జెడ్పీ పీఠంపై విభేదాల కుంపటి | fight for zp seat | Sakshi
Sakshi News home page

జెడ్పీ పీఠంపై విభేదాల కుంపటి

Published Thu, Mar 20 2014 2:24 AM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

జెడ్పీ పీఠంపై విభేదాల కుంపటి - Sakshi

జెడ్పీ పీఠంపై విభేదాల కుంపటి

ఇప్పటికే గ్రూపుల గోలతో గందరగోళంగా మారిన టీడీపీలో సరికొత్త విభేదాల కుంపటి రాజుకుంది. జెడ్పీ పీఠం కేంద్రంగా పీటముడి బిగుసుకుంటోంది. ప్రధానంగా రెండు సామాజిక వర్గాల నేతలు చైర్‌పర్సన్ అభ్యర్థిత్వం కోసం పంతాలకు పోతున్నారు.  
 
 ఈ విషయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు బాబ్జీనే సీనియర్ నేత కళా వెంకట్రావు ముప్పుతిప్పలు పెడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కళా, బాబ్జీ ఇద్దరూ తమ కుటుంబ సభ్యులకే చైర్‌పర్సన్ సీటు కేటాయించాలని పట్టుదలకు పోతున్నారు. బీసీ మహిళకు రిజర్వ్ అయిన ఈ స్థానంపై రేగిన ఈ విభేదాల చిచ్చు సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :  అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అంటే ఇదేనేమో!.. టీడీపీ జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ అభ్యర్థులకు ఇవ్వాల్సిన పార్టీ బీఫారాలన్నీ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జీ వద్దే ఉన్నాయి. కానీ తన సొంత మండలం ఎచ్చెర్ల జెడ్పీటీసీ అభ్యర్థిగా నిర్ణయించిన తన భార్య ధనలక్ష్మికి మాత్రం 48 గంటలుగా ఆయన బీఫారం ఇవ్వలేకపోతున్నారు. పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కళా వెంకట్రావు వ్యూహా త్మకంగా మోకాలడ్డుతుండటమే దీనికి కారణం.
 
 బాబ్జీ భార్య ధనలక్ష్మిని జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా కింజరాపు వర్గం ప్రతిపాదించింది. కింజరాపు వర్గంతో ఉన్న విభేదాల నేపథ్యంలో ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన బాబ్జీ భార్యకు జెడ్పీ పీఠం కట్టబెట్టే ప్రతిపాదనను కళా వెంకట్రావు అంగీకరించడం లేదు. తన నియోజకవర్గంలో మరో అధికార కేంద్రం తయారు కావడాన్ని ఆయన ఏమాత్రం అనుమతించలేకపోతున్నారు.
 
  తమ సామాజికవర్గానికి.. వీలైతే తమ కుటుంబం నుంచి ఒకర్ని జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా నిర్ణయించాలని ఆయన భావించారు. అందుకే అసలు చౌదరి ధనలక్ష్మిని ఎచ్చెర్ల జెడ్పీటీసీ అభ్యర్థిగానే అడ్డుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. మరోవైపు బీ ఫారాలన్నింటినీ జిల్లా అధ్యక్షుడైన బాబ్జీకి పార్టీ ఇచ్చింది. జిల్లాలోని జెడ్పీటీసీ, ఎమ్పీటీసీ అభ్యర్థులకు ఇవ్వాల్సిందిగా ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జీలకు ఆయన వాటిని అప్పగించేశారు.
 
 ఎచ్చెర్ల జెడ్పీటీసీగా తన భార్య ధనలక్ష్మి పోటీ చేయనున్నందున ఆ  బీ ఫారాన్ని మాత్రం తన వద్దే ఉంచుకున్నారు. అయితే తన భార్యతో నామినేషన్ వేయించడానికి ముందు నియోజకవర్గ ఇన్‌చార్జి కళా అమోదం పొందాల్సి ఉంది. అందుకోసం ఆయన మంగళవారం  రోజంతా ప్రయత్నించారు. మంగళవారం రాత్రి 10గంటల వరకు బాబ్జీని రాజాంలో వేచి ఉండేట్లు చేసిన కళా విషయం మాత్రం తేల్చలేదు. బుధవారం మాట్లాడదామని చెప్పి పంపించేశారు.
 
