్య కొంత కాలంగా ఆధిపత్యపోరు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరూ.. ఏ అవకాశమొచ్చినా..వెంటనే దాన్ని అమలు చేసేలా పావులు కదుపుతున్నారు. జిల్లాలో అనుకూల నాయకులపైన, లేదంటే అనుకూలంగా పనిచేశారన్న నెపంతో ఉద్యోగులపై తమ ప్రతాపాలు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ శాఖ ఎస్ఈ సత్యనారాయణపై బదిలీవేటు పడిందనే ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామంతో మరికొంతమంది అధికారులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎస్ఈ ఆకస్మిక బదిలీని అన్ని విద్యుత్ ఉద్యోగుల సంఘాల నేతలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయి. మంత్రుల తీరుపై భగ్గుమంటున్నారు. పైచేయి కోసం..! జిల్లా నుంచి బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు, విద్యుత్ శాఖామంత్రిగా, రాష్ట్ర టిడిపి అధ్యక్షుడిగా కళావెంకట్రావులు కొనసాగుతున్నారు. అయితే గతేడాది నుంచి వీరిద్దరి మధ్య ఆధిపత్యపోరు తారస్థాయికి వెళ్లిందని చెప్పవచ్చు. ఇటీవల మంత్రి అచ్చెన్న ప్రధాన అనుచరులైన జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మికి ముద్దాడ ఇసుకరీచ్‌ను పూర్తిగా రద్దు చేయించి, జిల్లాలో ఆధిపత్యపోరులో ఒక మెట్టు ఎక్కిన మంత్రి కళా.. మరోసారి ద్వితీయ విఘ్నం దాటేయ్యాలని భావించి, అచ్చెన్నకు అనుకూలంగా ఉన్నారన్న నెపంతో ఎస్ఈ సత్యనారాయణపై బదిలీ వేటు వేసినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. గత నెలలో టెక్కలి నియోజకవర్గంలో విద్యుత్ శాఖాధికారులతో జిల్లా విద్యుత్ ఉన్నతాధికారుల సమక్షంలో మంత్రి అచ్చెన్న సమీక్ష చేయడమే మంత్రుల మధ్య మరింత వివాదానికి ఆజ్యం పోసిందని పలు ఉద్యోగ సంఘాల నేతలు చర్చించుకుంటున్నారు. ఈసమీక్షలో విద్యుత్ శాఖ చేయాల్సిన విధివిధానాలను అచ్చెన్న డిక్టేట్ చేయడంపై సంబంధిత శాఖ మంత్రి కళాకు ఆగ్రహం తెప్పించిందంటున్నారు. నిజానికి విద్యుత్ శాఖామంత్రి కళా నిర్ణయాన్ని కాదని, కేవలం అచ్చెన్న చెప్పిన పనులను చేయడం ఎస్ఈగా సత్యనారాయణకు పూర్తిగా అసాధ్యమే. అయినప్పటికీ కళాకు చెందిన ముఖ్య అనుచరుల ధ్వయం చేసిన ఓవర్ యాక్షన్‌తో మంత్రి కళా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం తన సహజశైలికి భిన్నంగా ఎస్ఈపై బదిలీకి సిఫారసు చేయించి నట్లు సమాచారం. అలాగే దీన్నే నెపంగా చూపుతూ అచ్చెన్నకు అనుకూలంగా ఉన్న అధికారులను జిల్లాలో వదిలిపెట్టేది లేదంటూ మంత్రి ‘కళా’ హెచ్చరికలు పంపినట్లుగా పలువురు భావిస్తున్నారు. నిమ్మాడ...రాజాం మధ్యలో ఉద్యోగులు! అటు నిమ్మాడ...ఇటు రాజాం...మధ్యలో ఉద్యోగులు..అన్నట్లుగా తయారయ్యింది జిల్లాలో ఉద్యోగుల పరిస్థితి. ఎవరికి కోపమొచ్చినా..ఏం జరుగుతుందో అనే ఆందోళన వీరిలో నెలకొంది. ఉద్యోగ నిబంధనల మేరకు రాష్ట్రంలో ప్రభుత్వం చెప్పినట్లు ప్రజాసేవ నిమిత్తం పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో అధికార పార్టీ నేతలకు ప్రతిపక్షంలో ఉన్న నేతల కంటే అన్నింట్లోనూ అగ్రతాంబూలమే అని వేరే చెప్పనవసరం లేదు. అయితే ఇందుకోసం వివాదాలకు దూరంగా అధికారులు, ఉద్యోగులు అధికార పార్టీ నేతలకు సహజంగా అనుకూలంగా పనిచేస్తుంటారు. అయితే ఇక్కడ జిల్లాలో మాత్రం పరిస్థితి దారుణంగా, విచిత్రంగా తయారైంది. వివిధ ప్రాంతాల్లో పనులు, నిర్ణయాల విషయంలో ఇద్దరు మంత్రులకు అనుకూలంగా వెళ్లే