
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ టీడీపీ నేతలపై చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తెర వెనుక కుట్రలో భాగంగా పవన్ ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అంబ్లీ ప్రాంగణంలో గురువారం పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పవన్‌పై విమర్శలు చేశారు.
మంత్రి అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. నిన్నటి వరకు మంచిగా కనిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాత్రికి రాత్రే చెడ్డోడు అయ్యారా అని ప్రశ్నించారు. టీడీపీకి ప్రజల అండ ఉందని పేర్కొన్నారు. ప్రజలు నమ్మితే పవన్ కల్యాణ్ కాదు.. ఎలాంటి వాళ్ళు వచ్చిన టీడీపీకి ఇబ్బంది లేదని తెలిపారు.
అజ్ఞాతవాసి ఫ్లాప్‌తో..
అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ కావడంతో పవన్ కల్యాణ్‌కు మతిభ్రమించిందని పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథి ఎద్దేవా చేశారు. పవన్ ఏమీ మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదన్నారు.
పవన్ వ్యాఖ్యలు దేనికి సంకేతం..
రాష్ట్రాభివృద్ధిలో కలిసికట్టుగా వెళ్లే సమయంలో పవన్ వ్యాఖ్యలు దేనికి సంకేతమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్నదేంటీ.. పవన్ మాట్లాడిందేమిటన్నారు. నాటి ముఖ్యమంత్రి జయలలిత సిఫారస్సుతో శేఖర్‌రెడ్డిని టీడీపీలోకి తీసుకున్నారని.. శేఖర్ రెడ్డికి లోకేశ్‌కు ఏమి సంబంధమన్నారు. లోకేష్ తన పని తాను చేసుకుంటుంటే ఆయనపై లేనిపోని ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు.
ఎన్నికలు వచ్చే సమయంలో పార్టీలను తయారు చేయడం కొందరికి అలవాటన్నారు. రాష్ట్రాభివృదికి ఏం చేస్తాడో పవన్ చెప్పలేదని.. ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివి వినిపించారని ఆరోపించారు. తెరవెనుక కుట్రలో భాగంగా పవన్ మాట్లాడాడని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ఇద్దరు కేంద్ర మంత్రులు రాజీనామా చేసి పోరాడటం పవన్‌కి కనపడలేదా అని ప్రశ్నించారు. కష్టానికి మారు పేరు చంద్రబాబు అని ఆయన పేర్కొన్నారు.