
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
⇒ చివరి వరకు కొనసాగిన హైడ్రామా
⇒ అర్ధరాత్రి జాబితా ప్రకటించిన కళా వెంకట్రావు
సాక్షి, అమరావతి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. సోమవారం అర్ధరాత్రి తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అభ్యర్థుల పేర్లను విలేకరులకు వెల్లడించారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల స్థానిక సంస్థల స్థానాలకు సిట్టింగ్ ఎమ్మెల్సీలు వాకాటి నారాయణరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి పోటీ పడనున్నారు. పశ్చిమగోదావరిలోని రెండు స్థానాల్లో ఒక దానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, మరో స్థానానికి సత్యనారాయణరాజు (పాందువ శ్రీను), తూర్పుగోదావరి స్థానానికి మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, శ్రీకాకుళం జిల్లాకు మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు, చిత్తూరు జిల్లాకు రాజసింహులు (దొరబాబు), అనంతపురం జిల్లాకు దీపక్‌రెడ్డి పేర్లను ప్రకటించారు.
వైఎస్సార్ జిల్లా స్థానానికి బీటెక్ రవి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ల దాఖలుకు మంగళవారమే చివరిరోజు కాగా అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు చివరివరకు హైడ్రామా కొనసాగించారు. అభ్యర్థులను ఖరారు చేసినా ప్రకటించకుండా నేతల మధ్య ఉత్కంఠ పెంచారు. కొందరు అభ్యర్థుల విషయంలో వ్యతిరేకత వ్యక్తం కావడంతో వారిని బుజ్జగించేందుకు ఆయా జిల్లాల నాయకులతో మంతనాలు జరిపారు.
బుజ్జగింపుల పర్వం: నెల్లూరు జిల్లాలో తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాల్సిందేనని ఆదాల ప్రభాకర్‌రెడ్డి గట్టిగా పట్టు బట్టడంతో ఆయన్ను బుజ్జగించేందుకు బాబు సీనియర్ నేతలను రంగంలోకి దించారు. శ్రీకాకుళం జిల్లాలో శత్రుచర్ల విజయరామరాజు అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వ్యక్తమైందనే కారణంతో అర్థరాత్రి వరకు ఆయనకు కూడా ఏ విషయం చెప్పలేదు. పశ్చిమగోదావరి జిల్లాలో అంగర రామ్మోహన్ అభ్యర్థిత్వంపైనా చివరి వరకు టెన్షన్ కొనసాగించారు. తూర్పుగోదావరి జిల్లాలో మాజీ మంత్రి చిక్కాలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినా ఏకాభిప్రాయం కుదర్లేదని లీకులిచ్చారు. అనంతపురం జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా దీపక్‌రెడ్డి పేరును ఖరారు చేసినా ఐవీఆర్‌ఎస్ ఓటింగ్‌లో వ్యతిరేకత వచ్చిందని చెప్పడంతో ఆ జిల్లాలోనూ గందరగోళం ఏర్పడింది.