పరిస్థితులు ఉద్యోగులకు లేవు. అలా అని ఒక మంత్రికి అనుకూలమైతే, రెండో మంత్రితో చర్యలు తప్పవనే సంకేతాలు ఇప్పటికే కొందరు అధికారులు రుచిచూశారు. దీంతో అనుకూలతలో కూడా అప్రమత్తంగా ఉండేలా అధికారులు పావులు కదుపుతున్నారు. సుమారు ఓ ఏడాది పాటు కళ్లు మూసుకుంటే ఆ తర్వాత పరిస్థితులు మారవచ్చుననే సంకేతాలు ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. దీంతో తమ శాఖల్లో ఏ ప్రతిపాదనలు వచ్చినా జిల్లా కలెక్టర్ ధనంజయరెడ్డి కోర్టులో పడేసి కొందరు చేతులు దులుపుకుంటుంటే..మరికొందరు తమ ప్రాంతం ప్రతిపాదనలకు, పనులకు అనుకూలం కాదంటూ సర్టిఫై చేయించుకుంటూ కప్పదాటు ప్రయత్నాలకు తెరతీస్తున్నారు. ఏది ఏమైనా ఇద్దరి మంత్రుల మధ్య ఆధిపత్యపోరు ఇంకెంత మందిని బలితీసుకుంటుందో అని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
27 నుంచి విశాఖలో మహానాడు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ మహానాడును ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు విశాఖలో నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు తెలిపారు. విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానాన్ని వేదికగా ఎంపిక చేశామన్నారు. సోమవారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. -
భంగపడ్డ భాస్కరుడు: మంత్రుల బుజ్జగింపు
కాకినాడ: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండవసారి టికెట్ ఆశించిన సిట్టింగ్ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు భంగపడ్డారు. తూర్పుగోదావరి స్థానానికి మాజీ మంత్రి చిక్కాల పేరును టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. దీంతో ఆయన తిరుగుబాటు అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సిద్ధపడుతున్నారు. అధిష్టానం నిర్ణయంపై ఆయన అనుచరులు మంత్రుల ముందు మండిపడ్డారు. అసంతృప్తితో ఉన్న భాస్కర రామారావును హోం మంత్రి చినరాజప్ప, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావులు బుజ్జగిస్తున్నారు. -
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
-
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
⇒ చివరి వరకు కొనసాగిన హైడ్రామా ⇒ అర్ధరాత్రి జాబితా ప్రకటించిన కళా వెంకట్రావు సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అభ్యర్థుల పేర్లను విలేకరులకు వెల్లడించారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల స్థానిక సంస్థల స్థానాలకు సిట్టింగ్ ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి పోటీ పడనున్నారు. పశ్చిమగోదావరిలోని రెండు స్థానాల్లో ఒక దానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మరో స్థానానికి సత్యనారాయణరాజు (పాందువ శ్రీను), తూర్పుగోదావరి స్థానానికి మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, శ్రీకాకుళం జిల్లాకు మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, చిత్తూరు జిల్లాకు రాజసింహులు (దొరబాబు), అనంతపురం జిల్లాకు దీపక్‌రెడ్డి పేర్లను ప్రకటించారు. వైఎస్సార్ జిల్లా స్థానానికి బీటెక్ రవి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ల దాఖలుకు మంగళవారమే చివరిరోజు కాగా అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు చివరివరకు హైడ్రామా