బీతిల్లుతున్న దేశం
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
టీడీపీలో వలసలు కాకపుట్టిస్తున్నాయి. పాత కొత్త నాయకులు సలసలమని కాగిపోతున్నారు. నాయకుల మధ్య అంతర్గత పోరు రచ్చకెక్కే పరిస్థితులు ఏర్పడ్డాయి. పాత, కొత్త నాయకుల మధ్య పోరు తారస్థాయికి చేరింది. వీరి మధ్య బీ-ఫారం గొడవ నడుస్తోంది. ఇదెక్కడికి దారితీస్తుందోనని జిల్లా నాయకత్వం భయపడుతోంది. వలస నాయకులతో బలపడుతుందనుకున్న పార్టీకి తీవ్ర నష్టం ఏర్పడనుంది.
‘తెలుగు కాంగ్రెస్’గా మారిపోయిన ఆ పార్టీలో కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. ఇటీవల పార్టీలో చేరిన నాయకుల్లో అత్యధిక మంది పెత్తనం కోసం ప్రయత్నిస్తున్నారు. తమకంటూ వర్గాన్ని తయారు చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు. దీనికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను వేదికగా చేసుకుంటున్నారు.
తమ ప్యానెల్‌గా పలువురు అభ్యర్థులను బరిలోకి దించి పాత నాయకులకు సవాల్ విసిరారు. దీంతో ఇరువర్గాల మధ్య రగడ చోటు చేసుకుంది. గత పదేళ్లూ నరకయాతన పెట్టిన నాయకులొచ్చి తమపై పెత్తనం చెలాయిం చడం ఏంటని పాత నాయకులు, వారికంత సీన్ లేకపోవడంతోనే తమను ఆదరించారని కొత్త నాయకులు పంతానికి పోవడంతో పరిస్థితి అయోమయంగా తయారైంది.
బీ-ఫారాల గొడవ
గజపతినగరం, కురుపాం, చీపురుపల్లి, విజయనగరం నియోజకవర్గాల్లో బీ-ఫారాల సమస్య ఎక్కువగా ఉంది. సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం నియోజకవర్గాల్లో కూడా ఈ సమస్య ఉంది. దీంతో ఆయా నియోజకవర్గాల టీడీపీ నాయకుల మ ధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది.
కురుపాంలో ....
ఎన్నాళ్లగానో టీడీపీలో ఉండి, బరిలోకి దిగిన అభ్యర్థులకు బీ-ఫారం టెన్షన్ పట్టుకుంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చెప్పుకుంటున్న నిమ్మక జయరాజ్, తాజాగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే వి.టి.జనార్దన్ థాట్రాజ్ ప్రాదేశిక స్థానాలకు వేర్వేరుగా అభ్యర్థులను నిలబెట్టారు. స్థానిక ఎన్నికల కోసం కలిసే పనిచేస్తామని ఇద్దరూ చేతులు కలిపినా పోరుకొచ్చేసరికి చెరో దారి చూసుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లో చెరో ప్యానెల్ పెట్టుకున్నారు. తమకే బి-ఫారాలు దక్కుతాయని ఇరువర్గాలు చెప్పుకుంటున్నాయి.
తాము సూచించిన వాళ్లకే ఇవ్వాలని జిల్లా నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. దీనికంతటికీ నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం చేస్తున్న ప్రయత్నమే కారణమని ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ఎవరికైతే బి-ఫారాలు దక్కవో వారంతా రెబెల్స్‌గా పోటీ పడాలని చూస్తున్నారు.
గజపతినగరంలో...
గజపతినగరం నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పాత నాయకులు ఒక వర్గంగా, ఇటీవల పార్టీలో చేరిన మక్కువ శ్రీధర్ మరో వర్గంగా నామినేషన్లు వేయడంతో రగడ చోటుచేసుకుంది.ముప్పై ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తమను కాదని కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి సముచిత స్థానం కల్పించడం ఎంత వరకు సమంజసమని కొందరు ప్రశ్నిస్తున్నారు. గెలవనోళ్లకి బీ-ఫారాలు ఎందుకని కొత్త నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. దీంతో అంతర్గత పోరు ఏర్పడింది. ఈ క్రమంలో బీ ఫారాలు ఇవ్వకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులు గా రంగంలోకి దిగుతామని ఇరువర్గాలు హెచ్చరిస్తున్నాయి.
చీపురుపల్లి నియోజకవర్గంలో ...
చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల్లో రెండు వర్గాల పోరు నడుస్తోంది. కొత్తగా చేరిన మీసాల వరహాలనాయుడు వ్యవహారం టీడీపీ నాయకులకు మింగుడుపడటం లేదు. ఆయన పార్టీలో చేరినప్పుడు పోటీ చేసే స్థానాల విషయమై చేసుకున్న ఒప్పందానికి తిలోదకాలిచ్చారని పాత నాయకులు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాలు బరిలో ఉండటంతో ఎవరికి బీ -ఫారం ఇవ్వాలో జిల్లా పార్టీ తేల్చుకోలేకపోతోంది.
ఇక, గరివిడి జెడ్పీటీసీగా పోటీ చేసేందుకు ఆ పా ర్టీలో కురు వృద్ధుడు బలగం కృష్ణకు అధిష్టానం బొట్టుపెట్టిం ది. దీంతో ఆయన నామినేషన్ వేశారు. కానీ, పార్టీలో చేరిన కొత్త నేత తెరవెనుక ఉండి కోనూరు మాజీ సర్పంచ్ రమణమూర్తి కూడా గరివిడి జెడ్‌పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయించారన్న వాదనలు ఉన్నాయి.
దీంతో పార్టీలో అంతర్గత విభేదాలకు ఆజ్యం పోసినట్టయ్యింది. ఇదే పరిస్థితి మెరకముడిదాం మండలంలో కూడా కొనసాగుతోంది. ఇదే తరహాలో సాలూరు నియోజకవర్గం పాచిపెంటలో, బొబ్బిలి నియోజకవర్గం రామభద్రపుం, బాడంగి మండలాల్లో, ఎస్.కోట నియోజకవర్గం జామి మండలంలో, జిల్లా కేంద్రమైన విజయనగరంలో కూడా కొత్తగా వచ్చిన నాయకులు తామొక వర్గంగా పలు స్థానాల్లో నామినేషన్లు వేయించారు.
ఇప్పుడా మండలాల్లో పార్టీలో రగడ చోటు చేసుకుంది. దీంతో బీ-ఫారం ఇచ్చే విషయంలో పార్టీ నాయకత్వం సతమతమవుతోంది. బీ-ఫారం దక్కని వారంతా రెబెల్‌గా బరిలో ఉండిపోనున్నారు. జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే వలసలతో టీడీపీకి చేటు తప్పలాభం లేదని స్పష్టమవుతోంది. పంచాయతీ పరిష్కరించుకోలేకపోతే రచ్చకెక్కడం ఖాయంగా కనిపిస్తోంది.