
'ఎస్ఐ ఆత్మహత్యతో నాకు సంబంధం లేదు'
హైదరాబాద్: ఎస్ఐ వీరాంజనేయుల ఆత్మహత్య చేసుకోవడానికి, తనకు ఎటువంటి సంబంధం లేదని టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు. వీరాంజనేయులు ఎప్పుడూ తనను కలవలేదని, తాను ఆయన్ను చూడలేదని చెప్పారు.
శ్రీకాకుళం జిల్లా వంగర పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేసిన వీరాంజనేయులు విశాఖపట్నంలో మంగళవారం రైలు కింద పడి చనిపోయారు. మృతుని వద్ద లభ్యమైన లేఖలో.. ఏసీబీ డీఎస్పీ రంగరాజు, టీడీపీ ఎమ్మెల్యే కళా వెంకటరావు, ఆయన పీఏ నాయుడు వేధింపులు తట్టుకోలేకే చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు ఎస్‌ఐ రాశారు. దీనిపై కళా వెంకట్రావు స్పందించారు. మీడియాలో తనపై వచ్చిన కథనాలు బాధాకరమని, ఎస్ఐ ఆత్మహత్యతో తనకు సంబంధం లేదని చెప్పారు. ఎస్ఐ వీరాంజనేయులు కుటుంబానికి కళా వెంకట్రావు సానుభూతి తెలిపారు.