 వాస్తవానికి తన భార్యతో నామినేషన్ వేయిం చేందుకు  బుధవారం ఉదయం 10 గంటలకు ము హుర్తం పెట్టుకున్న బాబ్జీ ఈ పరిణామంతో నిరాశతో వెనుదిరిగారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బాబ్జీకి ఇది తీవ్ర అవమానమే.  కాగా బుధవారం ఉదయం  బాబ్జీ మళ్లీ ‘కళా’ను కలిశారు. కానీ అదే సీన్ రిపీట్ అయ్యింది.
 
  ఉదయం తొందరగా కళా ఆమోదించేస్తే 10గంటలకు నామినేషన్ వేయించాలనుకున్నారు. కానీ కళా సాయంత్రం వరకు సస్పెన్స్ కొనసాగిం చారు. ఎట్టకేలకు సాయంత్రం 5 గంటలకు బాబ్జీని కరుణించారు. ధనలక్ష్మితో జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేయించుకోవచ్చని చెప్పారు. కానీ ఆమే జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థి అని మాటమాత్రంగానైనా చెప్పలే దు. ఆ తరువాత కళా అసలు వ్యూహానికి తెరతీశారు.
 
 దామోదరంతో ఉపసంహరణ డ్రామా?
 జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిత్వం తమ సామాజికవర్గానికి.. ఇంకా చెప్పాలంటే తమ కుటుంబంలోని మహిళకే దక్కాలని కళా గట్టిగా పట్టుబడుతున్నారు. అందుకోసం తన మరదలు కిమిడి మృణాళిని పేరును ఆయన ప్రతిపాదిస్తున్నా అధిష్టానం నుంచి సానుకూల సంకేతాలు లభించలేదు. దాంతో బుధవారం పాలకొండ కేంద్రంగా ఆయన చక్రం తిప్పారు. టీడీపీ పాలకొండ జెడ్పీటీసీ అభ్యర్థిగా తన సన్నిహితుడు, ఇటీవలే పార్టీలో చేరిన సామంతుల దామోదరంతో  బుధవారం నామినేషన్ వేయించారు.
 
 అప్పటికే దామోదరం పాలకొండ మండలం పణుకువలస ఎమ్పీటీసీ సభ్యుడిగా కూడా నామినేషన్ వేయడం గమనార్హం. దాంతో టీడీపీ వర్గీయుల్లో సందేహాలు వ్యక్తమయ్యాయి. పాలకొండ ఎంపీపీ పీఠం దక్కించుకునేందుకే దామోదరం ఎమ్పీటీసీ సభ్యుడిగా నామినేషన్ వేశారని భావించారు. కానీ ఆయన జెడ్పీటీసీకి కూడా ఎందుకు నామినేషన్ వేశారన్నది చాలామందికి అంతుబట్ట లేదు.
 
  సాయంత్రానికి అసలు విషయం స్పష్టమైంది. జెడ్పీటీసీ నామినేషన్‌ను ఉపసంహరించుకోవాల్సిందిగా దామోదరాన్ని కళా ఆదేశించినట్లు తెలుస్తోంది. తమ కుటుంబ సభ్యులను పాలకొండ జెడ్పీటీసీ అభ్యర్థిగా రంగంలోకి తెచ్చేందుకే  దామోదరాన్ని రంగం నుంచి తప్పుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. కళా సహకారంతోనే ఇటీవల టీడీపీలో చేరిన దామోదరం ఆయన చెప్పింది చేయడం మినహా మరో గత్యంతరం లేని స్థితిలో పడిపోయారు.
 
 ఈ విధంగా కళా  పావులు వేగంగా కదిపి  చౌదరి ధనలక్ష్మి జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థి అనే ప్రచారానికి ఆడ్డుకట్ట వేస్తున్నారు. ఈమేరకు పాలకొండ డివిజన్‌తోపాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లోని తమ వర్గీయులతో మంతనాలు సాగిస్తున్నారు. ఈ పరిణామాలతో టీడీపీలో విభేదాల పీటుముడి మరింతగా బిగుసుకుంటోంది. జెడ్పీ చైర్‌పర్సన్ అభ్యర్థిత్వ వివాదం సామాజికవర్గ పోరుగా రూపాంతరం చెందుతోంది. ఈ పరిణామాలు సార్వత్రిక ఎన్నికలపైనా కూడా ప్రతికూల ప్రభావం చూపించే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement