ఆరని ఎన్నికల చిచ్చు
⇒ సీఎంకు జిల్లా నేతల ఫిర్యాదులు
⇒ పట్టాభి తీరుపై సమాచార సేకరణకు దిగిన పార్టీ హై కమాండ్
⇒ రంగంలోకి ఎస్వీయూ విద్యార్థి బృందాలు
⇒ పట్టాభి మీద కోపంతోనే వేల ఓట్లు చెల్లకుండా చేశారని సీఎంకు వివరించిన నేతలు
⇒ కోటంరెడ్డి, జెడ్‌ఎస్, విజయ భాస్కర్‌రెడ్డిలో ఎవరిని నిలిపినా గెలిచే వారని మంత్రి నిర్ణయంపై ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి – నెల్లూరు : స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై తెలుగుదేశం పార్టీలో రగిలిన గొడవలు ఆగడం లేదు. ఈ వ్యవహారంపై శనివారం సీఎం చంద్రబాబు నాయుడు మూడు గంటల పాటు నిర్వహించిన సమీక్షలో ఆయన చెప్పింది విని వచ్చిన నేతలు ఆ తర్వాత ఫిర్యాదుల పర్వం ప్రారంభించారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల అభ్యర్థుల ఎంపికే సరిగా జరగలేదని కొందరు నేతలు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకుని వెళ్లారు. పట్టభద్రుల అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వ్యవహార తీరు, ఆయన పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం గురించి పార్టీ అధిష్టానం ఇప్పుడు సమాచార సేకరణలో పడింది.
చేతులు కాలాక..
తూర్పు రాయలసీమ పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిపై ఈ ఎన్నికల్లో తీవ్ర వ్యతిరేకత కనిపించింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల అభిప్రాయాలు తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేసిఉంటే బాగుండేదనే అభిప్రాయం హై కమాండ్‌కు కలిగింది. 14,450 ఓట్లు చెల్లకుండా పోవడం, ఈ బ్యాలెట్లలో చాలా వాటిపై అభ్యర్థి గురించి చాలా తీవ్రమైన విమర్శలు రాయడం పార్టీ నాయకత్వానికి ఆందోళన కలిగిస్తోంది. కనీసం డిగ్రీ చదివిన వారు ఓటు ఎలా వేయాలో తెలియకుండా ఉండరని, ఈ ఓట్లు అభ్యర్థి మీద కోపంతో వేసినవేనని పార్టీ నాయకత్వం నిర్ధారణకు వచ్చింది.
అభ్యర్థి మీద ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎందుకు వచ్చింది ? ఆయన వ్యవహార తీరు ఎలా ఉంటుంది ? ఓటమికి దారి తీసిన కారణలేమిటి? అనే విషయాలపై జిల్లా ప్రజల అభిప్రాయాలు తీసుకునే పని ప్రారంభించింది. శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన విద్యార్థుల బృందాలు ఈ పని ప్రారంభించాయి. ఇదిలా ఉంటే పట్టాభిని పార్టీ నాయకులు, శ్రేణులు కూడా సొంతం చేసుకోలేక పోయాయని.. అయినా పార్టీ నాయకులు పనిచేయడం వల్లే గట్టి పోటీ ఇవ్వగలిగామని జిల్లా పార్టీ నేతలు సీఎం దృష్టికి తీసుకుని వెళ్లారు. పట్టాభికి బదులు నెల్లూరు నగర పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి , కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ డాక్టర్ జెడ్ శివప్రసాద్‌ను పోటీ చేయించి ఉంటే వీరిని పార్టీ శ్రేణులన్నీ సొంత మనుషులుగా భావించి పనిచేసేవని జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఒకరు చంద్రబాబుకు వివరించారు.
అలా కాకపోయినా మంత్రి నారాయణ తన మనిషినే పోటీ చేయించాలని నిర్ణయించుకున్నప్పుడు పట్టాభి కంటే ఆయన సోదరుడు విజయభాస్కర్‌రెడ్డిని పోటీ చేయించి ఉన్నా గెలిచే వారని చెప్పారు. పట్టాభి మీద ఉన్న వ్యతిరేకత వల్లే 14,500 ఓట్లు చెల్లకుండా పోయాయని, ఇందులో కనీసం 12 వేల ఓట్లు తమవేనని మరో నాయకుడు సీఎం, లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లారని సమాచారం. ఇకపోతే ఉపాధ్యాయ స్థానానికి కూడా చివరి నిమిషంలో అభ్యర్థిని ఎంపిక చేయడం, వాసుదేవనాయుడు చిత్తూరు జిల్లాలో తప్ప నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఉపాధ్యాయ వర్గానికి పరిచయం ఉన్న వ్యక్తి కాకపోవడం మైనస్ అయ్యిందని పార్టీ నాయకత్వం అంచనా వేస్తోంది. ఎన్నికల సమయంలో ఆయన ఓటర్లను నేరుగా కలవక పోవడం పీడీఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రమణ్యంకు లాభించిందనే లెక్కలు వేస్తున్నారు.
వారే వెన్నుపోటు దారులు
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 150 ఓట్లకు పైగా మెజార్టీతో గెలవాల్సి ఉన్నా 87 ఓట్లతో గెలవడంపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారు. శిబిరంలోని ఓటర్ల నుంచే సుమారు 50 మంది వైఎస్సార్ సీపీకి ఓటేశారని పార్టీ నాయకత్వం నిర్ధారణకు వచ్చింది. ఇది ఎవరి ప్రోద్బలంతో జరిగింది? ఎవరెవరు క్రాస్ ఓటింగ్ చేశారనే విషయంపై ఇంటెలిజెన్స్ వర్గాలు, పార్టీ బృందాల ద్వారా సీఎం సమాచారం తెప్పించే పనిలో ఉన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి నెగ్గిన వాకాటి నారాయణరెడ్డితో పాటు పలువురు నాయకులతో సీఎం ఈ విషయం గురించి మాట్లాడారు.
ఇదే అవకాశంగా తీసుకుని టీడీపీ ముఖ్య నేతలు ప్రత్యర్థులపై ఫిర్యాదులు ప్రారంభించారని తెలిసింది. సూళ్లూరుపేట, గూడూరు నియోజక వర్గాల్లో తన మీద కోపంతో కొందరు క్రాస్ ఓటింగ్ చేయించారని వాకాటి ఇప్పటికే ఫిర్యాదు చేశారని తెలిసింది. ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఓటింగ్ జరగడానికి కారణాలు ఏమిటో విచారణ జరిపించాలని జిల్లాముఖ్యుడొకరు సీఎంకు విన్నవించారు. ఈ వివాదంపై ఎవరికి వారు సీఎం చంద్రబాబుతో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు ఫిర్యాదులు చేసినట్లు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.