కొనసాగించారు. అభ్యర్థులను ఖరారు చేసినా ప్రకటించకుండా నేతల మధ్య ఉత్కంఠ పెంచారు. కొందరు అభ్యర్థుల విషయంలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో వారిని బుజ్జగించేందుకు ఆయా జిల్లాల నాయకులతో మంతనాలు జరిపారు. బుజ్జగింపుల పర్వం: నెల్లూరు జిల్లాలో తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాల్సిందేనని ఆదాల ప్రభాకర్‌రెడ్డి గట్టిగా పట్టు బట్టడంతో ఆయన్ను బుజ్జగించేందుకు బాబు సీనియర్ నేతలను రంగంలోకి దించారు. శ్రీకాకుళం జిల్లాలో శత్రుచర్ల విజయరామరాజు అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వ్యక్తమైందనే కారణంతో అర్థరాత్రి వరకు ఆయనకు కూడా ఏ విషయం చెప్పలేదు. పశ్చిమగోదావరి జిల్లాలో అంగర రామ్మోహన్ అభ్యర్థిత్వంపైనా చివరి వరకు టెన్షన్ కొనసాగించారు. తూర్పుగోదావరి జిల్లాలో మాజీ మంత్రి చిక్కాలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినా ఏకాభిప్రాయం కుదర్లేదని లీకులిచ్చారు. అనంతపురం జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా దీపక్‌రెడ్డి పేరును ఖరారు చేసినా ఐవీఆర్ఎస్ ఓటింగ్‌లో వ్యతిరేకత వచ్చిందని చెప్పడంతో ఆ జిల్లాలోనూ గందరగోళం ఏర్పడింది. -
పార్టీ విధివిధానాల మేరకు వ్యవహరిస్తాం
వెంకటగిరి ఎమ్యెల్యేపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు సాక్షి, అమరావతి: నెల్లూరు జిల్లాలో రైల్వే పనులు చేయాలంటే తనకు కప్పం కట్టాల్సిందేనని కాంట్రాక్ట్ సంస్థను బెదిరించిన వెంకటగిరి ఎమ్మెల్యే కె.రామకృష్ణపై పార్టీ విధానాల మేరకు వ్యవహరిస్తామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు తెలి పారు. ఎమ్మెల్యే రెండు రోజుల్లో పార్టీ వివరణ ఇస్తారని చెప్పారు. తాము పనులు చేయకుండా ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని, డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు విలేకరుల సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయమై కళా వెంకట్రావు పై విధంగా స్పందించారు. విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. -
'టీఆర్ఎస్ లో నాకు మంత్రి పదవి వచ్చింది'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ లాబీలో మంగళవారం తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, టీడీపీ నాయకులు బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావు మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. టీడీపీ నేతలతో మంత్రి తలసాని పిచ్చాపాటిగా మాట్లాడుతూ... తనకు టీఆర్ఎస్ లో మంత్రి పదవి వచ్చిందని, ఏపీలో అధికారంలో ఉండికూడా మీకు మంత్రి పదవులు రాలేదని అన్నారు. తలసాని వ్యాఖ్యలకు టీడీపీ నేతలు చిరునవ్వులు చిందిస్తూ వెళ్లిపోయారు. కాగా, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఆకర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ నజరానాలు, మంత్రి పదవులను ఎర వేస్తున్నారని అధికార తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలతో సీఎంతోపాటు కొందరు మంత్రులు అంతర్గతంగా చర్చలు సాగిస్తున్నట్లు వస్తున్న వార్తలు అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యేల్లో చర్చనీయాంశంగా మారాయి. -
'ఎస్ఐ ఆత్మహత్యతో నాకు సంబంధం లేదు'
