ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ ప్రకటించారు.
ముగిసిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ
సాక్షి, అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ ప్రకటించారు. ఏడు స్థానాలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయగా, అధికార తెలుగుదేశం పార్టీ ఐదుగురు అభ్యర్థులను, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఇద్దరు అభ్యర్థులను పోటీకి పెట్టింది. ఏడు స్థానాలకు, ఏడుగురే పోటీ పడడంతో ఎన్నిక ఏకగీవ్రంగా ముగిసింది. దీంతో టీడీపీ తరుఫున నారా లోకేశ్, కరణం బలరామ కృష్ణమూర్తి, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్, పోతుల సునీత.. వైఎస్సార్‌సీపీ నుంచి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), గంగుల ప్రభాకర్‌రెడ్డి ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
అవకాశమిచ్చిన వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు: ఆళ్ల నాని
ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆళ్ల నాని శుక్రవారం ఎన్నికల అధికారి నుంచి ఎన్నిక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఎమ్మెల్సీగా అవకాశమిచ్చిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో అనేక హామీలు గుప్పించారని, వాటి అమలు కోసం శాసనమండలిలో పోరాడతానని చెప్పారు.