బాబుకు షాక్!
⇔ దిమ్మతిరిగే తీర్పునిచ్చిన టీచర్లు, గ్రాడ్యుయేట్లు
⇔ ప్రజాక్షేత్రంలో టీడీపీ పతనం
♦ ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారుణ పరాజయం
♦ 5 స్థానాలకుగాను నాలుగింట ఓటమి
♦ అధికార పార్టీని నిర్ద్వంద్వంగా తిరస్కరించిన ఓటర్లు
♦ సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనే మట్టికరిచిన తెలుగుదేశం పార్టీ
♦ రిగ్గింగ్‌తో సహా ఎన్ని కుతంత్రాలు పన్నినా దక్కని విజయం
♦ ప్రత్యక్ష ఎన్నికలంటేనే వణుకుతున్న చంద్రబాబు నాయుడు
♦ ఎన్నికలు జరగని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో వాయిదాకు యత్నాలు
♦ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించలేని దుస్థితి
♦ జగన్ సవాల్ స్వీకరించలేక వెనుకంజ
సాక్షి, అమరావతి : స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో రూ.కోట్ల కొద్దీ డబ్బు వెదజల్లి... బేరసారాలు, బెదిరింపులు, శిబిరాలతో వక్రమార్గాన గెలుపొందిన అధికార తెలుగుదేశం పార్టీకి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు కోలుకోలేని షాక్ ఇచ్చారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ అక్రమ మార్గంలో గెలుపొందడానికి ఆ పార్టీ నేతలు చేసిన ప్రయత్నాలను జనం గట్టిగా తిప్పికొట్టారు. 2 ఉపాధ్యాయ, 3 పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగింటిలో అధికార పార్టీని ప్రజలు తిరస్కరించారు.
9 జిల్లాలు.. లక్షలాది మంది ఓటర్లు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సొంత జిల్లా చిత్తూరులో పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు రెండింటిలోనూ టీడీపీ పరాజయం పాలైంది. తూర్పు రాయలసీమ పట్టభద్రుల స్థానంలో టీడీపీ అభ్యర్థి ఓడిపోగా, పశ్చిమ రాయలసీమ స్థానంలో ఓటమి అంచున నిలిచారు. ఉత్తరాంధ్ర (విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం) స్థానంలో ఆ పార్టీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి పీడీఎఫ్ అభ్యర్థిపై స్వల్ప మెజారిటీలో ఉన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వరకే పరిమితం కాగా ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికలు అలా కాదు. 9 జిల్లాల్లో లక్షలాది మంది ఓటర్లతో కూడుకొని ఉన్నది. 5 ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి స్థానాల ఎన్నికలు అనంతపురం, వైఎస్సార్, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జరిగాయి. నాలుగు జిల్లాలు మినహా రాష్ట్రమంతా ఈ ఎన్నికల్లో పాలుపంచుకుంది.
విచ్చలవిడిగా టీడీపీ అక్రమాలు
ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ నేతలు బరితెగించారు. విచ్చలవిడిగా అక్రమాలకు పాల్పడ్డారు. షరా మామూలుగానే రూ.కోట్లు వెదజల్లారు. అంతేకాకుండా రిగ్గింగ్‌కూ పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్వయంగా ఆయా జిల్లాల నేతలతో టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. గెలుపు కోసం వ్యూహరచన చేశారు. అక్రమాలను ప్రోత్సహించారు. ఇన్ని చేసినా ఓటర్లు టీడీపీని కంగుతినిపించారు.
బాబు సొంత జిల్లాలో టీడీపీకి చెంపపెట్టు
సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీని ప్రజలు తిరస్కరించారు. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో కూడిన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్(పీడీఎఫ్) అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం చేతిలో టీడీపీ అభ్యర్థి వాసుదేవనాయుడు మట్టికరిచారు. అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాలతో కూడిన పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ స్థానంలో పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి చేతిలో సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన టీడీపీ అభ్యర్థి బచ్చల పుల్లయ్య దారుణంగా ఓటమి పాలయ్యారు.