హైదరాబాద్: ఎస్ఐ వీరాంజనేయుల ఆత్మహత్య చేసుకోవడానికి, తనకు ఎటువంటి సంబంధం లేదని టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు. వీరాంజనేయులు ఎప్పుడూ తనను కలవలేదని, తాను ఆయన్ను చూడలేదని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వంగర పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేసిన వీరాంజనేయులు విశాఖపట్నంలో మంగళవారం రైలు కింద పడి చనిపోయారు. మృతుని వద్ద లభ్యమైన లేఖలో.. ఏసీబీ డీఎస్పీ రంగరాజు, టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకటరావు, ఆయన పీఏ నాయుడు వేధింపులు తట్టుకోలేకే చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు ఎస్ఐ రాశారు. దీనిపై కళా వెంకట్రావు స్పందించారు. మీడియాలో తనపై వచ్చిన కథనాలు బాధాకరమని, ఎస్ఐ ఆత్మహత్యతో తనకు సంబంధం లేదని చెప్పారు. ఎస్ఐ వీరాంజనేయులు కుటుంబానికి కళా వెంకట్రావు సానుభూతి తెలిపారు. -
జెడ్పీ పీఠంపై విభేదాల కుంపటి
ఇప్పటికే గ్రూపుల గోలతో గందరగోళంగా మారిన టీడీపీలో సరికొత్త విభేదాల కుంపటి రాజుకుంది. జెడ్పీ పీఠం కేంద్రంగా పీటముడి బిగుసుకుంటోంది. ప్రధానంగా రెండు సామాజిక వర్గాల నేతలు చైర్పర్సన్ అభ్యర్థిత్వం కోసం పంతాలకు పోతున్నారు. ఈ విషయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు బాబ్జీనే సీనియర్ నేత కళా వెంకట్రావు ముప్పుతిప్పలు పెడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కళా, బాబ్జీ ఇద్దరూ తమ కుటుంబ సభ్యులకే చైర్పర్సన్ సీటు కేటాయించాలని పట్టుదలకు పోతున్నారు. బీసీ మహిళకు రిజర్వ్ అయిన ఈ స్థానంపై రేగిన ఈ విభేదాల చిచ్చు సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదేనేమో!.. టీడీపీ జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ అభ్యర్థులకు ఇవ్వాల్సిన పార్టీ బీఫారాలన్నీ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీ వద్దే ఉన్నాయి. కానీ తన సొంత మండలం ఎచ్చెర్ల జెడ్పీటీసీ అభ్యర్థిగా నిర్ణయించిన తన భార్య ధనలక్ష్మికి మాత్రం 48 గంటలుగా ఆయన బీఫారం ఇవ్వలేకపోతున్నారు. పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్చార్జి కళా వెంకట్రావు వ్యూహా త్మకంగా మోకాలడ్డుతుండటమే దీనికి కారణం. బాబ్జీ భార్య ధనలక్ష్మిని జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా కింజరాపు వర్గం ప్రతిపాదించింది. కింజరాపు వర్గంతో ఉన్న విభేదాల నేపథ్యంలో ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన బాబ్జీ భార్యకు జెడ్పీ పీఠం కట్టబెట్టే ప్రతిపాదనను కళా వెంకట్రావు అంగీకరించడం లేదు. తన నియోజకవర్గంలో మరో అధికార కేంద్రం తయారు కావడాన్ని ఆయన ఏమాత్రం అనుమతించలేకపోతున్నారు. తమ సామాజికవర్గానికి.. వీలైతే తమ కుటుంబం నుంచి ఒకర్ని జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిగా నిర్ణయించాలని ఆయన భావించారు. అందుకే అసలు చౌదరి ధనలక్ష్మిని ఎచ్చెర్ల జెడ్పీటీసీ అభ్యర్థిగానే అడ్డుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. మరోవైపు బీ ఫారాలన్నింటినీ జిల్లా అధ్యక్షుడైన బాబ్జీకి పార్టీ ఇచ్చింది. జిల్లాలోని జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ అభ్యర్థులకు ఇవ్వాల్సిందిగా ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జీలకు ఆయన వాటిని అప్పగించేశారు. ఎచ్చెర్ల జెడ్పీటీసీగా తన భార్య ధనలక్ష్మి పోటీ చేయనున్నందున ఆ బీ ఫారాన్ని మాత్రం తన వద్దే ఉంచుకున్నారు. అయితే తన భార్యతో నామినేషన్ వేయించడానికి ముందు నియోజకవర్గ ఇన్చార్జి కళా అమోదం పొందాల్సి ఉంది. అందుకోసం ఆయన మంగళవారం రోజంతా ప్రయత్నించారు. మంగళవారం రాత్రి 10గంటల వరకు బాబ్జీని రాజాంలో వేచి ఉండేట్లు చేసిన కళా విషయం మాత్రం తేల్చలేదు. బుధవారం మాట్లాడదామని చెప్పి పంపించేశారు. వాస్తవానికి తన భార్యతో నామినేషన్ వేయిం చేందుకు బుధవారం ఉదయం 10 గంటలకు ము హుర్తం పెట్టుకున్న బాబ్జీ ఈ పరిణామంతో నిరాశతో వెనుదిరిగారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బాబ్జీకి ఇది తీవ్ర అవమానమే. కాగా బుధవారం ఉదయం బాబ్జీ మళ్లీ ‘కళా’ను కలిశారు. కానీ అదే సీన్ రిపీట్ అయ్యింది. ఉదయం తొందరగా కళా ఆమోదించేస్తే 10గంటలకు నామినేషన్ వేయించాలనుకున్నారు. కానీ కళా సాయంత్రం వరకు సస్పెన్స్ కొనసాగిం చారు. ఎట్టకేలకు సాయంత్రం 5 గంటలకు బాబ్జీని కరుణించారు. ధనలక్ష్మితో జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేయించుకోవచ్చని చెప్పారు. కానీ ఆమే జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి అని మాటమాత్రంగానైనా చెప్పలే దు. ఆ తరువాత కళా అసలు వ్యూహానికి తెరతీశారు. దామోదరంతో ఉపసంహరణ డ్రామా? జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిత్వం తమ సామాజికవర్గానికి.. ఇంకా చెప్పాలంటే తమ కుటుంబంలోని మహిళకే దక్కాలని కళా గట్టిగా పట్టుబడుతున్నారు. అందుకోసం తన మరదలు కిమిడి మృణాళిని పేరును ఆయన ప్రతిపాదిస్తున్నా అధిష్టానం నుంచి సానుకూల సంకేతాలు లభించలేదు. దాంతో బుధవారం పాలకొండ కేంద్రంగా ఆయన చక్రం తిప్పారు. టీడీపీ పాలకొండ జెడ్పీటీసీ అభ్యర్థిగా తన సన్నిహితుడు, ఇటీవలే పార్టీలో చేరిన సామంతుల దామోదరంతో బుధవారం నామినేషన్ వేయించారు. అప్పటికే దామోదరం పాలకొండ మండలం పణుకువలస ఎమ్పీటీసీ సభ్యుడిగా కూడా నామినేషన్ వేయడం గమనార్హం. దాంతో టీడీపీ వర్గీయుల్లో సందేహాలు వ్యక్తమయ్యాయి. పాలకొండ ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకే దామోదరం ఎమ్పీటీసీ సభ్యుడిగా నామినేషన్ వేశారని భావించారు. కానీ ఆయన జెడ్పీటీసీకి కూడా ఎందుకు నామినేషన్ వేశారన్నది చాలామందికి అంతుబట్ట లేదు. సాయంత్రానికి అసలు విషయం స్పష్టమైంది. జెడ్పీటీసీ నామినేషన్‌ను ఉపసంహరించుకోవాల్సిందిగా దామోదరాన్ని కళా ఆదేశించినట్లు తెలుస్తోంది. తమ కుటుంబ సభ్యులను పాలకొండ జెడ్పీటీసీ అభ్యర్థిగా రంగంలోకి తెచ్చేందుకే దామోదరాన్ని రంగం నుంచి తప్పుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. కళా సహకారంతోనే ఇటీవల టీడీపీలో చేరిన దామోదరం ఆయన చెప్పింది చేయడం మినహా మరో గత్యంతరం లేని స్థితిలో పడిపోయారు. ఈ విధంగా కళా పావులు వేగంగా కదిపి చౌదరి ధనలక్ష్మి జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థి అనే ప్రచారానికి ఆడ్డుకట్ట వేస్తున్నారు. ఈమేరకు పాలకొండ డివిజన్‌తోపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని తమ వర్గీయులతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ పరిణామాలతో టీడీపీలో విభేదాల పీటుముడి మరింతగా బిగుసుకుంటోంది. జెడ్పీ చైర్పర్సన్ అభ్యర్థిత్వ వివాదం సామాజికవర్గ పోరుగా రూపాంతరం చెందుతోంది. ఈ పరిణామాలు సార్వత్రిక ఎన్నికలపైనా కూడా ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలున్నాయి.