బాబు సిగ్గుతో తలదించుకోవాలి
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
⇒ మెజారిటీ లేకున్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల్ని దింపారు
⇒ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. కారణం ఏమిటంటే.. మెజారిటీ లేకపోయినా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన అభ్యర్థులను పోటీలో నిలిపారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వ్యక్తిత్వానికి వెలకట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు’’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
కొనుగోళ్లు, కిడ్నాప్‌లు, బెదిరింపులు
‘‘స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ బీఫారంపై గెలిచినవారు. పార్టీ గుర్తులపై గెలి చిన వ్యక్తులు. నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచినవారు చాలా ఎక్కువ మంది ఉన్నారు. టీడీపీ గుర్తుపై గెలుపొందినవారు చాలా తక్కువ. అటువంటి చోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులను పోటీకి దింపారు. ఎన్నికల్లో గెలిచేం దుకు స్థానికసంస్థల ప్రజాప్రతిని«ధుల్ని ప్రలో భాలకు గురిచేస్తున్నారు. ఓటర్లను కొనుగోలు చేసి, భయపెట్టి, కిడ్నాప్‌లు చేసి ఎన్నికలు జరుపుతున్నారంటే నిజంగా సీఎం బాబు తలదించుకోవాలి. వైఎస్సార్ జిల్లాలో 841 ఓటర్లుంటే, అందులో 521 మంది వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచారు.
టీడీపీ గుర్తుపై గెలిచినవారు 305 మంది. 521 ఎక్కడ? 305 ఎక్కడ? అయినా చంద్రబాబు పోటీపెట్టి, కార్పొరేటర్ దగ్గర నుంచి ఎంపీటీసీ వరకూ నీకు డబ్బు ఎంత? నీ విలువ ఎంత? అంటూ వ్యక్తిత్వానికి లెక్కగట్టి కొనుగోలు చేశారు. మరోవైపు కిడ్నాప్‌లు, బెదిరింపులతో దారుణంగా వ్యవహరించారు. ఏపీలో బాబు నేతృత్వంలో ప్రజాస్వామ్యం దారుణంగా మంటగలుస్తోంది. సీఎం స్థానంలో ఉండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి అదే ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నారు. అవహేళన చేస్తున్నారు’’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ... ‘‘జిల్లా కలెక్టర్ నిబంధనలను అతిక్రమించి పనిచేస్తే ప్రజాస్వామ్యం మరో అడుగు దిగజారినట్లే. పైన దేవుడున్నాడు. ప్రజల ప్రేమాభిమానాలున్నాయి. మంచితనం ఇంకా బతికే ఉంది. తప్పక ప్రజలు దీవిస్తారు’’ అన్నారు.
జమ్మలమడుగులో ఓటేసిన వైఎస్ జగన్
వైఎస్ జగన్ జమ్మలమడుగులో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేశారు. ఆయన శుక్రవారం ఉదయం మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో కలసి పోలింగ్ కేంద్రానికి చేరుకు న్నారు. క్యూలైన్‌లో ఉన్న ఓటర్ల వెనుక నిల్చు ని ఓటుహక్కును వినియోగించుకున్నారు.