ఇక పశ్చిమ రాయలసీమ(కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు) పట్టభద్రుల స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి 12,677 ఓట్ల మెజారిటీతో విజయం దిశగా దూసుకుపోతుండగా టీడీపీ అభ్యర్థి కేజే రెడ్డి రెండో స్థానంలో చతికిలపడ్డారు. సీఎం సొంత జిల్లా చిత్తూరుతో కూడిన తూర్పు రాయలసీమ (చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల) పట్టభద్రుల స్థానంలో వైఎస్సార్‌సీపీ మద్దతిచ్చిన పీడీఎఫ్ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసులురెడ్డి 3,500 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ద్వితీయ స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
దారుణ పరాజయంపై టీడీపీ వర్గాల్లో చర్చ
సీఎం సొంత జిల్లాలోనే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఓటమి పాలవ్వడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిరాశ నిస్పృహలు అలముకున్నాయి. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.కోట్లు గుమ్మరించి ప్రత్యర్థి ఓటర్లను కొనుగోలు చేసి గెలిచినందుకు సంబరాలు చేసుకున్న టీడీపీ నేతలు మంగళవారం నోరు మెదపలేకపోయారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సమయం వరకు సభలోకి రాకుండా తన గదికే పరిమితమైపోయారు. కొద్దిసేపటికి సభలోకి వచ్చినా రుసరుసలాడుతూ ప్రతిపక్షంపై అకారణంగా విరుచుకుపడ్డారు. మరోవైపు అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం చర్చకు దారితీసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుతో గెలిచినపపటికీ, విద్యావంతులైన పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం ప్రజల్లో పార్టీ పట్ల వెల్లువెత్తుతున్న వ్యతిరేకతకు నిదర్శనమని స్వయంగా మంత్రులే అంగీకరిస్తున్నారు. ‘‘మా పని అయిపోయింది. ఇది ఆరంభం మాత్రమే. ఇక ఏ ఎన్నికలు జరిగినా ఇలాంటి ఫలితాలు తప్పవు.
ఇది గమనించే మా అధినేత ఎన్నికలంటేనే భయపడుతున్నారు. ఎన్నికలు జరగని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లకు జరగాల్సిన ఎన్నికలను కూడా ఏదో ఒక సాకు చూపించి, నిలిపివేయించే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచి టీడీపీలో చేరిన 21 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి, ఎన్నికలకు సిద్ధపడాలంటూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విసిరిన సవాల్‌ను చంద్రబాబు స్వీకరించకుండా దాటవేయడానికి కూడా ఇదే కారణం’’ ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన మంత్రి ఒకరు విశ్లేషించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అత్యల్ప మెజారిటీ..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన మూడు జిల్లాల్లో వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామికంగా తన అభ్యర్థులను బరిలోకి దింపింది. రూ.కోట్లు ఖర్చు చేసి, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను తనవైపు తిప్పుకొని ఏకంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే శిబిరాలు నడిపించింది. ఇన్ని అక్రమాలకు పాల్పడినా ఈ ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన మెజారిటీ అత్యల్పమే కావడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ, టీడీపీకి మ«ధ్య ఓట్ల వ్యత్యాసం అతి తక్కువే. నెల్లూరులో కేవలం 87, కర్నూలులో 62, వైఎస్సార్ జిల్లాలో 38 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు.
2017 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్ల వివరాలు
జిల్లా | పోలైన ఓట్లు | చెల్లని ఓట్లు | టీడీపీ అభ్యర్థికి | వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి | మెజారిటీ |
నెల్లూరు | 851 | 8 | 465 | 378 | 87 |
కర్నూలు | 1,077 |
11 |
564 | 502 | 62 |
వైఎస్సార్ | 839 | 8 | 434 | 396 | 38 |
2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో బలాబలాలు
జిల్లా | వైఎస్సార్‌సీపీ | టీడీపీ |
నెల్లూరు | 435 | 340 |
కర్నూలు | 531 | 454 |
వైఎస్సార్ | 521 | 303 |